మీకు మాత్రమే చెప్తా | Funny Conversation Between Trump And Baghdadi In Funday | Sakshi
Sakshi News home page

మీకు మాత్రమే చెప్తా

Published Sun, Nov 10 2019 3:01 AM | Last Updated on Sun, Nov 10 2019 3:01 AM

Funny Conversation Between Trump And Baghdadi In Funday - Sakshi

కళ్లకున్న  గంతలు విప్పగానే ‘‘ఎవడ్రా నన్ను కిడ్నాప్‌ చేసింది?’’ గట్టిగా అరిచాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.
‘‘హ్హాహ్హాహ్హా... నిన్ను కిడ్నాప్‌ చేసింది నేనే. నా పేరు అల్‌ బాగ్దాదీ. పేరు మోసిన ఉగ్రవాదిని. చచ్చాడనుకున్నారు కదా...నేను చచ్చినా చావను’’ విలన్‌ నవ్వుతో అన్నాడు ట్రంపు ముందు నిలుచున్న వ్యక్తి.
‘‘అచ్చం అలాగే ఉన్నావు. మేకప్‌ చేసింది ఎవరు? హాలివుడ్‌ మేకప్‌మెన్‌ సాండ్ర్‌ కొండ్రనా? భేష్‌! భలే చేశాడు’’ కితాబు ఇచ్చాడు ట్రంప్‌.
‘‘ఎలా గుర్తుపట్టావ్‌ గురూ!’’ మేకప్‌ తీస్తూ అడిగాడు ఉత్తర కొరియా సర్పంచ్‌ కిమ్‌–జోంగ్‌.
‘‘బరువు తగ్గిన తరువాత, ఇలాంటి వెధవ వేషాలు వెయ్యి. కాస్తో కూస్తో నమ్ముతారు. ఈ బరువుతో ఎన్ని వేషాలు వేసినా ఇట్టే గుర్తు పడతారు. ఇది సరే...అసలు నన్ను ఎందుకు కిడ్నాప్‌ చేశావో చెప్పు’’ కోపంగా అడిగాడు ట్రంప్‌.
‘‘ఏంలేదు బ్రో..రహస్య పరిశోధన కోసం రెండు సంవత్సరాల క్రితం మీరు రోదసిలోకి పంపిన ఎక్స్‌37బి మిస్టీరియస్‌ స్పేస్‌ ప్లేన్‌ ఈమధ్య భూమికి తిరిగి వచ్చింది కదా...’’ అన్నాడు కిమ్‌–జోంగ్‌.
‘‘వచ్చింది. అయితే ఏంటి?’’ కోపంగా అన్నాడు ట్రంప్‌.
‘‘బ్రో...ఆ మిస్టీరియస్‌ స్పేస్‌ ప్లేన్‌ రోదసిలో ఏం చేసింది? ఆ రహస్యం ఏమిటి? మీ లక్ష్యాలు ఏమిటి? నువ్వు చెప్పింది విన్న తరువాత మేము కూడా మీలాగే రహస్య వ్యోమనౌకను రోదసిలోకి  పంపాలనుకుంటున్నాం. చెప్పు ప్లీజ్‌’’ అని బతిమిలాడాడు కిమ్‌–జోంగ్‌.
‘‘రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆ సీకెట్ల్రు ఎవ్వరికీ చెపొద్దు... కాని నాకెందుకో నీకు మాత్రమే చెప్పాలని ఉంది. నీ చెవి నా నోటి దగ్గరకు తీసుకురా’’ అన్నాడు ట్రంప్‌. అలాగే చేశాడు కిమ్‌. అంతే...ఆ చెవిని రక్తం కారేలా కొరికాడు ట్రంప్‌.
‘చచ్చాన్రో’ అని గట్టిగా అరిచాడు యు.ఎస్‌ సెక్రెటరీ ఆఫ్‌ డిఫెన్స్‌ మార్క్‌ ఎస్పెర్‌. ట్రంపు కొరికింది కిమ్‌–జోంగ్‌ చెవిని కదా...మరి సెక్రెటరీ ఆఫ్‌ డిఫెన్స్‌ ఎందుకు అరిచినట్టు?
ఇంతకీ ఏం జరిగిందంటే...
‘నెక్స్‌›్ట ఎవరిని లేపేద్దాం?’ అనే టాపిక్‌పై పెంటాగన్‌లోని పెద్ద హాలులో సెక్రెటరీ ఆఫ్‌ డిఫెన్స్‌ మార్క్‌ ఎస్పెర్‌తో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యాడు ట్రంప్‌. మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలోనే అతనికి ఒక కల వచ్చింది. తాను కిడ్నాప్‌ అయినట్లు వచ్చిన కల అది! కలలో,  తాను కిమ్‌–జోంగ్‌ చెవి కొరుకుతున్నానే భ్రమలో తన పక్కన కూర్చున్న సెక్రెటరీ చెవి కొరికాడు ట్రంప్‌. ఇదీ కథ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement