మహిళలపై నేరాలకు మరణ శిక్షే | West Bengal Assembly passes Aparajita Bill unanimously | Sakshi
Sakshi News home page

మహిళలపై నేరాలకు మరణ శిక్షే

Published Wed, Sep 4 2024 3:24 AM | Last Updated on Wed, Sep 4 2024 3:24 AM

West Bengal Assembly passes Aparajita Bill unanimously

‘అపరాజిత’ బిల్లుకు బెంగాల్‌ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం 

ఈ బిల్లు చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి మమత ఉద్ఘాటన  

కోల్‌కతా: మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించడానికి ఉద్దేశించిన ‘అపరాజిత’ బిల్లుకు పశి్చమ బెంగాల్‌ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘అపరాజిత మహిళ, బాలలు(పశి్చమ బెంగాల్‌ చట్టాలు, సవరణ) బిల్లు–2024’ను రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి మలోయ్‌ ఘటక్‌ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార, విపక్ష సభ్యులంతా బిల్లుకు అంగీకారం తెలిపారు. బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ తిరస్కరించింది.

మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారి మరణానికి లేదా జీవచ్ఛవంగా మారడానికి కారణమైన దోషులకు మరణ శిక్ష లేదా పెరోల్‌కు వీల్లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా అపరాజిత బిల్లును పశి్చమ బెంగాల్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలపై నేరాల కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, సత్వరమే కోర్టు నుంచి తీర్పు వచ్చేలా బిల్లులో నిబంధనలు జోడించారు. మహిళలు, చిన్నారులకు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా అత్యాచారాలు, లైంగిక నేరాలకు సంబంధించి ఇప్పుడున్న చట్టంలో కొన్ని మార్పులు చేశారు, కొత్త అంశాలు చేర్చారు.

కోల్‌కతాలోని ఆర్‌.జి.కర్‌ ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులకు మరణ శిక్ష విధించేలా కఠినమైన చట్టం తీసుకొస్తామని పశి్చమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అపరాజిత బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించడం కోసమే రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు.  

మోదీ, అమిత్‌ షా రాజీనామా చేయాలి: సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌   
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టని ముఖ్యమంత్రులంతా పదవులకు రాజీనామా చేయాలని పశి్చమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. మంగళవారం అసెంబ్లీలో అపరాజిత బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించి, బాధితులకు సత్వరమే న్యాయం చేకూర్చేలా చట్టాల్లో సవరణలు చేయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే తామే మొదట చొరవ తీసుకున్నామని తెలిపారు.

అపరాజిత బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. ఇది మొత్తం దేశానికి ఒక రోల్‌మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీకి తాను రాసిన రెండు లేఖలను ఆమె సభ ముందుంచారు. మహిళలు, చిన్నారులకు భద్రత కలి్పంచేలా చట్టాలను అమలు చేయడంలో విఫలమైన పాలకులంతా పదవుల నుంచి తప్పుకోవాలని తేలి్చచెప్పారు.  ఇదిలా ఉండగా, జూనియర్‌ డాక్టర్‌ హత్యకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని సభలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బిగ్గరగా నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో మహిళలపై అధికంగా నేరాలు జరుగుతున్నాయని తిప్పికొట్టారు.

ఏమిటీ అపరాజిత బిల్లు?
భారతీయ న్యాయ సంహిత, నాగరిక్‌ సురక్ష సంహితతో పాటు పోక్సో చట్టానికి కూడా పశి్చమ బెంగాల్‌ ప్రభుత్వ అపరాజిత బిల్లు సవరణలను ప్రతిపాదించింది. ‘‘అత్యాచారం, అత్యాచారం–హత్య, సామూహిక అత్యాచారం, బాధితుల గుర్తింపు బయటపెట్టడం, యాసిడ్‌ దాడి వంటి నేరాలకు విధించే శిక్షలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66, 70(1), 71, 72(1), 73, 124(1), 124(2)ను సవరించాలి. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలి’’ అని పేర్కొంది.

‘‘అత్యాచారం కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 21 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. తగిన కారణాలుంటే మరో మూడు వారాలు పొడిగించవచ్చు. దోషులకు మరణ శిక్షతో పాటు జరిమానా లేదా ఆజన్మ ఖైదు (మరణించేదాకా) విధించాలి. మహిళలపై నేరాలకు సంబంధించిన కోర్టు కార్యకలాపాలను, కేసు విచారణ వివరాలను అనుమతి లేకుండా ప్రచురిస్తే 3 నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలి. దర్యాప్తు కోసం డీఎస్పీ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలి. దర్యాప్తు వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కోర్టును, దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి’’ అని అపరాజిత బిల్లు ప్రతిపాదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement