జగమే మాయ | Adi Shankaracharya Story In Funday | Sakshi
Sakshi News home page

జగమే మాయ

Published Sun, Sep 8 2019 11:05 AM | Last Updated on Sun, Sep 8 2019 11:05 AM

Adi Shankaracharya Story In Funday - Sakshi

ఈ కథ కృతయుగం ప్రారంభంలో జరిగింది. బ్రహ్మ స్తనాలను భేదించి ధర్ముడు పుట్టాడు. అతడి కుమారులు ఇద్దరు... నరుడు, నారాయణుడు. బదరికాశ్రమం వారి తపోభూమి. తపస్వులే కాదు, మహావీరులు కూడా. సహస్రకవచుడనే రాక్షసుణ్ణి వధించడానికి పూనుకున్నారు వారిద్దరూ. వెయ్యేళ్లపాటు తపస్సు చేసినవాడు తనతో యుద్ధం చేసినప్పుడు మాత్రమే పోయేటంత సురక్షితమైన కవచాలు సరిగ్గా ఓ వెయ్యి ఉన్నాయి ఆ రాక్షసుడి దగ్గర. 

నరనారాయణులు వంతుల వారీగా వాడితో యుద్ధం చేశారు. ఒకరు వెయ్యేళ్ల పాటు యుద్ధం చేస్తుంటే, మరొకరు తపస్సు చేసేవారు. అలా మొత్తం తొమ్మిదివందల తొంబైతొమ్మిది  యుద్ధాలు పూర్తయ్యాయి. చివరి వంతు యుద్ధం నరుడికి వచ్చింది. కానీ తనకు మిగిలిపోయిన ఒక్క కవచంతో సహస్ర కవచుడు సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుని శరణు పొందిన ఆ రాక్షసుని వధించడం సాధ్యం కాక నరుడు వెను తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత కాలం చాలానే గడిచిపోయింది.

భూలోకానికి పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకమనే అయిదు లోకాలను దాటిన తరువాత తపోలోకం ఉంది. అక్కడ ఉండే తపస్వులు, సిద్ధులు తమ ఇచ్ఛమేరకు కింది లోకాలకు అవతరిస్తారు, తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. ద్వాపరయుగం చివరిలో... అపాంతరతముడనే మహర్షి అలాగే తపోలోకం నుంచి బదరికాశ్రమానికి వచ్చాడు. 
సాక్షాత్‌ విష్ణువే అయిన ఆ మహర్షిని నరనారాయణులిద్దరూ పూజించారు. సంతోషించిన మహర్షి వారికి కర్తవ్యం బోధించాడు. ‘ఆనాటి సహస్రకవచుణ్ణి సూర్యదేవుడు మళ్లీ నేలపైకి పంపబోతున్నాడు. వాడిని చంపే బాధ్యత నరమహర్షీ నీదే’ అన్నాడు. 

‘‘అలాగే స్వామీ! వాడు నేల మీదకు వచ్చిన తరువాత కదా!’’ అన్నాడు నరుడు పాతపగ గుర్తు చేసుకుంటూ.
‘‘అంతే. కానీ వాడిని చంపేందుకు మీరు కూడా కొత్త జన్మలు తీసుకోవాలని బ్రహ్మ నిర్దేశం. కంస చాణూరాది రాక్షసులను నిర్జించి ధరాభారం తగ్గించడానికి నారాయణ మహర్షీ! మీరు శ్రీకృష్ణునిగా జన్మించాలి. కర్ణవధ కోసం నరుడు పాండవమధ్యముడైన అర్జునునిగా అవతరించాలి. నేను సైతం కృష్ణద్వైపాయనుడినై వేదవ్యాసునిగా జన్మించబోతున్నాను’’ అన్నాడు అపాంతర తముడు. 

నరనారాయణులు బదరికాశ్రమాన్ని విడిచిపెట్టారు. భారత సంగ్రామం గీతా ప్రయుక్తంగా ముగిసింది. శ్రీకృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమై 2611 సంవత్సరాలైంది. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం మాధవమాసం (క్రీ.శ. 495) ప్రవేశించింది. 

బదరికావనంలో అలకనందా నది ప్రశాంత సుందరంగా ప్రవహిస్తోంది. ఆ తీరాన శంకరయతి ముందు శిష్యులు కూర్చుని ఉన్నారు.
‘‘జన్మాష్టమినాడు సరిగ్గా శ్రీకృష్ణ జనన సమయానికే మాయ కూడా పుట్టిందట. కంసుడు చేతితో పట్టుకుని రాతికేసి కొట్టబోతే ఎగిరి గాలిలో నిలిచి నీ మృత్యువు రేపల్లె నుంచి నడిచి వస్తుంది అన్నదట’’ అన్నాడు నిత్యానందుడు.

ఆచార్య శంకరుడు మాయావివరణం ప్రారంభించాడు.
‘‘ఎండలో ధగధగలాడిపోతున్న ఆల్చిప్పను చూసి వెండి అని ఆశపడతాం. సూర్యకాంతి తక్కువై మసక మసకగా ఉన్నచోట తాడును చూసి పామని జంకుతాం. ఎడారుల్లో దవ్వున ఎండమావిని చూసి దప్పికి ఎగబడతాం. చీకటిలో మోడు చూసి దొంగ అనుకుని కేకలు వేస్తాం. ఇదంతా అసలు వస్తువును ఎరగకపోవడం వల్ల చేసే ఆరోపం. ఈ అజ్ఞానానికి చాలానే పేర్లున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాయ, అవిద్య, తామసి అనేవి. ఇవి మూడుగా విడిపోకముందు దీనినే మూలప్రకృతి అంటున్నాం.  సృష్టికి పూర్వం కర్మవాసనలతో నానిన జీవులెన్నో లక్కముద్దలో బంగారంలా ఈ మూలప్రకృతిలోనే లయమై ఉంటాయి.’’ 

‘‘అయితే ఆచార్యా! అది మూడుగా విడిపోయినప్పుడు ఏమవుతుంది?’’ ప్రశ్నించాడు పద్మపాదుడు. 
‘‘మూలప్రకృతి సత్త్వ రజస్తమో గుణాల సముదాయం. తెలుపు, ఎరుపు, నలుపు రంగుల దారాలతో పురిపెట్టిన తాడు లాంటిది. శుద్ధసత్త్వ స్వరూపమైన దానినే మాయ అంటారు. సృష్టి ప్రారంభంలో పంటకు వచ్చిన జీవులు కర్మలను బట్టి మూడు విధాలుగా దానినుంచే బయటకు వస్తాయి. సృష్టికి పూర్వమే ఉన్న బ్రహ్మచైతన్యం ఈ మాయలోనే ప్రతిబింబించి ఈశ్వరుడై జగత్తును సృజిస్తుంది. మాయయే తామసిగా మారినప్పుడు ఈశ్వరుడు సృష్టిని అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తాడు.’’

‘‘మరి మూడోరూపమైన అవిద్య ఎలా మారుతుంది?’’ సుబోధాచార్యుడు ప్రశ్నించాడు.
‘‘అది రజోగుణ ప్రధానం. వైయక్తికమైన అవిద్య జీవులకు కారణ శరీరం అవుతుంది. సమష్టి రూపమైన మూలప్రకృతి ఈశ్వరునికి కారణశరీరం. అయితే ఈ జీవేశ్వరుల ఉనికి గాఢసుషుప్తిలోనే వ్యక్తమవుతుంది. కారణ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఇది ఆనందమయ కోశం’’ వివరించాడు శంకరుడు.

‘‘గాఢ సుషుప్తిలో జీవేశ్వరుల కలయిక ఏర్పడినా అనుభవంలోకి రాదు కదా ఆచార్యా! ఎలా మరి ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం?’’ ఈసారి సురేంద్రుడు అడిగాడు.
‘‘అందుకోసమే లింగశరీరమున్నది. అదే సూక్ష్మ ప్రపంచ సృష్టి. తమస్సు నిండివున్న ప్రకృతిని ఈశ్వరుడు ఆకాశంగా మార్చేశాడు. ఆకాశం నుంచి వరుసగా వాయువు, అగ్ని, నీరు, భూమి పుట్టాయి. వీటి పుట్టుకకు కూడా కారణం అజ్ఞానమే అయినందువల్ల ఆ సూక్ష్మభూతాలకూ త్రిగుణాలుంటాయి. వాటి వేర్వేరు సత్త్వగుణాల వల్ల జ్ఞానేంద్రియాలు, సమష్టి సత్త్వం వల్ల అంతఃకరణం పుట్టింది. రజోగుణాంశాల వల్ల కర్మేంద్రియాలు కలిగాయి. రజోగుణ సమష్టిచేత ప్రాణం పుట్టి అయిదుగా విభాజితమైంది. అలా పది ఇంద్రియాలు, అయిదు ప్రాణాలు, మనస్సు, బుద్ది, చిత్తం, అహంకారమని నాలుగు విధాలుగా ఉండే అంతఃకరణం కలిసి సూక్ష్మశరీరం అయింది. కానీ ఈ శరీరంలో జీవేశ్వరుల ఉనికి స్వప్నావస్థలోనే తేటపడుతుంది. ఇందులో విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ కోశాలున్నాయి.’’

‘‘కానీ నిశ్చయంగా ఉన్నది మనకు అనిపించేది స్థూల జగత్తు ఒక్కటే కదా!’’ వేరొకరి ప్రశ్న.
‘‘వైశేష్యాత్తు తద్వాద స్తద్వాదః – బ్రహ్మసూత్రాల ప్రకారం పంచభూతాలను అతిసూక్ష్మభాగాలుగా పంచీకరణం చేస్తూ పోతే ఈ బ్రహ్మాండము, దీనిలోని పద్నాలుగు లోకాలు వచ్చాయి. వాటినుంచే నేలను చీల్చుకు పుట్టినవి, చెమట నుంచి పుట్టినవి, గుడ్ల నుంచి పుట్టినవి, గర్భం నుంచి పుట్టినవి అనే నాలుగు రకాలైన జీవజాతులు ఏర్పడుతున్నాయి. మెలకువలో మనకు కనిపించే ఈ స్థూలమంతా అన్నమయ కోశం’’ అని స్థూలజగత్తును వర్ణించాడు శంకరుడు.

‘‘చర్మచక్షువులకు దైవం ఉనికి తెలుసుకోవడం ఎందుకు సాధ్యం కాదు?’’ మరొక జీవుని వేదన.
‘‘మసక మసకగా ఉన్న వెలుగులో తాడు కొందరికి పాములా కనిపిస్తుంది. కొన్నిసార్లు పూలదండలా, జలధారలా, ఇనుప గొలుసులాగా అనిపిస్తుంది. అన్ని కల్పనలకూ ఆ తాడే ఆధారం. ఇది ఈశ్వరుని విక్షేప శక్తి. ఆ శక్తి చేతనే త్రిగుణ స్వరూపుడై త్రిమూర్తులుగా భాసిస్తాడు. జీవుల పంచకోశాలకూ, ఆత్మకూ మధ్య తేడా జ్ఞానులకు మాత్రమే గోచరిస్తుంది. ఇతరులకు ఇది కనబడనీయకుండా ఈశ్వరుని ఆవరణ శక్తి ప్రపంచాన్ని అంధకారంలా కప్పి ఉంచుతుంది’’ అని శంకరుని వివరణ.

‘‘ఈ చీకట్లు తొలగిపోవడం ఎలా?’’ అని దృఢభక్తి ప్రశ్నించాడు.
‘‘ఈశ్వరుని ఆవరణ శక్తిని అసత్వ్తము, అభానువు అనే రెండు ఆవరణల్లో జీవుడు చూస్తాడు. గురువు సాయంతో పరోక్ష జ్ఞానం లభిస్తుంది. అక్కడ శ్రవణ, మనన, నిదిధ్యాసల ద్వారా దైవమే లేదు అసత్వ ఆవరణ చెదిరిపోతుంది. అప్పుడు నేనే బ్రహ్మమును అనే అపరోక్ష జ్ఞానం ఉదయిస్తుంది. దానివల్ల బ్రహ్మము తెలియడం లేదు అనే అభానువు తొలగిపోతుంది. అప్పుడు బ్రహ్మకు భిన్నంగా ఏదీ లేదని, తానే బ్రహ్మమని విచారణతో అనుభవానికి తెచ్చుకుని జీవుడు జీవన్ముక్తుడు అవుతాడు.

అహం బ్రహ్మాస్మ్యహం బ్రహ్మా
స్మ్యహం బ్రహ్మేతి నిశ్చయః
చిదహం చిదహం చేతి
సజీవన్ముక్త ఉచ్యతే

– నేనే బ్రహ్మమును. జ్ఞాన స్వరూపుడను. ప్రకాశ స్వరూపుడను అనే నిశ్చయం సకల అవస్థలలోనూ కలిగినవారే జీవన్ముక్తులు. అటువంటివారు కర్మాధీనమైన శరీరం నశించిన వెంటనే ప్రాణవాయు సంచారం నిలిచిపోయినట్లు పునర్జన్మలను నశింప చేసుకుంటారు. జీవన్ముక్త స్థితిని కూడా పరిత్యజించి విదేహముక్తులవుతారు. అవాఙ్మానస గోచరమైన సచ్చిదానంద పరమాత్మ స్వరూపులు అవుతున్నారు. ఇదీ మాయావివరణంలోని ప్రథమ వర్ణకం’’ అని ఆ పూటకు పాఠం ముగించాడు శంకరుడు. 

శిష్యులందరూ అక్కడి నుంచి కదిలారు. దూరంగా నడుచుకుంటూ వెళ్తూ, ‘‘జీవుని అంతరాత్మ మూడు శరీరాలనే చెరసాలల్లో బందీగా ఉంటుంది. ఆ త్రిపురాలు ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు శివుడు నారాయణాస్త్రం ప్రయోగిస్తాడట’’ అంటూ త్రిపురాసుర సంహార సన్నివేశాన్ని చెబుతున్నాడు పద్మపాదుడు.   

శంకరుడు కూర్చున్న చోటనే అంతర్ముఖుడయ్యాడు. కాలటి నుంచి వచ్చిన మేనమామ అగ్నిశర్మను వెంటబెట్టుకుని విష్ణుశర్మ వచ్చాడు.
వస్తూనే ‘‘ఆచార్యా! నా మాట ఆలకించాలి’’ అన్నాడు. ‘‘వచ్చిన దగ్గరినుంచి వీరిమాటే పట్టించుకోలేదు మీరు. మీ అమ్మగారి గురించి ఏదో చెబుతున్నాడు’’ చెప్పాడు పక్కకు జరిగి.
ఏమిటన్నట్లుగా చూశాడు శంకరుడు.

‘‘నేను వచ్చి ఇప్పటికి రెండేళ్లయింది. అక్కడ అక్కయ్య ఎలా వుందో ఏమిటో’’ దిగులుగా అన్నాడు అగ్నిశర్మ.
‘‘ఏమైంది?’’
‘‘మంచం మీంచి దించడం... పోయిన ప్రాణం తిరిగి రావడం. దాదాపుగా ప్రతిరోజూ ఇదే తంతు. నిజానికి అటువంటి స్థితిలో ఆమెను వదిలి రావడానికి మనస్కరించలేదు. కానీ ఎలాగైనా దీనిని మీకు అందచేయమని పోరుపెడితే వచ్చాను’’ అంటూ బట్టలమూట చాటునుంచి ఒక బంగారు పళ్లేన్ని బయటకు తీశాడు విష్ణుశర్మ. ‘‘మీ ఆస్తి అంతా కరిగించి ఇలా పోత పోయించింది అక్కయ్య. ఇది మీకు అందిందనే కబురు అందేదాకా ఆవిడ కొనఊపిరితో అయినా ఉంటుందని నా నమ్మకం’’ అని ఆ బంగారు పళ్లేన్ని శంకరుని ముందు పెట్టాడు.

‘‘ఇంత విలువైన వస్తువుతో ఇంతదూరం ఒంటరిగా వచ్చావా?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు విష్ణు.
మెడలోని గాయత్రిని పైకెత్తి పట్టుకుని ‘అవున’న్నాడు అగ్నిశర్మ.
‘‘ఇంత బాధ్యతగా దీన్ని కాపాడావు కనుక, ఇది నీకు చెందడమే న్యాయం’’ అన్నాడు తీర్పు చెబుతూ శంకరుడు.
‘‘అంటే మీరు స్వీకరించరా?’’ బేలగా అడిగాడు అగ్నిశర్మ.

‘‘నేనేం చేసుకోను? నీలాగా సంసారిని కానుగా’’ అన్నాడు నవ్వుతూ. తల్లి కొంగులా మెత్తగా అనిపించిన ఆ బంగారపు పళ్లేన్ని అగ్నిశర్మకే తిరిగి ఇచ్చేశాడు.  ‘‘అమ్మకిచ్చిన చివరి మాట గుర్తుంది. ఆమె యోగక్షేమాలు నా బాధ్యత’’ స్థిరంగా చెప్పాడు శంకరుడు.
‘‘అయితే అక్కయ్య క్షేమంగా ఉందంటారా?  మాకు తెలియకపోయినా అక్కడి విషయాలు మీరు తెలుసుకోగలరు. దయచేసి చెప్పండి... అక్కయ్య ఇప్పుడెలా ఉంది?’’ ఆదుర్దాగా అడిగాడు అగ్నిశర్మ.
శంకరుడు చెప్పడం ప్రారంభించాడు.

‘‘నువ్వు వచ్చేశాక ఆమెకు బాగా నెమ్మదించింది. ఒకనాటి రాత్రి జరిగిన ముచ్చట ఇది. ఆమె స్థూలదేహం మంచం మీదనే ఉంది. దానినే అనుక్షణం గమనిస్తూ ప్రౌఢగా కనిపిస్తున్న కారణ శరీరం ఆమె పక్కనే ఉంది. కర్మానుభవాల వల్ల కలిగిన దుఃఖాలన్నింటినీ గుర్తుతెచ్చుకుంటూ శోకిస్తోంది. ఆమె సూక్ష్మశరీరం మాత్రం పూర్ణానది ఒడ్డున కూర్చుని వృషాచలేశ్వర శిఖరం వైపు చూస్తోంది. పదహారేళ్ల బాలిక కనుక ఎవరి సాయం లేకుండా వేగంగానే కోవెలకు వెళ్లిపోగలదు. కానీ ఎందుకో అధైర్యం ఆవహించిందామెకు. అసహాయంగా అక్కడే ఉండిపోయింది.

కొద్దిసేపటికి ఆమె దగ్గరకు పొట్టకింద తెల్లమచ్చలున్న ఓ జింక వచ్చింది. అమ్మ చుట్టూ తిరుగుతూ ఆడడం మొదలుపెట్టింది. మెల్లిగా దాని కొమ్ములు పట్టుకుని, ‘నన్ను మా నాన్న దగ్గరకు తీసుకెళ్తావా’ అని అడిగింది అమ్మ. సరేనంటూ ముందుకు కదిలింది జింక. అలా వాళ్లిద్దరూ ఎంతసేపు నడిచారో తెలియదు. పైకి ఎక్కుతున్నప్పుడు అది వృషాచలేశ్వరుని కోవెలలాగే అనిపించింది కానీ, అంతలోనే వెండికొండలా మారిపోయింది. అమ్మ చాలాసేపు ప్రయాసపడి శిఖరాన్ని చేరింది. మహాదేవుడు ఉమాసమేతుడై దర్శనమిచ్చాడు.

అమ్మ తనివితీరా ఆయనను అర్చించింది. ‘ఏం కావాలమ్మా’ అని ప్రీతితో అడిగాడు మహాదేవుడు. ‘నన్ను మా నాన్న దగ్గరకు పంపించు స్వామీ!’ అని అడిగింది అమ్మ. లోకాలన్నింటినీ కన్నతండ్రి చల్లగా నవ్వాడు. ‘అంతదూరం ఒక్కర్తివీ వెళ్లగలవా’ అని అడిగాడు అమ్మకొడుకులాగా. ‘ఇదిగో కాస్త ఈ జింకకు దారి చెప్పు’ అన్నది అమాయకంగా అమ్మ.

సరేనంటూ ఆయనేం చెప్పాడో తెలియదు కానీ, జింక మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది. కైలాసాన్ని దాటి లోకాలన్నీ అధిగమిస్తూ అమ్మ ముందుకు వెళుతోంది. రెండేళ్లుగా కాలటిలో అమ్మ స్థూలశరీరం మనవాళ్ల సంరక్షణలో భద్రంగానే ఉంది. ఆమె ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. పూర్తి కానివ్వు చూద్దాం.’’

శంకరుడు చెబుతున్న వృత్తాంతమంతా కలలా అనిపించింది విష్ణుశర్మకు, అగ్నిశర్మకు. మరే ప్రశ్నలూ వెయ్యకుండా మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు వాళ్లిద్దరూ. బంగారుపళ్లెం అగ్నిశర్మ వద్దనే ఉంది.
రోజు గడిచింది. అలకనంద స్వచ్ఛంగా పారుతోంది. పద్నాలుగేళ్ల శంకరుడికి నీళ్లను చూస్తే ఉత్సాహం పొంగింది. శిరస్సు నీటిలో ముంచి కాళ్లు రెండింటినీ ఎక్కువ వేగంగా కదపకపోయినా చేపపిల్లలా దూసుకుపోతున్నాడు. ఇక్కడ మునిగినవాడు ఎక్కడో తేలుతూ ఆటలాడుకుంటున్నాడు. అంతలో నీటి అడుగున ఒక విచిత్రం కంటపడింది. 
– సశేషం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement