సోలో జర్నీ...సో బెటరు... | Writer Aparajita Narrates Story About Journey On 24/11/2019 | Sakshi
Sakshi News home page

సోలో జర్నీ...సో బెటరు...

Published Sun, Nov 24 2019 4:58 AM | Last Updated on Sun, Nov 24 2019 4:58 AM

Writer Aparajita Narrates Story About Journey On 24/11/2019 - Sakshi

నేను ముంబైలో చదువుతున్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి భారతదేశంలో కొన్ని ప్రదేశాలూ, యూరప్‌లో కొన్ని దేశాలూ, ఈజిప్ట్‌ చూశాను. అలాగే అమెరికాలో చదువుతున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా పర్యాటన చేశాను కానీ, జపాన్‌ చూడాలన్న కల మాత్రం ఈమధ్య వరకూ తీరలేదు. జపాన్‌ వెళ్ళాలని నిశ్చయించుకున్నాక ఏ సీజన్లో వెళ్ళాలని ముందుగా ఆలోచించాను. వసంతకాలంలో వెళ్తే సకురా హనామి (చెర్రీ పూల కనువిందు), వేసవిలో ఐతే నత్సుమత్సూరి (వేసవి ఉత్సవాలు), శిశిరంలో మోమోజీ (ఎర్రని మేపిల్‌ చెట్ల దర్శనం) ఉంటాయి. నేను శిశిరంలోనే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను – ఇంకోసారి తక్కిన సీజన్లలో వెళ్ళచ్చని అనుకుంటూ. ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించుకున్నాక, ముందుగా ఏర్పాటు చేసుకోవల్సింది వీసా. నేను అమెరికా నుండి జపాన్‌ వెళ్తూండడం వల్ల వీసా పని సులభంగా అయిపోయింది. నిజానికి భారతదేశం నుండి కూడా జపాన్‌ వీసా రావడం సులభమే. చాలా దేశాలతో పోలిస్తే జపాన్‌ వీసా ఫీజు కూడా చాలా తక్కువ. సుమారుగా ఐదువందల రూపాయలు. 2020 నుండి జపాన్‌ ప్రభుత్వం భారత పర్యాటకులకి ఈ–వీసా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే టోక్యో ఒలింపిక్స్‌ వెళ్దామనుకున్న వాళ్ళు ఈ ఈ–వీసా సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

వీసా తర్వాత మనం వెళ్ళబోయే దేశంలో ఏ ఏ ప్రదేశాలు చూడాలి, ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉండాలి అని ప్రణాళిక వేసుకోవాలి. నా ప్రయాణం మొత్తం పదిరోజులే కాబట్టి నేను మూడు నాలుగు ప్రదేశాల కన్న ఎన్నుకోలేను, ఒక్కో చోటా రెండు మూడు రోజుల కన్న ఎక్కువ సమయం ఉండలేను. జపాన్‌లో ఉండే రకరకాల సంస్కృతుల్ని కొంచెం కొంచెంగా అనుభవించాలని నేను – నవీనత్వం కోసం టోక్యోనీ, రాచరికపు చిహ్నాల కోసం కానజావానీ, ఆలయాల కోసం క్యోటోనీ, గత వైభవపు కోట కోసం హిమేజీనీ, ప్రకృతి కోసం, ఆలయాల కోసం నారానీ ఎంచుకున్నాను. ఈ ప్రదేశాలన్నీ ఒక ప్రాంతంలో లేవు. అందుకని జపాన్‌ ఒక మూల నుండి ఇంకో మూలకి తిరగాల్సిన అవసరం ఉంది. ఐతే ఆ ఆవసరం ప్రపంచ ప్రసిద్ధమైన జపాన్‌ షిన్కాన్సెన్‌ (బుల్లెట్‌ రైళ్ళు) వాడే అవకాశం కూడా కలిగించింది.

జపాన్లో ప్రయాణాలకి నేను జపనీస్‌ రైల్‌ పాస్‌ తీసుకున్నాను. అది ఆన్‌లైన్‌లో ముందుగానే కొనుక్కోవచ్చు. జపాన్‌ రైల్‌ నెట్‌వర్క్‌లో ఎప్పుడు రైలు ఎక్కాలన్నా ఆ పాస్‌ ఉపయోగపడుతుంది. షిన్కాన్సెన్‌ రైళ్ళలో సీటు రిజర్వ్‌ చేసుకుందుకు కూడా ఆ పాస్‌ ఉపయోగిస్తుంది. ఎక్కువ ప్రయాణం చేసేవాళ్లకి పాస్‌ చాలా ఉపయోగకరం. నేను వారం రోజుల పాస్‌ తీసుకున్నాను. వీసా, రైలు టికెట్‌ తర్వాత చూసుకోవల్సింది ఎక్కడ ఉండాలన్నది. ఒక్కళ్ళమే ప్రయాణం చేస్తున్నప్పుడు హŸటళ్ళలో కాకుండా హాస్టళ్లలో ఉండడం మంచిది. హాస్టళ్ళలో ఉంటే – మనలాగే ప్రయాణాలు చేసే వాళ్లని కలవచ్చు. ఒక్కోసారి వాళ్లతో కలిసి కొన్ని ప్రదేశాలు చూడచ్చు. అదీకాక హాస్టళ్ళు సురక్షితంగా అనిపిస్తాయి. అద్దెలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. నేను ఒక్కదాన్నే ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు హాస్టళ్లలో ఉండటమే మంచిదనిపిస్తుంది. నేనంతకు ముందు కొన్ని చోట్లకి సోలోగా ప్రయాణం చేశాను కానీ పది రోజులు ఒంటరిగా వెళ్ళడం జపాన్‌తోనే మొదలైంది. టోక్యో నరీతా విమానాశ్రయంలో దిగడంతో నా జపాన్‌ పర్యటన మొదలైంది. విమానాశ్రయం నుండి ట్రైన్‌ ఎక్కి అసకుసలో ఉన్న నా బసకు చేరుకున్నాను. అక్కడ నా గది మూడు గోడలకీ, అల్మైరాకీ మధ్యన ఉన్న ఒక పడక. ఐతే అందులో టీవీ, స్టొరేజ్, సేఫ్‌ లాంటి సౌకర్యాలతో పాటు నిత్యావసరాలకి అవసరమైన కిట్‌ కూడా ఉంది, పైజామాతో సహా.

నేను ఆ హాస్టల్‌ ఎంచుకున్నది ప్రధాన కారణం అది సెన్సోజీ ఆలయానికి దగ్గరగా ఉండడం. మనం వెళ్ళే ఊళ్ళలో ఉండే ప్రధాన పర్యాటక ప్రదేశాలకి దగ్గరగా మనం ఉంటే మనకి సమయం బాగా కలిసి వస్తుంది. నేను నా బసకి చేరుకున్నది సాయంత్రం. సూర్యాస్తమయం తొందరగా అయిపోవడం వల్ల చీకటిలో దీపాల కాంతిలో ఆ గుడిని నేను చూశాను. ఆ గుడి చాలా పురాతనమైనది. ఎంతో ప్రసిద్ధమైనది. మర్నాడు నేను ఇషికావా ప్రాంతంలో ఉన్న కనజావాకి వెళ్ళాను. బుల్లెట్‌ రైలులో అదే నా మొదటి ప్రయాణం. రైలు అందమైన ప్రకృతి మధ్య వేగంగా సాగిపోయింది. కనజావాలో నేనో బొతిక్‌ హాస్టల్లో ఉన్నాను. సమురై డిస్ట్రిక్ట్‌ గా పేరుగాంచిన నాగామాచీ నన్ను శతాబ్దాల వెనకటి రోజుల్లోకి తీసికెళ్ళింది. అలానే హిగషి ఛాయా డిస్ట్రిక్ట్‌ లో గీషా (టీ వేడుక) గొప్ప అనుభవం. రాత్రి హాస్టల్లో గడిపి రెండోరోజు ఉదయమే – అక్కడున్న వనాల్లో తిరగడానికి వెళ్లాను. ఉదయం వెళ్తేనే ప్రకృతిæ రమణీయత బాగా ఆస్వాదించగలం. చెట్లనీ, రాలుతున్న ఆకుల్నీ, సరస్సుల్నీ తనివితీరా చూసి, దగ్గర్లోనే ఉన్న కానజావా కోటని కూడా చూశాను.

కానజావా నుండి క్యోటోకి వెళ్లాను. ఆ దారిలో బుల్లెట్‌ రైలు లేదు. అందుకని థండర్‌ బర్డ్‌ అనే ఎక్స్‌ప్రెస్స్‌ రైల్లో ప్రయాణం చేసాను. దారిలో జపాన్‌ పల్లెటూరి వాతావరణం చూడగలిగాను. క్యోటోలో నేను సాంప్రదాయకమైన అతిథి గృహంలో ఉన్నాను. అలా ఉండడం వల్ల జపాన్‌ సంస్కృతి తెలుసుకోవచ్చు. ఆ సాయంత్రం యునెస్కో చేత ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన కియోమిజుదేరా ఆలయాన్ని చూశాను. ఆ సమయంలో శిశిరపు ప్రత్యేక దీపాలంకరణ అద్భుతంగా అనిపించింది. క్యోటోలో లోకల్‌ బస్‌ పాస్‌ కొనుక్కుని ఉదయమే బంగారు భవనం అని పిలవబడే కిన్కాకుజీ ఆలయానికి వెళ్లాను. ఆ తర్వాత క్యోటోలో ఎక్కువగా ఫొటోగ్రాఫులకెక్కే అరషియామా వెదురు పొదలకి వెళ్లాను. అక్కడ నడుస్తూ గాలికి వెదురు పొదల మీద నుండి శబ్దాలని వినడం శ్రవణానందకరం. అది అనుభవైకవేద్యం. అలా నడుస్తూ ఫుషిమీ ఇనారీ దగ్గర మంత్రముగ్ధుల్ని చేసే ప్రదేశాల్లో తిరిగాను.

క్యోటో తర్వాత నా బస నారాలో. నారాలో ఉన్న జింకల పార్కు పక్కనే నా హాస్టల్‌. నాగరికతకి దూరంగా, జింకలకి దగ్గరగా ఉండడం ఓ అనుభవం. హాస్టల్లో కొందరితో కలిసి జింకల పార్కులో తిరిగాను. మర్నాడు ఉదయమే దగ్గర్లోని గుళ్ళని చూశాను. ఆ తర్వాత హిమేజీ ఆలయానికి ప్రయాణం అయ్యాను. దానికి బుల్లెట్‌ రైల్లో రెండు గంటల ప్రయాణం. ఐతే హిమేజీ కోట అద్భుతమైంది. అంతేకాదు. శిధిలమైపోకుండా ఉన్న కొన్ని కోటల్లో అది ఒకటి. తర్వాత తోదైజీ ఆలయానికి వెళ్ళాను. నేనెన్నో బౌద్ధాలయాలకి వెళ్ళాను కానే అవన్నే తొదైజీ బౌద్ధ మందిర వైభవానికి సాటి రావనిపించింది. ఆ ఆలయ దర్శనం తర్వాత నారా జింకలపార్కులో గడిపాను. నారాలో రెండురోజులూ ఆనందంగా సమయం తెలియకుండా గడిచిపోయింది.

అక్కడ నుండి మళ్ళీ టోక్యోకి బుల్లెట్‌ రైల్లో ప్రయాణమయ్యాను. క్యోటో నుండి టొక్యోకి వెళ్తోంటే దార్లో మౌంట్‌ ఫుజీ కనిపిస్తుంది. నాకు తెలిసిన జపనీస్‌ ఙ్ఞానంతో నేను క్యోటో టికెట్‌ ఆఫీసులో, నేనెటు కూచుంటే ఫుజీ కనిపిస్తుందో కనుక్కుని రైల్లో అటుపక్క కిటికీ సీట్‌ సంపాదించాను. అలా మంచు నిండిన అగ్నిపర్వతం ఫుజీని స్పష్టంగా చూడగలిగాను. ఈసారి టోక్యోలో నేను ఉన్న హాస్టల్‌ అంతా ఆడవాళ్ళకే. అంతకు ముందున్న హాస్టళ్ళలో నేనున్న గదులు మాత్రం ఆడవాళ్లకి ఉండేవి. ఇన్నాళ్ళూ ప్రకృతి అందాన్నీ, గత వైభవ చిహ్నాలనీ చూస్తున్న నాకు టోక్యోలో ఆధునికత కొట్టొచ్చినట్లు కనిపించింది. గింజా, షిన్కూజూ, షిబూయా, అకిహాబరాలలో ఎలక్ట్రానిక్, ఎనిమే, మాంగా కొట్లు కొత్త వస్తువులతో వెలిగిపోతూ ఉండడం చూశాను. అలానే జపాన్‌ పెన్నులకీ ఇంకులకీ ప్రసిద్ధి. నేనిప్పటికీ ఇంకు పెన్నులు వాడతాను. అవి కొన్ని కొనుక్కున్నాను.

ఆ తర్వాత కామాకురలో బౌద్ధాలయం చూశాను. పక్కనే పసిఫిక్‌ మహాసముద్రం దగ్గరకెళ్ళాను కానీ, చాలా చల్లగా ఉండడంతో నీళ్లలోకి దిగలేదు. ఆహరం గురించి ప్రస్తావించుకోకుండా జపాన్‌ పర్యటన ముచ్చటని ముగించలేం. పూర్తి శాకాహారిని కాబట్టి నాకు ఆహారం కష్టం అవుతుందని నేను భయపడ్డాను కానీ, వీగన్‌ రెస్టారెంట్లు ఎక్కువగానే ఉండడం వల్ల పెద్ద నగరాల్లో సమస్య లేకపోయింది. పెద్ద నగరాలు కాని చోట్ల కూడా గ్రాసరీలలో బన్నులూ, బ్రెడ్డులూ లాంటివి దొరుకుతాయి. ఐతే చూడ్డానికి శాకాహరంలా కనిపించే వస్తువుల్లో శాకాహారం కానివి ఏవైనా చేరి ఉంటాయా అన్నది చూసుకుంటూ ఉండాలి. ఐతే ఆహారం యాప్స్‌ ద్వారా చాలా విషయాలు ముందుగానే తెలుసుకోవచ్చు కాబట్టి నాకు బానే గడిచింది.

నారాలో ఒకరోజు ఉదయం ఐదు గంటలకి నాకు హాట్‌ చాకొలేట్‌ దొరికింది కూడా. జపాన్లో అన్నిటి కన్న ముఖ్యం భాష. అక్కడ చాలా మందికి ఇంగ్లిష్‌ రాదు. నేను జపాన్‌ వెళ్దామని అనుకున్న తర్వాత కొంచెం జపనీస్‌ నేర్చుకున్నాను. అది కొంత ఉపయోగపడింది. ఐతే అనువాద యాప్స్‌ ఎక్కువ వచ్చాయి. వాటిని వాడుతూ అన్ని చోట్లా పనులు చేసుకున్నాను. అంతేకాదు. జపాన్‌లో చాలామంది వాళ్లకి భాష రాకపోయినా మనకి సాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. హడావిడి పడకుండా నేను అడిగిన దాన్ని అర్థం చేసుకుందుకు ప్రయత్నించారు. వాళ్లలో చాలా మందికి భారతదేశం అంటే అభిమానం ఉన్నట్లు అనిపించింది. నాతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ఓ పదిరోజులు ఆ దేశం ఆత్మీయపూర్వకమైన ఆతిథ్యం చవిచూడడం మరిచిపోలేని అనుభవం. ఇంకో జపాన్‌ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను.
– అపరాజిత అల్లంరాజు(రచయిత్రి అమెరికాలో ఎమ్మెస్‌ చేసి యాపిల్‌లో పని చేసి భారతదేశం వచ్చేసి ప్రస్తుతం ఇండిపెండెంట్‌ కన్సల్టన్ట్‌ గా పనిచేస్తోంది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement