అపరాజిత
ఆమె పేరు అపరాజిత. పరాజయం అన్నదే లేకుండా... జీవితం అంతా విజేతగా ఉండాలని కోరుతూ...తల్లిదండ్రులు పెట్టిన పేరు అది.
ప్రేమించి పెళ్లాడిన భర్త... ప్రేమకు ప్రతిరూపంగా పిల్లలు. ఇంతలోనే ఆమెను పరాజయం వెంటాడింది... భర్తను ఎవరో చంపేశారు... చంపింది నువ్వే అన్నది న్యాయస్థానం. పదమూడేళ్లు జైలులో మగ్గి, న్యాయం కోసం అపరాజిత పోరాటం చేసింది.
‘వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’... ఇది మన న్యాయవ్యవస్థ నమ్మే సిద్ధాంతం. ఒక నిర్దోషి పదమూడేళ్లు జైల్లో గడిపిన తర్వాత న్యాయదేవత కళ్లు తెరిస్తే ఎలా ఉంటుంది? అపరాజిత జీవితంలాగే ఉంటుంది.
పదమూడేళ్ల క్రితం ఆమె జీవితంలో హఠాత్తుగా అంధకారం అలముకుంది. భర్త కునాల్‌బోసును అతడి స్నేహితుడు, వ్యాపారంలో భాగస్వామి అయిన కల్యాణ్‌రాయ్ చంపేశాడు. ఇందులో కోడలి ప్రమేయం ఉందేమోనని అపరాజిత అత్త అనూరాధ అనుమానం. అంతే! కోడలి మీద కేసు పెట్టింది. ఇదేమీ అపరాజితకు తెలియదు. భర్తపోయిన దుఃఖంతో కన్నీళ్లు తప్ప కంటి మీద కునుకు లేని అపరాజిత... ఒకరోజు మధ్యాహ్నం ఐదేళ్ల పెద్ద కొడుకుని పక్కన పడుకోబెట్టి, మూడున్నరేళ్ల చిన్న కొడుకుని చేతుల్లో నిద్రపుచ్చుతోంది. ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆమెను బయటకు లాక్కు వచ్చి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాక్ష్యాలేవీ ఆమెకు సహకరించలేదు. ‘భర్త హత్యలో నా ప్రమేయం ఏమీ లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త దూరం కావడంతో నా ప్రాణమే పోయినట్లుంది’ అని ఆమె తన మనోవేదన తెలియచేయాలంటే వినేవాళ్లు లేరు. పోనీ నిరూపించాలంటే మనసు చెప్పే మాట కాదు భౌతికంగా ఆధారాలు కావాలంటుంది న్యాయవ్యవస్థ. కింది కోర్టులో పొరపాటు జరిగిన విషయాన్ని పదమూడేళ్ల తర్వాత ఇటీవల గుర్తించింది కలకత్తా హైకోర్టు. పద్నాలుగేళ్ల శిక్షాకాలంలో అప్పటికే పదమూడేళ్లు పూర్తయ్యాయి. అలా విడుదలైన ఒక నిరపరాధి అపరాజిత.
జైల్లో ఉన్న పదమూడేళ్లలో అత్తింటివారెవరూ అపరాజితను చూడడానికి రాలేదు, ఆమెకు పిల్లల్ని కూడా చూపించలేదు. పైగా పిల్లలకు అమ్మ అంటే నాన్నను చంపిన హంతకి అనే విముఖతను రంగరించి పోశారు. ఇప్పుడు అపరాజిత పేరుకు తగ్గట్లుగానే న్యాయంతో పోరాడి పరాజయాన్ని జయించి విజయం సాధించింది. కానీ ఆమె కొడుకులు ఇప్పుడు చిన్న పిల్లలు కాదు. నానమ్మ పెంపకంలో అమ్మ మీద గొంతు వరకు కోపాన్ని నింపుకున్న టీనేజ్ యువకులు. ‘మాకు అమ్మ లేదు, అమ్మానాన్న లేక నానమ్మ పెంపకంలో పెరిగిన పిల్లలం. మా జీవితంలో అమ్మ అనే పదానికి తావే లేదు. మేము స్కూలుకెళ్లేటప్పుడు మా తోటి పిల్లలను వాళ్ల అమ్మానాన్నలు చేయిపట్టుకుని తీసుకువచ్చే వాళ్లు. అలా చూసిన ప్రతిసారీ మాకు అమ్మలేదు అనుకునే వాళ్లం. ఇప్పుడు అమ్మ ఉంది అనుకోవడం కుదరదు’ అన్నాడు పద్ధెనిమిదేళ్ల అబ్రనీల్. అన్న ఆరోపణలతో గొంతు కలిపాడు తమ్ముడు సౌరనీల్.
అసలేం జరిగింది?
అపరాజిత బోసు కోల్‌కతాలోని మధ్య తరగతి మహిళ. లోరెటో కాన్వెంట్‌లో పన్నెండో తరగతి చదువుతున్న రోజుల్లో 1989 మే 14వ తేదీన తన స్నేహితురాలి, స్నేహితుల ద్వారా కునాల్ బోసు పరిచయమయ్యాడు. అది ప్రేమగా మారి 1992 జనవరి 24వ తేదీన దంపతులయ్యారు.
ఇది సుతరామూ గిట్టని వ్యక్తి అపరాజిత అత్తగారు అనూరాధా బోసు మాత్రమే. తమ స్థాయికి తగిన సంబంధంతో ుుని కోడలిగా ఇంటికి తీసుకురావడాన్ని సహించలేకపోయింది. అలాంటి వాతావరణంలోనే అత్తగారింట్లో ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. అది 2000 మే నెల 23వ తేదీ. ఎప్పటి లాగానే కునాల్ బోసు మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌గా తన ఉద్యోగానికి వెళ్లాడు. సాయంత్రం ఫోన్ చేసి ‘స్నేహితులతో డిన్నర్ ఉంది, ఆలస్యంగా వస్తాను’ అన్నాడు. కానీ చెప్పినట్లు రాలేదు. మూడు రోజుల తర్వాత తీవ్రమైన గాయాలతో అతడి దేహం ఒక గుంటలో కనిపించింది. ‘స్నేహితుడు కల్యాణ్ రాయ్ తనను చంపడానికి ప్రయత్నించాడ’ని చెప్పి తుదిశ్వాస విడిచాడు కునాల్. ఈ మరణవాంజ్ఞ్మూలాన్ని సమాజం ఒప్పుకుంది కానీ అనూరాధా బోసు ఒప్పుకోలేదు. ఫలితంగా అపరాజిత జీవితం జైలుపాలయింది.
ఒక అమాయకురాలు అన్యాయంగా జైలు జీవితాన్ని అనుభవించింది అని న్యాయమూర్తి ఆవేదన చెందారు కానీ అత్త అనూరాధలో లేశమాత్రమైనా ఆ భావన కలగడం లేదనడానికి నిదర్శనం పిల్లలను అపరాజితకు దగ్గర కానివ్వకుండా అడ్డుకోవడమే.
అపరాజిత నిర్దోషి అని న్యాయస్థానం గుర్తించింది. కానీ ఆమె కోల్పోయిన 13 ఏళ్ల విలువైన కాలం ఆమెకు తిరిగిరాదు. పిల్లల అల్లరిచేష్టలకు మురిసిపోయే ఆనంద క్షణాలను ఆమె కోల్పోయింది. పిల్లలిద్దరూ తల్లి ఒడి మాధుర్యం తెలియని నిరాశలోనే పెద్ద య్యారు. పిల్లల ప్రేమకోసం, తల్లి స్థానం కోసం తల్లడిల్లిపోతున్న ఈ మాతృమూర్తి విజేతగా నిలుస్తుందా? పిల్లల మనసు గెలుస్తుందా?
న్యాయం నా వైపే..!
జైలు నుంచి బయటకు వచ్చిన నాకు ఎదిగిన కొడుకులను అక్కున చేర్చుకుని, బాధ తీరే వరకు కన్నీళ్లు కార్చే అవకాశం కూడా లేకపోయింది. ఇప్పటి వరకు న్యాయం కోసం ఎదురు చూశాను, ఇప్పుడు నా పిల్లల మనసు మారడం కోసం ఎదురుచూస్తాను. న్యాయం నా వైపే ఉంది. నా పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడడం నేర్చుకున్న తర్వాత నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది.