కొండవీటి కోటలో ఓ రోజు | Vaka Manjula Reddy Special Story In Funday 10/11/2019 | Sakshi
Sakshi News home page

కొండవీటి కోటలో ఓ రోజు

Published Sun, Nov 10 2019 2:49 AM | Last Updated on Sun, Nov 10 2019 2:49 AM

Vaka Manjula Reddy Special Story In Funday 10/11/2019 - Sakshi

అది 1990, ‘జగదేక వీరుడు– అతిలోక సుందరి’ సినిమా రిలీజైంది. శ్రీదేవిని తెలుగు తెర మీద చూసి అప్పటికి చాలా రోజులైంది. దేవకన్యగా శ్రీదేవిని చూడాలని సినిమాకి వెళ్లాను. శ్రీదేవికంటే ముందు గొప్ప పర్యాటక ప్రదేశంగా కొండవీడు కోట ఫ్రేమ్‌లోకి వచ్చింది. గైడ్‌ రాజు పాత్రలో చిరంజీవి ప్రేక్షకుల కళ్లకు కట్టిన కొండవీటి చరిత్రలో ప్రతి దృశ్యమూ ఇప్పటికీ తడి ఆరని జ్ఞాపకంగానే ఉంది. ఆ జ్ఞాపకాల ఒరలోకి స్వయంగా ప్రవేశించే అవకాశం అక్టోబర్‌ 12వ తేదీన కలిగింది. ఆ రోజు గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, హౌస్‌ గణేశ్‌ గ్రామంలో ‘రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శన శాల’ ప్రారంభోత్సవం.

ఆ మ్యూజియం మూడంతస్తుల భవనం, 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పల్నాటి నాగమ్మ విభాగం, ప్రోలయ వేమారెడ్డి విభాగం, రేచర్ల రుద్రారెడ్డి విభాగం, శిల్ప విభాగం, గ్రంథాలయం ఉన్నాయి. మ్యూజియం ఎదురుగా 15వ శతాబ్దం నాటి నంది విగ్రహం పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. మ్యూజియంలో 70 విగ్రహాలు, పురాతన నాణేలు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. 14వ శతాబ్దం నాటి ఘనమైన తెలుగు వారి చరిత్రకు ఆనవాలు ఈ మ్యూజియం. మ్యూజియంలో ఉన్న కొండవీడు కోట నమూనాను క్షుణ్నంగా పరిశీలించిన తరవాత కొండవీడు కోటకు వెళ్తే టూర్‌ని బాగా ఎంజాయ్‌ చేయవచ్చు.

కొండ మీద కోట
వీడు అంటే నివాస ప్రదేశం. కొండవీడుకి ఆ పేరు కొండలున్న ప్రదేశం అనే అర్థంలోనే వచ్చింది. కోట ఉన్న కొండ సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో ఉంది. కొండ కింద నుంచి కొండ మీద కోట వరకు చక్కటి రోడ్‌లో సాగింది ప్రయాణం. కొండమీదకు వెళ్లడానికి పన్నెండు వందల మెట్లతో మెట్లదారి కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని కాకతీయుల తర్వాత రెడ్డిరాజులు పాలించారు. ప్రోలయ వేమారెడ్డి అద్దంకిలో రాజ్యస్థాపన చేశాడు. అతడి వారసుడు అనపోతా రెడ్డి రాజధానిని కొండవీడుకి మార్చి కోటను పటిష్టం చేశాడు.

కోట రక్షణ కోసం పహారా కాయడానికి బురుజులున్నాయి. జెట్టి బురుజు, నెమళ్ల బురుజు, సజ్జా మహల్‌ బురుజు, బి. ఖిల్లా బురుజు, మిరియాల చట్టు బురుజు, ఆళ్లవారి బురుజు, ఎ. రమణాల్‌బురుజు, గుర్రం నాడా బురుజు, బుంగబావి, రెడ్డి వారి భోజనశాల, తారా బురుజు ఉన్నాయి. తారా బురుజును స్థానికులు చుక్కల కొండ బురుజని పిలుస్తారు. ఈ పక్కనే ఉన్న మండపం పేరు తీర్పుల మండపం. యోగివేమన మండపం అని కూడా అంటారు. ఆళ్ల వారి బురుజు శిథిలమై పోయి ఆనవాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తంగా కోట గోడ 20 కిలోమీటర్లు ఉంటుందని అంచనా.

చెరువుల కొండ
కొండమీద వెదుళ్ల చెరువు, పుట్టలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువుతోపాటు ఒక కోనేరు కూడా ఉంది. వెదుళ్ల చెరువులో ఏడాది పొడవునా నీళ్లుంటాయి. ఆ చెరువు పచ్చగా కనిపించింది, కానీ నీటిని చేతిలోకి తీసుకుంటే స్వచ్ఛంగా ఉన్నాయి. అంత ఎత్తులో కోటల నిర్మాణమే ఆశ్చర్యచకితమైతే, చెరువుల తవ్వకం నీటి పారుదల కాలువల ఏర్పాటు... ఊహకు అందలేదు. టూరిజం డిపార్ట్‌మెంట్‌ కోటలోపల ఉన్న మూడు చెరువులను, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరిస్తోంది. రాజుల కాలం నాటి రాజమందిరాన్ని బ్రిటిష్‌ వాళ్లు బంగ్లాగా మార్చారు. ఇప్పుడది కూడా శిథిలావస్థలోనే ఉంది. రెడ్డిరాజులు శైవాన్ని ఆచరించినప్పటికీ వైష్ణవాన్ని కూడా బాగా ఆదరించారు.

కోటలోపల శివాలయంతోపాటు లక్ష్మీ నరసింహాలయం, గంగాధర రామేశ్వరాలయం కూడా ఉన్నాయి. ముత్యాలమ్మ చెరువు పక్కన దర్గా, మరో రెండు మసీదులను కుతుబ్‌షాహీలు కట్టించారు. గుర్రపుశాలలు, వరహాల కొట్టు, నేతికొట్టు ఉన్నాయి. రాత్రిళ్లు దివిటీలు వెలిగించడానికి అవసరమైన నెయ్యిని ఈ నేతికొట్టులో నిల్వ చేసేవారని చెబుతారు. గుప్తనిధుల కోసం దుండగులు విచక్షణారహితంగా తవ్విపోయడంతో కళ తప్పింది కోట. ఒకప్పటి రాజధాని ఇప్పుడు ఒక గ్రామంగా తన ఉనికిని నిలుపుకునే ప్రయత్నంలో ఉంది. నాటి ఆర్కిటెక్చర్‌లోనే ఇప్పుడు కొత్త నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి.

మహిళల దార్శనికత
మ్యూజియంలోని ఆడియో విజువల్‌ థియేటర్‌లో కొండవీటి రెడ్డిరాజుల పాలన డాక్యుమెంటరీ ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మహాభారతాన్ని తెలుగీకరించిన కవిత్రయంలో మూడవ వాడు ఎర్రాప్రగడ ఇక్కడి వాడే, కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఈ ఆస్థానంలోని వాడే. హలం వదిలి కత్తి పట్టిన రెడ్డిరాజులు, కత్తితోపాటు కలంతోనూ స్వైర విహారం చేసిన వైనానికి నిదర్శనమే కొండవీటి కోట. రాజుల గొప్పదనాలు ఒక ఎత్తయితే, ఇక్కడి రాజవంశ మహిళల సామాజిక చైతన్యం మరొక ఎత్తు. పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబిక కొండవీడు దగ్గర సంతాన సాగరం అనే చెరువు తవ్వించింది.

రెడ్డి రాజుల కాలంలో మహిళలకు నిర్ణయాధికారం ఉండేది. విత్త నిర్వహణలో చొరవ ఉండేది. పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలను పండించాల్సిన అవసరాన్ని గుర్తించారు వాళ్లు. నేలను చదును చేసి సాగుభూమిని విస్తరింపచేయడం నుంచి, నీటి లభ్యత కోసం చెరువులు తవ్వించడంలో కూడా ముందుండే వాళ్లు. ‘దేవతల రాజధాని అమరావతికి తీసిపోని నగరం’ అని కొండవీడు కోటను శ్రీనాథుడు చాటుపద్యాల్లో వర్ణించినట్లు చెప్పారు స్థపతి ఈమని శివనాగిరెడ్డి. అలాగే మరో ఆశ్చర్యకరమైన సంగతి కూడా తెలిసింది... రక్షణ బాధ్యతలో ఉన్న ఉద్యోగి దొంగను పట్టుకుని సొమ్మును తిరిగి ఖజానాకు జమ చేయడంలో విఫలమైతే అతడు నష్టపరిహారం చెల్లించాల్సిందే.

నాటి సమాజానికి దర్పణం
మ్యూజియంలో మోటుపల్లి రేవు చిత్రంలో అప్పటి రవాణా విధానాలన్నింటినీ పొందుపరిచారు. ఒక్క చిత్రం పది వాక్యాల పెట్టు అనేది నానుడి అయితే... ఈ చిత్రం ఏకంగా అప్పటి సమాజాన్ని, వృత్తి పనివాళ్ల జీవితాన్ని, వర్తక వాణిజ్యాన్ని ప్రతిబింబిస్తోంది. పద్నాలుగవ శతాబ్దంలో మహిళలు, మగవాళ్లు దుస్తులను మోకాళ్ల వరకు ధరించేవాళ్లని చెప్తున్నాయి ఈ చిత్రాలు. మ్యూజియంలో తిరుగుతుంటే టైమ్‌ మెషీన్‌లో పద్నాలుగవ శతాబ్దంలోకి ప్రయాణించినట్లు ఉంటుంది. గోపీనాథ ఆలయం నిర్మాణంలో పెద్దదే, కానీ గర్భగుడిలో దేవుడి విగ్రహ ప్రతిష్ఠ జరగనే లేదు. దీనిని కత్తుల బావి అంటారు. కొండవీడు అనగానే లకుమాదేవి కూడా గుర్తుకు వస్తుంది. ఆమె కుమారగిరి ఆస్థానంలో నర్తకి. మ్యూజియంలో ఆమె చిత్రం కూడా ఉంది. అక్కడికి రాగానే ‘జగదేక వీరుడు– అతిలోక సుందరి’లో లకుమాదేవిగా నాట్యం చేసిన బేబీ షాలిని కళ్ల ముందు మెదిలింది.

కోటకు కొత్త కళ
చరిత్రను అక్షరబద్ధం చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతుంది. ఆనవాలుకు కూడా దొరకకుండా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న శిథిలాలను పునరుద్ధరిస్తోంది కొండవీడు కోట డెవలప్‌మెంట్‌ కమిటీ. ఆ కమిటీ కన్వీనర్‌ శివారెడ్డి ఒక అలుపెరుగని సైనికుడు. ఆయన ఇంటర్‌ చదివే రోజుల్లో కొండవీడును చూడడానికి వచ్చి, శిథిలాల నుంచి ఊడిపడిన ఒక రాయిని తీసుకెళ్లి ట్రంకుపెట్టెలో దాచుకున్నట్లు ‘కొండవీడు’ పుస్తకంలో రాసుకున్నారు. శివారెడ్డి పదిహేనేళ్ల శ్రమ, భక్తప్రియ వంటి ఓ యాభై– అరవై మంది సైనికుల అకుంఠిత దీక్షతో కొండవీడు కొత్త కళను సంతరించుకుంటోంది. ‘అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య– శ్రీశైలం’ వాళ్లు మ్యూజియం కోసం పడిన శ్రమను చూసినప్పుడు... చరిత్రను సృష్టించడం కంటే చరిత్రను పరిరక్షించడమే పెద్ద పని అనిపించింది.
– వాకా మంజులారెడ్డి,ఫొటోలు: గజ్జెల రామ్‌గోపాల్‌ రెడ్డి

కొండవీడు సమీపంలోని అమీనాబాద్‌ గ్రామంలో మూలాంకురేశ్వరి ఆలయం ఉంది. ఈ అమ్మవారు కొండవీడు రెడ్డిరాజుల కులదైవం. రాజకుటుంబీకులు అమ్మవారి నిత్యపూజల్లో పాల్గొనేవారు. రోజూ అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు మోగే గంటారవం వినిపించిన తరవాత మాత్రమే రాజకుటుంబీకులు ముద్దముట్టేవాళ్లని చెప్పారు స్థానికులు. అమీనాబాద్‌ చెరువు దగ్గర ఒక రెస్ట్‌హౌస్‌ ఉంది. అంతఃపుర మహిళలు చెరువు స్నానానికి వచ్చినప్పుడు దుస్తులు మార్చుకోవడానికి, సేదదీరడానికి ఈ రెస్ట్‌హౌస్‌ను ఉపయోగించేవారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement