Aparajita
-
మహిళలపై నేరాలకు మరణ శిక్షే
కోల్‌కతా: మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించడానికి ఉద్దేశించిన ‘అపరాజిత’ బిల్లుకు పశి్చమ బెంగాల్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘అపరాజిత మహిళ, బాలలు(పశి్చమ బెంగాల్ చట్టాలు, సవరణ) బిల్లు–2024’ను రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి మలోయ్ ఘటక్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార, విపక్ష సభ్యులంతా బిల్లుకు అంగీకారం తెలిపారు. బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ తిరస్కరించింది.మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారి మరణానికి లేదా జీవచ్ఛవంగా మారడానికి కారణమైన దోషులకు మరణ శిక్ష లేదా పెరోల్‌కు వీల్లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా అపరాజిత బిల్లును పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలపై నేరాల కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, సత్వరమే కోర్టు నుంచి తీర్పు వచ్చేలా బిల్లులో నిబంధనలు జోడించారు. మహిళలు, చిన్నారులకు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా అత్యాచారాలు, లైంగిక నేరాలకు సంబంధించి ఇప్పుడున్న చట్టంలో కొన్ని మార్పులు చేశారు, కొత్త అంశాలు చేర్చారు.కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులకు మరణ శిక్ష విధించేలా కఠినమైన చట్టం తీసుకొస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అపరాజిత బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించడం కోసమే రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: సీఎం మమతా బెనర్జీ డిమాండ్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టని ముఖ్యమంత్రులంతా పదవులకు రాజీనామా చేయాలని పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలో అపరాజిత బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించి, బాధితులకు సత్వరమే న్యాయం చేకూర్చేలా చట్టాల్లో సవరణలు చేయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే తామే మొదట చొరవ తీసుకున్నామని తెలిపారు.అపరాజిత బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. ఇది మొత్తం దేశానికి ఒక రోల్‌మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీకి తాను రాసిన రెండు లేఖలను ఆమె సభ ముందుంచారు. మహిళలు, చిన్నారులకు భద్రత కలి్పంచేలా చట్టాలను అమలు చేయడంలో విఫలమైన పాలకులంతా పదవుల నుంచి తప్పుకోవాలని తేలి్చచెప్పారు. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్ హత్యకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని సభలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బిగ్గరగా నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్లో మహిళలపై అధికంగా నేరాలు జరుగుతున్నాయని తిప్పికొట్టారు.ఏమిటీ అపరాజిత బిల్లు?భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితతో పాటు పోక్సో చట్టానికి కూడా పశి్చమ బెంగాల్ ప్రభుత్వ అపరాజిత బిల్లు సవరణలను ప్రతిపాదించింది. ‘‘అత్యాచారం, అత్యాచారం–హత్య, సామూహిక అత్యాచారం, బాధితుల గుర్తింపు బయటపెట్టడం, యాసిడ్ దాడి వంటి నేరాలకు విధించే శిక్షలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66, 70(1), 71, 72(1), 73, 124(1), 124(2)ను సవరించాలి. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలి’’ అని పేర్కొంది.‘‘అత్యాచారం కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైన 21 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. తగిన కారణాలుంటే మరో మూడు వారాలు పొడిగించవచ్చు. దోషులకు మరణ శిక్షతో పాటు జరిమానా లేదా ఆజన్మ ఖైదు (మరణించేదాకా) విధించాలి. మహిళలపై నేరాలకు సంబంధించిన కోర్టు కార్యకలాపాలను, కేసు విచారణ వివరాలను అనుమతి లేకుండా ప్రచురిస్తే 3 నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలి. దర్యాప్తు కోసం డీఎస్పీ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. దర్యాప్తు వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కోర్టును, దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి’’ అని అపరాజిత బిల్లు ప్రతిపాదించింది. -
సౌందర్యమైన ‘బ్లూ టీ’ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో! ఎలా చేసుకోవాలి?
ఆధునిక కాలంలో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. పోషకాలతో నిండిన ఆహారం, పానీయాలు, హెర్బల్‌టీ పై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా, బరువును అదుపులోఉంచుకునే హెర్బల్ టీల గురించి తెలుసుకుంటున్నారు. మరి అపరాజిత పువ్వులు, ఈ పువ్వులతో తయారు చేసుకునే ‘బ్లూ టీ’ ప్రయోజనాలు గురించి తెలుసా? తెలుసుకుందాం రండి!అపరాజిత, వీటినే శంఖుపుష్కాలు , బటర్‌ఫ్లై పీ అని కూడా అంటారు. తెలుగు, నీలం, ముదురు నీలం రంగుల్లో ఈ పూలు పూస్తాయి. ఈ పువ్వులతో తయారు చేసిన టీని తాగితే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ‘బ్లూ టీ’ గా పాపులర్ అయిన ఈ టీతో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. పలు వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అపరాజిత ప్రస్తావన ఉంది. బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. లక్షణాలతో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఈ టీతాగడం బరువు తగ్గినట్టు అధ్యయనాల్లో రుజువైంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.యాంటీ-డయాబెటిక్, యాంటీ-కేన్సర్ లక్షణాలుకూడా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ టీలోని యాంటిథ్రాంబోటిక్ లక్షణం రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బ్లూటీ తయారీనాలుగు నీలిరంగు అపరాజిత పువ్వులను తీసుకొని ఒక కప్పు నీళ్లలో బాగా మరిగించాలి. నీళ్లు నీలం రంగులోకి మారతాయి. తరువాత, దీన్ని ఒక కప్పులోకి ఫిల్టర్ చేసుకొని హనీ, లేదా పంచదార, నిమ్మకాయ కలపుకుని తాగవచ్చు. ఇందులో తురిమిన అల్లం కూడా వేసుకోవచ్చు. -
కృష్ణా: కాబోయే కలెక్టర్-ఎస్పీలు.. సింపుల్ మ్యారేజ్
సాక్షి, కృష్ణా: కాబోయే కలెక్టర్.. కాబోయే ఎస్పీల వివాహం నిరాడంబరంగా జరిగింది. అదీ రిజిస్టర్ మ్యారేజ్‌గా సింపుల్‌గా దండలు మార్చుకున్నారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అయిన అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లోని ఛాంబర్ వీళ్ల వివాహానికి వేదిక అయ్యింది. వీళ్లిద్దరిదీ రాజస్థాన్ కావడం గమనార్హం. ఈ కొత్త జంటకు కలెక్టర్ రాజాబాబు, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. వివాహం తర్వాత కొత్త జంట గుడ్లవల్లేరు వేమవరంలోని శ్రీకొండాలమ్మ ఆలయాన్ని దర్శించారు. ఇదిలా ఉండగా.. దేవేంద్ర కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. -
మహిళా ఎంపీకి చేదు అనుభవం.. కోడిగుడ్ల దాడి
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్ల దాడి చేయడంతో ఒడిశాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కాన్వాయ్‌పై దాడి జరగిన మరుసటి రోజే.. ఓ మహిళా ఎంపీకి ఇదే రీతిలో చేదు అనుభవం ఎదురయ్యింది. కాంగ్రెస్ మద్దతుదారులు బీజేడీ ఎంపీ అపరాజిత సారంగిని టార్గెట్ చేశారు. ఆమె వాహానంపై కోడిగుడ్లు విసిరారు. (చదవండి: ఒడిశా సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి) ఈ సంఘటన శుక్రవారం భువనేశ్వర్ బనమలిపూర్లో చోటు చేసుకుంది. నిరుద్యోగం, నిత్యసరాల ధరలు, ఇంధన ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎంపీ అపరాజిత సారంగి వాహానాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ మద్దతుదారులు.. దానిపై కోడిగుడ్లు విసిరారు. నల్ల జెండాలు చూపి నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు) ఈ క్రమంలో జరిగిన సంఘటన గురించి అపరాజిత సారంగి తన స్వస్థలం ధనేశ్వర్ బారిక్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసనకారుల రాళ్లు కోడిగుడ్లతో తన వాహనంపై దాడి చేశారని.. వారి వద్ద కత్తులు, ఇతర మారణాయుధాలు ఉన్నాయని ఎంపీ తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చదవండి: ఒడిశాలో పతీసహగమనం.. భార్య మరణం తట్టుకోలేక -
సోలో జర్నీ...సో బెటరు...
నేను ముంబైలో చదువుతున్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి భారతదేశంలో కొన్ని ప్రదేశాలూ, యూరప్‌లో కొన్ని దేశాలూ, ఈజిప్ట్ చూశాను. అలాగే అమెరికాలో చదువుతున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా పర్యాటన చేశాను కానీ, జపాన్ చూడాలన్న కల మాత్రం ఈమధ్య వరకూ తీరలేదు. జపాన్ వెళ్ళాలని నిశ్చయించుకున్నాక ఏ సీజన్లో వెళ్ళాలని ముందుగా ఆలోచించాను. వసంతకాలంలో వెళ్తే సకురా హనామి (చెర్రీ పూల కనువిందు), వేసవిలో ఐతే నత్సుమత్సూరి (వేసవి ఉత్సవాలు), శిశిరంలో మోమోజీ (ఎర్రని మేపిల్ చెట్ల దర్శనం) ఉంటాయి. నేను శిశిరంలోనే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను – ఇంకోసారి తక్కిన సీజన్లలో వెళ్ళచ్చని అనుకుంటూ. ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించుకున్నాక, ముందుగా ఏర్పాటు చేసుకోవల్సింది వీసా. నేను అమెరికా నుండి జపాన్ వెళ్తూండడం వల్ల వీసా పని సులభంగా అయిపోయింది. నిజానికి భారతదేశం నుండి కూడా జపాన్ వీసా రావడం సులభమే. చాలా దేశాలతో పోలిస్తే జపాన్ వీసా ఫీజు కూడా చాలా తక్కువ. సుమారుగా ఐదువందల రూపాయలు. 2020 నుండి జపాన్ ప్రభుత్వం భారత పర్యాటకులకి ఈ–వీసా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే టోక్యో ఒలింపిక్స్ వెళ్దామనుకున్న వాళ్ళు ఈ ఈ–వీసా సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వీసా తర్వాత మనం వెళ్ళబోయే దేశంలో ఏ ఏ ప్రదేశాలు చూడాలి, ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉండాలి అని ప్రణాళిక వేసుకోవాలి. నా ప్రయాణం మొత్తం పదిరోజులే కాబట్టి నేను మూడు నాలుగు ప్రదేశాల కన్న ఎన్నుకోలేను, ఒక్కో చోటా రెండు మూడు రోజుల కన్న ఎక్కువ సమయం ఉండలేను. జపాన్‌లో ఉండే రకరకాల సంస్కృతుల్ని కొంచెం కొంచెంగా అనుభవించాలని నేను – నవీనత్వం కోసం టోక్యోనీ, రాచరికపు చిహ్నాల కోసం కానజావానీ, ఆలయాల కోసం క్యోటోనీ, గత వైభవపు కోట కోసం హిమేజీనీ, ప్రకృతి కోసం, ఆలయాల కోసం నారానీ ఎంచుకున్నాను. ఈ ప్రదేశాలన్నీ ఒక ప్రాంతంలో లేవు. అందుకని జపాన్ ఒక మూల నుండి ఇంకో మూలకి తిరగాల్సిన అవసరం ఉంది. ఐతే ఆ ఆవసరం ప్రపంచ ప్రసిద్ధమైన జపాన్ షిన్కాన్సెన్ (బుల్లెట్ రైళ్ళు) వాడే అవకాశం కూడా కలిగించింది. జపాన్‌లో ప్రయాణాలకి నేను జపనీస్ రైల్ పాస్ తీసుకున్నాను. అది ఆన్లైన్లో ముందుగానే కొనుక్కోవచ్చు. జపాన్ రైల్ నెట్‌వర్క్‌లో ఎప్పుడు రైలు ఎక్కాలన్నా ఆ పాస్ ఉపయోగపడుతుంది. షిన్కాన్సెన్ రైళ్ళలో సీటు రిజర్వ్ చేసుకుందుకు కూడా ఆ పాస్ ఉపయోగిస్తుంది. ఎక్కువ ప్రయాణం చేసేవాళ్లకి పాస్ చాలా ఉపయోగకరం. నేను వారం రోజుల పాస్ తీసుకున్నాను. వీసా, రైలు టికెట్ తర్వాత చూసుకోవల్సింది ఎక్కడ ఉండాలన్నది. ఒక్కళ్ళమే ప్రయాణం చేస్తున్నప్పుడు హŸటళ్ళలో కాకుండా హాస్టళ్లలో ఉండడం మంచిది. హాస్టళ్ళలో ఉంటే – మనలాగే ప్రయాణాలు చేసే వాళ్లని కలవచ్చు. ఒక్కోసారి వాళ్లతో కలిసి కొన్ని ప్రదేశాలు చూడచ్చు. అదీకాక హాస్టళ్ళు సురక్షితంగా అనిపిస్తాయి. అద్దెలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. నేను ఒక్కదాన్నే ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు హాస్టళ్లలో ఉండటమే మంచిదనిపిస్తుంది. నేనంతకు ముందు కొన్ని చోట్లకి సోలోగా ప్రయాణం చేశాను కానీ పది రోజులు ఒంటరిగా వెళ్ళడం జపాన్‌తోనే మొదలైంది. టోక్యో నరీతా విమానాశ్రయంలో దిగడంతో నా జపాన్ పర్యటన మొదలైంది. విమానాశ్రయం నుండి ట్రైన్ ఎక్కి అసకుసలో ఉన్న నా బసకు చేరుకున్నాను. అక్కడ నా గది మూడు గోడలకీ, అల్మైరాకీ మధ్యన ఉన్న ఒక పడక. ఐతే అందులో టీవీ, స్టొరేజ్, సేఫ్ లాంటి సౌకర్యాలతో పాటు నిత్యావసరాలకి అవసరమైన కిట్ కూడా ఉంది, పైజామాతో సహా. నేను ఆ హాస్టల్ ఎంచుకున్నది ప్రధాన కారణం అది సెన్సోజీ ఆలయానికి దగ్గరగా ఉండడం. మనం వెళ్ళే ఊళ్ళలో ఉండే ప్రధాన పర్యాటక ప్రదేశాలకి దగ్గరగా మనం ఉంటే మనకి సమయం బాగా కలిసి వస్తుంది. నేను నా బసకి చేరుకున్నది సాయంత్రం. సూర్యాస్తమయం తొందరగా అయిపోవడం వల్ల చీకటిలో దీపాల కాంతిలో ఆ గుడిని నేను చూశాను. ఆ గుడి చాలా పురాతనమైనది. ఎంతో ప్రసిద్ధమైనది. మర్నాడు నేను ఇషికావా ప్రాంతంలో ఉన్న కనజావాకి వెళ్ళాను. బుల్లెట్ రైలులో అదే నా మొదటి ప్రయాణం. రైలు అందమైన ప్రకృతి మధ్య వేగంగా సాగిపోయింది. కనజావాలో నేనో బొతిక్ హాస్టల్లో ఉన్నాను. సమురై డిస్ట్రిక్ట్ గా పేరుగాంచిన నాగామాచీ నన్ను శతాబ్దాల వెనకటి రోజుల్లోకి తీసికెళ్ళింది. అలానే హిగషి ఛాయా డిస్ట్రిక్ట్ లో గీషా (టీ వేడుక) గొప్ప అనుభవం. రాత్రి హాస్టల్లో గడిపి రెండోరోజు ఉదయమే – అక్కడున్న వనాల్లో తిరగడానికి వెళ్లాను. ఉదయం వెళ్తేనే ప్రకృతిæ రమణీయత బాగా ఆస్వాదించగలం. చెట్లనీ, రాలుతున్న ఆకుల్నీ, సరస్సుల్నీ తనివితీరా చూసి, దగ్గర్లోనే ఉన్న కానజావా కోటని కూడా చూశాను. కానజావా నుండి క్యోటోకి వెళ్లాను. ఆ దారిలో బుల్లెట్ రైలు లేదు. అందుకని థండర్ బర్డ్ అనే ఎక్స్ప్రెస్స్ రైల్లో ప్రయాణం చేసాను. దారిలో జపాన్ పల్లెటూరి వాతావరణం చూడగలిగాను. క్యోటోలో నేను సాంప్రదాయకమైన అతిథి గృహంలో ఉన్నాను. అలా ఉండడం వల్ల జపాన్ సంస్కృతి తెలుసుకోవచ్చు. ఆ సాయంత్రం యునెస్కో చేత ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన కియోమిజుదేరా ఆలయాన్ని చూశాను. ఆ సమయంలో శిశిరపు ప్రత్యేక దీపాలంకరణ అద్భుతంగా అనిపించింది. క్యోటోలో లోకల్ బస్ పాస్ కొనుక్కుని ఉదయమే బంగారు భవనం అని పిలవబడే కిన్కాకుజీ ఆలయానికి వెళ్లాను. ఆ తర్వాత క్యోటోలో ఎక్కువగా ఫొటోగ్రాఫులకెక్కే అరషియామా వెదురు పొదలకి వెళ్లాను. అక్కడ నడుస్తూ గాలికి వెదురు పొదల మీద నుండి శబ్దాలని వినడం శ్రవణానందకరం. అది అనుభవైకవేద్యం. అలా నడుస్తూ ఫుషిమీ ఇనారీ దగ్గర మంత్రముగ్ధుల్ని చేసే ప్రదేశాల్లో తిరిగాను. క్యోటో తర్వాత నా బస నారాలో. నారాలో ఉన్న జింకల పార్కు పక్కనే నా హాస్టల్. నాగరికతకి దూరంగా, జింకలకి దగ్గరగా ఉండడం ఓ అనుభవం. హాస్టల్లో కొందరితో కలిసి జింకల పార్కులో తిరిగాను. మర్నాడు ఉదయమే దగ్గర్లోని గుళ్ళని చూశాను. ఆ తర్వాత హిమేజీ ఆలయానికి ప్రయాణం అయ్యాను. దానికి బుల్లెట్ రైల్లో రెండు గంటల ప్రయాణం. ఐతే హిమేజీ కోట అద్భుతమైంది. అంతేకాదు. శిధిలమైపోకుండా ఉన్న కొన్ని కోటల్లో అది ఒకటి. తర్వాత తోదైజీ ఆలయానికి వెళ్ళాను. నేనెన్నో బౌద్ధాలయాలకి వెళ్ళాను కానే అవన్నే తొదైజీ బౌద్ధ మందిర వైభవానికి సాటి రావనిపించింది. ఆ ఆలయ దర్శనం తర్వాత నారా జింకలపార్కులో గడిపాను. నారాలో రెండురోజులూ ఆనందంగా సమయం తెలియకుండా గడిచిపోయింది. అక్కడ నుండి మళ్ళీ టోక్యోకి బుల్లెట్ రైల్లో ప్రయాణమయ్యాను. క్యోటో నుండి టొక్యోకి వెళ్తోంటే దార్లో మౌంట్ ఫుజీ కనిపిస్తుంది. నాకు తెలిసిన జపనీస్ ఙ్ఞానంతో నేను క్యోటో టికెట్ ఆఫీసులో, నేనెటు కూచుంటే ఫుజీ కనిపిస్తుందో కనుక్కుని రైల్లో అటుపక్క కిటికీ సీట్ సంపాదించాను. అలా మంచు నిండిన అగ్నిపర్వతం ఫుజీని స్పష్టంగా చూడగలిగాను. ఈసారి టోక్యోలో నేను ఉన్న హాస్టల్ అంతా ఆడవాళ్ళకే. అంతకు ముందున్న హాస్టళ్ళలో నేనున్న గదులు మాత్రం ఆడవాళ్లకి ఉండేవి. ఇన్నాళ్ళూ ప్రకృతి అందాన్నీ, గత వైభవ చిహ్నాలనీ చూస్తున్న నాకు టోక్యోలో ఆధునికత కొట్టొచ్చినట్లు కనిపించింది. గింజా, షిన్కూజూ, షిబూయా, అకిహాబరాలలో ఎలక్ట్రానిక్, ఎనిమే, మాంగా కొట్లు కొత్త వస్తువులతో వెలిగిపోతూ ఉండడం చూశాను. అలానే జపాన్ పెన్నులకీ ఇంకులకీ ప్రసిద్ధి. నేనిప్పటికీ ఇంకు పెన్నులు వాడతాను. అవి కొన్ని కొనుక్కున్నాను. ఆ తర్వాత కామాకురలో బౌద్ధాలయం చూశాను. పక్కనే పసిఫిక్ మహాసముద్రం దగ్గరకెళ్ళాను కానీ, చాలా చల్లగా ఉండడంతో నీళ్లలోకి దిగలేదు. ఆహరం గురించి ప్రస్తావించుకోకుండా జపాన్ పర్యటన ముచ్చటని ముగించలేం. పూర్తి శాకాహారిని కాబట్టి నాకు ఆహారం కష్టం అవుతుందని నేను భయపడ్డాను కానీ, వీగన్ రెస్టారెంట్లు ఎక్కువగానే ఉండడం వల్ల పెద్ద నగరాల్లో సమస్య లేకపోయింది. పెద్ద నగరాలు కాని చోట్ల కూడా గ్రాసరీలలో బన్నులూ, బ్రెడ్డులూ లాంటివి దొరుకుతాయి. ఐతే చూడ్డానికి శాకాహరంలా కనిపించే వస్తువుల్లో శాకాహారం కానివి ఏవైనా చేరి ఉంటాయా అన్నది చూసుకుంటూ ఉండాలి. ఐతే ఆహారం యాప్స్ ద్వారా చాలా విషయాలు ముందుగానే తెలుసుకోవచ్చు కాబట్టి నాకు బానే గడిచింది. నారాలో ఒకరోజు ఉదయం ఐదు గంటలకి నాకు హాట్ చాకొలేట్ దొరికింది కూడా. జపాన్‌లో అన్నిటి కన్న ముఖ్యం భాష. అక్కడ చాలా మందికి ఇంగ్లిష్ రాదు. నేను జపాన్ వెళ్దామని అనుకున్న తర్వాత కొంచెం జపనీస్ నేర్చుకున్నాను. అది కొంత ఉపయోగపడింది. ఐతే అనువాద యాప్స్ ఎక్కువ వచ్చాయి. వాటిని వాడుతూ అన్ని చోట్లా పనులు చేసుకున్నాను. అంతేకాదు. జపాన్‌లో చాలామంది వాళ్లకి భాష రాకపోయినా మనకి సాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. హడావిడి పడకుండా నేను అడిగిన దాన్ని అర్థం చేసుకుందుకు ప్రయత్నించారు. వాళ్లలో చాలా మందికి భారతదేశం అంటే అభిమానం ఉన్నట్లు అనిపించింది. నాతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ఓ పదిరోజులు ఆ దేశం ఆత్మీయపూర్వకమైన ఆతిథ్యం చవిచూడడం మరిచిపోలేని అనుభవం. ఇంకో జపాన్ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను. – అపరాజిత అల్లంరాజు(రచయిత్రి అమెరికాలో ఎమ్మెస్ చేసి యాపిల్‌లో పని చేసి భారతదేశం వచ్చేసి ప్రస్తుతం ఇండిపెండెంట్ కన్సల్టన్ట్ గా పనిచేస్తోంది) -
నాన్నకు శ్రద్ధతో..
నాన్నా నువ్వంటే ఇష్టం. నీ కబుర్లు ఎన్నో వింటున్నాను. ప్రతిసారీ నువ్వు కొత్తగా అర్థమవుతున్నావు. స్కూలు మ్యాగజైన్లో నా తొలి వ్యాసం ‘మై డాడీ... మై హీరో’. ఆ ఇష్టం రోజు రోజుకీ పెరిగిపోతోంది. నేను తెలుసుకున్న నిన్ను అక్షరాల్లో చూపించాను. ఆ పుస్తకం పేరు ‘అవర్ బబ్లూ... ద హీరో ఆఫ్ ద్రాస్’. నీ సాహసానికి ప్రతిరూపం అది. నీ గురించిన జ్ఞాపకాల ప్రతిబింబం కూడా. నాన్నా! నీకు బెంగవద్దు. నువ్వు కోరుకున్నట్లే పెరుగుతాను. ఇట్లు... నీ మౌగ్లీ. ఇది అపరాజిత తన తండ్రికి రాసిన ఉత్తరంలోని సారాంశం. నాన్నను చూళ్లేదు. నాన్న ఆత్మ తెలుసు. అపరాజిత కడుపులో ఉండగానే.. నాన్న కార్గిల్‌లో అమరుడయ్యాడు. కూతురి జ్ఞాపకాల్లో జీవించే ఉన్నాడు. ఇండియా–పాకిస్థాన్. ఒకప్పుడది సమైక్య భారతం. ఇప్పుడవి ఇరుగు పొరుగు దేశాలు. ఇరుగు– పొరుగు అనే అందమైన మాట వెనుక అంతర్లీనంగా అప్పుడప్పుడు ఘర్షణ కూడా ధ్వనిస్తూ ఉంటుంది. ఇరుదేశాల సైనికులూ ఒకరి మీద మరొకరు పైచేయి సాధిస్తూ తమ తమ దేశాల పతాకాలకు సగర్వంగా సెల్యూట్ చేస్తుంటారు. అలాంటి సెల్యూట్లలో ఒకటి 1999లో చేశారు మన సైనికులు. ఆనాడు దేశమంతటా ‘ఆపరేషన్ విజయ్’ సంబరాలు చేసుకుంది. కశ్మీర్‌లోని కార్గిల్‌లో రెండునెలల మూడువారాల రెండు రోజుల పోరాటం.. ఆ ఏడాది మే 3వ తేదీ మొదలైంది, జూలై 26తో ముగిసింది. భారత సైనికులు విజయ పతాకం ఎగురవేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా సంతోషంలో మునిగిపోయింది. ఇక్కడ హైదరాబాద్, హస్తినాపురంలోని మేజర్ పద్మపాణి ఆచార్య కుటుంబంలో ప్రతి ఒక్కరి కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. ఏడు నెలల గర్భిణి చారులత తన పొట్టను నిమురుతూ ‘మీ నాన్న గెలిచాడు కన్నా’ అని చెప్పింది. వింగ్ కమాండర్ జగన్నాథాచార్య తన కొడుకు ఫొటోను చూస్తూ ‘నీ సేవలు వృథా కాలేదు పాణీ’ అనుకున్నాడు. ‘దేశవిజయం కోసం అమరుడైన వీరుడివి నువ్వు. నీకు ఓటమి లేదు. నీ బిడ్డకు పరాజయం ఉండదు. నువ్వు సంతోషపడేలా పెంచుతాను నీ బిడ్డను’ అని కొడుకు ఫొటో చూస్తూ మౌనంగా తనలో తానే అనుకుంది తల్లి విమలాచార్య. సెప్టెంబర్ 14వ తేదీ పుట్టింది అపరాజిత. పద్మపాణి ఫొటోముందు నిలబడి ‘అన్నయ్యా! నీ బిడ్డ తండ్రిలేనిది కాదు, నేనున్నాను’ అని అన్నయ్య షర్ట్ వేసుకుని హాస్పిటల్కెళ్లింది మహా వీర చక్ర మేజర్ పద్మపాణి ఆచార్య చెల్లెలు ఆమ్రపాలి. కార్గిల్ యుద్ధసమయంలో మేజర్ పద్మపాణి ఆచార్య కశ్మీర్లో ఇన్ఫాంట్రీ ఆఫీసర్‌గా విధుల్లో ఉన్నారు. కార్గిల్‌లో యుద్ధవాతావరణం అలముకొని ఉందని మాత్రమే తెలుసు దేశానికి. యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితిని అంచనా వేస్తున్నారు నిపుణులు. యుద్ధం జరుగుతోందని ఏ దేశమూ ప్రకటించలేదు. దాడులైతే జరుగుతూనే ఉన్నాయి. జూన్ 21వ తేదీన పద్మపాణి ఆచార్య ఇంటికి ఫోన్ చేశారు. తన పుట్టినరోజునాడు కుటుంబ సభ్యులతో శుభాకాంక్షలు చెప్పించుకోవడానికి చేసిన ఫోన్ కాల్ అది. యుద్ధక్షేత్రం నుంచి నెలకో, రెండు నెలలకో సాధ్యమైనప్పుడు ఒక్కఫోన్ రావాల్సిందే తప్ప, జవానుల కుటుంబసభ్యులు అక్కడికి ఫోన్ చేయడం కుదరదు. మొబైల్ ఫోన్లు లేని రోజులవి. శాటిలైట్ ఫోన్లో ఒకటి– రెండు నిమిషాలు మాట్లాడడమే ఎక్కువ. ఆ రోజు పద్మపాణికి ఇంట్లో అందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఇంట్లోవాళ్లతో ‘ప్రే ఫర్ ద యూనిట్’ అని ఆయన ఆ రోజు చెప్పిన మాటను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు వాళ్లు. పద్మపాణి మాటలతో వాళ్లకు యుద్ధం గురించి స్పష్టత వచ్చింది. ‘అప్పుడు కూడా తనకోసం ప్రార్థించమని చెప్పలేదు, తన యూనిట్ కోసం ప్రార్థించమని కోరాడు’ అని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఎనిమిదో రోజు వార్ ఫీల్డ్ నుంచే మరో ఫోన్. ఈసారి పద్మపాణి నుంచి కాదు, ఆర్మీ ఆఫీసర్ నుంచి. ఆ ఫోన్‌కాల్‌ని చారులత రిసీవ్ చేసుకున్నారు. ‘పద్మపాణి భార్యను’ అనగానే ఫోన్ కట్ అయింది. ఐదు నిమిషాల్లోనే మళ్లీ ఫోన్. ఈ సారి పద్మపాణి తల్లి విమల తీశారు. దేశమాత కోసం పద్మపాణి అమరుడయ్యాడని తెలిసింది. అపరాజిత ఇవేవీ చూడలేదు, కానీ తాను చూసినట్లే ప్రతి సంఘటననూ కళ్లకు కట్టినట్లు పుస్తకం రాసింది. ఆఖరుకి నానమ్మ తనను ఎత్తుకుని ‘నీ బిడ్డకు ఓటమి ఉండదు’ అంటూ అపరాజిత అని పేరు పెట్టడం కూడా. నానమ్మ చెప్పిన ప్రతి కథలోనూ హీరో తన తండ్రే. ‘అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు’ అని మనుమరాలిని దగ్గరకు తీసుకుంటూ కొడుకు చిన్నప్పుడు చేసిన అల్లరి పనులన్నీ చెప్పేదామె. పద్మపాణి ప్రేమకథతోపాటు అతడి వీరోచిత సంఘటనలనూ చెప్పేది. ఆటో మీటరు అరవై రూపాయలు తిరిగితే ‘పోనీలే ఖాళీగా తిరిగి వెళ్లాలి కదా’ అని మరో వంద కలిపి నూట అరవై రూపాయలిచ్చిన సందర్భాల నుంచి.. దసరా ఉత్సవాల్లో ధోవతి, కుర్తా ధరించి పాదాభివందనం చేసిన వాళ్లను ఆశీర్వదించడం వరకు పద్మపాణి చేసిన ప్రాక్టికల్ జోక్స్‌తో సహా ప్రతిదీ పూసగుచ్చేది విమలాచార్య. వాటన్నింటినీ ‘అవర్ బబ్లూ... హీరో ఆఫ్ ద్రాస్’ పేరుతో అక్షరబద్దం చేసింది అపరాజిత. ఈ పుస్తకాన్ని అమ్మ, చిన్నాన్న, మేనత్తలు, నానమ్మ, తాతయ్యల జ్ఞాపకాలతో రాసింది. గత ఏడాది పద్మపాణి జయంతి రోజున ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఈ ఏడాది తండ్రి జయంతికి మరో కొత్త ఆలోచనను తెర మీదకు తెచ్చింది అపరాజిత. ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్’కి విరాళమిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. నానమ్మ 2011లో స్థాపించిన ‘మేజర్ పద్మపాణి ఫౌండేషన్’ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఫండ్ రైజింగ్ పోగ్రామ్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని తాజ్‌బంజారాలో జరిగే డోనర్స్ డిన్నర్‌కి దాదాపుగా 150 మంది దాతలు హాజరు అవుతున్నారు. పద్మపాణి కోర్స్మేట్లు, యూనిట్లో సహ అధికారులు వస్తున్నట్లు చెప్పింది అపరాజిత. తన తండ్రి స్మారకార్థం చేస్తున్న ఈ కార్యక్రమంలో వాళ్లు తమ జ్ఞాపకాలను పంచుకుంటారని, తనకు తండ్రి గురించి మరికొన్ని సంగతులు తెలుస్తాయని సంబరపడుతోంది. ‘‘ఉత్తరాల్లో నాన్నను చూశాను, అక్షరాల్లో నాన్నేమిటో తెలుసుకున్నాను. నాన్న మా మధ్య ఉన్నారు. మాతో ఉన్నారు. ప్రపంచానికి నాన్న గురించి చెప్పడానికి ఇంకా ఎన్నో చేస్తాను’’ అంది అపరాజిత. తల్లి చారులతతో అపరాజిత మా నాన్న హీరో నేను చూసింది నాన్న ఫొటోను మాత్రమే. అయితే నాన్న గురించిన ప్రతి చిన్న సంఘటన కూడా తెలుసు. నాన్న నాతో ఉన్నారనే భావనలోనే పెరిగాను. నేను నాన్నతో మాట్లాడతాను కూడా. నా పోషణ, పెంపకం నాన్న పెన్షన్‌తోనే. మరి నాన్న లేడని ఎలా అనుకోగలను. కళ్ల ముందు కనిపించకపోయినంత మాత్రాన లేనట్లు కాదు. నా దృష్టిలో మా నాన్న గొప్ప హీరో. – అపరాజిత, అమరవీరుడు మేజర్ పద్మపాణి ఆచార్య కుమార్తె మా బిడ్డే అపరాజిత పుట్టినప్పుడు తొలిసారి ఎత్తుకున్నది నేనే. తనకు అన్నప్రాశన, చెవులు కుట్టడం, అక్షరాభ్యాసం... అన్నీ నా ఒడిలోనే జరిగాయి. అపరాజితకు తండ్రిగా మా అన్నయ్య చేయాల్సిన కార్యక్రమాలన్నీ నేనే చేశాను. బాధలో ఉన్న మా వదిన చారులతకు ఇబ్బంది కలగకుండా అపరాజిత పనులు నేనే చేసేదాన్ని. నా పెళ్లయిన తర్వాత నా భర్త కూడా అపరాజితను సొంత బిడ్డలాగే చూస్తున్నారు. అపరాజిత, నాకు పుట్టిన పాపాయి ఇద్దరూ మాకు బిడ్డలే. ఈ పిల్లలిద్దరికీ నేను, చారులత ఇద్దరం తల్లులం. అపరాజిత పుట్టకముందే తండ్రిని కోల్పోయింది అనుకుంటారు. కానీ తనిప్పుడు ఇద్దరు తండ్రులు, ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ. – ఆమ్రపాలి, అపరాజిత మేనత్త – వాకా మంజులారెడ్డి ఫొటోలు: జి. అమర్ -
అపరాజిత
ఆమె పేరు అపరాజిత. పరాజయం అన్నదే లేకుండా... జీవితం అంతా విజేతగా ఉండాలని కోరుతూ...తల్లిదండ్రులు పెట్టిన పేరు అది. ప్రేమించి పెళ్లాడిన భర్త... ప్రేమకు ప్రతిరూపంగా పిల్లలు. ఇంతలోనే ఆమెను పరాజయం వెంటాడింది... భర్తను ఎవరో చంపేశారు... చంపింది నువ్వే అన్నది న్యాయస్థానం. పదమూడేళ్లు జైలులో మగ్గి, న్యాయం కోసం అపరాజిత పోరాటం చేసింది. ‘వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’... ఇది మన న్యాయవ్యవస్థ నమ్మే సిద్ధాంతం. ఒక నిర్దోషి పదమూడేళ్లు జైల్లో గడిపిన తర్వాత న్యాయదేవత కళ్లు తెరిస్తే ఎలా ఉంటుంది? అపరాజిత జీవితంలాగే ఉంటుంది. పదమూడేళ్ల క్రితం ఆమె జీవితంలో హఠాత్తుగా అంధకారం అలముకుంది. భర్త కునాల్బోసును అతడి స్నేహితుడు, వ్యాపారంలో భాగస్వామి అయిన కల్యాణ్రాయ్ చంపేశాడు. ఇందులో కోడలి ప్రమేయం ఉందేమోనని అపరాజిత అత్త అనూరాధ అనుమానం. అంతే! కోడలి మీద కేసు పెట్టింది. ఇదేమీ అపరాజితకు తెలియదు. భర్తపోయిన దుఃఖంతో కన్నీళ్లు తప్ప కంటి మీద కునుకు లేని అపరాజిత... ఒకరోజు మధ్యాహ్నం ఐదేళ్ల పెద్ద కొడుకుని పక్కన పడుకోబెట్టి, మూడున్నరేళ్ల చిన్న కొడుకుని చేతుల్లో నిద్రపుచ్చుతోంది. ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆమెను బయటకు లాక్కు వచ్చి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాక్ష్యాలేవీ ఆమెకు సహకరించలేదు. ‘భర్త హత్యలో నా ప్రమేయం ఏమీ లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త దూరం కావడంతో నా ప్రాణమే పోయినట్లుంది’ అని ఆమె తన మనోవేదన తెలియచేయాలంటే వినేవాళ్లు లేరు. పోనీ నిరూపించాలంటే మనసు చెప్పే మాట కాదు భౌతికంగా ఆధారాలు కావాలంటుంది న్యాయవ్యవస్థ. కింది కోర్టులో పొరపాటు జరిగిన విషయాన్ని పదమూడేళ్ల తర్వాత ఇటీవల గుర్తించింది కలకత్తా హైకోర్టు. పద్నాలుగేళ్ల శిక్షాకాలంలో అప్పటికే పదమూడేళ్లు పూర్తయ్యాయి. అలా విడుదలైన ఒక నిరపరాధి అపరాజిత. జైల్లో ఉన్న పదమూడేళ్లలో అత్తింటివారెవరూ అపరాజితను చూడడానికి రాలేదు, ఆమెకు పిల్లల్ని కూడా చూపించలేదు. పైగా పిల్లలకు అమ్మ అంటే నాన్నను చంపిన హంతకి అనే విముఖతను రంగరించి పోశారు. ఇప్పుడు అపరాజిత పేరుకు తగ్గట్లుగానే న్యాయంతో పోరాడి పరాజయాన్ని జయించి విజయం సాధించింది. కానీ ఆమె కొడుకులు ఇప్పుడు చిన్న పిల్లలు కాదు. నానమ్మ పెంపకంలో అమ్మ మీద గొంతు వరకు కోపాన్ని నింపుకున్న టీనేజ్ యువకులు. ‘మాకు అమ్మ లేదు, అమ్మానాన్న లేక నానమ్మ పెంపకంలో పెరిగిన పిల్లలం. మా జీవితంలో అమ్మ అనే పదానికి తావే లేదు. మేము స్కూలుకెళ్లేటప్పుడు మా తోటి పిల్లలను వాళ్ల అమ్మానాన్నలు చేయిపట్టుకుని తీసుకువచ్చే వాళ్లు. అలా చూసిన ప్రతిసారీ మాకు అమ్మలేదు అనుకునే వాళ్లం. ఇప్పుడు అమ్మ ఉంది అనుకోవడం కుదరదు’ అన్నాడు పద్ధెనిమిదేళ్ల అబ్రనీల్. అన్న ఆరోపణలతో గొంతు కలిపాడు తమ్ముడు సౌరనీల్. అసలేం జరిగింది? అపరాజిత బోసు కోల్‌కతాలోని మధ్య తరగతి మహిళ. లోరెటో కాన్వెంట్లో పన్నెండో తరగతి చదువుతున్న రోజుల్లో 1989 మే 14వ తేదీన తన స్నేహితురాలి, స్నేహితుల ద్వారా కునాల్ బోసు పరిచయమయ్యాడు. అది ప్రేమగా మారి 1992 జనవరి 24వ తేదీన దంపతులయ్యారు. ఇది సుతరామూ గిట్టని వ్యక్తి అపరాజిత అత్తగారు అనూరాధా బోసు మాత్రమే. తమ స్థాయికి తగిన సంబంధంతో ుుని కోడలిగా ఇంటికి తీసుకురావడాన్ని సహించలేకపోయింది. అలాంటి వాతావరణంలోనే అత్తగారింట్లో ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. అది 2000 మే నెల 23వ తేదీ. ఎప్పటి లాగానే కునాల్ బోసు మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్‌గా తన ఉద్యోగానికి వెళ్లాడు. సాయంత్రం ఫోన్ చేసి ‘స్నేహితులతో డిన్నర్ ఉంది, ఆలస్యంగా వస్తాను’ అన్నాడు. కానీ చెప్పినట్లు రాలేదు. మూడు రోజుల తర్వాత తీవ్రమైన గాయాలతో అతడి దేహం ఒక గుంటలో కనిపించింది. ‘స్నేహితుడు కల్యాణ్ రాయ్ తనను చంపడానికి ప్రయత్నించాడ’ని చెప్పి తుదిశ్వాస విడిచాడు కునాల్. ఈ మరణవాంజ్ఞ్మూలాన్ని సమాజం ఒప్పుకుంది కానీ అనూరాధా బోసు ఒప్పుకోలేదు. ఫలితంగా అపరాజిత జీవితం జైలుపాలయింది. ఒక అమాయకురాలు అన్యాయంగా జైలు జీవితాన్ని అనుభవించింది అని న్యాయమూర్తి ఆవేదన చెందారు కానీ అత్త అనూరాధలో లేశమాత్రమైనా ఆ భావన కలగడం లేదనడానికి నిదర్శనం పిల్లలను అపరాజితకు దగ్గర కానివ్వకుండా అడ్డుకోవడమే. అపరాజిత నిర్దోషి అని న్యాయస్థానం గుర్తించింది. కానీ ఆమె కోల్పోయిన 13 ఏళ్ల విలువైన కాలం ఆమెకు తిరిగిరాదు. పిల్లల అల్లరిచేష్టలకు మురిసిపోయే ఆనంద క్షణాలను ఆమె కోల్పోయింది. పిల్లలిద్దరూ తల్లి ఒడి మాధుర్యం తెలియని నిరాశలోనే పెద్ద య్యారు. పిల్లల ప్రేమకోసం, తల్లి స్థానం కోసం తల్లడిల్లిపోతున్న ఈ మాతృమూర్తి విజేతగా నిలుస్తుందా? పిల్లల మనసు గెలుస్తుందా? న్యాయం నా వైపే..! జైలు నుంచి బయటకు వచ్చిన నాకు ఎదిగిన కొడుకులను అక్కున చేర్చుకుని, బాధ తీరే వరకు కన్నీళ్లు కార్చే అవకాశం కూడా లేకపోయింది. ఇప్పటి వరకు న్యాయం కోసం ఎదురు చూశాను, ఇప్పుడు నా పిల్లల మనసు మారడం కోసం ఎదురుచూస్తాను. న్యాయం నా వైపే ఉంది. నా పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడడం నేర్చుకున్న తర్వాత నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది.