
కాలం ప్రసవించే ఘడియలన్నీ ఒకలా ఉండవు. కొన్ని ఘడియలు సామాన్యులు అసామాన్యులుగా ఆవిర్భవించిన దృష్టాంతానికి సాక్షీభూతమవుతాయి. చరిత్రను మలుపు తిప్పగలిగేవి కూడా అలాంటి ఘడియలే. వంటింట్లో ఉన్న ఆ పది పన్నెండేళ్ల బాలికను, ఆ పాతికేళ్ల యువకుడు వెదురు బెత్తంతో కొట్టాడు. ఆమె వంట సరిగా చేయడం లేదు, అందుకే కొడుతున్నాడు కాబోలుననే అంతా అనుకున్నారు. చుట్టుపక్కల వారు మరో విధంగా ఆలోచించే అవకాశం లేని కాలం. 1877 సంవత్సరం ప్రాంతంలో ఇది జరిగింది. కానీ చుట్టుపక్కల వారి ఆలోచన శుద్ధ తప్పు. ‘కూర్చుని చదువుకోమంటే నీకు వంటింట్లో ఏం పని?’ అని చెప్పి మరీ కొట్టాడతడు.
మహిళలు వంటింటికి పరిమితమని శ్రోత్రియ కుటుంబాలతో పాటు, సమాజంలో చాలా వర్గాలు భావిస్తున్న తరుణంలో, ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలకు చదువేమిటి? అనుకుంటూ సమాజం మొత్తం ఆ సూత్రాన్ని ఒక వ్రతంలా ఆచరిస్తున్న కాలంలో అతడా పనిచేశాడు. ఆ పదేళ్ల బాలిక పేరు ఆనంది. ఆ పాతికేళ్ల యువకుడు ఆమె భర్తే. పేరు గోపాల్రావ్ జోషి. అతడు అలా చేయి చేసుకోవడం బాగాలేదనిపించినా, ఆ ఘడియ మాత్రం నిశ్చయంగా గొప్పదే. ఆ కాలంలో కూడా తన భార్యను వైద్యురాలిని చేసేందుకు అమెరికా పంపాలన్న జోషి నిశ్చయాన్ని దృఢంగా వ్యక్తీకరించిన ఘడియ అది.
1880 నాటి భారతీయ సమాజంలో బాల్య వివాహం జరిగిన బాలికకు వైద్యవిద్యకు వెళ్లాలని ఎలా అనిపించింది? ఎందుకు ఆ ఆలోచన వచ్చింది? వైద్యురాలిని కావాలన్న తన భార్య ఆకాంక్షను తనదిగా చేసుకుని ఆ భర్త ఆమెకు అండదండలు అందించడానికి ఎలా ముందుకు రాగలిగాడు? కాలానికి కూడా ఊహించలేని దృశ్యాలే అవి. కానీ ఈ రెండు ప్రశ్నలను విశ్లేషించుకుంటూ వెళితే ఒక గొప్ప చరిత్ర మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. ఆనంది (మార్చి 31, 1865– ఫిబ్రవరి 21, 1887)– పాశ్చాత్య వైద్యశాస్త్రంలో పట్టా పొందిన తొలి భారతీయ వనిత. అసలు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అడుగు పెట్టిన తొలి భారతీయురాలు కూడా ఆనందీయేనని చెబుతారు. పూనా (నేటి పుణే)కు చెందిన ఒక సంపన్న శ్రోత్రియ కుటుంబంలో ఆనందీ జన్మించారు. అసలు పేరు యమున. ఒకప్పుడు జమీందారుల కుటుంబం. తరువాత చితికిపోయింది. ఆనందీబాయి అని ఆమె భర్త గోపాల్రావ్ జోషి పెళ్లి తరువాత పేరు మార్చాడు. ఆమెకు తొమ్మిదో ఏటనే వివాహం చేశారు. అప్పటికి ఆయన వయసు 21 ఏళ్లు.
మొదటి భార్య చనిపోవడంతో ఆనందీతో ఆయనకది రెండో వివాహం. మహారాష్ట్రలోనే కల్యాణ్‌లో తంతితపాలా శాఖ గుమాస్తా. వివాహం అయిన తరువాత ఆయనకు అలీబాగ్ బదిలీ అయింది. మరో బదిలీ కలకత్తాకు. అక్కడే వైద్యవిద్యకు సంబంధించిన ఆలోచన ఆమెకు వచ్చింది, నిజానికి కలకత్తాకు బదిలీ కాలేదు. ఆయన చేయించుకున్నారు. ఆనందీ తన 14వ ఏట ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పదిరోజులకే కన్నుమూయడం ఆ జంటను కలచివేసింది. బిడ్డకు సరైన వైద్యం అందలేదు. ఆ కాలంలో వైద్యులంతా క్రైస్తవులైన విదేశీయులే. వారిని ఇంటికి తీసుకురావడం, తాకడం వంటి పనులు జరిగేవి కాదు. ఫలితం–పసికందు కన్నుమూసింది. ఆ బాధ నుంచే ఆమెకు తానే వైద్య విద్యను అభ్యసించి, భారతదేశ చిన్నారులకే కాదు, తల్లులకు కూడా వైద్యసేవలు అందించాలన్న గొప్ప సంకల్పం కలిగింది.
చదువుకోవాలన్న తపన, అందునా వైద్య విద్య చదవాలన్న ఆకాంక్ష మొదలైనాకనే, భర్త ఎంతో సంతోషంగా ఆమె చేత ఓనమాలు దిద్దించాడు. తనే ఇంగ్లిష్, సంస్కృతం బోధించడం ఆరంభించాడు. మాతృభాష మరాఠీలో రాయడం నేర్పించాడు. కానీ ఆనందీ తల్లిదండ్రులకు ఇదేమీ నచ్చలేదు. తరచూ కుటుంబంలో కలహాలు రేగేవి. నిజానికి పెళ్లి తరువాత ఆనందీని తాను చదివిస్తాననీ, అందుకు అంగీకారమైతేనే పెళ్లి చేసుకుంటాననీ జోషి షరతు పెట్టారు. అయినా తల్లిదండ్రులు గొడవకు దిగారు. వీరందిరికీ దూరంగా వెళ్లిపోయి ఈ గొడవలకు స్వస్తి పలకాలనీ, ఆనందీ చదువుకు ప్రశాంత వాతావరణం కల్పించాలనీ గోపాల్రావ్ కోరుకున్నాడు. ఫలితమే కలకత్తా బదలీ. కలకత్తా నుంచే ఆయన ఆనందీని అమెరికా పంపే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ రోజుల్లో రాయల్ వైల్డర్ అనే ప్రఖ్యాత మిషనరీ ఉండేవారు. ఆయనకే 1880లో జోషి లేఖ రాశారు. అమెరికాలో ఏదైనా కళశాలలో తన భార్యకు మెడికల్ సీటు, తనకో ఉద్యోగం చూడమని అందులో కోరారు. ఈ రెండూ చేయాలంటే వైల్డర్ ఒక షరతు పెట్టాడు.
ఈ ఇద్దరు భారతీయులు మతం మార్చుకోవాలి. ఇందుకు జోషి అంగీకరించలేదు. కానీ ఇలాంటి షరతు పెట్టినా వైల్డర్ చేసిన మేలొకటి ఉంది. ఎంతో వెనుకబడి ఉన్న భారతదేశంలో పుట్టిన మహిళ అమెరికా వచ్చి వైద్యవిద్యను అభ్యసించాలని కోరుకుంటున్న సంగతిని స్థానిక పత్రికకు రాసిన ఒక వ్యాసంలో ప్రస్తావించాడు. అంతేకాదు, ‘ప్రిన్స్‌టన్ మిషనరీ రివ్యూ’లో ఆనందీ చేసిన విన్నపాన్ని కూడా ప్రచురించేటట్టు చేశారు. అది చదివిన థియోడిసియా కార్పెంటర్ అనే ఒక ధనిక మహిళకు (న్యూజెర్సీ) ఆనందీ మీద సానుభూతి కలిగింది. అదికూడా ఎంతో యాధృచ్ఛికంగా జరిగింది. పళ్లు చూపించుకునేందుకు కార్పెంటర్ ఒక డాక్టర్ దగ్గరకు వచ్చారు. అక్కడే ఆనందీ చేసిన విన్నపం గురించి పత్రికలో చదివారు. సనాతన భారతదేశంలో ఇలాంటి దంపతులు ఉండడం ఆమెకు విస్తుగొలిపింది.
ఆ కాలంలో అదొక అద్భుతంగా కూడా ఆమె భావించారు. అమెరికా వస్తే తానే వారికి ఆతిథ్యం ఇవ్వగలనని ఉత్తరం రాశారు. ఆ రెండు కుటుంబాల మధ్య చాలాకాలం ఉత్తర ప్రత్యురాలు సాగాయి. అందులో హిందూమతం, భారతదేశానికి సంబంధించిన ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చేవి. ఆనందీ, కార్పెంటర్ లేఖల ద్వారా సన్నిహిత మిత్రులయ్యారు. అమెరికా వెళితే తమకు కాస్త నీడ దొరుకుతుందన్న భరోసా వచ్చింది. భార్యను దించి రావడానికి జోషి ప్రయాణ సన్నాహాలు ప్రారంభించారు. అప్పుడే ఆనందీ ఆరోగ్యంలో మార్పులు ప్రారంభమయ్యాయి. నిరంతరం నిస్సత్తువగా అనిపించేది. తరచూ శిరోభారం ఒకటి. అడపాదడపా జ్వరం. ఒక్కొక్కసారి ఊపిరి సలపనట్టు ఉక్కిరి బిక్కిరిగా ఉండేది. ఈ సంగతి ఉత్తరంలో రాస్తే కార్పెంటర్ న్యూయార్క్ నుంచి మందులు కూడా పంపించింది. అంత ప్రేమ కురిపించారామె. కానీ ఆ మందులు పనిచేయలేదు. ప్రయాణం దగ్గర పడింది. అప్పుడే జోషికి సెరాంపూర్ బదలీ అయింది. దీనితో భార్యను మాత్రమే 1883లో కలకత్తా నుంచే పంపించారాయన.
ఇందుకు తమ కుటుంబాల నుంచే కాకుండా, సమాజం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా వారు వెనక్కి తగ్గలేదు. ఆమె తన కలను నిజం చేసుకోవడానికి షాపెరోనెడ్ అనే ఓడలో సుదూర తీరానికి ప్రయాణమయ్యారు. ఈ ప్రయాణంలోనే మిషనరీలైన ఇద్దరు వైద్య దంపతులు ఆనందీకి పరిచయమయ్యారు. వారే థోర్‌బోర్న్ దంపతులు.కార్పెంటర్ స్వయంగా ఓడ దగ్గరకు వచ్చి ఆనందీ జోషిని దింపుకుని, ఎంతో సంతోషంగా తన ఇంటికి న్యూయార్క్ తీసుకువెళ్లింది. థోర్‌బోర్న్ దంపతుల సలహా మేరకే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియా (దీనినే ఇప్పుడు డ్రెక్సల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తున్నారు)లో సీటు కోసం ఆనందీ ఒక విజ్ఞాపన పంపారు.
రాషెల్ బాడ్లే అప్పుడు ఆ కళాశాల డీన్. ఆ విజ్ఞాపనలో ఆమె రాసిన వాక్యాలు నిజంగా కదిలిస్తాయి. ఆ వాక్యాల ఆర్తిని, అవసరాన్ని కూడా అప్పటి కాలం, భారతీయ సమాజం అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. కానీ అదొక చరిత్రాత్మక విజ్ఞాపన. మహిళల పురోగతి చరిత్ర రూపం దాలిస్తే అందులో అది గొప్ప స్థానం పొందుతుంది. ‘నా పేద భారతదేశంలో వైద్య సదుపాయానికి నోచుకోక నిస్సహాయంగా కన్ను మూస్తున్న, రోగబాధతోనే జీవితాలను నెట్టుకొస్తున్న మహిళలకు సేవలు అందించాలన్న గాఢమైన ఆకాంక్షే నన్ను వైద్య విద్య వైపు నడిపించింది. నా కుటుంబం, నా కులం, సమాజం, ఆఖరికి నా మిత్రులు కూడా తీవ్రంగా నిరసించినప్పటికీ లెక్క చేయకుండా నేను వైద్య విద్య కోసం వచ్చాను. ఒక పురుష వైద్యుడు తమ శరీరాలను తాకుతూ చేసే పరీక్షల కంటే, రోగంతోæ మరణించడమే మేలని నా దేశంలో మహిళలు అనుకుంటారు. వారికి సేవ చేయమని నా ఆత్మ ఘోషిస్తోంది.
మానవత్వపు వాణి నాకు అదే బోధిస్తున్నది. నా ఆకాంక్షకు ఆకృతినివ్వడంలో విఫలం కాకూడదని నేను కోరుకుంటున్నాను.’ రాషెల్‌కు ఆ విన్నపం ఎంతో నచ్చింది. ఆనందీకి ప్రవేశం లభించింది. మూడేళ్ల కోర్సు అది. నిజానికి స్త్రీల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకంలో భాగమది. అప్పటికి కొల్హాపూర్ సంస్థానం ఇవ్వజూపిన కొంత విద్యార్థి వేతనానికి తోడు, కళాశాల కూడా మూడేళ్లకు కలిపి ఆరు వందల డాలర్లు భృతిగా మంజూరు చేసింది. అమెరికా చలి, ఆహారం ఆనందీ ఆరోగ్యాన్ని కుంగదీయడం మొదలుపెట్టాయి. అయినా ఆమె చదువు విషయంలో అశ్రద్ధ చేయలేదు. ఆమె డిగ్రీ తీసుకునే సమయంలో ‘ఫిలడెల్ఫియా పోస్ట్’ పత్రిక చేసిన వ్యాఖ్య ఇందుకు నిదర్శనం.
తరగతిలో ఈ ‘చిన్నారి మహిళ’ ఎంతో ప్రతిభ కనపరిచిందని ఆ పత్రిక రాసింది. కలకత్తాలోనే మొదలైన క్షయ లక్షణాలు అమెరికా వాతావరణానికి విజృంభించాయి. ఆరోగ్యం బాగా పాడైంది. ఆ బాధ మధ్యనే మార్చి 11, 1886న ఆమె ఎం.డి. పట్టా పొందింది. ఈ పట్టా కోసం ఆమె రాసిచ్చిన సిద్ధాంత వ్యాసం ఏమిటో తెలుసా? ‘పురాతన భారతదేశంలో ప్రసూతి పద్ధతులు’. ఇంతకీ ఒక భారతీయ మహిళ ఎండీ పట్టా సాధించిన ఆ కాలానికి అమెరికా మహిళలకు ఓటు హక్కు కూడా లేదు. మహారాష్ట్రలో నాడు స్త్రీ విద్య కోసం పాటు పడుతున్న సంస్కర్త పండిత రమాబాయి, గోపాల్రావ్ జోషి కలసి ఆనందీ పట్టా తీసుకున్న స్నాతకోత్సవానికి వెళ్లారు. ఆ ఇద్దరితో కలసి ఆమె ఇండియా బయలుదేరింది. బొంబాయిలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
కొల్హాపూర్ వచ్చినప్పుడు కూడా ప్రజలు సగౌరవంగా ఆహ్వానించారు. కొల్హాపూర్‌లోని అల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్ మహిళా విభాగం అధిపతిగా ఆనందీని నియమిస్తూ సంస్థానాధీశుడు వెంటనే ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇంత జరిగినా వారి ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగు పడలేదు. ఇందుకు ఆనందీకి లోకమాన్య బాలగంగాధర తిలక్ రాసిన లేఖ నిదర్శనం. మీరు ఎంతటి ప్రతికూలతల మధ్య విదేశాలకు వెళ్లి వైద్య విద్యను పూర్తి చేసుకుని వచ్చారో నాకు తెలుసు. మీరు ఈ నవ యుగపు మహోన్నత మహిళ. కానీ మీరు ప్రస్తుతం కొన్ని డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారని విన్నాను. నేనో పత్రికాధిపతిని. నా దగ్గర అపారంగా ధనమేమీ ఉండదు. అయినా మీకు వంద రూపాయలు పంపించాలని ఉన్నది.’కలకత్తాలో ఓడ ఎక్కే ముందు ఆనందీ సెరాంపూర్‌లో కమ్యూనిటీ సమావేశంలో మాట్లాడారు.
అప్పటికి గోపాల్రావ్ బదిలీపై అక్కడికి వెళ్లారు. ఆ మాటలు ఎంతో గొప్పవి. ‘ఇంత ప్రతికూలత ఉన్నా నేను వైద్య విద్య కోసం అమెరికా వెళుతున్నాను. ఈ దేశ మహిళలు వైద్యం లేకుండా ఎంతకాలం ఉండాలి? ఈ దేశంలో వైద్యం లేక ఎందరు పిల్లలు చనిపోవాలి? వారికి వైద్య సేవ చేయడమే ధ్యేయంగా నేను అంత దూరం వెళ్లి వైద్యురాలిగా తిరిగి రావాలని ప్రగాఢంగా వాంఛిస్తున్నాను. నేను తిరిగి వచ్చిన తరువాత ఇక్కడ కేవలం మహిళల కోసమే ఒక వైద్య కళాశాలను స్థాపించాలని ఉంది. ఈ దేశానికి మహిళా వైద్యురాళ్ల అవసరం ఎంతో ఉంది.’
కానీ ఆమె ఆశయం నెరవేరలేదు. వైద్య విద్యను అభ్యసించినా, పూర్తి స్థాయిలో తన దేశపు మహిళలకు వైద్యం అందించే అవకాశం ఆమెకు రాలేదు. 21 ఏళ్లు దాటి, 22వ సంవత్సరంలోకి ప్రవేశించిన నెలకే ఆనందీ క్షయ వ్యాధి ముదిరి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 26, 1887న జరిగిన ఈ విషాదం మొత్తం భారతదేశాన్ని కుదిపింది. న్యూయార్క్‌లో ఆమెకు ఆశ్రయం ఇచ్చిన కార్పెంటర్ కూడా చలించిపోయారు. ఆనందీ చితాభస్మాన్ని అమెరికాకు తెప్పించుకుని హడ్సన్‌లోని స్మశానవాటికలో తన కుటుంబ సభ్యుల సమాధుల మధ్య ఉంచి, ఆమె పేరున కూడా కార్పెంటర్ ఒక సమాధిని నిర్మించారు.
ఇక్కడ మరో ఇద్దరి గురించి ప్రస్తావించడం అసందర్భం కాదు. వారే– కి ఒకామి (జపాన్), తాబత్ ఇస్లాంబూలీ (సిరియా/ఈజిప్ట్). ఈ ఇద్దరు పెన్సిల్వేనియాలోనే ఆనందీ సహాధ్యాయులు. వారిద్దరు కూడా ఆ దేశాల నుంచి వైద్య విద్య కోసం వచ్చిన తొలి మహిళలు.
ఇందులో ఒకామి వైద్యురాలిగా పట్టా తీసుకున్నా కూడా వివక్షకు గురయ్యారు. ఆమె చదువు పూర్తయిన వెంటనే టోక్యో హాస్పిటల్‌లో ప్రసూతి విభాగం అధిపతిగా నియమించారు. కానీ ఆమెను జపాన్ రాజు గౌరవప్రదంగా చూసేవాడు కాదు. కారణం– మహిళ. ఇందుకు నిరసనగా ఒకామి ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. తాబత్ ఏమైందో తెలియలేదు. చిత్రంగా ఖగోళ శాస్త్రజ్ఞులు వీనస్ గ్రహంలో కనిపెట్టిన 34.3 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఒక అగాధానికి ‘జోషీ’ అని ఆనందీ జీవితానికి గుర్తుగా నామకరణం చేశారు. ఆనందీ అల్పాయుష్కుడైన బిడ్డకు జన్మనిచ్చి, గుండె కోతను మిగుల్చుకుంది. కాలం కూడా ఆయుష్షు తక్కువైన ఆనంది వంటి ఒక ప్రతిభా సంపన్నురాలికి జన్మనిచ్చి చరిత్రకు గుండె కోతను మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment