∙పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడానికి ముందు దంపతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలియజేయగలరు. – కె.వీణ, తిరుపతి
పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడానికి ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ప్రయత్నం చేయాలి. బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలి. దాని కోసం నడక, యోగా వంటివి పాటించాలి. మితమైన పోషకాహారం తీసుకోవాలి. థైరాయిడ్, కంప్లీట్ బ్లడ్ టెస్ట్, షుగర్, బీపీ వంటి పరీక్షలు చేసుకుని, సమస్యలు ఏవైనా ఉన్నాయేమో ముందే తెలుసుకోవాలి. సమస్యలు ఉన్నట్లయితే వాటికి చికిత్స తీసుకుని, వాటిని అదుపులో ఉంచుకుని గర్భం కోసం ప్రయత్నం చేయడం మంచిది.
ఫిట్స్, కిడ్నీ, గుండె సమస్యలు ఉన్నట్లయితే, ఇంకా ఇతరత్రా సమస్యలకు మందులు వాడుతున్నట్లయితే, వాటికి డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు మందులలో మార్పులు ఉంటే చేసుకుని గర్భం కోసం ప్రయత్నం చెయ్యడం మంచిది. రుబెల్లా పరీక్ష చేయించుకుని, రుబెల్లా యాంటీబాడీస్ నెగటివ్ వస్తే, రుబెల్లా వ్యాక్సిన్ తీసుకుని నెల తర్వాత గర్భం కోసం ప్రయత్నించవచ్చు.
గర్భధారణకు మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున వాడాలి. సిగరెట్, మద్యపానం అలవాటుంటే మానేయాలి. ఏదైనా ఇన్‌ఫెక్షన్స్ ఉంటే ముందుగానే చికిత్స తీసుకోవాలి. కుటుంబంలో ఏవైనా జన్యుపరమైన సమస్యలు వంటి ఇతర సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, సలహా తీసుకుని, అవసరమైతే దంపతులిద్దరూ రక్తపరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. రక్తహీనత ఉంటే ఐరన్ మాత్రలు, థైరాయిడ్ సమస్య ఉంటే దానికి మాత్రలు వేసుకుని, అదుపులోకి వచ్చిన తర్వాత గర్భం కోసం ప్లాన్ చెయ్యడం మంచిది.
∙నా వయసు 29 సంవత్సరాలు. మర్మాగంపై పుండు ఏర్పడింది. సిఫిలిస్ అంటున్నారు. ఇది ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలు ఏమిటి?
– యన్‌ఎన్, విజయనగరం
సిఫిలిస్ అనేది ‘ట్రిపోనిమా ప్యాలిడమ్’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే లైంగిక వ్యాధి. దీనిలో మొదటగా జననేంద్రియాల దగ్గర, నోట్లోను, మలద్వారం దగ్గర నొప్పిలేని చిన్నపుండులాగ ఏర్పడుతుంది. అవి వాటంతట అవే తగ్గిపోతాయి. కాని, తర్వాత ఈ పుండ్లు దశల వారీగా శరీరమంతా పాకుతాయి. త్వరగా గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఇది నరాలకు, గుండెకు, కాలేయానికి, కీళ్లకు, ఎముకలకు, రక్తనాళాలకు పాకి వాటిని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. చికిత్స తీసుకోకపోతే ఈ బ్యాక్టీరియా జీవితకాలం శరీరంలోనే ఉండిపోతుంది.
గర్భవతులలో తల్లి నుంచి బిడ్డకు పాకి అబార్షన్లు, కడుపులోనే శిశువు చనిపోవడం, పుట్టిన పిల్లల్లో అవయవ లోపాలు ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. నిర్ధారణ కోసం వీడీఆర్‌ఎల్, ఆర్‌పీఆర్ వంటి రక్తపరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ తర్వాత పెన్సిలిన్ వంటి యాంటీబయోటిక్స్‌తో చికిత్స చేయడం జరుగుతుంది. చికిత్సలో బ్యాక్టీరియా నశించిపోతుంది. కాని,దాని వల్ల ముందుగా అవయవాలపై ఏర్పడిన దుష్ప్రభావాన్ని తిరిగి తగ్గించడం జరగదు. నివారణ మార్గాలలో అనేక లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. కండోమ్స్ వాడుకోవాలి. చికిత్స ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది.
∙నాకు కొత్తగా పెళ్లయింది. ‘వెజైనిస్మస్’ సమస్యతో బాధ పడుతున్నాను. ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం కాదని ఒకరంటే, తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలనుంటున్నారు మరొకరు. ఏది నిజం? చికిత్స ఏ విధంగా ఉంటుందో తెలియజేయగలరు.
– ఆర్‌వి, హైదరాబాద్
యోని భాగంలోని కండరాలు కొన్ని సందర్భాల్లో బిగుసుకుపోవడాన్ని వెజైనిస్మస్ అంటారు. ఇది కలయిక సమయంలో కావచ్చు. పెల్విక్ పరీక్ష చేసేటప్పుడు కావచ్చు. దాని వల్ల ఆ సమయంలో బాగా నొప్పిగా ఉండటం, కలయికకు, పరీక్షకు సహకరించకపోవడం వంటివి జరుగుతాయి. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు.
కొందరిలో నొప్పి ఉంటుందనే భయంతో, గర్భం వస్తుందనే భయంతో ఆందోళన, మానసిక సమస్యలు, జననేంద్రియాల దగ్గర దెబ్బలు, ఆపరేషన్లు, ఏవైనా లైంగిక సమస్యలు, బాల్యంలో కొన్ని సంఘటనలు చూడటం, చదవడం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చు. దీనికి చికిత్సలో భాగంగా కారణం తెలుసుకోవడానికి వారితో విడిగా మాట్లాడటం, కౌన్సెలింగ్ చెయ్యడం, మెల్లగా యోని భాగం దగ్గర పరీక్ష చేయడం వంటివి అవసరం. తర్వాత సమస్యను విశ్లేషించి, కౌన్సెలింగ్ చెయ్యడం వల్ల చాలామందిలో సమస్య తగ్గుతుంది.
ఏవైనా ఇన్‌ఫెక్షన్లు ఉంటే చికిత్స తీసుకోవడం, పెల్విక్ కండరాల వ్యాయామాలు, మానసిక ఒత్తిడి తగ్గడానికి నడక, యోగా, ధ్యానం వంటివి పాటించడం, యోని భాగంలో లూబ్రికేషన్ జెల్ వాడటం, లేదా డైలేటర్స్ వాడటం, భార్యా భర్త అన్యోన్యంగా ఉంటూ ఓపికగా కలయికకు ప్రయత్నం చేయడం వల్ల చాలామందిలో మార్పు ఉంటుంది. అరుదుగా కొద్ది మందిలో ఎలాంటి మార్పు లేనప్పుడు చిన్నగా కోసి కండరాలను వదులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా బోటిలినమ్ టాక్సిన్ (బోటాక్స్) అనే ఇంజెక్షన్ నేరుగా యోని కండరాలకు ఇవ్వడం వల్ల యోని కండరాలు వదులయ్యి వెజైనిస్మస్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్‌బో హైదర్‌నగర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment