అమ్మకిచ్చిన మాట | Adi Shankara Vijayam Part 18 Story In Funday | Sakshi
Sakshi News home page

అమ్మకిచ్చిన మాట

Published Sun, Oct 20 2019 10:30 AM | Last Updated on Sun, Oct 20 2019 10:33 AM

Adi Shankara Vijayam Part 18 Story In Funday - Sakshi

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం 
కాశివాస లోకపుణ్యపాప శోధకం విభుమ్‌ 
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం 
కాశికాపురాధినాథ కాలభైరవం భజే 

స్వామి సన్నిధిలో నిలిచి, ఆదిశంకరుడు ఆశువుగా కాలభైరవాష్టకాన్ని రచిస్తున్నాడు. శోకమోహాలు దైన్యలోభాలు కోపతాపాలు కాలభైరవుని సన్నిధిలో నశించిపోతాయి. జ్ఞానానికి, ముక్తికి, పుణ్యఫలం పెరిగేందుకు కాలభైరవాష్టకాన్ని పఠించండి. కాశికా పురాధినాథుడైన కాలభైరవుణ్ణి భజించండి అని ఫలశ్రుతి చెప్పడం కూడా పూర్తయింది.సరిగ్గా అదే సమయానికి ఒక ముసలివగ్గు ఆలయంలో ప్రవేశించాడు. శంకరయతి శిష్యులలో ఎవరినో ‘ఆ పాడుతున్నవారెవరు?’ అని అడిగినట్లున్నాడు. సమాధానం తెలుసుకుని శంకరుణ్ణి సమీపించాడు.

‘‘జగద్గురూ!’’ అని నమస్కరించాడు ఆ ముసలాయన.

శంకరుని ఒళ్లు పులకించింది. ఆనాటి   వరకూ తన గురువులు తప్ప ఇతరులెవరూ శంకరుణ్ణి జగద్గురూ అని సంబోధించలేదు. వచ్చిన వ్యక్తిని గుర్తించాడు శంకరుడు. ఆయన మారువేషంలో ఉన్నాడు. ఇతరులకు ఆయన ఎవరో తెలియదు. శంకరుడు ఆశ్రమ నియమాలు పాటించక తప్పదు. సన్యాసులు దేవతలకు, కన్నతల్లికి, గురువులకు, తోటి సన్యాసులకు తప్ప ఇతరులకు నమస్కరించ కూడదు అనే నియమాన్ని పాటిస్తూ శంకరుడు ప్రతి నమస్కారం చేయలేదు. 

‘‘స్వామీ! మీ గురించి ఇదివరలో చాలా విన్నాను. మీరు రచించిన ఉపనిషత్‌ భాష్యాలను అక్కడక్కడా చూశాను. గతంలో మీరు కాశీకి వచ్చినప్పుడు పండిత పరిషత్తులలో నిగ్గు తేలిన వారని విని సంతోషించాను’’ అన్నాడు ముసలాయన.
శంకరుడు మౌనంగా విన్నాడు.

‘‘కానీ స్వామీ! నేటి సమాజంలో వేదబాహ్యులు, నానాత్వవాదులు పెచ్చుమీరిపోతున్నారు. మీరు వేదాన్నే పట్టుకుని అద్వైతం అద్వైతం అంటూ మాట్లాడుతుంటారు. మీకు ప్రతిపక్షులు చాలామందే ఉన్నారు. వారందరితోనూ వాదించాలంటే మీ సంగతి ఏమో కానీ, సామాన్యులకైతే కష్టసాధ్యమే. మీరు వేదవ్యాసుడు రచించిన బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారని విన్నాను. అందులో నాకేవేవో సందేహాలున్నాయి. మీరు సమయం ఇస్తే కొంచెం తెలుసుకుంటాను’’ అన్నాడాయన.

‘‘తప్పకుండా’’ అన్నాడు శంకరుడు.
‘‘జగద్గురూ! ఈవేళ అష్టమి. ప్రతినెలలోనూ రెండు అష్టమి తిథులలోనూ, మాసశివరాత్రి రోజుల్లోనూ తప్ప నేను కాశీలో ఉండడానికి వీలులేదు. మిగిలిన రోజుల్లో నేను కాశీకి రావడానికి ఈ కాలభైరవుడు అనుమతించడు...’’ గొంతు గద్గదికం అవుతుండగా ముసలాయన కొద్దిసేపు మాట పెగుల్చుకోవడానికి ఇబ్బంది పడ్డాడు.
‘‘ఇంతకూ ఏం చేయమంటారు స్వామీ!’’ అడిగాడు శంకరుడు వినయంగా.
‘‘మరేమీ లేదు. మీరు వీలుచూసుకుని ఒక్కసారి వ్యాసకాశీకి రండి. బ్రహ్మసూత్ర భాష్యాన్ని గురించి నాకున్న సందేహాలు కొద్దిలో తేలేవి కావు. వీలైనన్ని ఎక్కువరోజులు మీ సన్నిధిలో గడపాలని నా కోరిక’’ అన్నాడు ముసలాయన.
‘‘అయితే ఎప్పుడు రమ్మంటారు’’ అడిగాడు శంకరుడు.
‘‘పౌర్ణమి లోపుగానే రండి. వ్యాసలింగేశ్వర స్వామి సన్నిధిలో కలుద్దాం’’ అని చెప్పి ముసలాయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు.శంకరయతి శిష్యులతో కలిసి ముందుకు సాగాడు. బిందుమాధవుణ్ణి సేవించిన తరువాత విశ్వనాథుని దర్శనానికి వెళ్లాడు. విశాలాక్షిని, అన్నపూర్ణను స్తుతించాడు. ఆరు రోజుల వ్యవధిలో కొన్ని పండిత పరిషత్తులలో పాల్గొని వాదనలు చేశాడు. కొన్ని మతాలకు సనాతన ధర్మంతో సమన్వయం సాధించి, వాటిని కూడా ఇందులో కలిపేశాడు. కొన్నింటిని నిరాకరించి వాటిని అవైదిక మతాలని తృణీకరించాడు. ఎదుట పడిన ప్రతివాడిని పాదాక్రాంతుణ్ణి చేసుకున్నాడు.

మాసశివరాత్రినాటి ఉదయ సంధ్యలో... కాలభైరవ స్వామి సన్నిధిలో కనిపించిన ముసలాయన ఆనాడు విశ్వనాథుణ్ణి చూడవచ్చాడు. కానీ శంకరునితో ఆయనేమీ మాట్లాడలేదు. ఆ సాయంత్రమే శంకరుడు వ్యాసలింగేశ్వర దర్శనానికి వెళ్లాడు. అక్కడ శంకరుని కోసమే వేచి చూస్తున్నాడా వృద్ధుడు. ‘‘మనకు కొంత ఏకాంతం కావాలి’’ అన్నాడు. శంకరుణ్ణి ముందుకు నడిపించాడు. వ్యాసకాశీకి సమీపంలో గంగాతీరాన అనేక గుహలున్నాయి. ఆ గుహల్లో ఒకదానిలోకి వృద్ధుడు దారి తీశాడు.
శంకరయతి శిష్యులందరూ గుహ బయటనే వేచివున్నారు.

లోనికి ప్రవేశిస్తూనే శంకరుడు ఆ వృద్ధునికి సాష్టాంగ పడ్డాడు. వృద్ధుడు నిజస్వరూపంలో వేదవ్యాసునిగా దర్శనమిచ్చాడు. ఇద్దరూ సంభాషణ ప్రారంభించారు.
‘‘జగద్గురూ! లోకంలో ఒక పదానికి ఒక అర్థం రూఢిగా ఏర్పడుతుంది. సూత్రకారులు ఆ అర్థాన్నే గ్రహిస్తారు. మీవంటి భాష్యకారులు కూడా ఆ అర్థాలనే గ్రహించాలి. అంతేకానీ కొత్త అర్థాలు కల్పించ కూడదు. ఏమంటారు?’’ ప్రశ్నించాడు వ్యాసుడు.
‘‘అవును స్వామీ!’’ అన్నాడు శంకరుడు.
‘‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌ – ఆనందమే బ్రహ్మ అని తెలుసుకో – అని తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. ఆనందమయోభ్యాసాత్‌ – అని నేను సూత్రం చెప్పాను. దీనికి మీరు చెప్పిన భాష్యం ఏమిటి?’’ తదుపరి ప్రశ్న సంధించాడు వ్యాసుడు.

‘‘స్వామీ! ఈ సూత్రానికి యథాతథంగా అర్థం స్వీకరిస్తే ఆనందమయమైన వస్తువులో బ్రహ్మ ఒక భాగం అయిపోతాడు. అది వ్యాసహృదయం కాదని నేను చెప్పాను. దానికి తైత్తిరీయోపనిషత్తు బోధించినట్లుగా ఒకదాని లోపల ఒకటిగా ఉండే పంచకోశాలలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలను దాటిన తరువాత నిగూఢంగా లోపల ఉండే ఆనందమయ కోశాన్ని ప్రస్తావించాను. అప్పుడు ఆనందమయకోశమే బ్రహ్మస్వరూపం అవుతోంది. ఇక్కడ ఆనందమయత్వం వేరు... బ్రహ్మ వేరు కాదు. రెండూ ఒకటే అవుతోంది’’ అని బదులిచ్చాడు శంకరుడు.
‘‘వైదిక వాక్యానికి, సూత్రానికి ఎప్పుడైనా విరోధం వస్తే... సూత్రాన్ని మార్చి చెప్పుకోవాలి కానీ వైదిక వాక్యాన్ని మార్చకూడదు. ఇది వార్తిక కారుడైన కుమారిల భట్టు పద్ధతి. జగద్గురూ! మీరు సూత్రానికీ, ఉపనిషత్‌ వాక్యానికీ సమతూకం పాటించారు... మెచ్చుకున్నాను’’ అన్నాడు వ్యాసుడు.
‘‘ధన్యోహం’’ చెప్పాడు శంకరుడు.
‘‘ఇప్పుడు మూడో అధ్యాయంలోకి వద్దాం.  తదంతర ప్రతిపత్తౌ రహంతి సంపరిష్వక్తః ప్రశ్న నిరూపణాభ్యాం – అన్న సూత్రాన్ని మీరెలా వ్యాఖ్యానించారో తెలుసుకోవాలని ఉంది’’ అడిగాడు వ్యాసుడు.

‘‘మరణించిన తరువాత జీవుడు సూక్ష్మరూపాన్ని ధరిస్తాడు. అందుకు జలం, తేజస్సు, పృథ్వి భూతసూక్ష్మాలు సహకరిస్తాయి. అయితే ఛాందోగ్యోపనిషత్తులోని పంచాగ్ని విద్య ప్రకారం జీవుడు అయిదో ఆహుతి అయిన జలంతో సహాద్యులోకానికి వెళతాడు అని ఉంది. ఇక్కడ జలం ఒక్కదాన్నే పేర్కొన్నా దేహానికి బీజాలైన మూడింటినీ చెప్పుకోవాలి. అయితే జీవుడు ప్రాణేంద్రియాలతో కలిసి దేహాంతరానికి వెళతాడు అని వేదం చెబుతోంది. గడ్డిమీద సంచరించే జలూక అనే పొడుగుకాళ్ల పురుగు ఒక గడ్డి పరకను పట్టుకుని ఉంటుంది. మరో గడ్డిపరక దొరికే వరకూ తానున్నదాన్ని విడిచిపెట్టదు. ఇక్కడ దేహం గడ్డిపరక. మరణావస్థలోని జీవుడు కర్మబలం చేత తనకు రాబోయే జన్మలో ప్రాప్తించబోయే దేహాన్ని గురించి దీర్ఘంగా భావన చేస్తాడు. అదే రూపాన్ని పొంది జలం సహాయంతో ఊర్ధ్వగతికి వెళతాడు. జలమే అన్నిటా ఉన్నది’’ చెప్పాడు శంకరుడు.

‘‘మరి నాలుగో అధ్యాయంలోని – నిశి నేతి చేన్న సంబంధస్య యావద్దేహ భావిత్వాద్దర్శయతి చ అన్న సూత్రం గురించి...’’
‘‘హృదయ సంబంధమైన హార్దవిద్య ఒకటుంది. దాని ప్రకారం హృదయానికి సంబంధించి నూటొక్క నాడులున్నాయి. వాటిలో ఒకటి శిరస్సువైపుకి వెళుతుంది. దాని ద్వారా పైకి వెళ్లేవాడు అమృతత్త్వాన్ని పొందుతాడు. పగలైనా, రాత్రైనా దేహానికి రశ్మిసంబంధం ఉంటుంది. మరణంలో ఎప్పుడైనా కిరణయోగం ఉండనే ఉంటుంది. అసలు కిరణాలకు నాడులతో చుట్టరికం యావజ్జీవితమూ ఉంది. దానికి పగలు, రాత్రి అనే భేదం లేదు. దక్షిణాయనమైనా, కృష్ణపక్షమైనా యోగికి జ్ఞానఫలమైన ముక్తి అవశ్యం లభిస్తుంది...’’ శంకరుడింకా చెబుతూనే ఉన్నాడు.
పలుకు బ్రహ్మనిష్ఠమై ఉన్నది. మనస్సు, శరీరం గురుసన్నిధిలో ఉన్నాయి. గురుబోధ తప్ప అన్యమైనదేదీ గోచరించడానికి అవకాశమే లేని సందర్భం అది. అటువంటి స్థితిలో శంకరుని మనోఫలకంపై అతని తల్లి మెరిసింది. అందుకు కారణం వ్యాసుని కరుణ తప్ప మరొకటి కాదని గ్రహించాడు. 

కాలటి అగ్రహారంలో శంకరుని తల్లి ఆర్యాంబ అంత్యదశలో ఉంది. ఆమె స్థూలదేహం చుట్టూ బంధుమిత్రులు మూగి ఉన్నారు. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉండే ఆమె కారణ శరీరం మెల్లగా అక్కడి నుంచి కదిలింది. గదిలో నుంచి బయటకు వచ్చింది. మెట్టినింటికి వచ్చింది మొదలు తాను కన్నతండ్రిలా సేవించుకున్న కృష్ణ మందిరానికి చేరింది. 
పొట్టకింద తెల్లమచ్చలుండే జింక తోడురాగా ఒకప్పుడు, ఆర్యాంబ సూక్ష్మదేహం కైలాసనాథుణ్ణి దర్శించింది. ‘మా నాన్న దగ్గరకు పంపించు స్వామీ’ అని కోరితే సదాశివుడు అంగీకరించి పంపాడు. లోకాలన్నింటినీ అధిగమిస్తూ ఆర్యాంబ క్రమంగా ఆనాటికి గోలోకాన్ని చేరింది. 

కాలటిలోని బంధుమిత్రులు ఆర్యాంబ మరణించిందని ప్రకటించారు.వ్యాసుని ముందు కూర్చుని ఉన్న శంకరుని కన్నుల వెంట అశ్రువులు జలజల రాలిపడ్డాయి.
‘‘అమ్మకిచ్చిన మాట చెల్లించుకోవాలి కదూ!’’ అన్నాడు కొద్ది వ్యవధి తరువాత వ్యాసుడు. శంకరుడు అసహాయంగా చూశాడు.

‘‘ముందు కర్తవ్యం పూర్తి చేసుకోండి. మీరు వచ్చేవరకూ ఇక్కడే గ్రంథ పరిశీలన చేస్తూ ఉంటాను’’ అని సెలవిచ్చి పంపాడు వ్యాసుడు.
శంకరుడు ఉన్నచోటనే అంతర్థానమయ్యాడు. యోగశక్తి చేత ఆకాశగమనం చేసి శీఘ్రంగా తల్లి వద్దకు చేరుకున్నాడు. వార్త పంపకపోయినా, అకస్మాత్తుగా శంకరుడు రావడంతో కాలటిలోని వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. శంకరుడు తన తల్లికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధపడ్డాడు.

ముక్తామణి త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిర సుత త్వం 
ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కం

–కొడుకా! నా ఆణిముత్యమా! నా కంటిదీపమా... వెయ్యేళ్లు వర్ధిల్లుమా అని చిన్ననాడు నన్ను లాలించిన నీ నోటిలో అమ్మా! ఇప్పుడు తెల్లబియ్యాన్ని పోస్తున్నాను.  
అమ్మా... అయ్యా! గోవిందా అని తలచుకుంటూ పంటిబిగువున ఎంతో తీవ్రమైన ప్రసవ వేదనను అనుభవించి నాకు జన్మనిచ్చావు. నాకోసం నువ్వు పడిన శ్రమకు, త్యాగానికి ఏనాటికీ నీ ఋణం తీర్చలేను. ఈ అంత్యవేళ నీకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నాను.   

నేనప్పుడు గురుకులంలో ఉన్నాను. నేను యతివేషం ధరించినట్లు కల వచ్చిందని, రోదిస్తూ ఒకరోజున అంతదూరం పరుగు పరుగున వచ్చావు. అటువంటి నువ్వు నిజంగానే నేను సన్యాసం స్వీకరిస్తే ఎంత బాధపడ్డావో కదా... మన్నించమ్మా!

నీ చివరి ఘడియలలో నోటిలో తులసి తీర్థమైనా పోయలేక పోయాను. సమయం మించిపోయి వచ్చినందు వల్ల నీ చెవిలో తారకమంత్రమైనా చెప్పలేకపోయాను. గృహస్థుల వలె నీకు శాస్త్రబద్ధంగా శ్రాద్ధ విధులు సైతం నిర్వర్తించలేను. కేవలం నేను సమర్పిస్తున్న ఈ తెల్లబియ్యాన్ని అయినా స్వీకరించవమ్మా!... అన్నాడు శంకరుడు.
‘‘అయ్యా! ఏడుకట్ల సవారీ సిద్ధం చేయండి. అగ్నిహోత్రం సమకూర్చండి’’ అని అక్కడే ఉన్న బంధువులను అభ్యర్ధించాడు. 
‘‘సన్యాసికి అగ్నిహోత్రాన్ని తాకే అధికారం లేదు. నువ్వు నీ తల్లికి అంత్యక్రియలు నిర్వహించడం శాస్త్రవిరుద్ధం’’ అన్నారు వారంతా ముక్తకంఠంతో.
‘‘నిజమే. సన్యాసినైన నేను తల్లికి అంత్యక్రియలు నిర్వహించడానికి పనికిరాను. కానీ ఇది ఆమె చివరి కోరిక. నేను మాటిచ్చాను. చేయక తప్పదు’’ అన్నాడు స్థిరంగా శంకరుడు.
(సశేషం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement