బాల్యంలో కటిక దారిద్య్రం అనుభవిస్తూనే, చదువులు కొనసాగించిన కొందరు ఉన్నత స్థానానికి చేరుకున్న ఉదంతాల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఇదే కోవలోకి వస్తారు రమేష్ ఘోలాప్. ఈయన సాధించిన విజయం యువతకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.
రమేష్ ఘోలాప్.. ఐఏఎస్ అధికారిగా మారేవరకూ సాగించిన ప్రయాణంలో చదువుపై ఆయన చూపిన అంకితభావం, శ్రద్ధ, కృషి మనకు కనిపిస్తాయి. మహారాష్ట్రలోని షోలాపూర్(Solapur) జిల్లాలోని మహాగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించిన రమేష్ చిన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. రమేష్ తండ్రి గోరఖ్ ఘోలాప్ ఒక చిన్న సైకిల్ మరమ్మతుల దుకాణం నడిపేవాడు. మద్యం అలవాటు కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇంట్లో పరిస్థితి అంతకంతకూ దిగజారింది. ఒకరోజు రమేష్ తండ్రి దుకాణం మూసివేశాడు.
దీంతో రమేష్ తల్లి విమల్ ఘోలాప్ కుటుంబాన్ని పోషించేందుకు సమీప గ్రామాల్లో గాజులు అమ్మడం ప్రారంభించింది. ఆ సమయంలో రమేష్ తన తల్లికి సహాయం చేస్తూ వచ్చాడు. 2005లో రమేష్ తండ్రి మరణించాడు. కుటుంబసభ్యులు పొరుగింటివారి సాయంలో అంత్యక్రియలు(Funeral) నిర్వహించారు. ఈ ఘటన రమేష్‌ను అమితంగా ఆలోచింపజేసింది. పేదరికం నుండి బయటపడటానికి ఏకైక మార్గం విద్య అని రమేష్ గ్రహించాడు. చదువుపై దృష్టి సారించిన రమేష్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2009 లో ఉపాధ్యాయుడైన తర్వాత కూడా, తన ఆశయంపై దృష్టి సారిస్తూ ముందుకుసాగాడు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) కి సిద్ధం కావాలని నిర్ణయించుకుని, ప్రిపరేషన్ కోసం రమేష్ పూణేకు పయనమయ్యాడు. ఆ సమయంలో అతని తల్లి అండగా నిలిచింది. 2010లో రమేష్ తన మొదటి ప్రయత్నంలో యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష విఫలమయ్యాడు. పోలియో బాధితుడైన రమేష్ 2012లో వికలాంగుల కోటా(Disabled quota) కింద యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)287తో ఉత్తీర్ణుడయ్యాడు. ఐఎఎస్ అధికారి కావాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐఏఎస్ రమేష్ ఘోలాప్ జార్ఖండ్ ఇంధన శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన కథ కోట్లాది మంది యువతకు ప్రేరణ కల్పిస్తుందనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు
Comments
Please login to add a commentAdd a comment