పోటీలో ఈటల రాజేందర్, ఎన్.రామచంద్రరావు
ఈటల వైపే అమిత్ షా, సునీల్ బన్సల్ మొగ్గు?
కొత్త వారికి అధ్యక్ష పదవి వద్దని కొందరి అభ్యంతరం
ఆ వాదనకు సంఘ్ కూడా మద్దతిస్తే రామచంద్రరావుకు అవకాశం
కొత్త అధ్యక్షుడిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటున్న పార్టీ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకపు అంశం మరోసారి చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర పార్టీలో సమన్వయ లేమి సమస్య, ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం, కేడర్‌లో నిరాసక్తత, నిస్తేజం పెరుగుతున్న నేపథ్యంలో... కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం ఇంకా ఎప్పుడు నియమిస్తుందా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవితో పాటు, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు.
దీంతో ఆయన రాష్ట్ర పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించ లేకపోతున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. కిషన్‌రెడ్డి కూడా వీలైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను తప్పించాలని అధిష్టానానికి ఇప్పటికే విన్నవించినట్టు సమాచారం. దీంతో పాటు మరో మూడు నాలుగు నెలల్లో స్థానికసంస్థల ఎన్నికలు జరగొచ్చుననే రాజకీయవర్గాల అంచనాల నేపథ్యంలో గ్రామ, మండల ,జిల్లా స్థాయిల్లో పార్టీ పటిష్టతతో పాటు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచుకోవడమనేది బీజేపీకి తక్షణ అవసరంగా మారింది.
స్థానిక ఎన్నికల్లో... జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అంతగా కేడర్, స్థానిక నాయకుల బలం లేని బీజేపీ.. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని గణనీయమైన సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎలా గెలిపించుకోగలుగుతుందనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న నేతను కొత్త అధ్యక్షుడిని నియమిస్తే...ఎన్నికల్లోగా సంస్థాగతంగా పార్టీ బలం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
ఈటల వైపే మొగ్గు...?
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం..పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గట్టిగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, టి.రాజాసింగ్, ముఖ్యనేతలు ఎన్.రామచంద్రరావు, చింతల రామచంద్రా రెడ్డి, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు పోటీపడుతున్నారు.
బీజేఎల్పీ నేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచ్చినందున, రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందినవారినే అధిష్టానం నియమిస్తుందని పార్టీలో పలువురు నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ వాదన రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన ఈటల రాజేందర్‌కు అడ్వాంటేజ్‌గా మారొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటల వైపే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ వంటి వారు మొగ్గుచూపుతున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బీసీ వర్గాల నుంచే ఎంపికచేస్తే ఈటలతో పాటు అర్వింద్ ధర్మపురి, పాయల్‌శంకర్, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు పేర్లను సైతం పరిశీలిస్తారని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితమే పార్టీలో చేరిన ఈటలకు అధ్యక్ష పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచాక కొత్త, పాత అంటూ ఉండదని, రాష్ట్రంలో పార్టీ గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా విస్తరించి, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఇది అడ్డంకి కాకూదని వాదిస్తున్న వారూ పార్టీలో ఉన్నారు.
అలాగైతే రామచంద్రరావుకే..
సైద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యతని స్తే... మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని పార్టీ వర్గాలంటున్నాయి. కొత్త వారికి అధ్యక్ష పదవి వద్దన్న కొందరి అభ్యంతరాల నేపథ్యంలో సంఘ్ పరివార్ కూడా మద్దతిస్తే రామచంద్రరావుకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని పార్టీ నాయకులు కోరుతున్నారు. మొత్తంగా చూస్తే పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment