‘‘ఎప్పటికప్పుడు ఇలాగే పాఠం చెప్పుకోకుండా ఎగ్గొట్టావంటే... ఆత్మనేపదికీ పరస్మైపదికీ కూడా కాకుండా పోతావ్. ఆనక ప్రతివాడూ ఛ ప్రత్యయం ప్రయోగిస్తాడు. ఎవరి శిష్యుడివిరా అబ్బీ అని పృచ్ఛ చేస్తారు. ఏం చెబుతావ్...’’ గద్దిస్తున్నట్లుగా అడిగాడు గురువుగారు.
‘‘మీ పేరే చెప్పాలి కదండీ’’ అమాయకంగా అన్నాడు శిష్యుడు.
‘‘అదే చెబుతున్నది.... ఆ పనిమాత్రం చెయ్యకు. ఇంకే తద్ధితంగాడి పేరైనా చెప్పుకో’’ అంటూ తొడమీద ఉన్న పత్తిపోగును వేళ్లనుంచి మణికట్టుదాకా లాగి విసురుగా తోశాడు గురువుగారు. కందెనకు వేలాడుతున్న దారం దాంతోపాటే గిరగిరా తిరుగుతూ జందెం తయారవుతోంది.
అసలే కోదండానికి వేలాడుతూ తల్లక్రిందులుగా చూస్తున్నాడేమో... పాపం ఆ శిష్యుడికి కళ్లు తిరుగుతున్నాయి. ‘ఊ కానియ్’ అన్న గురువుగారి హుంకారంతో, శిష్యుడు తడబడుతూ పాఠం వల్లెవేస్తున్నాడు.
‘క్షిణు చ, ఋణు గతౌ, తృణు అదనే, ఘృణు దీప్తౌ....’
పాణిని ఆలయం ఆవరణలో విద్యార్ధులకు వ్యాకరణ పాఠాలు సాగుతున్నాయి. కోదండం వేసిన శిష్యుడు కాక ఇంకా అనేకమంది ఉన్నారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క తీరులో కనిపిస్తున్నారు. ఒకరి శిఖ మేకుకు కట్టేసి ఉంది. మరొకరు మోకాళ్లపై నిలబడ్డారు. ఇంకొకరు శీర్షాసనంలో చదువుతున్నారు. అందరి దగ్గరకూ వెళుతూ వాళ్లమధ్యలో తిరుగుతూ ఎవరిపాఠం వారికి చెబుతున్నాడు గురువుగారు.
దాదాపు నాలుగువేల సూత్రాలతో సంస్కృత వ్యాకరణానికి ఒరవడి దిద్ది శబ్దానుశాసనం చేసినవాడు పాణిని. సింధుతీరంలో ఆయన జన్మించిన చోటు నుంచి మట్టితెచ్చి... శిష్యులంతా కలిసి కాశీలో ఈ గుడి కట్టించారు. పాణినీయంలో వృథా అయిన అక్షరం ఒక్కటి కూడా లేదు అంటాడు పతంజలి. అటువంటి సూత్రాలను వేలాదిగా రూపొందించడానికి ఆయనకు ఎన్నేళ్లు పట్టిందో చెప్పలేం. కానీ, సూత్రరచనలో ఆదమరుపుగా ఉన్నవేళలో ఒక సింహం పాణిని మహర్షిపై దూకి చంపేసిందని చెబుతారు. ఆ కథలో ఎంత నిజముందో తెలియదు... ఏదేమైనా నింద లేనిదే బొందె పోదు కదా!
‘‘ఘృణు దీప్తౌ, వను యాచనే, మను అవబోధనే, డుకృఞ్ కరణే....’’ విద్యార్థి పాఠం కొనసాగుతోంది.
‘‘అదీ... భూ సత్తాయాం నుంచి డుకృఞ్ కరణే వరకూ ఈ ఎనిమిది అధ్యాయాలున్నూ చప్పుచప్పున వప్పచెప్పేయ్. ఇంక రేపటినుంచి నీకు చక్కగా క్రియారూపాలు కూడా చెబుతాను.... ఏం? నా ఘటం వెళ్లిపోయేలోపు నిన్ను నా అంతవాణ్ణి చేస్తాను రా’’ శపథం చేశాడు గురువుగారు.
భాష్యరచన కోసం కాశీని విడిచిపెట్టి బదరికాశ్రమానికి బయలుదేరాడు శంకరుడు. శిష్యసమేతంగా ఆ దారిలోనే వెళుతూ అక్కడ ఆగాడు.
‘‘శాస్త్రాలనే కీకారణ్యంలోకి ప్రవేశించినవాడు ఎప్పటికి బయటపడతాడో చెప్పలేం. అతడు దారి తప్పవచ్చు. క్రూరమృగాల బారిన పడవచ్చు. అన్వేషిస్తున్నది లభ్యం కాక వేసట పొందవచ్చు. లేదా అమూల్యమైన వస్తువునేదో సొంతం చేసుకోవచ్చు. గహనాంతర సీమలలో సంచారం చేసినవాడు లోకంలో ఎవ్వరూ చూడని, సామాన్యులకు దుర్లభమైన అపురూపమైన జ్ఞానపుష్పాలేవో సొంతం చేసుకోవచ్చు. అయితే అటువంటి వాటన్నింటి కంటే గొప్పదైన హృదయపుష్పాన్ని శివునికి సమర్పించినవాడు ధన్యుడు. జ్ఞానమెప్పుడూ ప్రతికూలమైనదే.... భూమిని దున్నే నాగలిలాగా. అది పదును దేరకపోతే హృదయక్షేత్రాన్ని సస్యానుకూలం చేయలేదు. భక్తి ఎప్పుడూ సానుకూలమైనదే... భూమి నుంచి మొలకెత్తి మారాకు వేసి ఎదిగే మొక్కలాగా. జ్ఞానసాధన కలుపు ఏరినట్లుండాలి. కృషీవలుడు నేలను సన్నద్ధం చేసిన తరువాతే విత్తనాలు చల్లుతాడు. భక్తి అనే విత్తనం మొలకెత్తి ఫలవంతం కావాలంటే కృషి తప్పనిసరి....’’ అన్నాడు శిష్యులతో శంకరుడు.
ఈ అర్థాన్ని తెలియచెప్పే శివానందలహరిలోని శ్లోకాన్ని శ్రావ్యంగా వినిపించాడు విష్ణుశర్మ. ఈ సన్యాసుల రాగాలాపన విద్యార్థుల పాఠానికి భంగం కలిగించింది.
‘‘ఈ కవిగాళ్ల వల్ల భాషంతా చచ్చుబడి పోతోంది. రూపం మారిపోతోంది. చిక్కి శల్యమైపోతోంది. వేదమంత్రాల్లా ప్రతివాడి నోటివెంబడీ ఆ కాకి కూతలే. అయినా ఈ బికారి పాటలకు కూడా దేవభాషే కావలసి వచ్చిందేం?!’’ విసుక్కున్నాడు గురువు.
‘‘అయ్యా! సన్యాసాశ్రమం అన్నింటిలోనూ గొప్పది. సన్యాసి కనబడగానే వయోభేదం పాటించకుండా అందరూ పాదాభివందనం చేయాలి. ఇంత చదువుకున్నా మీరు ఆ మర్యాద పాటించకపోగా, ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు’’ అన్నారు శంకర శిష్యులు.
‘‘చూస్తుంటే ఇంకా మీసాలు కూడా మొలిచినట్లు లేదు. బరువు బాధ్యతలు గాలి కొదిలేశారు. ఆత్మపిండాలు వేసుకుని ముష్టిచిప్పలు పట్టుకుని బయల్దేరారు. అలాంటి మీకు అందరూ పడీపడీ మొక్కాలా?’’ విసురుగా అన్నాడాయన.
శంకరయతి శిష్యులు ఏదో సమాధానం ఇవ్వబోయారు.
అదేమీ వినిపించుకోకుండా, ‘ఏరా జశ్త్వసంధి సూత్రం ఏమిటి?’ అన్నాడాయన తన శిష్యుల్ని ఉద్దేశించి.
‘‘మరేమో గురువుగారూ... వర్గ తృతీయాక్షరాలూ, చతుర్థాక్షరాలూ రెండూ కానీ... అహహ ఏదైనా ఒకటి గానీ...’’
‘‘శుంఠా... ఒక్కసారి చదివితే అస్థిని పట్టి పోవాల్రా. మళ్లీ చదివి అఘోరించు’’ అని ఇటువైపుకు తిరిగాడు గురువు. ‘‘సన్యాసివైతే అడవులు పట్టిపో. అంతేకానీ జనావాసాల్లోకి చొరబడకు. దుంపలు తవ్వుకుని, పళ్లు కొట్టుకుని తిని కొండల్లో కోనల్లో బతుకు. తపస్సు చెయ్. ఏదైనా ఇతరులు సాధించలేని దానిని సాధించు. అంతేకానీ దేశానికి బరువుగా మారకు’’ అన్నాడు.
అంతలోనే శిష్యుడి వైపుకు తిరిగి, ‘‘ఒరే ధాతూ! పూర్తయిందా?’’ అన్నాడు.
‘‘అంతా వచ్చేసింది గురువుగారూ! ఆ చివరి సూత్రమే పట్టుబడడం లేదు’’ అయోమయంగా అన్నాడు వేళ్లాడుతున్న శిష్యుడు.
‘‘ఇంతకీ ఏమిటి నీ చచ్చు సందేహం?’’
‘‘డుకురుయ్ అనాలా?! డుకురుంగ్ అనాలా?! ఏవిటీ అనమని చెప్పారిందాకానూ?’’
‘‘వ్హోరి చవట దద్దమ్మా! నిన్ను కోదండం వేయించడం కాదురా... కరచరణాలు కట్టేసి గంగలో తోసెయ్యాలి’’ అని తలపట్టుకున్నాడు గురువు.
శంకరుని కంఠం ఖంగుమంటూ మోగింది.
భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్ కరణే
ఓరి మూఢమానవుడా! గోవిందుణ్ణి భజించు. చేసే పనులన్నింటా గోవిందుడినే ప్రతిష్ఠించుకో. కర్మానుభవం పొందవలసిన దశలో నీవు ఏది, ఎంతవరకూ చేయాలో నిర్దేశించేది అతడే. మరణ సమయం ఆసన్నమైన దశలో నీ దుష్కృతాలను రద్దుచేసినా, సుకృతాలను రెట్టింపు చేసినా అతడికే అధికారం ఉంది. అందుకే ఎల్లవేళలా గోవిందుణ్ణి మాత్రమే భజించు. భగవత్ స్పర్శలేని పనుల జోలికి పోనే పోవద్దు... అన్నాడు.
‘‘ఆ.... ఆ.... ఎవర్నీ అంతమాటా??’’
‘‘అక్షరాలా తమరినే స్వామీ! మరెవ్వరినీ కాదు’’ అంటూ శంకర శిష్యులు గురువుతో పాటు అడుగు ముందుకు వేశారు.
గురువు ముఖాన నెత్తురు చుక్క లేదు. శిష్యులంతా నోళ్లు వెళ్లబెట్టారు.
భజగోవిందం ప్రయాగదిశగా ప్రయాణిస్తూ కొనసాగింది. దారిలో కనిపించిన వ్యక్తులు, సమాజ పరిస్థితులు అందులో ప్రతిఫలించాయి.
మూర్ఖుడా! ధనతృష్ణను విడిచిపెట్టు. అల్పమతీ! వైరాగ్యాన్ని పెంచుకో. స్వయంకృషితో సంపాదించిన దానితోటే మనస్సును సంతోషపెట్టుకో. స్త్రీవ్యామోహంలో చెడిపోకు. ఆ అందచందాలన్నీ కేవలం మాంసపు ముద్దలే అని మాటిమాటికీ మనసుకు నచ్చచెప్పుకో. మానవ జీవితం తామరాకుమీద నీటిబొట్టులా అనుక్షణం కదలాడిపోతూ ఉంటుంది. ఏ క్షణంలో అయినా ఆ నీటిబొట్టు చెరువులో కలిసిపోవచ్చు. ఈ సంసార సాగరాన్ని తరింపచేసే నౌక సాధుసంగం మాత్రమే అని తెలుసుకో.
నీకు డబ్బు సంపాదించే శక్తి ఉన్నంత వరకే భార్య అయినా, కొడుకులైనా ప్రేమ చూపిస్తారు. నీ దేహం జరాగ్రస్తమై, నువ్వు మూలన పడితే... ఈ పూట ఎలావుందీ అని పలకరించే దిక్కు కూడా ఉండదు. నీ ఒంటిలో ప్రాణం ఉన్నంతవరకూ కనీసం ఇంటిలో అయినా ఉండనిస్తారేమో. కానీ ఒక్కసారి కడ ఊపిరి విడిచిన తరువాత నీ శవాన్ని తాకడానికి నీ భార్య కూడా ఇష్టపడదు.
బాలుడు క్రీడాసక్తుడు. యువకుడు లలనా లోలుడు. వృద్ధుడు చింతామగ్నుడు. ఎంత వెతికినా పరబ్రహ్మపై సంపూర్ణంగా మనసు నిలిపిన వాడు ఒక్కడూ కనబడడు. సోదరా! ఈ ప్రపంచం చాలా చిత్రమైనది. నీ భార్య ఎవరు? నీ పుత్రులెవరు? వారేమీ నీకు శాశ్వతం కాదు. వారిలో నువ్వు ఎవ్వరి వాడవూ కాదు. ఎక్కడి నుంచి అసలిక్కడికి వచ్చావో... ఎక్కడికి పోతున్నావో ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించు. నువ్వు జీవన్ముక్తుడివి అయితే తప్ప ఈ విషవలయం నుంచి బయటపడలేవు.
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః
సజ్జనులతో కలిసి తిరిగేవాడే విషయవాసనలకు దూరంగా ఉంటాడు. అలా ఉన్నప్పుడే మోహపు తెరలు తొలగుతాయి. దానివల్ల చలించని తత్త్వం... తద్వారా జీవన్ముక్తి సాధ్యమవుతాయి. నీరు ఎండిపోయాక చెరువు మాయమైపోతుంది. డబ్బు ఖర్చయిపోగానే నీ చుట్టూచేరిన భజనగాళ్లు మాయమైపోతారు. అలాగే వయసు జారిపోయిన తరువాత కామవికారం కూడా తగ్గిపోతుంది అనుకోవద్దు సుమా! తత్త్వ విచారం చేసిన వాడికి మాత్రమే సంసార చక్రబంధం నుంచి విముక్తి లభిస్తుంది.
అర్థబలం, అంగబలం ఉన్నాయని, వయసు పోడిమి ఉందని గర్వం పొందకు. కాలపురుషుడు తలచుకుంటే అన్నింటినీ క్షణంలోనే మాయం చేయగలడు. ఈ కనిపిస్తున్నదంతా మాయ అనుకోవడమే నీకు మేలు కలిగిస్తుంది. తత్త్వాన్ని గ్రహించినవాడికే బ్రహ్మపదం లభిస్తుంది. ఎంతగా ఏమి బోధచేసినా ఏం లాభం సోదరా! రాత్రింబవళ్లు, ఉదయాస్తమానాలు, శిశిర వసంతాలు ఎన్నెన్నో వెళ్లిపోతూ మళ్లీ వస్తూ ఉన్నాయి. కాలక్రీడలో ఆయుష్షు చెల్లిపోతూనే ఉన్నది. కానీ నీలో ఆశ మాత్రం పోవడం లేదా? గోవిందుణ్ణి భజించు. నీ ప్రయత్నాల కంటే, నీ సంకల్పాల కంటే బలవత్తరమైనది అదే... నిన్ను రక్షించేది అదొక్కటే. అప్పటికి పన్నెండు శ్లోకాలు పూర్తయ్యాయి. శంకరయతి త్రివేణీ సంగమాన్ని చేరుకున్నాడు. వేణీమాధవుని అర్చించి బయటకు వచ్చాడు. శిష్యులు భజగోవిందం అంటూ పదేపదే పాడుకుంటున్నారు. ద్వాదశ త్రిపుండ్రాలను ధరించిన వైష్ణవుడొకడు పరుగు పరుగున వచ్చి శంకరుని పాదాలపై పడ్డాడు.
‘‘స్వామీ! ఈ అంతులేని దుఃఖానికి అసలు కారణమేమిటి?’’ అని ప్రశ్నించాడు.
‘‘జీవుడు దేహధారి కావడమే కారణం. జన్మించినది లగాయతు ఈ దేహమే నేను అనే మమత్వాన్ని పెంచుకోవడమే అసలు కారణం. అదే జన్మ పరంపరలను సృష్టిస్తోంది’’ అన్నాడు శంకరుడు.
‘‘అయితే ఈ మమకారమే జన్మకు కారణమా?’’ మళ్లీ అడిగాడతను.
‘‘కాదు... కర్మ. ఇది మూడు విధాలుగా ఉంటుంది. ప్రారబ్ధం భూతకాలానికి చెందినది. ఆగామి భవిష్యత్తును సూచిస్తుంది. సంచిత కర్మ అంటే పోగుచేసుకునేది... అది ఏ కాలానికైనా చెందవచ్చు. ఆగామి, ప్రారబ్ధ కర్మలలో ఏ కర్మ ముందుగా పరిపక్వమై ఫలోన్ముఖమవుతుందో ఆ కర్మలను జీవుడు ఆచరిస్తూ ఉంటాడు. దానికి అనురూపమైన జన్మలనే పొందుతుంటాడు’’ అన్నాడు శంకరుడు.
‘‘అయితే కర్మబంధాల నుంచి విముక్తం కావడం ఎలా... నిష్క్రియాపరులుగా మారిపోవాలా? ప్రజలందరూ సన్యాసులు కావాలా?’’
‘‘అవసరం లేదు. సన్యాసి కూడా నిష్క్రియాపరుడు కాలేడు. ఆత్మానాత్మ వివేకం చేసుకున్న వాడే కర్మబంధాల నుంచి బయటపడతాడు’’ వివరించాడు శంకరుడు.
‘‘ఏది ఆత్మ, ఏది అనాత్మ?’’
‘‘ఆత్మ సత్పదార్థం శాశ్వతమైనది.’’
‘‘మరి అనాత్మ?’’
‘‘ఆత్మ ఏదో తెలుసుకుంటే చాలు. అనాత్మకు ప్రత్యేకమైన అస్తిత్వమంటూ లేదు. ఇది ఎలాగంటే వెలుగుకు నిర్వచనం తెలిస్తే చాలు. ఆ వెలుగు లేకపోవడమే చీకటి అని అర్థం అవుతుంది కదా! అలాగే ఆత్మను గురించి ఎరుక కలిగించుకుంటే చాలు’’ అన్నాడు శంకరుడు.
‘‘ఆ ఎరుక కలిగేదెలా? ఇంతకూ సత్పదార్థాన్ని తెలుసుకునేందుకు అవరోధంగా మారే అజ్ఞానం మనిషిలో ఎలా ప్రవేశిస్తుంది?’’
‘‘అజ్ఞానం ఎప్పుడు మొదలైందో ఎవరూ చెప్పలేరు. దాన్ని నిర్వచించడం కూడా కుదరదు. కానీ అజ్ఞానం వల్లనే అవివేకం, దేహాభిమానం, రాగద్వేషాలు పెంపొంది వాటినుంచి పుట్టిన చిత్తవృత్తులు కర్మకు కారణమవుతున్నాయి. చిత్తవృత్తుల చేత రూపొందే కర్మలే జీవుణ్ణి శరీరం పొందేలా పురికొల్పి దుఃఖానికి గురి చేస్తున్నాయి. మానవుణ్ణి కోరికల పుట్టగా తయారు చేస్తున్నాయి.’’
‘‘కోరికలే దుఃఖానికి మూలమా?’’
‘‘కాదు. అవిద్యయే దుఃఖానికి మూలం. కోరికలకు మూలమైన కర్మవలయంలో మానవుడు తాదాత్మ్యం చెందడమే అసలు కారణం. నిజానికి కర్మకు అజ్ఞానానికి విరోధం లేదు. అవిద్యావంతుడు కూడా కర్మలు ఆచరిస్తూనే ఉన్నాడు కదా! కానీ అవిద్యవల్ల భేదజ్ఞానం పుడుతుంది. అది భయాన్ని కలిగిస్తుంది. జ్ఞానం మాత్రమే భయరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. అద్వైతసిద్ధిని కటాక్షిస్తుంది’’ అన్నాడు శంకరుడు.
వైష్ణవ శిష్యుడు తన్మయుడై తన ఆత్మావిష్కారం ఇలా చేసుకున్నాడు....
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే ఖలు దుస్తారే కృపయా పారే పాహి మురారే
మళ్లీ పుట్టడం, మళ్లీ మరణించడం.. మళ్లీ పుట్టడం కోసం జనని గర్భంలో శయనించడం.. ఈ ప్రపంచంలో అగచాట్లు పడుతూ జీవించడం ఈ జనన మరణ చక్రభ్రమణాన్ని ఛేదించాలంటే ఓ మురారీ! నీవు కృప చూపి రక్షించాల్సిందే.. అన్నాడు. అతడే తరువాతి కాలంలో దృఢభక్తి ఆచార్యుడై శంకర శిష్యునిగా వినుతికెక్కాడు.
– సశేషం
- నేతి సూర్యనారాయణ శర్మ
Comments
Please login to add a commentAdd a comment