ఇటు రా నాయనా! | Shankara Vijayam Part 12 | Sakshi
Sakshi News home page

ఇటు రా నాయనా!

Published Sun, Sep 1 2019 10:22 AM | Last Updated on Sun, Sep 1 2019 10:22 AM

Shankara Vijayam Part 12 - Sakshi

శంకరయతి బదరికాశ్రమం దిశగా గంగాతీరం వెంట సాగిపోతున్నాడు. తపస్సుకు అనుకూలమైన హిమాలయాలను ఎంచుకుని, భాష్య రచనలను పూర్తి చేసుకోవడం ప్రాథమిక లక్ష్యంగా ఆ ప్రయాణం కొనసాగుతోంది. శంకరునితో కలిపి ఆ బృందం ఏడుమంది. సప్త ఊర్ధ్వలోకాల్లా భాసిస్తున్నారు వారు. గురు ముఖతః సత్యదర్శనం చేసుకుంటూ విల్లు విడిచిన బాణాల్లా హిమాలయాలను అధిరోహిస్తున్నారు. 
గురువుకు ఆకలిదప్పులు లేవు. అయినా శిష్యులు సమర్పించినప్పుడు ప్రీతితో స్వీకరించడమే గురువు నైజం. ఆచార్య శంకరుడు ఎప్పుడూ నిటారుగా కూర్చోవడమే కానీ, కాసేపైనా నడుం వాల్చడం శిష్యులెప్పుడూ చూసి ఎరుగరు. గురువుకు మార్గాయాసమూ లేదు. తనతో సమానమైన వేగంతో మిగతావారు ప్రయాణించలేరనే కారణం వల్లనే కాబోలు... ఆయన ఇప్పటికీ బదరికాశ్రమం చేరకుండా తాత్సారం చేస్తున్నాడు. ఇంకెంత... రెండురోజుల ప్రయాణదూరంలో బదరికాశ్రమానికి చేరుకోవచ్చు. ఆవేళ అప్పటికే చీకటి పడడం వల్ల ప్రయాణం నిలుపు చేశారు.

విష్ణుశర్మ నిప్పు రాజేశాడు. పుల్లాపుడకా చేర్చాడు. అందరూ చలి కాచుకోవడానికి ఆ నెగడు చుట్టూ చేరారు. దూరంగా శంకరుడు తపోమగ్నుడై ఉన్నాడు. అగ్నిశిఖల వెలుగులో గురువు దివ్యతేజస్సులో కణకణలాడుతూ కనిపిస్తున్నాడు.
ఇహ పరసుఖ విముఖోహం 
నిజసుఖబోధానుభూతి భరితోహం
ఇతిమతి దూరతరోహం
భావేతర సుఖనిషక్త చిత్తోహం
– నేను ఇహపర లోకాలలో లభించే సుఖాల పట్ల విరక్తుడను. ఆత్మసుఖానంద పరిపూర్ణుడను. పొందిన కొద్దీ కొరత మిగిలే ఉండే సుఖలాలసకు నేను చాలా దూరం. భావాతీతమైన నిత్యసుఖంపైనే నా చిత్తం లగ్నమై ఉంది. నాకు ఈర్షా్యద్వేషాలు లేవు. పరమేశ్వర దర్శనాన్ని బలంగా వాంఛించే వాళ్లకు తగిన పురుషార్థాలను సమకూర్చి పెడుతూ ఉంటాను. ఉపనిషత్తులనే ఉద్యానవనాల్లో ప్రతి అంగుళం నేను విహరించిన చోటులే. గట్లు పొర్లి ఉప్పొంగే శోకసముద్రంలో అంతర్లీనంగా ఉండే బడబానలం విరజిమ్మే వహ్నిజ్వాల నేనే. తత్త్వజ్ఞానం అందించే తృప్తిని నేనే. ఆ తృప్తి అనే దీపపు కాంతినీ నేనే. వేదాంత వాక్యాలను విశ్వసించిన పరిశుద్ధ అంతఃకరణం కలవారికి జీవబ్రహ్మైక్య స్థితిని బోధిస్తాను. మోహమనే కటిక చీకట్లను పోగొట్టే సహస్ర కిరణుడను నేనే.

.... శంకరుణ్ణే గమనిస్తూ ఆయన రచించిన స్వాత్మనిరూపణంలోని శ్లోకాలను మననం చేసుకుంటున్నాడు సనందుడు.
మిగతావారంతా ముచ్చట్లలో పడ్డారు.
‘‘సరేనయ్యా! యోగం వల్ల అలసటకు దూరమవుతాం అని విని ఉన్నాం. కానీ మరీ నిద్రాహారాలు లేకపోయినా మనగలిగే స్థితి ఉంటుందా?’’ అన్నాడు సురేంద్రుడు.
‘‘ఉంటుంది. మానవుని బుద్ధి అజ్ఞానంలో మునిగిపోవడాన్నే నిద్ర అంటారు. బుద్ధి తాలూకు విలీన స్థితి అరికట్టిన వాడికి నిద్ర అవసరం లేదంటారు మన గురువుగారు. అలాగే మెలకువలో బుద్ధి పూర్ణంగా వికసిస్తుంది. ఈ వికాసమూ, విలీనమనే వికారాలకు దూరమైనప్పుడు... నిద్ర లేకపోయినా జాగరణ చేసినప్పటి అలసట ఉండదు. ఇక బుద్ధి సూక్ష్మనాడుల్లో సంచరించినప్పుడు స్వప్నాలు వస్తాయి. ఆ బుద్ధి సంచారాన్నే అరికట్టి నిశ్చలత్వాన్ని సాధించిన యోగిని స్వప్నావస్థ కూడా చేరలేదు. వాయువు వల్ల, అగ్నివల్ల శరీరంలో నాడులు పీడన పొందితే ఆకలి దప్పికలు కలుగుతాయి. స్వాత్మానంద స్థితికి చేరుకున్న నాకు ఇవేమీ ఉండవు... వినలేదా ఆచార్య శంకరుని మాట??’’ అన్నాడు సనందుడు. ఈ మాటలు చెప్పి అక్కడినుంచి లేచి దూరంగా వెళ్లాడు.

‘‘అంతా తనకే తెలిసున్నట్లు చెబుతాడేం? అసలు నువ్వు అతగాణ్ణి అడిగావా?! ఏదో పిచ్చాపాటీగా మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరాడు’’ విసుక్కున్నాడు సుబోధాచార్యుడు.
‘‘అట్లా అనకు సుబోధా! గురువుగారికి సనందుడంటే ఎంత ప్రేమ?! ఎంత ఆదరణ?! మన గురువుగారి నీడకు ఓ పేరు, రూపం గనక కల్పిస్తే అది మన సనందుడే కదా. అవును గానీ విష్ణూ! నువ్వు గురువుగారి వద్దకు చేరి ఎన్నేళ్లయింది?’’ అడిగాడు సురేంద్రుడు.
‘‘ఆయనకు అయిదేళ్ల వయసున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇద్దరం ఒకే గురుకులంలో చదువుకున్నాం’’ చెప్పాడు విష్ణుశర్మ.
‘‘అయితే అందరికంటే పెద్దపీట న్యాయంగా నీకే దక్కాలి’’ అన్నాడు సుబోధాచార్యుడు.
‘‘అవును ముమ్మాటికీ నిజం. విష్ణూ! బహుశా నువ్వు సన్యాసం తీసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నావు. ఎందుకని ఆలస్యం చేస్తున్నావు?’’ ఆత్రుతను ఆపుకోలేక అడిగాడు సురేంద్రుడు.
‘‘అడిగితే ఇచ్చేవారేనేమో! నేను కోరలేదు... వారివ్వనూ లేదు. నాకు కావాల్సిందల్లా ఆయన నా కళ్లముందు ఉండడం. తొలినాడు గురుకులంలో ఆయనను చూసినప్పుడే జన్మకు చాలిన పెన్నిధి దొరికిన అనుభూతి కలిగింది. ఆయనతోనే కలిసి నడుస్తూ, ఆయనకు లేఖకునిగా ఉంటూ, కావలసినవన్నీ సమకూరుస్తూ ఇలా ఉండిపోవడమే నాకు ఆనందం’’ అన్నాడు విష్ణుశర్మ.

‘‘మంచిదే. కానీ సన్యాసం ఆత్మోన్నతికి మార్గమవుతుంది కదా!’’ అన్నాడు సుబోధాచార్యుడు.
‘‘కావచ్చు. ఆయన ఎఫ్పుడు ఏది చేయమని ఆజ్ఞాపిస్తే... అప్పుడు అది చేయడమే నా పరమార్థం’’ దృఢంగా అన్నాడు విష్ణుశర్మ.
‘‘చూస్తుంటే నీక్కొంచెం పెళ్లియావ ఉన్నట్లుంది’’ అన్నాడు సురేంద్రుడు.
విష్ణుశర్మ ఆ మాటకు సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు.
అప్పటివరకూ మౌనంగా ఉన్న నిత్యానందుడు కల్పించుకున్నాడు. ‘‘విష్ణూ! విరక్తి వేరు,  సన్యాసం వేరు కదా... ఏమంటావు?’’ అన్నాడు సురేంద్రుని వంక క్రీగంట చూస్తూ.
‘‘నిజమే. సంసారసుఖాల పట్ల విరక్తి పెంచుకోవడం వేరు, తత్త్వజ్ఞానం పొందడం వేరు అని మన ఆచార్యుల వారే తరచుగా చెబుతుంటారు. జీవితంలో ఏర్పడే అనుభవాల వల్ల ఎవరికైనా విరక్తి పుట్టవచ్చు. కానీ జ్ఞానం మాత్రం సద్గురువు వల్లనే లభిస్తుంది. మబ్బుల నుంచి జారిపడే స్వచ్ఛ జలాన్ని నేరుగా తాగాలని, నదిగట్టునే వేచి ఉండే చాతక పక్షిలా మానవుడు... ఆత్మప్రబోధం కలిగించే సద్గురువు కోసం వేచి చూడాలి అంటారాయన’’ అన్నాడు దృఢభక్తి ఆచార్యుడు.

‘‘ఆత్మప్రబోధం అంటే ఏమిటి?’’ అన్నాడు సురేంద్రుడు.
‘‘నీలోనే అసలు వెలుగు ఉందని నీకు తెలిసేలా చెప్పడం’’ అన్నాడు నిత్యానందుడు.
‘‘దానికి కొంచెం తపస్సు చేస్తే సరిపోతుంది. పుస్తకాలు చదివితే జ్ఞానం తనంత తానే పెరుగుతుంది. ఇంకా గురువెందుకు?’’ అన్నాడు సుబోధాచార్యుడు. 
‘‘అవును. బెల్లం తియ్యగా ఉంటుందని తిన్నప్పుడే తెలియనక్కరలేదు. ఎవరైనా చెప్పినా, పుస్తకంలో చదివినా తెలుస్తుంది. అంతేకదా!’’ అందించాడు సురేంద్రుడు. 
‘‘పుస్తక జ్ఞానం వల్ల బెల్లంలా కనిపించే ప్రతిదీ బెల్లమే అనుకునే ప్రమాదం ఉంటుంది. అదే దాని స్వరూప స్వభావాలు పూర్తిగా తెలిసినవాడికి నువ్వో బెల్లంముక్క తినమని ఇచ్చావనుకో. వాడేమంటాడూ?! మా చిన్నతనంలో తిన్న బెల్లం రుచి వేరు. ఇప్పుడా రుచి రావడం లేదు అంటాడు. అవునా!’’ అన్నాడు నిత్యానందుడు.
దృఢభక్తి దానికి కొనసాగింపుగా ఇలా చెప్పాడు. ‘‘గురుప్రబోధం పొందకుండా ఆత్మాన్వేషణ చేసిన వాడిని అనుక్షణం అయోమయం వెంటాడుతుంది. చిన్నప్పుడు తిన్న రుచి ఇప్పుడు ఎక్కడికి పోయిందీ అని వెతుక్కుంటూ కూర్చోవడంలాగే ఉంటుందది. అదే గురువు తోడుగా ఉంటే స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. జీవితమంతా ఆనందమనే రుచి స్థిరపడుతుంది.’’ 

‘‘అలా కాదులే ఆచార్యా! ఏది తిన్నా బెల్లంలాగే ఉండాలి. హాయిగా అరిగిపోవాలి. గురువు అనే వ్యక్తి అలా ఏమైనా చేయగలరా?’’ వెటకారంగా అడిగాడు సురేంద్రుడు.
‘‘ఆత్మానుభవం ఎవరికి వారే పొందాలి. ఆ దోవలోకి తీసుకువెళ్లి విడిచిపెట్టడమే కానీ, గురువులు ఇతరత్రా ప్రమేయం కలిగించుకోరు’’ అన్నాడు నిత్యానందుడు.
‘‘ఈ శరీరంతో పొందే అనుభవాలన్నీ ఆత్మానుభవాలే కదా!’’ అన్నాడు సురేంద్రుడు.
‘‘కాదు. నువ్వు మరణించిన తరువాత నీ శరీరం అన్నపానాలు కోరదు. అందువల్ల దేహం కంటే ఆత్మ భిన్నమైనది’’ అన్నాడు నిత్యానందుడు.
‘‘బహుశా ప్రాణం కాబోలు’’ అన్నాడు సుబోధాచార్యుడు.
‘‘నువ్వు నిద్రపోతూ ఉంటే ఒంటిమీద బట్టలు వలుచుకుపోయినా నీకు తెలియదు కదా... అప్పుడా ప్రాణం ఎటు పోయింది?’’
‘‘బహుశా ఆత్మ అంటే మనస్సే అయివుండాలి.’’
‘‘అదెప్పుడూ పరాధీనమే కదయ్యా! దానికి అన్నీ తెలుసు అని చెప్పలేం. స్వయంగా విషయాలను గ్రహించే శక్తి మనస్సుకు లేదు. నిజానికి మనస్సును ఉద్ధరించగలిగే శక్తికే ఆత్మ అని పేరు’’ అన్నాడు దృఢభక్తి.
‘‘ఇంతకూ అసలు ఆత్మపదార్థం ఎలా ఉంటుంది? దాని ఉనికిని సామాన్యుడు కూడా తెలుసుకోవడం ఎలా? ఈ విషయంలో గురువుగారు ఏమైనా చెప్పారా?! నీకు గుర్తున్నంత వరకూ చెప్పు’’ నిత్యానందుడు అడిగాడు. విష్ణుశర్మ ఇలా చెప్పాడు.

‘‘చీకటింటిలో ఒక దీపం వెలిగించు. గది మధ్యలో ఉంచు. దానిమీద ఒక కుండ బోర్లించు. గాలి ఆడడానికి, కాంతి వెలార్చడానికి ఆ కుండకు ముందుగానే అయిదు చిల్లులు ఉండేలా చూసుకో. ఒక్కో చిల్లుకూ ఎదురుగా వరసగా నేల ఉసిరిక, వీణ, కస్తూరి, జాతిరత్నం, వింజామర ఉంచు. దీపం మీద కుండ ఉన్నప్పటికీ దానికి ఉన్న చిల్లుల ద్వారా వెలువడే కాంతిలో ఆయా వస్తువులన్నీ చక్కగా కనబడుతున్నాయి కదా! ఇప్పుడు సమాధానం చెప్పు... నువ్వు ఆ వస్తువులన్నింటినీ గుర్తించడానికి కారణమైనది ఏది? కుండకు ఉన్న చిల్లులా.. మొత్తం కుండేనా... తైలమా... లేదంటే వత్తి అంటావా? వీటిలో దేన్నీ నువ్వు ఒప్పుకోలేవు. దీపజ్యోతి మాత్రమే కారణం అని అంగీకరిస్తావు కదా!  ఆ కుండకు ఉన్న అయిదు చిల్లులూ పంచేంద్రియాలు. వాటి ముందు పెట్టిన పదార్థాలన్నీ శబ్ద స్పర్శ రూప రస గంధాలకు ప్రతీకలు. చిల్లుల కుండలో వెలుగుతున్న జ్యోతిలా ఆత్మయే నీకు సర్వపదార్థాలనూ గురించిన ఎరుకను కలిగిస్తోంది. అయితే ఈ ఆత్మ ఎవ్వరికీ గోచరం కాదు. మహామహా యోగులకు మాత్రం మెరుపులా మెరిసి చటుక్కున మాయమైపోతూ ఉంటుంది అన్నారు.’’

‘‘ఈ మాయ ఎక్కడినుంచి దాపురించిందయ్యా మనకు?’’ విసుక్కున్నాడు సురేంద్రుడు.
‘‘సృష్టిని విస్తరించాలని పరబ్రహ్మ సంకల్పించినప్పుడు ఆయనకు తోడుగా నిలిచిందే మాయ. అదే స్థావర జంగమాత్మకమైన ఈ దృశ్య జగత్తును సృష్టిస్తోంది’’ అన్నాడు దఢభక్తి.
‘‘కాదు. జగత్తు ఈశ్వరుడి వల్లనే వస్తోంది. మధ్యలో మాయ ప్రమేయం ఏముంది?’’ అడిగాడు సుబోధాచార్యుడు.
‘‘విష్ణూ! ప్రబోధ సుధాకరంలోని ఆత్మసిద్ధ ప్రకరణం ఇందాక చెప్పావు. మరి మాయా స్వరూపాన్ని గురించిన ఉదాహరణ కూడా చెప్పు’’ అన్నాడు నిత్యానందుడు.
విష్ణుశర్మ ఇలా చెప్పాడు. ‘‘స్వప్నంలో ఒకడికి సురతానుభవం కలిగిందనుకుందాం. మెలుకువ వచ్చేసరికి వస్త్రంపై శుక్రస్రావం కనిపిస్తుంది. స్వప్నంలో ఉన్న పురుషుడు తానే కనుక అతడు సత్యమే. ఆ స్త్రీ, ఆమెతో పొందు రెండూ అసత్యాలే. కానీ వస్త్రంపై శుక్రదర్శనం మాత్రం సత్యం. జాగ్రత్‌ స్వప్న అవస్థలలో మానవుడు ఒకేలాంటి మిధ్యావిషయాల వెంటబడి, రాగద్వేషాలకు లోనవుతున్నాడు. సుషుప్తిలో తన ఎరుకే తనకు తెలియదు. సత్యదర్శనానికి అడ్డుపడుతూ జగత్తును మాయ ఇలాగే నడిపిస్తోంది.’’ 

సురేంద్రుడు, సుబోధాచార్యుడు వినలేక చెవులు మూసుకుని అక్కడినుంచి లేచివెళ్లిపోయారు.
‘‘అయితే ఈ మాయను దాటగలిగే వారెవరు?’’ ప్రశ్నించాడు నిత్యానందుడు.
‘‘జగదాచార్యుడే...’’ అన్నాడు తాను కూడా పైకి లేస్తూ దృఢభక్తి.
‘‘ఆయనను త్రికరణ శుద్ధిగా అనుసరించిన శిష్యులు కూడా కావచ్చును’’ అంటూ నిత్యానందుడు కూడా కదిలాడు.
తెల్లవారింది. పొద్దెక్కి రెండు ఝాములైంది. గంగ ఒడ్డున శంకరుడు ధ్యానతత్పరుడై ఉన్నాడు. శిష్యులంతా ఆయనను సమీపించారు. వారి మనసుల్లో ఏవేవో ప్రశ్నలున్నాయి. శిష్యుల రాకను గురువు గుర్తించాడు. కానీ ఆయన చెప్పదల్చుకున్న పాఠం వేరు.
నెమ్మదిగా కన్నులు తెరిచి, ‘‘సనందా!’’ అన్నాడాయన.
సురేంద్రుడు, సుబోధాచార్యులకు ఆ పిలుపు అపశ్రుతిలా వినిపించింది. ‘అతడు ఆవలి ఒడ్డుకు వెళ్లాడండీ’ అని సమాధానం చెప్పబోయారు. 
కానీ వారి మాటలు వినిపించుకోకుండా, ‘‘ఇటు రా నాయనా’’ అన్నాడు శంకరుడు.
ఆవలి గట్టున ఉన్న సనందుడు తలతిప్పి చూశాడు. అతని కళ్లకు ఆచార్య శంకరుని నగుమోము అతి సమీపంగా కనిపించింది. బుద్ధికి తామున్న దూరం అంచనా వేసే లక్షణం పోయింది. 
మనసెప్పడో ఆయనను సమీపించినందువల్ల అప్రయత్నంగా, ‘‘చెప్పండి గురువుగారూ!’’ అన్నాడతడు అడుగు ముందుకు వేసి.

అప్పటికింకా గంగకు ఆవలి ఒడ్డునే ఉన్నాడతను. ఈవలి ఒడ్డున శంకరుడు. మధ్య గంగ సరళ ప్రవాహంగా సాగిపోతోంది. కొన్ని తావుల్లో చెప్పరాని లోతు కూడా ఉంది. సనందుని అడుగులు ముందుకు పడుతున్నాయి. అలాగే వస్తే అతడు నదిలో మునిగిపోవడం ఖాయం.
బ్రహ్మ సత్యం జగన్నిధ్యేత్యేవం రూపో వినిశ్చయః
సోయం నిత్యానిత్య వస్తు వివేక స్సముదాహృతః
–    కనిపించే రూపాలన్నీ జగత్తులా మిధ్యా స్వరూపాలే. బ్రహ్మమొక్కటే సత్యం. నిత్యుడైన ఆయన యందు దృష్టిని నిలిపి వివేకం పెంచుకో... అన్నాడు శంకరుడు.
అవతల సనందుని అడుగులు నది అడుగుకు వెళ్లడం మాని విచిత్రంగా పైకి తేలుతున్నాయి.
అతని పాదాల క్రింద గంగ లోపలి నుంచి పద్మాలు వెలుస్తున్నాయి. అవి సనందుణ్ణి మోసి తెచ్చి ఈవలి ఒడ్డుకు చేర్చాయి. అందరూ నోళ్లు వెళ్లబెట్టుకుని ఆ దృశ్యాన్ని తిలకించారు. 
‘‘మాయను దాటించేది ఏది?’’ గొణిగాడు నిత్యానందుడు.
‘‘శ్రీశంకరాచార్య మమ దేహి పదావలంబమ్‌’’ అన్నాడు దృఢభక్తి రెండు చేతులూ జోడించి. 
నదిని దాటి క్షేమంగా వచ్చిన సనందుణ్ణి చూసి చిరునవ్వుతో శంకరుడు, ‘‘పద్మపాదాచార్యా!’’ అని సంబోధించాడు. ఆనాటి నుంచి సనందుడు పద్మపాదునిగా ప్రసిద్ధుడయ్యాడు. శంకరశిష్యులలో ప్రథమస్థానం అతడికే పదిలపడింది.  
మళ్లీ ప్రయాణం కొనసాగింది.
బదరికాశ్రమం చేరువ అయింది. యతిబృందం లోనికి ప్రవేశిస్తోంది. దారికి పక్కగా అప్పటివరకూ కూర్చుని ఉన్న ఓ వ్యక్తి వీరిని చూసి లేచి నిలబడ్డాడు. అతడు అగ్నిశర్మ. కాలటి నుంచి వచ్చాడు. పూర్వాశ్రమంలో శంకరునికి వరుసకు మేనమామ.
‘ఏమిటిలా వచ్చావు?’ అన్నట్లు శంకరుడు కన్నులతోనే ప్రశ్నించాడు ముందుకు సాగుతూ.
‘‘అమ్మ పంపించింది’’ అన్నాడు అగ్నిశర్మ వెంటబడి వస్తూ. 
– సశేషం
- నేతి సూర్యనారాయణ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement