కిష్కింద కాండ | Ranganadha Ramachandra Rao Written Story in Funday 03/11/2019 | Sakshi
Sakshi News home page

కిష్కింద కాండ

Published Sun, Nov 3 2019 4:54 AM | Last Updated on Sun, Nov 3 2019 7:50 AM

Ranganadha Ramachandra Rao Written Story in Funday 03/11/2019 - Sakshi

మా ఊరిలో కోతుల పీడ చాలాఎక్కువ. అలా అంటే కోతులకు కోపం వస్తుందేమోనని నాకు అనుమానం. తట్టుకుని పడితే హంపి. వాలి, సుగ్రీవుడు, ఆంజనేయుడు పాలించిన కిష్కింధ. వారి సామ్రాజ్యాన్నే మేము ఆక్రమించి ఇప్పుడు దాడి అంటే ఎలా?  ఆంగ్లేయులే భారతీయులను ‘భారతాన్ని వదలి వెళ్ళండి’ అని చెప్పినట్టు. అందువల్ల మేమందరం ఈ కోతులకు సర్దుకున్నాం. మా మధ్యన అవి కూడా సర్దుకున్నాయి. ఎంతగా సర్దుకున్నా కోతులు కోతులే! పుట్టుకతో వచ్చిన గుణాలను అవి వదులుకుంటాయా? గవాక్షాల ద్వారా తొంగి చూసి, వంటింట్లో పెట్టిన ఆహారాన్ని చూసుకుని, మెల్లగా ఇంట్లోకి దూరి కావలసినదాన్ని పాత్రలతో సహా తీసుకునిపోయి, మళ్ళీ కడగవలసిన అవసరమే లేకుండా తిని, మరొకరి పెరట్లో ఆ పాత్రను పారవేసి, ‘‘మేమేమీ దొంగలం కాదండి...’’ అని రెండిండ్లవారూ కొట్టుకునే జగడపు సన్నివేశాన్ని సృష్టిస్తాయి. ఎవరి పెరట్లో ఏ చెట్టులో ఎలాంటి పళ్ళున్నాయో తెలుసుకుని, ఆ పళ్ళను సరిగ్గా మాగే కాలానికి వచ్చి అన్నీ తిని తేన్చి వెళతాయి. నిప్పులు చెరిగే వేసవిలో ఎక్కడా నీళ్ళు దొరకక నోరు ఎండిపోయి, మేము కొళాయి నీళ్ళు పట్టుకునే కాలానికి మా దగ్గరికి వచ్చి, మేము గుంతలో నిలిచిన నీళ్ళను బకెట్‌లో పట్టి పెడితే, మేమున్నామనే çస్పృహనే లేకుండా ఒక్కొక్కటిగా వచ్చి నీళ్ళు తాగి వెళతాయి.

దీపావళి పండుగ వేళలో టపాసుల ఆర్భాటానికి బెదిరి కంగారు పడి చెట్లలో వణుకుతూ కూర్చుంటాయి. మా ఊరి ఆడవాళ్ళకు వడియాలు, అప్పడాలు చేసే సంబరం.ఆ బళ్ళారి ఎండకు వేరే ఇంకేమి చేయగలరు? వర్షం వచ్చినపుడు పురి విప్పుకుని నృత్యం చేసే నెమళ్ళ సంభ్రమంతో ఆడవాళ్ళు మండే ఎండలో వారి వారి మిద్దెల మీద వడియాలు, అప్పడాలను ఎండకు ఆరబెట్టేవారు. అత్తగారు సేమ్యాలు, వడియాలు, పువ్వు వడియాలు ఎండకు ఆరబెడుతుంటే, చెట్టుకొమ్మ మీద, ఇంటి చూరు మీద కోతులు తమ సంసార సమేతంగా ఎదురుచూస్తుంటాయి. పిల్లలు బెత్తం, ఖాళీడబ్బా, జేగంట, క్యాటర్‌బాల్‌ పట్టుకుని గొప్పయుద్ధరంగంలో సిద్ధమైన సిపాయిల్లా నిలబడినప్పటికీ వానర సైన్యం ముందు వాళ్ళేం లెక్కకు వస్తారు? అవి పిల్లలనే బెదిరించి వడియాలు, అప్పడాలను ఖాళీ చేస్తాయి. ఒకసారి మా పక్కింటి గృహిణి ఎక్కడో చదివి కోతులకు ఇంగువ మింగుడుపడదనే చిదంబర రహస్యాన్ని అందరికి చెప్పేసింది. ఆడవాళ్ళందరూ రాశులు రాశులుగా ఇంగువ వేసి వడియాలు, అప్పడాలు చేయసాగారు. దాంతో కోతులు ఒక ముక్క కూడా తినలేక ఉమ్మేసి వెళ్ళిపోయాయి.

ఆ గృహిణి అయితే ‘నేను చెప్పలేదా?’ అని అందరి దృష్టిలో హీరోయిన్‌ అయిన సంభ్రమంతో మెరిసిపోయింది. మా అమ్మ, ‘‘అదికాదు, కోతిలాంటి కోతే అసహ్యపడే ఇంగువను మనం కోరికోరి తింటాం కదా... లొట్టలేసుకుంటూ తింటాం కదా...’’ అని సణుగుతూ, మరొక కొత్త శంకను అందరి ముందు పెట్టింది. ఆ రోజు నుంచి ఊరి ఆంజనేయుడికి పంపే నైవేద్యపు వంటకంలో ఇంగువ వేయటం ఆపేసింది. అయితే కోతులు ఎన్ని రోజులు వడియాలు, అప్పడాలు తినకుండా ఉంటాయి? కొద్ది రోజుల్లోనే ఇంగువను అలవాటు చేసుకున్నాయి. వడియాలు, అప్పడాలను తినటం మొదలుపెట్టాయి. అప్పుడు మా అమ్మకు సంతృప్తి కలిగింది. ‘‘బ్రాహ్మణుల వంట అంటే తమాషానా? ఎవరైనా లొంగాల్సిందే’’ అని దర్పంగా మాట్లాడింది. మళ్ళీ ఆంజనేయుడి నైవేద్యానికి ఇంగువ వేయసాగింది. ఊరికి కొత్తగా టీవీ వచ్చినపుడు ప్రజలకు కోతుల దాడి భరించటం అసాధ్యమైంది. వీధిలోని జనమంతా కన్నీరు ప్రవహింపజేసే ఏదో ధారావాహికను చూస్తూ కూర్చునివుంటే, కోతులు యాంటెనా మీద దూకి తెర మీద కేవలం చుక్కలను ఏర్పరిచేవి.

జనమంతా ‘హో...’ అని గోలపెట్టసాగారు. మళ్ళీ ఎవరో ఒకరు మేడ ఎక్కి యాంటెనను దశదిక్కులకు తిప్పి, కింద నుంచి, ‘‘సరిగ్గా వచ్చింది, సరిగ్గా వచ్చింది...’’ అంటూ కేక పెట్టిన తరువాత టీవీ చూడానికి పరుగెత్తిపోతే మళ్ళీ పదినిముషాలకంతా మరొక కోతి దాని మీద ఎగిరేది.  కొందరు తుమ్మ ముళ్ళను యాంటెనా మీద వేసి చూశారు. ఇంకొందరు భయంకరమైన రంగుల బట్టలను దానిమీద పరిచారు. మరికొందరు ఎత్తయిన కర్రను బిగించి యాంటెనా ఎత్తును పెంచారు. ఏమి చేసినా కోతుల దాడి ఆగలేదు. ప్రజలకు కోతులు ఎంతగా అలవాటైపోయాయంటే, ‘అది మొండితోక కోతికొడుకు’, ‘ఇది కుంటి కాలు కోతి కూతురు’, మొదలైన పేర్లతో గుర్తించేవారు. (కోతి పిల్లలకు తల్లి ఎవరని గుర్తిస్తారే తప్ప తండ్రి ఎవరో గుర్తించే మూర్ఖత్వాన్ని ఎవరూ చేయరు) మా అమ్మ కూడా ఒక కోతిని చాలా అలవాటు చేసుకుంది.

మరీ సంప్రదాయపరులమైనందువల్ల స్నానం చేసి, పూజాపునస్కారాలు ముగించే వరకు నోట నీళ్ళు కూడా వేసుకునేవారు కాదు. అయితే దోసకాయ, బీరకాయలు కోసేటప్పుడు దాని రుచిచూసి తీపు–చేదు అని చెప్పడానికి ఎవరో ఒకరి సహాయం కావలసి వచ్చేది. మా చిన్నతనంలో మేము ఆశతో ఆ పని చేస్తున్నప్పటికీ కాస్త పెద్దవారమైన తరువాత లేని పొగరు చూపిస్తూ ’’పోమ్మా, నీవొకటి...’’ అని తప్పించుకునేవాళ్ళం. ఆ పనిని ఈ కోతి సంతోషంగా చేసేది. తియ్యగా ఉంటే చప్పరిస్తూ తినేది. చేదుగా ఉంటే బయిటికి వెళ్ళి ఉమ్మేసేది. అంతా ముగిసిన తరువాత సగం దోసకాయ దానికి ఇస్తే తీసుకునిపోయేది. ఒకసారి మా అమ్మ దురదృష్టానికి కోసిన దోసకాయలన్నీ చేదుగా ఉండాలా? కోతి కోపంతో మా అమ్మ మీద అరవటంతో అమ్మ భయపడిపోయింది.

చివరికి గూట్లోఉన్న ఒక కొబ్బరి చిప్పను ఇచ్చి పంపింది. వకీలు సుందరావుగారి తల్లి కాశవ్వకు కోతులంటే చాలా ఇష్టముండేది. ఇంట్లో మిగిలిన సద్ది పదార్థాలన్నీ దాచిపెట్టి కోతులకు ఇచ్చేది. కాయగూరలు అమ్మేవారి దగ్గర కుళ్ళిన టమోటాలు, వంకాయలు వేడుకుని తెచ్చి కోతులకు ఇచ్చేది. మేడ మీద కుండలో ఒకటి రెండు కడవల నీళ్ళు వేసిపెట్టేది. అలాంటి కాశవ్వ చనిపోయినపుడు సుందరరావు హంపిలోని తుంగభద్ర ఒడ్డున కార్యక్రమాలను చేపట్టారు. మిగలిన కార్యక్రమాలన్నీ సుసూత్రంగా జరిగిపోయినా ఎంత ప్రయత్నించినా పిండాన్ని కాకి ముట్టలేదు. ఇంట్లో వాళ్ళందరూ ఏవేవో ఆశలు చూపించి వేడుకున్నా కాకరాయుడు వచ్చి పిండం ముట్టలేదు. పురోహితులు ’’ఈ రోజు చాలామంది కర్మలు చేశారు. అందుకే కాకులంతా పిండాలు తిని తిని పొట్ట నింపుకున్నట్టు కనిపిస్తోంది. ఏదీ రావటం లేదండి’’ అని ఓదార్చారు.

సుందరరావుగారు చివరికి విసిగి ‘‘తొందరగా వచ్చి భోజనం చేయమ్మా, మా భోజనానికి ఆలస్యం చేయకు’’ అని వేడుకుని నిస్సహాయంగా కూర్చున్నారు. కొద్దిసేప్లోనే ఒక కోతివచ్చి ఆ పిండాన్ని ఎత్తుకునిపోయింది. జనం ‘‘ఏ...ఏ...’’ అని అరిచేలోపే కోతి పరారయ్యింది. జరిగిన సంఘటన వల్ల బెదిరిపోయిన పురోహితులు ‘‘కాకి పిండానికి బదులుగా కోతి పిండం అయిపోయింది కదండి’’ అని చేతులు నలుపుకున్నారు. అందుకు సుందరరావుగారు, ‘‘మా అమ్మకు కాకుల కన్నా కోతులమీద ప్రేమ ఎక్కువలెండి. మంచే జరిగింది’’ అని జవాబిచ్చారు. ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ గుహలో నరసింహస్వామి దేవస్థానం ఉంది.

నరసింహుడు కొండ గుహలో కాకుండా ఇంకెక్కడ ఉండానికి సాధ్యం? చుట్టుపక్కల అడవి ఉన్న కారణంగా ఇక్కడ కోతులు గుంపులు గుంపులుగా ఉండేవి. పట్టణ కోతులకన్నా ఇవి బలమైనవి. భక్తాదులు ఇచ్చే కొబ్బరి, అరిటిపళ్ళ కారణంగా దేవస్థానం చుట్టుపక్కలంతా సంచరిస్తుంటాయి. మేము పిల్లలం వాటి చేష్టలను చూడటంలోనే సంతోషపడేవాళ్ళం. ఒకసారి ఒక చిన్న కోతిపిల్ల గరుడస్తంభం దగ్గర కూర్చునివుంది. చుట్టుపక్కల ఏ కోతి కనిపించకపోవటంతో నాకు ధైర్యం వచ్చింది. అరుగు కింద వేలాడబడిన దాని తోకను సద్దు చేయకుండా వెళ్ళి లాగాను. చెట్టుమీద ఆ కోతిపిల్ల తల్లి ఎక్కడ కూర్చునివుందో తెలియదు. ఎగిరొచ్చి నా చేతిని రక్తం వచ్చేలా గోళ్ళతో గీరి తన బిడ్డను ఎత్తుకుని పారిపోయింది. నేలానింగీ ఏకమయ్యేటట్టు ఏడ్చాను. గుడిలో ఉన్నవారందరూ పరుగున వచ్చారు. రక్తం కారుతున్న నా చెయ్యి చూసి మా అమ్మకు దుఃఖం కలిగింది. ‘‘నువ్వేం చేశావు?’’ అని అడిగింది.

నేను అత్యంత అమాయకంగా, ‘‘నేనేమీ చేయలేదు. మౌనంగా నుంచున్నాను. అదేవచ్చి గీరి వెళ్ళింది’’ అని అబద్ధం చెప్పాను. అమ్మ బాధను భరించలేక నా రక్తం కారుతున్న చెయ్యిని చెట్టు మీద తన బిడ్డతో కూర్చున్న కోతికి చూపించి ‘‘నీ ఇల్లు పాడైపోను. పిల్లల్ని కన్న నువ్వూ ఇలా బిడ్డకు గాయం చేశావుకదా?’’ అని దానికి శాపనార్థాలు పెట్టింది. గాయానికి తడిబట్టను కట్టి, నా ఏడ్పులోని ఆర్భాటమంతా తగ్గిన తరువాత ఎందుకో మా అమ్మకు అనుమానం వచ్చి ‘‘నువ్వేం చేశావో నిజం చెప్పు. అబద్ధాలు చెప్పకు’’ అని గద్దించటంతో మెల్లగా పిల్లకోతి తోకను లాగిన విషయం కక్కాను. మా అమ్మకు కోతిని శపించిన తన కృత్యానికి భయంవేసి మరుసటి రోజున ఆంజనేయస్వామికి శెనగపప్పు వడల దండను వేయించింది. ఇప్పటికీ నా చేతి మీద ఆ కోతి గీరిన గాయపు మచ్చ అలాగే ఉంది.

అప్పటి నుంచి పిల్లకోతి తంటాలకు వెళ్ళలేదు. కోతి పిల్లనుకానీ, చిన్నపిల్లల బుగ్గలు నిమిరేటప్పుడూ వాళ్ళ అమ్మల వైపు ఓరచూపు చూసి గట్టిగా నిమిరానని కోప్పపడలేదని నిర్ధారించుకునేవాణ్ణి. ఈ నరసింహస్వామి దేవస్థానం దగ్గర్లోనే ఒక అరుగు ఉంది. ఆడవాళ్ళు తల జుట్టు విప్పుకుని ఈ అరుగుకింద కూర్చుంటే చాలు ఏదో ఒక కోతి అరుగుమీద కూర్చుని పేలు చూస్తుంది. దొరికిన పేనును గుటుక్కున నోట వేసుకుంటుంది. పక్కన దాని పిల్ల వచ్చి కూర్చుంటే దాని నోటికి ప్రేమగా ఒకటి రెండు పేన్లను ఇస్తుంది. అయితే ఇలా పేలు చూస్తున్నప్పుడు ఆడవాళ్ళు తలెత్తి అటూ ఇటూ కదిలిస్తే దానికి చాలా కోపం. ప్చ్‌మని తలమీద ఒక్కటిచ్చేది. దాని దెబ్బకు ఆడవాళ్ళు భయపడుతున్నప్పటికీ, అది తన సూక్ష్మమెన కళ్ళతో మరీ చిన్నగా వున్న పేనును సహితం పట్టి కుక్కుతుండటం వల్ల అరుగు కిందికి వెళ్ళి కూర్చునేవారు. సీతక్క అని మా పెద్దమ్మ ఒకరుండేవారు.

ఆమె హరపనహళ్ళి ఆడపిల్ల. మహా గయ్యాళి. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఆమె నోరుకి భయపడుతారు. అలా సీతక్క ఒకసారి తన తలజుత్తు విరబోసుకుని వెళ్ళి అరుగుకింద కూర్చుంది. కోతి యథాప్రకారం వచ్చి పేలు చూడసాగింది. ఎందుకో తలా కదిలించినందుకు కోపగించుకున్న కోతి ప్చ్‌మని ఆమె తల మీదొక దెబ్బ వేసింది. సీతక్క ఊరుకుంటుందా? అక్కడే పక్కనే ఉన్న చింత బరికెను తీసుకుని దానికి బొబ్బలు లేచేలా వాయించేసింది. కలవరపడ్డ కోతి బాధతో అరుస్తూ పారిపోయింది. ఆడవాళ్ళంతా ‘‘చూశారేమే ఆమె గట్టితనం? కోతిని కూడా వదల్లేదు మహాతల్లి...’’ అని మాట్లాడుకున్నారు. మొదటే దైవభక్తిగల మా అమ్మకు కోతిని సీతక్క ఇలా కొట్టడం భయాన్ని కలిగించింది. ‘‘అదికాదు సీతక్కా, కోతి అంటే సాక్షాత్‌ ఆంజనేయస్వామి ఉన్నట్టేకదా, నువ్వు ఇలా కొట్టవచ్చా?’’ అని అడిగింది. సీతక్క ఎలాంటి సంకోచం లేకుండా ‘‘అది సాక్షాత్‌ ఆంజనేయస్వామి అయితే నేను సాక్షాత్‌ సీతమ్మను. తోక ఊపితే కత్తిరిస్తాను’’ అని చెప్పటంతో మా అమ్మ మళ్ళీ నోరెత్తలేదు.

సంవత్సరానికి ఒకటి రెండుసార్లు బంధుబలగంతో, స్నేహితులతో కలిసి నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళి నైవేద్యమిచ్చి రావడం మాలో అలవాటు. బియ్యం, బెల్లం, మొదలైన ఆహార సామాగ్రులు, పాత్రలు ఎద్దుల బండిలో వేసుకుని పోయి, అక్కడే వంట చేసుకుని, నైవేద్యం సమర్పించి, కాలువ నీళ్ళతో పాత్రలు కడుక్కుని తిరిగొస్తాం. ఉదయం వెళితే సాయంత్రం వరకు అక్కడే ఉంటాం. అక్కడ మేమంతా మైదానంలో భోజనానికి కూర్చుంటే కోతులు ఊరుకుంటాయా? అందుకు మా దగ్గర ఒక ఉపాయం ఉంది. అడవిలో భోజనానికి కూర్చునే సమయానికి నాలుగైదు సేర్ల వేరుశెనగకాయలను దగ్గర్లోని సరిగ్గా చల్లి వస్తాం. కోతులకు మా ఇంగువ వాసన భోజనం కన్నా వేరుశెనక్కాయలు ఇష్టం. తమ సంసార సమేతంగా అడవిలో ఈ కాయలను ఏరుకుని తినడానికి వెళతాయి. మా అందరి భోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయి. రోజూ ఉష్‌...ఏయ్‌...అని కోతులను కసురుకున్నా, అవి మరణించినపుడు వాటికి ఎక్కడలేని డిమాండ్‌. మామూలుగా వయస్సు మీరి చనిపోయిన కోతులను ఎవరూ అంతగా గమనించకపోయినా విద్యుత్‌ఘాతానికి గురై మరణించిన కోతుల శవాలకు వైభవం ఎక్కువ.

భిక్షగాళ్ళు కూడా శవసంస్కారానికి పదిపైసలు ఇస్తారు. పూలహారంతో అలంకరించి, అగరొత్తులు వెలిగించి, కొత్తబట్టలో చుట్టి, నలుగురు మనుషులు భుజాల మీద శవాన్ని మోసుకుని వెళుతుంటే, చెట్లమీద, ఇండ్ల చూరుమీద కూర్చున్న కోతులు కలవరపాటుతో చూస్తాయి. ఈ మధ్యన చాలా సంవత్సరాల తరువాత ఊరికి వెళ్ళినపుడు నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాను. యథాప్రకారం కోతులు అక్కడ ఉన్నప్పటికీ బాగా చిక్కిపోయినట్టు కనిపించాయి. మునుపట్లా కోతిచేష్టలూ లేకుండా నిశ్శక్తితో బలహీనంగా కనిపించాయి. ఎందుకో వాటి పరిస్థితి చూసి చాలా బాధవేసింది. అర్చకులను విచారించినపుడు కొన్ని వాస్తవాలు తెలిపారు. ‘‘అడవిలో ఉండే అన్ని పండ్లచెట్లను ప్రభుత్వం కౌలుకు ఇస్తూ ఉంది. సీతాఫలం, ఉసిరికాయ, వెలగకాయలు, చింతకాయలు... అన్ని రకాల పండ్ల చెట్లనూ జనం కౌలుకు తీసుకున్నారు. రాత్రీపగలూ కాపలాకాసి పంటను కోసుకుని పోతారు. అంతేకాకుండా కొండను తవ్వితవ్వి మైన్స్‌గా మార్చి చెట్లన్నీ నరికి కూర్చున్నారు.

కోతులు ఏం తినివుంటాయో చెప్పండి? ఇదొక్కటే చాలదన్నట్టు వన్యమృగ సంరక్షణ చేయాలని నాలుగైదు చిరుతలను తెచ్చి అడవిలో వదిలారు. అవి రోజూ రాత్రి ఒకో రెండో కోతులను చంపి తింటాయి. భయంతో కోతులు నిద్రకూడా పోకుండా హెచ్చరికతో రాత్రి గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొరబాటున నిద్రపోయినా, చిరుత ఒక్కసారి గర్జిస్తే చాలు. భయపడి చెట్టు మీది నుంచి పట్టుతప్పి కింద పడిపోతాయి’’ అని బాధపడ్డారు. కేవలం భక్తాదులు ఇచ్చే కొబ్బరి, అరిపళ్ళతోనే కోతులు ఎలా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమో చెప్పండి? సీతక్క ఎలాంటి సంకోచం లేకుండా ‘‘అది సాక్షాత్‌ ఆంజనేయస్వామి అయితే నేను సాక్షాత్‌ సీతమ్మను. తోక ఊపితే కత్తిరిస్తాను’’ అని చెప్పటంతో మా అమ్మ మళ్ళీ నోరెత్తలేదు. ఈ మధ్యన చాలా సంవత్సరాల తరువాత ఊరికి వెళ్ళినపుడు నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాను. యథాప్రకారం కోతులు అక్కడ ఉన్నప్పటికీ బాగా చిక్కిపోయినట్టు కనిపించాయి.
కన్నడ మూలం : వసుధేంద్ర
అనువాదం: రంగనాథ రామచంద్రరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement