సాధ్వీమణులకు వందనం.. | famous women Spiritual Gurus in india | Sakshi
Sakshi News home page

సాధ్వీమణులకు వందనం..

Published Thu, Mar 1 2018 11:08 AM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM

famous women Spiritual Gurus in india - Sakshi

ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఏకాగ్రత, నిబద్ధత అవసరం.. అవి చేకూరాలంటే మానసిక ప్రశాంతత ఉండాలి.. అందుకు ఏకైక మార్గం ఆధ్యాత్మికత.. తమ ప్రవచనాలు, ప్రసంగాల ద్వారా ఎందరికో సాంత్వన చేకూర్చిన సాధ్వీమణులను ఓసారి స్మరించుకుందాం.. 

శ్రీ శారదా దేవి
భారత మహిళా సాధువుల్లో అత్యంత ప్రముఖులు. రామకృష్ణ పరమహంస ధర్మపత్ని. 1858లో శారదామణి ముఖోపాధ్యాయ్‌గా జన్మించిన ఆమెకు ఐదేళ్ల ప్రాయంలో 23 ఏళ్ల రామకృష్ణ పరమహంసతో వివాహం జరిగింది. కౌమార దశలోకి ప్రవేశించగానే దక్షిణేశ్వర్‌లోని కాళీమాత గుడిలో పూజారిగా పనిచేసే భర్తను కలుసుకోవడానికి వేల మైళ్లు ప్రయాణించారు. భర్తను చేరు​కునే సమయానికి ఆయన ఆధ్యాత్మిక యోగిగా మారారు. భార్యగా, భక్తురాలిగా, సహాయకురాలిగా పరమహంస సాహచర్యంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు. పరమహంస ఆమెను కాళీ మాత అవతారంగా, దైవ మూర్తిగా భావించి శారదాదేవిగా నామకరణం చేశారు. తమ ఆశ్రమానికి వచ్చే మహిళా భక్తుల్ని సాదరంగా ఆహ్వానించేవారు. వారికి ఆధ్యాత్మిక అంశాలు బోధించేవారు. భర్త దైవైక్యం పొందిన తర్వాత శిష్యులందరికీ గురువుగా మారారు. ఎంతో మంది భక్తులను పొందారు.  శారదాదేవి గౌరవార్థం ఆమె భక్తుల్లో ఒకరు 1954లో  శ్రీ శారదా మఠ్‌ రామకృష్ణ శారదా మిషన్‌ స్థాపించారు. దీని ద్వారా ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. భారత్‌, ఆస్ట్రేలియా దేశాల్లో శాఖలు కలిగి ఉంది.

మైత్రేయి
ప్రాచీన భారతదేశంలో అత్యంత మేధావిగా పేరుగాంచిన మహిళగా అనేక పురాణాల్లో మైత్రేయి ప్రస్తావన ఉంది. విద్యా వ్యాప్తికై ఆమె ఎంతగానో కృషి చేశారు. వైదిక భారతదేశంలో స్త్రీలకు కూడా విద్యావకాశాలు ఉన్నాయనడానికి నిదర్శనంగా నిలిచారు. భారతీయ మహిళా మేధావులకు దర్పణంగా నిలిచిన మైత్రేయి స్మారకార్థం ఢిల్లీలోని ఒక విద్యా సంస్థకి ఆమె పేరు పెట్టారు.
  
 

భైరవీ బ్రాహ్మణి
రామకృష్ణ పరమహంస 1861లో భైరవీ బ్రాహ్మణిని గురువుగా స్వీకరించారు. ఆమె ఎల్లప్పుడూ రామ, వైష్ణవ దేవతల ప్రతిమలను ప్రతిబింబించే   ‘రఘువీర్‌ శిల’ను తన వెంట తీసుకువెళ్లేవారు. గౌడీయ వైష్ణవం, తంత్ర విద్యను ఆచరించేవారు. దైవత్వం పట్ల నమ్మకాన్ని, భక్తి శాస్త్రాలను బోధించారు. శక్తిని పూజించేందుకు కావాల్సిన తంత్ర విద్యను రామకృష్ణకు
ఉపదేశించారు. 64 రకాల తంత్ర సాధనాలను కేవలం రెండేళ్లలో రామకృష్ణకు బోధించారు. రామకృష్ణ వీటిని పూర్తి స్థాయిలో ఆచరించేందుకు  చిత్తశుద్ధి, నిగ్రహం పొందేందుకు మంత్ర, జప, పురస్కరణ వంటి సంస్కృతులు పాటించేవారు. సంప్రదాయ విరుద్ధమైన వామాచార ఆచారాన్ని(పూర్తిస్వేచ్ఛగా జీవించడం, మాంసాహారం భుజించడం, బ్రహ్మచర్యం వదలటం) కూడా రామకృష్ణకు బోధించారు. కానీ ఆయన ఈ ఆచారాన్ని పూర్తిస్థాయిలో ఆచరించలేదు. కుమారి పూజ, కుండలిని యోగ, యోగాసనాలు బోధించిన పరిపూర్ణ గురువుగా మన్ననలు అందుకున్నారు.

అవ్వయ్యార్‌
తమిళంలో అవ్వయ్యార్‌ అంటే గౌరవనీయులైన మహిళ అని అర్థం. తమిళ సాహిత్యంలో ఈ పేరుతో సుమారు ముగ్గురు కవయిత్రులు ఉన్నారు. వారిలో ఒకరు 1 వ శతాబ్దంలో జీవించినట్లు, 59 పద్యాలు రచించినట్లు ఆధారాలు ఉన్నాయి. అవ్వయ్యార్‌-2 చోళ వంశ పాలనా సమయంలో(10వ శతాబ్దం) జీవించారు. రోజువారీ జీవితంలో చేయకూడని, చేయాల్సిన పనుల గురించి సామాన్య భాషలో పద్యాలు రచించారు. ఆమె రాసిన పద్యాలు నేటికీ తమిళ పాఠ్య పుస్తకాల్లో దర్శనమిస్తున్నాయి. తను ఎంతో ఙ్ఞాన సంపదను కలిగి ఉన్నానని, ఇక నేర్చుకోవాల్సిందేమీలేదని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మారువేషంలో వచ్చిన మురుగన్‌ ఙ్ఞానసముపార్జన నిత్యప్రవాహం వంటిదని, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆమెకు బోధ చేయడంతో మరలా విద్యాభ్యాసం ప్రారంభించిందని, చిన్నారుల కోసం పుస్తకాలు రాసిన మొదటి వ్యక్తిగా నిలిచిందని చరిత్ర చెబుతోంది.

ఉభయ భారతి
ఒకప్పటి మాహిష్మతి(మహిషి) రాజు మందన మిశ్రా భార్య. జైత్ర యాత్రలో భాగంగా ఒకరోజు ఆదిశంకరాచార్యుల వారు మాహిష్మతి రాజ్యానికి చేరుకున్నపుడు రాజుతో మేధో చర్చకు సిద్ధమవుతారు. ఈ చర్చలో విజేతను నిర్ణయించే బాధ్యతను రాజు భార్యకు అప్పగిస్తారు. చర్చలో ఓడితే రాజు సన్యాసం స్వీకరించాలనే షరుతు కూడా విధిస్తారు. వాదోపదవాదాలను, గణాంకాలను బేరీజు వేస్తూ శంకరాచార్యుల వారిని విజేతగా నిర్ణయిస్తుంది ఉభయ భారతి. షరతు ప్రకారం రాజు సన్యాసం స్వీకరిస్తారు. భర్త అడుగుజాడల్లో నడిచే భారతీయ స్త్రీ కనుక ఆమె కూడా సన్యాసం స్వీకరించి, ఇద్దరూ కలిసి ఙ్ఞాన మార్గాన్ని వ్యాప్తిచేస్తూంటారు. ఈ క్రమంలో ఆమె గంగా నది ఒడ్డున ఆశ్రమంలో శిష్యురాళ్లతో కలిసి జీవిస్తూ ఉంటారు. స్నానపానాదుల కోసం రోజూ గంగా నదికి వెళ్లే దారిలో బ్రహ్మఙ్ఞానిగా పిలువబడే సన్యాసి వారికి తారసపడతారు. అన్నింటినీ పరిత్యజించిన ఆ సాధువు ఒక మట్టికుండను మాత్రం ఎల్లప్పుడూ తన వద్దే పెట్టుకుని, ఒక దిండులాగా భావించి దానిపై నిద్రిస్తూ ఉంటారు. ఇది గమనించిన ఉభయ భారతి ‘నిజమైన సన్యాసులు దేనిని కూడా ఆస్తిగా, ప్రేమపూర్వకమైన దానిగా భావించరని’ తన శిష్యులకు చెబుతుండగా ఆ మాటలు విన్న సన్యాసి ఆగ్రహించి కుండను దూరంగా విసిరివేస్తారు. ‘నాడు ఆ కుండను మీ దగ్గర పెట్లుకుని అభిమానం పెంచుకున్నారు. నేడేమో అహంకారంతో దానిని పగులగొట్టారు’ అన్న ఉభయ భారతి మాటలు ఆయనకు కనువిప్పు కలిగిస్తాయి. ఈ విధంగా ప్రతిఒక్కరినీ ఙ్ఞాన మార్గాన్ని బోధిస్తూ తన జీవితాన్నిసంఘసంస్కరణకు అంకితం చేశారు ఉభయ భారతి.

శ్రీ ఆండాళ్‌
వైష్ణవ మతాన్ని ఆచరించిన 12 మంది అళ్వార్లలో ఏకైక మహిళా అళ్వార్‌. 8వ శతాబ్దానికి చెందిన వారు. పెరుమాళ్‌(విష్ణుమూర్తి)ని స్తుతిస్తూ పదిహేనేళ్ల ప్రాయంలో ‘తిరుప్పావై’(తమిళం) రచించారు. ఇందులో గల 30 చరణాలను పసురామాలు అంటారు. వైష్ణవ మతాన్ని ఆచరించే అళ్వార్లు సంకలనం చేసిన ‘దివ్య ప్రబందం’లోని అంతర్భాగాలుగా వీటిని పేర్కొంటారు. పెరియళ్వార్‌గా పిలువబడే విష్ణుచిత్త అనే సాధువు తులసి మొక్క కింద కనిపించిన పసిపాపను చేరదీసి, కొదాయి(గోదా)గా నామకరణం చేశారు. పెరిగి పెద్దవుతున్న కొద్దీ భగవంతుని పట్ల ఆమెకున్న అచంచలమైన భక్తి, ఆరాధనా భావం వలన భగవంతుడినే తన భర్తగా భావించి ఊహాలోకంలో విహరించేవారు.  విష్ణుమూర్తి విగ్రహానికి అలంకరించే పూలమాలను తాను ముందుగా ధరించేవారు. ఇది గమనించిన ఆమె తండ్రి విష్ణుచిత్త ఆగ్రహించారు. అతని కలలో విష్ణుమూర్తి  కనిపించి, తాను గోదా చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్లు చెప్పడంతో నాటి నుంచి గోదా, ఆండాళ్‌,-దేవున్ని పాలించే బాలికగా పేరుపొందారు. కొంతమంది భక్తులు ఆమెను ‘సూది కొడుత సుదర్కోడి’గా పిలుచుకుంటారు. గోదా వివాహం రంగనాథ స్వామితో జరిపించేందుకు విష్ణుచిత్త ఆమెను శ్రీరంగం గుడికి తీసుకువెళ్లగా గర్భగుడిలోకి ప్రవేశించిన ఆమె దేవునిలో ఐక్యమైపోయింది.

మీరా బాయి
కృష్ణ భక్తురాలుగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి మీరాబాయి. రాజస్థాన్‌లోని కుడ్కి జిల్లాలో జన్మించారు.16వ శతాబ్దానికి చెందినవారు. మీరాబాయి రాజపూత్‌ వంశానికి చెందినవారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా శ్రీ కృష్ణుడిని తన భర్తగా పూజించడంతో అత్తారింటివారు ఆమెను పీడించినట్లుగా కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. 

అక్క మహాదేవి
12వ శతాబ్దంలో సాగిన వీరశైవ భక్తి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తుల్లో ముఖ్యులు. కన్నడ భాషలో 430కి పైగా వచన పద్యాలు రచించారు. మంత్రోగోప్య, యోగత్రివిధి రచనలు కన్నడ సాహిత్యంలో ఆమెకు ఉన్నత స్థానం కల్పించాయి. వీరశైవ ప్రచారకులు బసవన్న, సిద్ధారామ, అల్లమప్రభు భక్తి ఉద్యమంలో మహాదేవి కృషికి గౌరవసూచకంగా ఆమెను ‘అక్క’ అని పిలిచేవారు. చెన్న మల్లికార్జుడిని(శివుడు) ఆమె భర్తగా భావించేవారు. 

శ్రీ దయామాత
అమెరికాలోని ఊథా నగరంలో 1914లో జన్మించిన  చెందిన రాచెల్‌ ఫాయె రైట్‌ తన 17వ ఏట భారత ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానందను కలుసుకున్నారు. పరిపూర్ణమైన
ప్రేమ గురించి, జీవిత సత్యాల గురించి యోగానంద చేసిన ప్రసంగాలు ఆమెను ప్రభావితం చేశాయి. యోగానంద తన మొదటి శిష్యురాలిగా స్వీకరించారు. ‘దయా మాత’గా నామకరణం చేశారు. యోగానంద మరణానికి ముందు తన వారసత్వాన్ని కొనసాగించాల్సిందిగా ఆమెను కోరారు. అతికొద్ది మంది మహిళా ఆధ్యాత్మికవేత్తలు ఉన్న సమయంలో యోగానంద వారసత్వాన్ని కొనసాగించే బాధ్యతను స్వీకరించారు. మహిళాఅనుచర గణాన్ని సంపాదించుకున్నారు. 1955లో సెల్ఫ్‌ రియలైజేషన్‌ ఫెలోషిప్‌ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ సంస్థ ప్రస్తుతం సుమారు 60 దేశాల్లో కేంద్రాలు కలిగి ఉంది. తన శిష్యులకు కర్మ యోగాను బోధించారు. 

 శ్రీ మాతాజీ నిర్మలాదేవి
సహజ యోగాను ప్రవేశపెట్టి, ప్రాచుర్యం కల్పించారు. సంపన్న కుటుంబంలో జన్మించిన మాతాజీ బాల్యం నుంచే గాంధీ ఆశ్రమాన్ని సందర్శించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1947లో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సంస్కృతి, సాంప్రదాయాలు, జాతీయత, నైతిక విలువల పట్ల యువతకు అవగాహన కల్పించేవారు. 1970లో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘నిన్ను నడిపించే శక్తి ఏదో ​నీవు కనుగొనాలంటే ధ్యాన సాధన చేయాల’ని బోధించేవారు. ఈవిధమైన ధ్యాన ప్రక్రియకు సహజ యోగాగా నామకరణం చేశారు. ఈ ప్రక్రియకు  ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించారు. ఈ క్రమంలోనే నిర్మలా శ్రీ వాస్తవను ఆమె అనుచరులు మాతాజీ నిర్మలాదేవిగా పిలిచేవారు. ​​90వ దశకంలో అంతర్జాతీయ సహజ యోగా ఆరోగ్య, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన మహిళలకు ఆశ్రయం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పారు. అనేక పాఠశాలలు, అంతర్జాతీయ సంగీత, కళా అకాడమీని స్థాపించారు.

మా నిత్యా స్వరూప ప్రియానంద
ఈమె అసలు పేరు సుదేవి. కెనడాకు చెందిన సుదేవి 2010లో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించారు. ‘ఫ్రీ యువర్‌సెల్ఫ్‌ ఫ్రమ్‌ ద ఇంటర్నేషనల్‌ కాన్స్పిరసీ అగైనెస్ట్‌ ఎన్‌లైటెన్మెంట్‌’ పేరుతో వీడియోలు పోస్ట్‌ చేసేవారు. తన ఛానెల్‌లో ముఖ్యంగా హిందుత్వ, మార్మికత, శాకాహార, ఙ్ఞానోదయ, భూలోకేతర అంశాల గురించి చర్చించేవారు. 2011లో తాను భూలోకేతర మూలాలు కలిగిన వ్యక్తినని ప్రకటిస్తూ ఒక వీడియో పోస్ట్‌ చేసి సంచలనం సృష్టించారు. దాదాపు 40 వేల మంది అనుచరగణాన్ని సంపాదించారు. 2015లో నిత్యానంద ఆశ్రమంలో చేరి స్వరూపాప్రియానందగా మారారు. ‘లివింగ్‌ అద్వైత’ అనే టీవీ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు. జంతు ప్రేమికురాలైన మాతాజీ, వాటి హక్కుల కోసం పోరాడుతున్నారు.  

శ్రీ ఆనందమయి మా
బెంగాల్‌కు చెందిన వారు. హిందూ ఆధ్యాత్మిక గురువు. 20 శతాబ్దానికి చెందిన తత్త్వవేత్తగా, సాధ్విగా గుర్తింపు పొందారు. వేలాది మంది అనుచరులను సంపాదించుకున్నారు. వారందరూ ఆమెను ఒక గురువుగా, దేవుని ప్రతిరూపంగా, దేవీ మాతగా కొలిచేవారు. 

సాధ్వి రితంభరా జీ(దీదీ మా)
పంజాబ్‌కు చెందిన రితంభరా జీ సమకాలీన భారతీయ ఆధ్యాత్మికవేత్తల్లో ప్రముఖులు. హిందూ మత ప్రచారకులు. మానవతావాది. సామాజిక వేత్త. విశ్వహిందూ పరిషత్,ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులుగా ఉన్నారు. ‘దుర్గా వాహిని’ సేన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘వాత్సల్యగ్రామ్‌’ అనే సంస్థను స్థాపించి అనాథలు, వృద్ధులు, వితంతువులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆప్యాయంగా అమ్మలా ఆదరించే గుణం కలిగిన ఆమెను అనుచరగణం ‘దీదీ మా’ అని పిలుస్తారు.

ఆనందమూర్తి గురూ మా
నవతరం ఆధ్మాత్మికవేత్త. క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులు,యూదులు, ముస్లింలు, బౌద్ధులు ఇలా మతాలకతీతంగా ఆమెకు అనుచరులు ఉన్నారు. ఆమె ప్రవచనాలకు లింగ, వర్గ, మత,
రాజకీయ, భౌగోళిక హద్దులంటూ ఏమీలేవు. జైనిజం, బుద్ధిజం, కళలు, ఉపనిషత్తులు, యోగాలలో ప్రావీణ్యం కలవారు. ప్రతీ అంశాన్ని హేతుబద్ధంగా, శాస్త్రీయతను జోడించి తర్కించగల ఙ్ఞాననిధి. బాలికా విద్యను ప్రోత్సహించడానికి, భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడానికి ‘శకి’్త అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అన్ని వర్గాల పేద విద్యార్థినులకు విద్యా అవకాశం కల్పించడంతో పాటు, ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. 

బ్రహ్మకుమారి
భారతీయ మూలాలతో ప్రారంభమై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘బ్రహ్మకుమారీస్‌’ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించారు. బ్రహ్మకుమారీలు శివుడిని గురువుగా భావిస్తారు. సామాజిక సేవను బాధ్యతగా స్వీకరించి జీవితాంతం సేవకే అంకితం అవుతారు. ఈ సంస్థ ద్వారా భారతీయ సంప్రదాయ, సంస్కృతులతో పాటు ధ్యానం, రాజయోగా వంటి ఆధ్మాత్మిక భావనలు ప్రచారం చేస్తున్నారు.  

రాణి హేమలేఖ
ఒక గురువుగా భర్త హేమచూడ, అత్త ఇలా ఎంతో మందిని తన ఙ్ఞాన సంపద ద్వారా అభ్యుదయ మార్గంలోకి నడిపించారు. ఆమె ప్రవచనా ప్రభావం ఎంతగా ఉండేదంటే.... ఒకానొక సమయంలో రాజ్యమంతా బ్రహ్మ ఙ్ఞానులుగా మారారట. వారి రాజ్యంలోని చిలకలు కూడా ఆమె ప్రవచనా వల్లెవేసేవట. ఈ విషయాలు ‘త్రిపుర రహస్యం’లో పేర్కొనబడినాయి.

రాణి చూడల
యోగ వశిష్ఠ గ్రంథంలో ఈమె గురించి పేర్కొనబడింది. మేధావుల నుంచి ఆర్జించిన ఙ్ఞానాన్ని తన భర్త రాజా సిఖిధ్వజ్‌కు బోధించడం ద్వారా గురువుగా మారారు.

- సుష్మారెడ్డి యాళ్ళ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement