Special story for women
-
‘ఏఐ’ పంట!.. వ్యవసాయ రంగంపై చాట్ జీపీటీ ప్రభావం ఎలా ఉండబోతుంది?
-కంచర్ల యాదగిరిరెడ్డి నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు.. యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు. ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో బాగున్నాయే అనుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం కొంత పుంజుకున్నా.. తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు. ఇలాంటి సమయంలోనే ‘చాట్ జీపీటీ’, దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా. మరి మొత్తంగా దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయానికి ఏం ఒనగూరుతుంది? అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతంపైనే. కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం రకరకాల పథకాలు, లాభాలు చేకూరుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు తక్కువే. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సరీ్వస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘జుగల్బందీ’చాట్‌బోట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ అందిస్తూండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడంకోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు. 1. ప్రిడిక్టివ్ అనాలసిస్: వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వేసిన పంట ఎంత బాగా పండేది కచి్చతంగా చెప్పగలదు. దీన్నే ప్రిడిక్టివ్ అనాలసిస్ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. 2. గరిష్టంగా దిగుబడులు: పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేíÙంచడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. 3. ప్రిసిషన్ అగ్రికల్చర్: జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే.. అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి. 4. కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే.. అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపు ణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేíÙంచి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కత్రిమ మేధ సాఫ్ట్వేర్లు వేగంగా గుర్తించగలవు. చాట్బోట్లు.. కాల్‌సెంటర్లు భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది. కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ వాట్సాప్ ఆధారిత చాట్‌బోట్ ఒకదాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ (కిసాన్ జీపీటీ)’ ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు. వాధ్వానీ ఏఐ అనే స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ కూడా జనరేటివ్ ఏఐ సాయంతో రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కిసాన్ కాల్‌సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. వ్యవసాయ రంగ నిపుణుల అనుభవాన్ని జనరేటివ్ ఏఐతో అనుసంధానించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వాధ్వానీ ఏఐ తెలిపింది. డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్‌బోట్ ద్వారా అందిస్తోంది. తెలంగాణలో ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరగా మార్కెటింగ్ చేసుకోవడానికి, తగిన ధర పొందడానికి ఇది వీలు కల్పిస్తోంది. -
"ఆమే ఒక సైన్యమై, సందేశమై.. " క్యాన్సర్ బాధితురాలి యదార్థ గాధ
‘నీ కన్నీళ్లను మోసే శక్తి నాకు లేదు’ అని నటులు ఏదో ఒక సందర్భంలో మనసులోనో, మనసు దాటో అని ఉండవచ్చు. కొన్ని పాత్రలు అలా ఉంటాయి మరి! పాత్ర పండాలంటే జీవం ఉట్టిపడాలి. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నం ఫలించకపోవచ్చు. తేలిపోవచ్చు. మరి బాధితులే నటమాధ్యమంలోకి, తమ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తే..? వారి జీవితం మన కళ్ల ముందుకు నడిచొస్తుంది. జీవం ఉట్టిపడుతుంది. పదిమందికి మంచి చేసే సందేశం వేగిరంగా అందుతుంది... ప్రియ జోషి (హైదరాబాద్) నటి, రచయిత్రి. ఆమె ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడింది. ఆ సమయంలో ప్రియ మానసిక ప్రపంచం ఏమిటో మనకు తెలియదు. ధైర్యంగా కనిపించి ఉండొచ్చు. కాని నిజంగానే ధైర్యంగా ఉందా? కళ్లలో నీటిపొరలేవీ కనిపించకపోవచ్చు. కానీ మనకు కనిపించని దుఃఖసముద్రాలు ఆమె మనసులో ఏమైనా ఉన్నాయా? తనకు క్యాన్సర్ ఉందన్న చేదునిజం తెలిసిన క్షణం నుంచి క్యాన్సర్ నుంచి బయట పడిన రోజు వరకు ఆమె హృదయం రణరంగంగా మారి ఉండవచ్చు. అక్కడ ఆశ, నిరాశలకు మధ్య ఎన్నో యుద్ధాలు జరిగి ఉండవచ్చు. ఆత్మవిశ్వాసం అనే ఆయుధం అప్పుడప్పుడూ చేజారిపోతూ ఉండవచ్చు. దాని జాడ కనిపించకుండా ఉండవచ్చు. చేజారిన ఆయుధాన్ని ఆమె కష్టపడి వెదికి పట్టుకొని ఉండవచ్చు. ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు ఒక ఏకాంకిక సమాధానం చెప్పబోతుంది. ప్రియ జోషి ఆత్మబలం, పోరాట పటిమను నితిన్ బస్రూర్ హిందీలో ‘ఔర్ షమా జల్తీ రహీ’ పేరుతో సోలో ప్లేగా మలిచారు. ఈ ప్లేలో ప్రియ జోషి తన పాత్రలో తానే నటించడానికి సన్నద్ధం కావడం ఒక విశేషం అయితే, కస్ట్యూమ్, స్టేజ్ సపోర్ట్, మ్యూజిక్, లైట్ ఆరెంజ్మెంట్లాంటి బాధ్యతలను స్త్రీలే నిర్వహించడానికి రెడీ కావడం మరో విశేషం. ఆర్మీ ఆఫీసర్ భార్యగా, కాన్సర్ సర్వైవర్‌గా తన అనుభవాలతో రెండు పుస్తకాలు రాసింది ప్రియ. గతంలో టీచర్‌గా పనిచేసిన ప్రియ ఇప్పుడు ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేస్తుంది. రంగస్థలం అనేది సృజనాత్మక వేదిక మాత్రమే కాదు...సందేశం అందే విశాల వేదిక కూడా. అంకితభావం, ఆశావహæదృక్పథం, సంకల్పబలం ఉంటే ఎంతటి జటిలమైన పరిస్థితి నుంచైనా బయటపడవచ్చు అనే సందేశాన్ని ‘ఔర్ షమా జల్తీ రహీ’ ద్వారా ఇవ్వాలన్నది ప్రియ జోషి ఉద్దేశం. నిజజీవితం నుంచి నడిచొచ్చిన కథ, నాటకంలాంటి సృజనాత్మక రూపాలకు జనాలు జేజేలు పలకడం కొత్త కాదు. అయితే ఈ సింగిల్ ప్లే మనం ప్రశంసించడానికి మాత్రమే పరిమితమైన కళారూపం కాదు. మనకు ధైర్యాన్ని ఇచ్చే ఆయుధం కూడా! -
మనీషా బొమ్మేస్తే అచ్చుపడుద్ది!
ప్రకాశం (దర్శి) : కరోనా.. ఎందరినో బలి తీసుకుంది. అదే సమయంలో కొత్త ఆలోచనలు పరుడుపోసుకునేలా చేసింది. సరికొత్త ఆవిష్కరణలకు కారణభూతంగా నిలిచింది. కొందరి ఉపాధికి గండి కొట్టింది.. మరికొందరిని జీవనోపాధి మార్గాలు వెతుక్కునేలా చేసింది. దర్శికి చెందిన మనీషా కూడా తనలోని సృజనకు కరోనా సమయంలోనే పదును పెట్టింది. బొమ్మలు గీసే తన హాబీని ఉపాధికి మార్గంగా మలుచుకుంది. తాను గీసిన బొమ్మలను తోటివారికి చూపి, వారి బొమ్మలు కూడా గీయడం.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఆర్డర్లు తీసుకుని బొమ్మలు వేయడం.. ఇలా తన కళా ప్రతిభను చాటుకుంటూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కొందరు మనీషా ప్రతిభకు ముగ్ధులై తమ చిత్రాలను పంపి బొమ్మలు గీయించుకుంటున్నారు. వాటిని కొరియర్ ద్వారా విదేశాలకు తెప్పించుకుంటున్నారు. పేర్లతో బొమ్మలు.. త్రీడీ, ఫైవ్‌డీ కెమెరాలతో తీసిన అందమైన ఫొటోలు ఫ్రేమ్ కట్టించుకుని మురిసిపోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, కాస్త విభిన్నంగా ఉండాలని కోరుకునేవారు మాత్రం చేత్తో గీసిన చిత్రాలను ఇష్టపడతారు. అలాంటి వారి బొమ్మలను గడిచిన రెండేళ్లలో మనీషా వందల సంఖ్యలో గీసింది. పెన్సిల్‌తో బొమ్మలు వేయడమే కాదు పేర్లు రాస్తూ చిత్రంగా మలచడం మనీషా ప్రత్యేకత. కరోనా సమయంలో ఉపాధి కోసం ఒక్కో చిత్రానికి రూ.200 తీసుకున్న ఆమె.. ప్రస్తుతం చిత్రం సైజును బట్టి రూ.300 నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటోంది. తన ఇంట్లోనే బొమ్మలు గీస్తూ.. పిల్లలు, పెద్దలకు చిత్ర లేఖనంపై శిక్షణ ఇస్తూ ఉపాధి పొందుతోంది. భర్త సాయికుమార్ ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి చేరుకుంటానని మనీషా ధీమాగా చెబుతోంది. -
ఆకాశంలో సగం అవకాశాల్లో శూన్యం
మన దేశంలో 54% మంది వ్యవసాయం ఆధార కుటుంబాలే. ఇందులో 80 శాతం వ్యవసాయ పనులు చేసే మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. మహిళలను, వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, సరైన వ్యవసాయ పద్ధతులు కాని, విధానాలను కాని రూపొందించక పోవటం వలన మహిళా రైతులు పడిన కష్టానికి సరిపడా ఫలితం దక్కటం లేదు. ముఖ్యంగా ఒంటరి మహిళల విషయానికి వచ్చే సరికి పరిస్థితి మరీ దారుణంగా వుంది. సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయంలో శ్రమతో కూడిన చాలా పనులు మహిళలు చేస్తున్నారు. వరిలో నాట్లు వేసే దగ్గర నుంచి, మెట్ట పంటలలో విత్తనాలు వేయటం, కలుపు తీయటం వంటి చాలా పనుల వరకూ మహిళలు ఒంగి చేయటం మనం రోజూ చూస్తుంటాం. ఈ పనులు చూడటానికి సులభంగా కనిపించినప్పటికీ, శారీరకంగా ఎక్కువ శ్రమ చేయాలి. ఈ పనులలో శ్రమ తగ్గటానికి సరిపడా పనిముట్లు లేకపోవటం చాలా పెద్ద సమస్య. వ్యవసాయంలో భారీ యాంత్రీకరణ మీదనే ఎక్కువ దృష్టి పెట్టటం వలన మహిళలు తమకున్న కొద్దిపాటి ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. అలా కాకుండా శ్రమను తగ్గించి పనిని సులభంగా చేసే పనిముట్లు చేయటంతో పాటు, మహిళలకు శిక్షణ ఇచ్చి శ్రమ సంఘాల వంటివి ఏర్పాటు చేస్తే ఉపయోగం వుంటుంది. రసాయనాల అవశేషాల బెడద వ్యవసాయంలో పురుగుల నివారణకు, కలుపు నివారణకు వాడే రసాయనాలలో విష ప్రభావంతో పాటు హార్మోన్లు కలిగి వుంటాయి. సాధారణంగా మహిళలు, చిన్న పిల్లల శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ వుండటం వలన ఈ రసాయనాల అవశేషాలు శరీరంలో నిలువ ఉండటానికి అవకాశం వుంటుంది. వీటికి తోడు హోర్మోనల్ ప్రభావం కూడా వుండటం వలన మహిళల పునరుత్పత్తి వ్యవస్థ, ఋతుచక్రంపై ప్రభావం పడుతుంది. ఈ రసాయనాల వినియోగం ఎక్కువ వున్న ప్రాంతాలలో చాలా మంది మహిళలకు గర్భసంచి తీసివేసిన వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కలుపు నివారణకు వాడుతున్న కొన్ని రసాయనాలు (గడ్డి మందు) అనేక విష ప్రభావాలు కలిగి వున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అనేక నివేదికలు తెలియచేస్తున్నాయి. అలాగే పత్తి విత్తనోత్పత్తిలో చిన్న వయసులో వున్న ఆడపిల్లలు ‘క్రాసింగ్’ పనులు చేస్తున్నప్పుడు మొక్కల మీద చల్లిన రసాయనాలలో చాలా వరకు చేతి వేళ్ళ లేత చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి విషప్రభావం చూపిస్తాయి. చదవండి: నగర యంత్రాంగంలో నారీమణుల ప్రత్యేక ముద్ర అలాగే, ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటల్లో రసాయనాలు చల్లిన వెంటనే కోసినప్పుడు కూడా ఇలాంటి విష ప్రభావాలు కనపడుతున్నాయి. వ్యవసాయంలో రసాయనాల వినియోగం తగ్గించుకోవటంతో పాటు వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే ఇలాంటి నివేదికలు అనేకం వున్న నేప«థ్యంలో పొలంలో పని చేసే వారి మీద ప్రభావం చూపే అన్ని రకాల రసాయనాల మీద నియంత్రణ విధించాల్సిన అవసరం వుంది. పౌష్టికాహార లోపం ఆహార భద్రత కోసం అనేక పథకాలు ఉన్నప్పటికీ అవన్నీ కేవలం బియ్యం / గోధుమలు పెంపకం వరకే పరిమితం కావటం వలన పోషకాహార లోపాలు కనిపిస్తున్నాయి. శ్రమకు సరిపడా పోషకాహారం తీసుకోక పోవటం వలన ఆరోగ్యం బాగా దెబ్బ తింటోంది. ఈ సమస్యను నివారించటానికి ఇంటి ఆవరణలో, బడులలో, గ్రామస్థాయిలో కాయకూరల, కోళ్ళు, పశువుల పెంపకంపై అవగాహన కల్పించి, ప్రోత్సహించేందుకు అవసరమైన సహాయం చేయటం వలన ఆదాయం పెరగటంతో పాటు పోషకాహార లోపాలను నివారించవచ్చు. వలసల భారం కుటుంబంలో పురుషులు వలస పోవటం వలన ఇంటిపనులు, వ్యవసాయ పనులు అన్ని కూడా మహిళల మీదే భారం పడుతున్నాయి. అలాగే మద్యం, రసాయనాల ప్రభావం.. వంటి అనేక అనారోగ్య కారణాల వలన భర్త చనిపోతే కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత మహిళ మీద పడుతోంది. అలాగే, ఆస్తుల పంపిణీ విషయంలో మహిళల పట్ల వివక్ష వుండటం వలన న్యాయంగా వారికి రావలసిన భూములు కూడా వారి పేరు మీదకు రావటం లేదు. చాలా రాష్ట్రాలలో మహిళలకు వ్యవసాయ భూమి అందుబాటులోకి తేవటానికి, హక్కులు ఇవ్వటానికి చేసిన ప్రయత్నాలు మెరుగైన ఫలితాలు చూపిస్తున్నాయి. మహిళలకు భూమి హక్కులపై అవగాహన, న్యాయ సహాయం ఇవ్వటంతో పాటు కొన్ని (కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్..) రాష్ట్రాలలో వీరిని సంఘాలుగా ఏర్పాటు చేసి భూమి పంపకం చేయటం, కౌలుకు తీసుకోవటానికి సహాయం చేయటం ద్వారా వీరి జీవనోపాధులను బలోపేతం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు అన్ని రాష్ట్రాలలో చేయాల్సి వుంది. ప్రస్తుతం ఉన్న లోపాలు సరిదిద్ది మహిళలకు రావాల్సిన హక్కులు కల్పించటంతో పాటు వివక్షను సరిచేసి, సరైన అవకాశాలు కల్పించ గలిగితేనే కుటుంబం అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధిలో మహిళలు తమ పాత్ర పోషించగలుగుతారు. మహిళల అభివృద్ధిలోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు వుందని గుర్తించి ఆ వైపుగా విధానాల రూపకల్పన, ప«థకాల రచన, ప్రయత్నాలు చేయటం ఎంతైనా అవసరం. 80 శాతం పని.. 13 శాతం భూమి.. వ్యవసాయంలో 80 శాతం పనులను మహిళలు చేస్తున్నప్పటికీ భూమి హక్కు 13 శాతం మందికి మించి లేదు. నేషనల్ కౌన్సెల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్.సి.ఎ.ఇ.ఆర్.) సంస్థ 2018లో చేసిన ఒక సర్వే ప్రకారం వ్యవసాయ భూముల్లో 2 శాతం మాత్రమే మహిళల పేరు మీద వున్నాయి. ఉత్పత్తికి ఆధారమైన ముఖ్య వనరు అయిన భూమిపై హక్కు లేకపోవటంతో వ్యవసాయానికి సంబంధించిన రుణాలు, రాయితీలు వంటివి అన్ని భూమి హక్కు పత్రంతో ముడిపడి వుండటం వలన ఖర్చులు ఎక్కువ పెట్టాల్సి వస్తున్నది. వీటికి తోడు, కొన్ని రాష్ట్రాలలో ధాన్యం సేకరణ, ఆదాయ భద్రత కింద ఇచ్చే అనేక ప«థకాలు భూమి హక్కు లేని మహిళలకు అందటం లేదు. అలాగే అనేక రాష్ట్రాల్లో కుటుంబ ఆస్తిలో మహిళలకు సమాన హక్కు వుండాలని చట్టాలు వున్నాయి. ఇటీవలే దీని మీద సుప్రీంకోర్టు కూడా రూలింగ్ ఇవ్వటం జరిగింది. అయినా, సమస్య తీవ్రత తగ్గలేదు. -
2020లో ప్రపంచాన్ని నడిపించిన స్త్రీ మూర్తులు
ఊరి మీదకు రాక్షసుడొచ్చి పడ్డాడు. కొత్త ముఖం రాక్షసుడు. బండెడన్నం కాదు వాడి డిష్. రోజుకు బండెడు మనుషులు. ఊరు ఇంట్లోకి పరుగులు తీసి తలుపేసుకుంది. దబా.. దబా.. దబా.. దబా.. రాక్షసుడు తలుపు తడుతున్నాడు. తడుతూనే ఉన్నాడు. ధడేల్మని తలుపులు తెరుచుకున్నాయి. ఆ ఇంటి మహిళ బయటికి వచ్చింది. చేతుల్లో పది కత్తులు ఉన్నాయి! పది కత్తులకు పది రూపాలు. గృహిణి, ఉద్యోగి, డాక్టర్, నర్స్, యాక్టివిస్ట్..పరిశోధకురాలు, పారిశుధ్య కార్మికురాలు..ఆశా వర్కర్.. ఆన్లైన్ టీచర్, అంబులెన్స్ డ్రైవర్! రాక్షసుడి అడుగు తడబడింది. ఊరు ధైర్యంగా తొంగి చూసింది. కరోనాపై యుద్ధంలోనే కాదు.. సకల రంగాలలోనూ స్త్రీ శక్తి విజేతగా నిలిచింది. జాతీయంగా, అంతర్జాతీయంగా అన్ని రంగాలలోనూ మహిళలు ఈ ఏడాది అసమాన ప్రతిభను చాటారు. అద్భుత విజయాలు సాధించారు. అవార్డులు పొందారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేశారు. సంపన్నులుగా చరిత్రను సృష్టించారు. మన దేశంలో పది మంది ప్రముఖ మహిళల పేరిట వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యాపీఠాలను నెలకొల్పనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు పురుషులతో సమానంగా ఉన్నత బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ భావనను వ్యతిరేకించడమేనని సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది. ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు, కూతుళ్లకు సమాన హక్కులుంటాయని తేల్చి చెప్పింది. చర్మాన్ని తెల్లగా మార్చే సౌందర్య ఉత్పత్తులు వర్ణవివక్షలో భాగమేనన్న చర్చ నేపథ్యంలో ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరును ‘గ్లో అండ్ లవ్లీ’గా మారుస్తూ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) హెచ్‌యూఎల్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం–2019 అమలు కోసం ఐఎఎస్ కృతికా శుక్లా, ఐపీఎస్ దీపిక దిశ స్పెషల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. అంతర్జాతీయంగా కమలా హ్యారిస్, జాతీయంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి పాలనలో, ప్రణాళికలో తమ ముద్రను వేశారు. ఈ వివరాలు సంక్షిప్తంగా మీ కోసం. అక్కడ కమలపాలన ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవి బరిలో నిలిచి గెలిచిన భారత సంతతి మహిళ కమలా దేవి హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా జనవరిలో పగ్గాలు చేపట్టబోతున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళగా, తొలి నల్లజాతి అమెరికన్‌గా, తొలి ఇండో–అమెరికన్‌గా, తొలి ఆసియా–అమెరికన్ మహిళగా కమల రికార్డు నెలకొల్పారు. కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఒక్లాండ్‌లో జన్మించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు డొనాల్డ్ హ్యారిస్. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో కమల చదువుకున్నారు. యూసీ హేస్టింగ్స కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు. ప్రధానం గా చిన్నారులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్రటిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు. ఇక్కడ శైలప్రణాళిక కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ ‘టాప్ థింకర్ 2020’ గా ఎంపికయ్యారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా యు.కె.లోని ప్రతిష్టాత్మక పత్రిక ‘ప్రాస్పెక్ట్’ ఆమెను ఈ టైటిల్‌తో గౌరవించింది. తత్వవేత్తలు, మేధావులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, రచయితలను యేటా ‘ప్రాస్పెక్ట్’ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేస్తుంది. పాఠకులు, నిపుణులు, సంపాదక బృందం ఇచ్చే రేటింగ్‌ని అనుసరించి జాబితాను ప్రకటిస్తుంది. సకాలంలో చర్యలు తీసుకుని తన రాష్ట్రంలో కరోనా విస్తృతిని కట్టడిని చేసిన శైలజకు గుర్తింపు లభించింది. ఈ సమర్థతను కారణంగానే ఆమెకు ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడే ఘనతను సాధించారు. గతంలో నిఫా వైరస్ కేరళను ఆవరించినప్పుడు కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా శైలజే సమర్థంగా ఎదుర్కొన్నారు. ‘నిఫా యువరాణి’, ‘కోవిడ్ రారాణి’ అంటూ విపక్షాలు వ్యంగ్యంగా మాట్లాడినా, తన పనితీరుతో గట్టి సమాధానం చెప్పారు. శైలజ విధి నిర్వహణ చురుగ్గా, ముందుచూపుతో ఉంటుంది. కేరళలో కరోనా కేసులు బయటపడగానే ఆమె ప్రణాళికలు సిద్ధంగా చేశారు. ఆరోగ్యశాఖ యంత్రాంగాన్ని పూర్తిగా మేల్కొలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి టెస్టింగ్ కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారెంటైన్ విధానాన్ని కఠినంగా అమలు పరిచారు. ►బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఎండీ కిరణ్ మజుందార్ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ లభించింది. దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వాణిజ్య, విద్యాపర సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకుగాను కిరణ్‌కు ఈ అవార్డు దక్కింది. ►అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్ బర్గ్(87) కన్నుమూశారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన రూత్ అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. ►దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చైర్‌పర్సన్‌గా రోష్ని నాడార్ మల్హోత్ర నియమితులయ్యారు. హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఏకైక సంతానం అయిన రోష్ని దేశంలోనే అత్యధిక సంపద ఉన్న మహిళగా హురున్ సంస్థ తాజా కుబేరుల జాబితాలో ఉన్నారు. ►అమెరికాకు చెందిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి, కెరీర్ ఆరంభం నుంచి సమానత్వ హక్కుల కోసం పోరాడిన బిల్లీ జీన్ కింగ్ (76)ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అరుదైన రీతిలో గౌరవించింది. ప్రతిష్టాత్మక ఐటీఎఫ్ టీమ్ ఈవెంట్ ఫెడ్ కప్ పేరు మారుస్తూ ఇకపై దీనిని ‘బిల్లీ జీన్ కింగ్ కప్’గా వ్యహరిస్తామని ప్రకటించింది. ఒక టీమ్ ఈవెంట్ టోర్నీని మహిళ పేరుతో వ్యవహరించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ►తమిళనాడులోని మదురైకి చెందిన 9వ తరగతి విద్యార్థిని నేత్ర ఐక్యరాజ్యసమితి ‘గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్’గా నేత్ర నియమితురాలైంది. క్షౌరశాల నడుపుతున్న తండ్రి తన పెళ్లి కోసం దాచిన 5లక్షల రూపాయలను నేత్ర పేదల సంక్షేమం కోసం ఖర్చుచేసింది. ►ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన ‘బీబీసీ 100 మహిళలు–2020’ జాబితాలో భారత్ నుంచి బిల్కిస్ దాదీ (82), గానా ఇసైవాణి (23), మానసీ జోషీ (31), రిధిమా పాండే(12) చోటు దక్కించుకున్నారు. ►ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారిణిగా జపాన్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్ వన్ నయోమి ఒసాకా గుర్తింపు పొందింది. ‘ఫోర్బ్స్ పత్రిక మే వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి 22 ఏళ్ల ఒసాకా ప్రైజ్‌మనీ, ఎండార్స్మెంట్ల ద్వారా మొత్తం 3కోట్ల 74 లక్షల డాలర్లు (రూ. 284 కోట్లు) సంపాదించింది. ►నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీని పూర్తి చేసినందుకు చాలా సంతోషం గా ఉన్నానని ఆడపిల్లల విద్యకోసం పాటు పడుతున్న ఈ ఉద్యమ కారిణి అన్నారు. ►ఇండియన్ ఆర్మీ చరిత్రలోనే లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకుకు చేరుకున్న మూడోమహిళగా మాధురీ కనిట్కర్ చరిత్ర సృష్టించారు. ఆర్మీలో రెండవ అత్యున్నతస్థాయిలోని ఈ ర్యాంకును పొందిన తొలి పీడియాట్రీషియన్‌గా కూడా కనిట్కర్ గుర్తింపు పొందారు. ►బాలీవుడ్ మెగాస్టార్ ప్రియాంక చోప్రా ‘ఫార్చూన్’ వారి భారతదేశపు అతి శక్తిమంతమైన బిజినెస్ ఉమన్ జాబితాలో స్థానం పొందారు. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ ఆమె నటించారు. ►అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్‌గా ఖ్యాతి గడించిన భారత గణిత మేధావి శకుంతలాదేవికి దాదాపు 4 దశాబ్దాల తర్వాత గిన్నిస్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. 1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంతవేగంగా కేవలం 28 సెకన్లలోనే గుణించిన శకుంతలాదేవి ప్రపంచ రికార్డు నెలకొల్పినప్పటికీ అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు గిన్నిస్ సంస్థ ధ్రువీకరణ పత్రం అందజేయలేదు. ►దివ్యా గోకుల్ నాథ్ ‘ఫోర్బ్స్’ ఏషియా పవర్ఫుల్ బిజినెస్‌ఉమన్ లిస్ట్–2020లో స్థానం సంపాదించారు. ఆమె, ఆమె భర్త వ్యవస్థాపకులుగా ఉన్న ‘బైజూస్’ కంపెనీ విలువ 300 కోట్ల డాలర్లు! ఈ స్టార్టప్ ఆలోచన దివ్యదే. ►ముంబైలోని నావికాదళ స్కూల్ విద్యార్థిని 12 ఏళ్ల కామ్య కార్తికేయన్ దక్షిణ అమెరికాలోని ఎత్తయిన పర్వతం మౌంట్ అకాంకాగ్వా (6,962మీ) విజయవంతంగా అధిరోహించింది. అకాంకాగ్వా పర్వతాన్ని అధిరోహించిన అత్యంత చిన్న వయస్కురాలిగా కామ్య ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ►హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త ప్రత్యూష పారెడ్డికి ‘నీతీ ఆయోగ్ మహిళా అవార్డు’ లభించింది. 2017లో నెమో కేర్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన ప్రత్యూష శిశు మరణాలను తగ్గించడానికి విశేషంగా కృషి చేయడంతోపాటు నవజాత శిశువుల ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకునే కార్యక్రమాలు చేపట్టారు. -
సాధికారతకు నిలువుటద్దం
బోథ్ మండలం బాబెర గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ ఆత్రం సుశీలబాయి ఇటీవల హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై నుంచి అవార్డు స్వీకరించారు. బోథ్ మండల సమైక్య అధ్యక్షురాలుగా ఉన్న సుశీలబాయి సామాజిక చైతన్యం కేటగిరిలో ఈ అవార్డును పొందారు. మహిళ స్వయం సంఘాల బలోపేతం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, వినియోగంపై ప్రోత్సహించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆమెకు ఈ అవార్డును అందజేశారు. సాక్షి, ఆదిలాబాద్ : నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం నేపథ్యంలో మహిళ సాధికారతకు నిలువుటద్దంగా పై అంశాలు నిలుస్తున్నాయి.. ఆయా రంగాల్లో మహిళలు నాయకత్వం వహిస్తూ ఇతరులకు మార్గదర్శనంగా నిలుస్తున్నారు. యువతులకు ఆదర్శప్రాయం అవుతున్నారు. జిల్లా పరిపాలన పరంగా ముఖ్యమైన హోదాల్లో మహిళ అధికారులు అధికంగా ఉండటం గమనార్హం. జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనతో పాటు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కలెక్టర్ అభిలాష అభినవ్‌లు ఉన్నత హోదాలో విశిష్టంగా సేవలు అందిస్తున్నారు. ఇక జిల్లా వ్యవసాయ అధికారిణిగా ఆశకుమారి, జిల్లా మహిళ సంక్షేమ అధికారిగా మిల్కా, భూగర్భ జలశాఖ అధికారిణిగా శ్రీవల్లి, ఐటీడీఏ డీడీ చందన వివిధ శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ జిల్లాకు వన్నె తెస్తున్నారు. అదేవిధంగా మహిళ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా రాజకీయంగానూ మహిళలు రాణిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా శ్రీదేవసేన బాధ్యతలు స్వీకరించారు. అదే నెల 18న ముంబైలో సీఎంవో వరల్డ్ సంస్థ నుంచి వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. పెద్దపెల్లి కలెక్టర్‌గా వ్యవహరించిన సమయంలో ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ, పల్లెప్రగతి, తదితర కార్యక్రమాల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించినందుకు గాను ఈ అవార్డును అందజేయడం జరిగింది. పెద్దపెల్లి కలెక్టర్‌గా అభివృద్ధి, పారిశుధ్యం, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ వంటి అంశాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారాలు దక్కాయి. ఆదిలాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి నెలరోజులు మాత్రమే అయినప్పటికి విధుల నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో దిశ కేసుతో పాటు సమతా కేసు కూడా సంచలనం సృష్టించింది. సమతా కేసు విచారణ ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో 66 రోజుల పాటు సాగింది. ప్రత్యేక కోర్టుకు జడ్జిగా ఎంజీ ప్రియదర్శిని వ్యవహరించారు. ఈ కేసులో దోషులకు మరణ శిక్ష విధించడం గమనార్హం. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో రెండుసార్లు వరుసగా మొదటి స్థానంలో నిలిచారు. మహిళ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఆమె విస్తృతంగా కృషి చేస్తున్నారు. స్త్రీలను గౌరవించడం ఇంటి నుంచే మొదలవ్వాలి ప్రతి పురుషుడు మహిళను తల్లి, చెల్లి, కూతురులా భావించాలి. కనీస గౌరవం ఇవ్వాలి. ఇది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ఆడ, మగ అనే తేడా లేకుండా ఆడపిల్లలకు సమానత్వం ఇవ్వాలి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అంతరిక్షంలో కూడా ప్రయాణిస్తున్నప్పటికీ భూమిపై నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలపై అత్యాచారాలు, హింస ఘటనలు నివారించాలంటే ఓ మంచి సమాజ నిర్మాణం జరగాలి. అంతర్జాతీయ మహిళ దినోత్సవం ఎన్నో ఏళ్లుగా జరుపుకుంటున్నప్పటికీ మహిళలు తమ సాధికారతను ఇంకా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. – శ్రీ దేవసేన, కలెక్టర్ -
మేకవన్నె మృగాడు
‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు’ అన్న సినీ కవి మాటలు అక్షర సత్యమయ్యాయి. ఎక్కడో ఒక చోట నిత్యమూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు రెచ్చిపోయి కబళిస్తున్నాయి. తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తులు, విద్యా బుద్దలు నేర్పించే గురువులు, వయస్సుతో సంబంధం లేకుండా అకృత్యాలకు ఒడిగడుతున్నారు. ముక్కుపచ్చలారని బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఏటా జిల్లాలో సగటున 50 వరకు ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బుధవారం రాత్రి అనంతపురంలోని ఎర్రనేలకొట్టాలలో ఐదేళ్ల బాలికపై స్థానికంగా నివాసముంటున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన నగర వాసులను భయభ్రాంతులకు గురి చేసింది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు అమలవుతున్నా.. క్షేత్రస్థాయిలో నేరాలకు అడ్డుకట్ట పడకపోవడం వ్యవస్థ పతనావస్థకు అద్దం పడుతోంది. – అనంతపురం సెంట్రల్ నేరాల నియంత్రణకు కఠినమైన చట్టాలు అత్యాచార నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టానికి 2012లో ఆమోదం లభించింది. ఆ ఏడాది జూన్ 19న ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. జూన్ 20న భారతదేశం గెజిట్‌లో నోటిఫై చేశారు. చట్టంలో పేర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలపకపోయినా 18 సంవత్సరాలలోపు ఏ వ్యకిపైనైనా లైంగిక కలయిక జరిగితే అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. ఇప్పటి వరకూ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375 ప్రకారం 16 సంవత్సరాలలోపు వ్యక్తి ఆమోదం తెలిపినా, తెలపకపోయినా అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. కానీ, ఇప్పుడు కొత్త చట్టం, నిబంధనల ప్రకారం అది 18 సంవత్సరాల వయసు గల ఏ వ్యక్తికైనా వర్తిస్తుంది. • పిల్లలపై లైంగిక అత్యాచారం చేస్తే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, అపరాధ రుసుము లేదా జీవిత ఖైదు కూడా విధించవచ్చు. (ఇటీవల రాష్ట్రపతి ఉరిశిక్ష అమలుపై ఆమోదం తెలిపారు. ) • పిల్లలపై అత్యాచారం లేదా వేధింపులకు గురిచేస్తే మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము, అశ్లీల దృశ్యాలకు, సాహిత్యానికి వాడుకుంటే ఐదేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము, రెండోసారి అదే నేరంపై దొరికితే ఏడేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము విధించవచ్చు. • నిపుణులకు, ప్రత్యేక అధ్యాపకులు, అనువాదకులు, వ్యాఖ్యాతలకు ఉండాల్సిన అనుభవం, అర్హతలను పొందుపరిచారు. అలాగే బాలల అత్యవసర వైద్య చికిత్స, ఆదరణ, రక్షణకు కావాల్సిన ఏర్పాట్ల గురించి, లైంగిక దాడి బాధితులైన పిల్లలకు కు ఇచ్చే నష్టపరిహారం పొందుపరిచారు. • సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న మహిళా పోలీసు అధికారి, బాధిత పిల్లలు తెలిపే విషయాలను, ప్రామాణిక న్యాయసాక్ష్యంలాగా లిఖితపూర్వకంగా భద్రపరుస్తారు. పిల్లలను పోలీసు స్టేషన్లో రాత్రి వేళల్లో ఏ కారణంగానూ ఉంచరాదు. పిల్లల నుంచి విషయాలను లిఖిత పూర్వకంగా సేకరించేటప్పుడు పోలీసు అధికారి యూనిఫాంలో ఉండరాదు. పిల్లలు ఏ మాటలతో విషయాన్ని వివరిస్తారో, అదే రీతిలో దానిని రికార్డు చేయాలి. • పిల్లల అవసరం మేరకు చెప్పిన మాటలను అనువదించడానికి సహకారం కల్పించాలి. ఒకవేళ పిల్లలు వికలాంగులై అశక్తతకు గురైనవారైతే, వారికి ప్రత్యేక శిక్షకులు, లేదా వారిని అర్థం చేసుకునేలా చెప్పేవారి సహకారాన్ని తీసుకోవాలి. • వైద్య పరిశీలన/విచారణ సమయంలో పిల్లల తల్లి/తండ్రి కానీ, వారికి నమ్మకం కలిగిన వ్యక్తి సమక్షంలో జరపాలి. బాలిక పరిశీలన/విచారణ మహిళా డాక్టర్లు చేయాలి. • విచారణ, పరిశోధన, సాక్షి రికార్డింగ్, నేరాలను నిషేధించేటప్పుడు బాలల స్నేహ పద్ధతులను ఈ చట్టం, నిబంధనలను అందిస్తుంది. న్యాయవిచారణ జరిగే సమయంలో బాలలకు తరచూ విరామం కలిగించాలి. పిల్లలను విచారణ జరిపేటప్పుడు, మళ్లీ మళ్లీ సాక్ష్యమివ్వడానికి పిలవరాదు. పిల్లల విచారణ అనేది దాడి చేసే మాదిరిగా ఉండరాదు. వారి ప్రతిష్టకు అవమానం కలిగించేటట్లు ఉండరాదు. విచారణ అందరి సమక్షంలో కాకుండా గోప్యంగా జరపాలి. • పలు అంశాలు (బాధితురాలు గర్భవతి అయితే, లైంగిక వ్యాధులు ప్రబలితే వైద్య చికిత్సకు అవసరమైన డబ్బును బట్టి మొదలగునవి) పరిగణలోకి తీసుకుని ప్రత్యేక కోర్టు విచారణ త్వరగా జరపాలనే ఉద్దేశ్యంతో బాలల విచారణ, విషయాలను భద్రపరిచే చర్యను 30 రోజలలోపు చేయాలి. ప్రత్యేక కోర్టు న్యాయ విచారణ ఏడాదిలోపు పూర్తి చేయాలి. • ఫిర్యాదు అందిన తక్షణమే ప్రత్యేక బాలల పోలీసు బృందం (ఎన్.జె.పి.యు) రంగంలో దిగి బాధితుల సహాయం, పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. పిల్లలకు ఆదరణ, రక్షణ కల్పించే షెల్టర్ హోం కానీ, అస్పత్రికి కానీ తరలించాలి. ఫిర్యాదు వచ్చిన తరువాత స్థానిక పోలీసు లేదా ఏస్జేపీయూ ‘బాలల సంక్షేమ సమితి’ ఎదుట 24 గంటలలోపు నివేదికను ప్రవేశపెట్టాలి. • ఈ చట్టం, నిబంధనల సదుపాయాలను జాతీయ లేదా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్లు పర్యవేక్షణ చేస్తాయి. పిల్లలు సురక్షితంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అన్ని అసమానతల నుంచి వారిని కాపాడాలని అనుకుంటారు. రోజు వారి పనుల్లో భాగంగా చాలా మంది వ్యక్తులతో పిల్లలు సంప్రదిస్తుంటారు. ఇలాంటి వారిలో మంచి వారు, చెడ్డ వారు ఉంటారు. వారిలో ఉన్న నైజాన్ని పిల్లలు పసిగట్టగలగాలి. తద్వారా వారు ఏదైనా విచిత్రమైన పరిస్థితి లేదా వ్యక్తి తారసపడితే ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. ఇందులో భాగంగానే పిల్లలకు మంచి స్పర్శ.. చెడు స్పర్శ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. రండి, పిల్లలు సురక్షితమైన వాతావరణంలో పెరిగేందుకు చేతులు కలపండి. మంచి, చెడు స్పర్శల గురించి పిల్లలకు నేర్పండి. – సాక్షి, అనంతపురం తల్లిదండ్రులు దేని కోసం చూడాలి? పిల్లలను పెంచేటప్పుడు అప్రమత్తత అవసరం. పిల్లల చుట్టూ ఉన్న అపరిచితులను గుడ్డిగా నమ్మరాదు. ఎదుటి వ్యక్తి వింత ప్రవర్తనను పసిగట్టగలగాలి. పిల్లలు బాధపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. ప్రత్యేకించి దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి స్నేహితుడో, కుటుంబ సభ్యుడో, జీవిత భాగస్వామినో అయితే పిల్లల భద్రత, వారి ఆనందం పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. పిల్లలకు శరీరంలోని కొన్ని ప్రాంతాలు వారి సొంతమనే భావనను పెంపొందించాలి. వాటి సంరక్షణపై జాగ్రత్తలు వివరించాలి. చొరబాటుదారుల నుంచి వాటిని ఎలా రక్షించుకోవాలో చైతన్య పరచాలి. విందులు.. వినోదాలు అంటూ ఆహ్వానించే అపరిచితులకు ‘నో’ చెప్పమనే స్థాయికి వారిని ఎదగనివ్వాలి. శరీరంలోని వ్యక్తిగత ప్రాంతాలను తాకితే తమకు అందుబాటులో ఉన్న వారిని వెంటనే అప్రమత్తం చేయగలిగేలా తీర్చిదిద్దాలి. గట్టిగా అరవడమో.. లేదా తిరగబడి పోరాటం చేసేలా సిద్ధపరచాలి. ► మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ గురించి పిల్లలకు అవగాహన కల్పించే చిట్కాలు లైంగిక విషయాలను పిల్లలకు తెలిసిన ఉదాహరణలతో వివరించండి. ► పిల్లలతో ముభావంగానో, టెక్నికల్గానో ఉండరాదు. ప్రశ్నించబడుతున్నట్లు వారు భావించేలా ఉండరాదు. తీవ్రమైన చర్చను వెంటనే కత్తిరించాలి. సున్నితమైన, ప్రశాంతమైన స్వరాన్ని ఉపయోగించండి. ► పిల్లలలకు తల్లిదండ్రులకు మధ్య నమ్మకమనే దృఢమైన బంధం ఉండాలి. ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రేమతో దగ్గరకు తీసుకుని నచ్చచెప్పగలగాలి. మీరు వారి కోసం ఉన్నారని భావనను వారికి తెలియజేయాలి. ► చెడు స్పర్శ గురించి చాలా చిన్న పిల్లలకు బోధించేటప్పుడు పాటించాల్సిన సాధారణ నియమం ఇది. లోదుస్తులతో కప్పబడిన వారి శరీరంలోని ఏదైనా భాగాలు వారి ప్రైవేట్ ప్రాంతం అని వివరించండి, అది వారు తప్ప మరెవరూ తాకకూడదు, చూడకూడదు అనే విషయంపై పూర్తి అవగాహన కల్పించాలి. వారి శరీరాలపై ఎక్కడైనా తాకితే వారు అసౌకర్యంగా భావిస్తే మీకు తెలియజేయాలని పట్టుబట్టండి. ► మంచి స్పర్శ గొప్పగా అనిపిస్తుంది ఇది ఒక బంధం. చెడు స్పర్శ అసౌకర్యం, ఒత్తిడిని పెంచుతుంది. ► మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి పిల్లలకు నేర్పించేందుకు చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాలు సాధారణంగా మానవ శరీర నిర్మాణ శాస్త్రం యొక్క చిత్ర ప్రాతినిధ్యాలతో ఉంటాయి. దాని నుంచి వారు వారి శరీరాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ► పిల్లలు ప్రాథమిక వివరణ కంటే దృశ్యమాన కథనాలకు అనుకూలంగా ఉంటారు. మీరు వారితో చిన్న ఆటలను ఆడవచ్చు, అక్కడ వారు సహాయం కోసం అరవడం లేదా ఎవరైనా వారిని వేధిస్తుంటే ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధం చేయవచ్చు. ► ఎవరైనా మీ ప్రైవేట్ భాగాలను కారణం లేకుండా తాకినట్లయితే, ఎవరైనా మిమ్మల్ని తాకి, ఎవరికీ చెప్పవద్దని చెబితే , ఇవన్నీ చెడ్డ స్పర్శకు సంకేతాలు. ► పిల్లలతో ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. వారు పగటిపూట చేసిన పనిని వివరిస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. వారు మీతో ఏదైనా పంచుకోవచ్చుననే భరోసా ఇవ్వగలగాలి. మా పని ఇంకా పూర్తి కాలేదనో, గట్టిగా అరుస్తూ హెచ్చరికలు చేయడం సరికాదు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా ఎదుర్కొంటే ఏమి చేయాలో నేర్పించాలి. నిందితులను వదిలే ప్రసక్తే లేదు ఆడపిల్లలపై అత్యాచార యత్నాలు, అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. క్రూరులను వదిలే ప్రసక్తే లేదు. ఆడపిల్లల తల్లిదండ్రులు ధైర్యంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు. అనంతపురంలో గురువారం జరిగిన ఘటన చాలా దారుణమైనది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిందితుడికి కఠిన శిక్ష పడేలా కృషి చేస్తా. – ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం చావు తప్పదన్న భయం ఉండాలి ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు ఉండాలి. కొన్ని నెలలు జైలులో ఉండి బయటకు వస్తామనే భావన వారిలో ఏ మాత్రం రానివ్వరాదు. తప్పు చేస్తే మరణశిక్ష పడుతుందనే భయం ఉండాలి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక బాలికపై జరిగిన యాసిడ్ దాడి ఘటనలో నిందితులను ఎలా శిక్షించారో.. ఆ తరహా శిక్షలను ఇక్కడ కూడా అమలు చేయాలి. అనంతపురం ఘటనను ఖండిస్తున్నా. – జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే, శింగనమల కఠిన చర్యలు తప్పవు బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నాయి. లైం గిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ప్రస్తుతం మారిన చట్టం ప్రకారం ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. జిల్లాలో బాలికల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటాం. జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. – బూసారపు సత్యయేసుబాబు, ఎస్పీ మార్పు రావాలి మానవత్వానికి, మృగత్వానికి జరుగుతున్న సంఘర్షణ ఇది. మానవత్వాన్ని గెలిపించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు మగ పిల్లలను పెంచే విధానంలో మార్పు రావాలి. ఆడపిల్లలను తనను తాను రక్షించుకునే విధంగా తయారు చేయాలి. చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమాజం కూడా ఇలాంటి వారిని బహిష్కరించాలని కోరుతున్నా. – కె. చౌడేశ్వరి, అదనపు ఎస్పీ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం అమ్మాయిల ర క్షణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అ నేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ము ఖ్యంగా ఫోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నాం. అయినా నేరాలు జరుగుతుండడం బాధాకరం. ప్రస్తుత బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇద్దరు పిల్లలకు బాలసదనంలో ఆశ్రయం కల్పించి వారి చదువుకు సహకరిస్తాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. – చిన్మయాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ దురదృష్టకరం భగవంతుడితో స మానమైన ప సిమొగ్గల్ని చిదిమేస్తున్న నరరూప రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలి. చట్టాలు కఠినంగా ఉంటే ఇలాంటి ప రిస్థితులు పునరావృతం కావు. ఏదేమైనా పిల్లల భద్రత పరమైన అంశాల్లో తల్లిదండ్రుల్లో జాగ్రత్తతో ఉండడం మంచిది. విపరీత ప్రవర్తన గల వారికి ప్రత్యేకమైన కౌన్సెలింగ్ నిర్వహించే వ్యవస్థ ఉండాలి. – ప్రొఫెసర్ ప్రశాంతి, డైరెక్టర్ , జేఎన్టీయూఏ గల్ఫ్ చట్టాలు రావాలి గల్ఫ్ దేశాల్లో అమలు చేసే కఠిన చట్టాలు ఇక్కడ కూడా అమలు కావాలి. అప్పుడే నేర ప్రవృత్తి తగ్గే అవకాశం ఉం టుంది. నరరూప రాక్షసుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి. పసిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్బడే వారికి తక్షణమే శిక్ష పడేలా వ్యవస్థలో మార్పు రావాలి. – ప్రొఫెసర్ కృష్ణకుమారి, జియాగ్రఫీ, ఎస్కేయూ అనంతపురం ఒకరిని ఉరి తీయాలి చిన్నారిపై అఘాయిత్యం జరిగిందని ఊహించుకుంటుంటేనే ప్రాణం పోయినట్లైంది. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన ఒకరిని నడి రోడ్డులో ఉరి తీయాలి. అప్పుడే అంతా సెట్ అవుతారు. ఇలాంటి విషయాలు మళ్లీ జరగకుండా న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. ప్రజలే శిక్షించేలా అవకాశం కల్పించాలి. నడిరోడ్డుపై రాళ్లు, కట్టలతో కొట్టి చంపాలి. – మృదుల, నర్సింగ్ విద్యార్థిని, అనంతపురం ఉరిశిక్షే సరైంది తప్పులు బహిరంగంగా చేస్తూ..శిక్ష మాత్రం రహస్యంగా అనుభవిస్తున్నారు. దీని ద్వారా తప్పు మీద తప్పులు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు, బాలికలు, అమ్మాయిలపై రోజు రోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు నరరూప రాక్షసులు కూతుళ్లు, మనవరాళ్ల వయసున్న వారి పట్ల పాశవికంగా ప్రవరిస్తున్నారు. ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే ఉరి శిక్షే సరైంది. బహిరంగంగా ఉరి తీయాలి. అప్పుడే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. – డాక్టర్ ఉషశ్రీనాగ్, హౌస్‌సర్జన్, సర్వజనాస్పత్రి, అనంతపురం -
ధీర విజయ
నటి. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది. దర్శకురాలు. అక్కినేని, శివాజీ గణేశన్‌లను కూడా డైరెక్ట్ చేసి అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌పై తన సంతకం చేసింది. సహచరి. భర్త వేసే ప్రతి అడుగులోనూ భాగమవుతూ తన అడుగు చెరిగిపోకుండా కాపాడుకుంది. తల్లి. కుమారుడి వెన్నంటే ఉండి అతడి కెరీర్‌కు వెన్నెముకలా నిలిచింది. సంపూర్ణ స్త్రీ. సమాజం స్ఫూర్తి పొందేలా తన జీవితాన్ని సఫలం చేసుకుంది. విజయ నిర్మల సార్థక నామధేయి. వెండితెర విజయకేతనం. అన్ని విధాల ధీర విజయ. తెలుగువారి గర్వకారణాలలో తప్పక మెదిలే ఒక గొప్ప స్త్రీ ఉనికి. రావు బాలసరస్వతి విజయ నిర్మలకు బంధువు. బాల సరస్వతి గాయని, నటి. ఆ రోజుల్లో సూపర్‌స్టార్. ఏడేళ్ల వయసులో ఒక రోజు విజయ నిర్మల తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా బాలసరస్వతి వచ్చి ఆమెను ఎత్తుకొని తన ఇంటికి తీసుకెళ్లింది. తెల్లవారి లేచి చూసిన విజయ నిర్మలకు ఆశ్చర్యం. ఆ తర్వాత బాలసరస్వతి తీసుకువెళ్లిన చోటు చూశాక ఇంకా ఆశ్చర్యం. అది ఒక స్టూడియో. అక్కడ సినిమా షూటింగ్ జరుగుతోంది. బాల నటి కావాలని బాల సరస్వతిని కోరితే విజయ నిర్మలను తీసుకొచ్చి నిలబెట్టింది. ఆ సినిమా పేరు ‘మచ్చరేకై’ (తమిళం). అలా వెండి తెర మీద బుజ్జిపాదాలతో అడుగులు వేసిన విజయ నిర్మల చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది. ఘనమైనది కూడా. జయ కృష్ణా ముకుందా మురారి విజయ నిర్మలకు పన్నెండు పదమూడేళ్లు వచ్చాయి. ఆమె కుటుంబం సినిమాలకు అంతో ఇంతో సంబంధం ఉన్నదే. తల్లి శకుంతల గృహిణే అయినా తండ్రి రామ్మోహనరావు వాహిని స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా పని చేసేవారు. బాలనటిగా గుర్తింపు పొందిన విజయ నిర్మలకు అవకాశమొస్తే దగ్గరుండి ప్రోత్సహించడానికి తండ్రి సిద్ధంగా ఉన్నారు. విమల, విజయనిర్మల ఆ సమయంలో తలుపు తట్టిన మంచి అవకాశమే ‘పాండురంగ మహత్య్మం’లో నటించే అవకాశం. అందులోని ‘జయ కృష్ణా ముకుందా మురారి’ పాటలో విజయ నిర్మల బాలకృష్ణునిగా నటించాలి. ‘మీనా’లో నాగరత్నమ్మ (కృష్ణ తల్లి), కృష్ణ, విజయనిర్మల అది ఎవరి పర్యవేక్షణలో? కృష్ణుడంటే తనే అని తెలుగు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ పర్యవేక్షణలో. ఎన్టీఆర్ విజయ నిర్మలను ఎంతో ప్రోత్సహించారు. అది చాలా పెద్ద పాట. ప్రతిరోజూ మేకప్‌ను ఆయనే సరిదిద్దడం, కళ్లచివర శంఖు చక్రాలను దిద్దడం ఆయనే చేసేవారు. కొన్నిరోజుల షూటింగ్ జరిగింది. ఒకరోజు షాట్లో విజయ నిర్మల కళ్లు తిరిగి పడిపోయారు. రామారావు షూటింగ్ ఆపేశారు. మూడు నాలుగు రోజుల తర్వాత ‘నా కృష్ణుడికి దిష్టి తగిలినట్టుంది’ అని పెద్ద బూడిద గుమ్మడికాయతో దిష్టితీసి మిగిలిన పాటను సెట్లోకి బయటివారు ఎవరూ రాకుండా షూటింగ్ ముగించారు. ఆ పాట తెలుగు సినిమాలలో, ఎన్టీఆర్ నటజీవితంలో దాంతోపాటు విజయ నిర్మల నట జీవితంలో కూడా నిలబడింది. ‘దేవదాసు’లో కృష్ణ పిలిచిన కేరళ గాలి తర్వాతి కాలంలో సినిమాటోగ్రాఫర్‌గా పేరు గడించిన విన్సెంట్ ఆ రోజుల్లో మలయాళంలో దర్శకుడిగా ఒక సినిమా తీయదలిచారు. ఆయన వాహినిలో పని చేస్తున్నప్పుడు విజయ నిర్మల తండ్రికి స్నేహితుడయ్యాడు. విజయ నిర్మలను చూసి ‘మీ అమ్మాయి కళ్లు బాగున్నాయి. నేను మలయాళంలో ఒక ఘోస్ట్ సినిమా తీస్తున్నాను. ఆ పాత్రకు కళ్లు చాలా ముఖ్యం. హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తాను’ అంటే తండ్రి అంగీకరించారు. అలా విజయ నిర్మల మలయాళంలో నటించిన తొలి సినిమా ‘భార్గవి నిలయం’. అది హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అక్కడ డజనుకు పైగా సినిమాలలో నటించారు. ఈలోపు బి.ఎన్.రెడ్డి నుంచి ‘రంగుల రాట్నం’లో నటించడానికి పిలుపు వచ్చింది.. తెలుగులో తొలిసారి హీరోయిన్గా. ‘రంగుల రాట్నం’ కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా క్లాసిక్‌గా నిలిచి ఆమెకు పేరు తెచ్చింది. ఎస్.వి. రంగారావును గెలిచింది తెలుగులో ‘షావుకారు’ను విజయా సంస్థ తమిళంలో ‘ఎంగవీట్టు పెణ్’గా తీయదలిచింది. తెలుగులో లీడ్ రోల్ చేసిన షావుకారు జానకి పాత్ర తమిళంలో విజయ నిర్మలకు ఇచ్చారు. షూటింగ్ తొలిరోజు సెట్‌కు ఎస్.వి. రంగారావు వచ్చారు. విజయ నిర్మలను చూశారు. ‘ఏమిటి... ఈ అమ్మాయా నా మేనకోడలుగా చేసేది. ఏం బాగాలేదు. కె.ఆర్.విజయను పెట్టి తీయండి’ అని వెళ్లిపోయారు. విజయ నిర్మల చాలా అప్సెట్ అయ్యారు. చాన్స్ పోయినట్టే అనుకున్నారు. రెండు రోజుల తర్వాత మళ్లీ విజయా సంస్థ నుంచి పిలుపు వచ్చింది. ‘ఏమిటి... రంగారావు గారు ఒప్పుకున్నారా’ అంటే ‘కాదు.. ఆయననే మార్చేశాం. ఆయన ప్లేస్‌లో ఎస్.వి.సుబ్బయ్యను తీసుకున్నాం’ అని జవాబు వచ్చింది. అలా తమిళంలో అవిఘ్నంగా అడుగుపెట్టిన నటి విజయ నిర్మల. అక్కడ కూడా ఆమె దాదాపు డజను సినిమాల్లో నటించారు. వచ్చాడు నా రాజు ఈ రోజు ఆ తర్వాత ఆమె నట జీవితం ఎలా ఉండేదో తెలియదు. కాని బాపు–రమణలు సొంత నిర్మాణ సంస్థ మొదలెట్టి తీసిన ‘సాక్షి’ సినిమాలో కృష్ణతో కలిసి నటించడం ఆమె జీవితాన్ని మార్చింది. కృష్ణ జీవితాన్ని కూడా. వారిరువురూ గోదావరి ప్రాంతంలోని ‘మీసాల కృష్ణుడి’ గుడిలో ‘అమ్మ కడుపు చల్లగా’ పాటలో తాళి కట్టే సన్నివేశంలో నటించారు. షూటింగ్ ముగించి బయటకు వస్తుంటే బయటే ఉన్న నటుడు రాజబాబు ‘ఇది మీసాల కృష్ణుడి గుడి. విజయనిర్మల, కృష్ణ చాలా పవర్ఫుల్. ఇక్కడ ఉత్తుత్తి జంట అయినా నిజమైన జంట అయిపోతుంది’ అని జోస్యం చెప్పారు. మూడు నాలుగు నెలలో అదే నిజమైంది. ఆ సమయంలో మూడు నాలుగు సినిమాలలో నటిస్తున్న విజయ నిర్మల, కృష్ణ తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇరువురికీ అది ద్వితీయ వివాహమే. పెళ్లి విషయం కృష్ణే ప్రపోజ్ చేశారని విజయ నిర్మల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పెళ్లి ఆ సమయంలో ఇండస్ట్రీలో న్యూస్ క్రియేట్ చేసినా క్రమంగా అందరూ వారి జంటను ఆదరించారు. భర్తను డైరెక్ట్ చేసిన భార్య సాధారణంగా భర్తను భార్య డైరెక్ట్ చేయడం కొంచెం సున్నితమైన అంశం. సెట్లో నటుడి కన్నా దర్శకుడిదే పై చేయి. కాని కృష్ణ, విజయ నిర్మలల మధ్య ఉండే అవగాహన, సామరస్యం, ప్రొఫెషనలిజమ్ అసాధారణమైనది. అందుకే ఆమె దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలో కృష్ణ భేషజం లేకుండా, ఇగోకు పోకుండా ఎలా చెప్తే అలా చేస్తూ నటించారు. కృష్ణ సూపర్ డూపర్ హిట్స్‌లో విజయ నిర్మల దర్శకత్వం వహించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణ చేత ‘త్రిబుల్ యాక్షన్’ చేయించి విజయ నిర్మల తీసిన ‘రక్త సంబంధం’ సినిమా సంచలనం. కృష్ణ, విజయనిర్మల ఉన్నది కాసేపే అయినా ఈ సినిమాలు ఒకెత్తయితే ఉన్నది కాసేపే అయినా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తెచ్చిన పేరు ఒక ఎత్తు. ఆ సినిమాలో సీతారామరాజు ఆత్మబంధువు సీతగా కనిపించి ఆమె పాడిన పాట ‘వస్తాడు నా రాజు ఈరోజు’ ఎంత హిట్టో అందరికీ తెలుసు. విశేషం ఏమిటంటే కృష్ణతో పెళ్లయ్యాక కూడా ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘మంచి మిత్రులు’, ‘ముహూర్తబలం’ సినిమాలలో ఆయన చెల్లెలిగా విజయ నిర్మల నటించారు. ఇతర హీరోల పక్కన నటించడానికి కృష్ణ అభ్యంతర పెట్టకపోవడం వల్ల ‘బుద్ధిమంతుడు’, ‘తాతా మనవడు’, ‘బుల్లెమ్మ బుల్లోడు’ వంటి హిట్ సినిమాలు ఆమెకు దక్కాయి. విజయనిర్మల, జ్యోతిలక్ష్మి కెరీర్‌ను హుందాగా నిలబెట్టుకొని విజయ నిర్మల అనుకుంటే ఎన్నో క్యారెక్టర్లను చేసి ఉండేవారు. ఎన్నో క్యారెక్టర్లు కావాలనుకుని పొందేవారు. కానీ నటిగా, దర్శకురాలిగా, గృహిణిగా, తల్లిగా తన ప్రయారిటీస్‌ని ఆమె ఎప్పుడూ గట్టిగా పట్టించుకున్నారు. వీటిని సమన్వయం చేసుకుంటూ హుందాగా తన మార్గంలో నడిచారు. ఎప్పుడూ డల్‌గా ఉండే విజయ నిర్మలను ఎవరూ చూడలేదు. ఎప్పుడూ బ్రైట్‌గా, గ్లామరస్‌గా, కృష్ణ పక్కన ఎనర్జిటిక్‌గా ఆమె కనపడేవారు. సినిమా రంగంలో ఎందరో నటీమణులకు ఆమె ధైర్యం. మార్గదర్శి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఆమె ఎంతో సపోర్ట్ చేసేవారు. అన్ని అవకాశాలు ఉంటే అందలం చేరడం వింత కాదు. కానీ ఒక మామూలు కుటుంబం నుంచి అంతంత మాత్రం చదువు కలిగి ఉండి ఇంత జీవితాన్ని ఇంత సమర్థంగా నడపడం కచ్చితంగా స్ఫూర్తివంతమైన అంశం. కృష్ణతో 47 సినిమాలలో తెలుగులో హిట్ పెయిర్స్ చాలా ఉన్నాయి. ఎన్.టి.ఆర్–జయలలిత, అక్కినేని–సావిత్రి, జమున–హరనాథ్... కానీ కృష్ణ–విజయ నిర్మల జోడి చేసినన్ని సినిమాలు ఎవరూ చేయలేదు. వీరిరువురూ కలిసి 47 సినిమాలలో నటించారు. ‘అత్తగారు–కొత్త కోడలు’, ‘టక్కరిదొంగ–చక్కని చుక్క’, బందిపోటు భీమన్న’, ‘అమ్మ కోసం’.. ఇలా అనేక సినిమాల్లో నటించారు. అయితే ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో కృష్ణతో కలిసి గుర్రపు స్వారీ చేయడం, స్టంట్స్‌లో పాల్గొనడం దేనికీ తాను తక్కువ కాదు అన్న స్థాయిలో విజయ నిర్మల చేశారు. ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘మీనా’, ‘దేవదాసు’, ‘కురుక్షేత్రం’ ఈ సినిమాలన్నింటిలో వారి జంట రక్తి కట్టింది. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఆత్మాభిమానం చంపుకొని మానం అమ్ముకోవడానికి సిద్ధపడే సన్నివేశంలో విజయ నిర్మల నటన ఎన్నదగినదిగా నిలిచింది. కృష్ణగారిని ఒంటరిని చేసి వెళ్లారని తప్ప బహుశా అభిమానులకు వేరే ఫిర్యాదులుండే అవకాశం లేదు. జీవించినంత కాలం ప్రతిభా తరంగాలను ప్రసారం చేసిన విజయ నిర్మల మరణించాక దివ్య తరంగాలతో కృష్ణగారి సమక్షంలోనే ఉంటారని ఈ అభిమానులే ఊరట చెందుతారు. ఎందుకంటే అదే సత్యం. ఈ బహుముఖ సమర్థురాలికి తెలుగువారి ఘన నివాళి. – కె -
మేమేం చేయాలి?
∙పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడానికి ముందు దంపతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలియజేయగలరు. – కె.వీణ, తిరుపతి పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడానికి ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ప్రయత్నం చేయాలి. బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలి. దాని కోసం నడక, యోగా వంటివి పాటించాలి. మితమైన పోషకాహారం తీసుకోవాలి. థైరాయిడ్, కంప్లీట్ బ్లడ్ టెస్ట్, షుగర్, బీపీ వంటి పరీక్షలు చేసుకుని, సమస్యలు ఏవైనా ఉన్నాయేమో ముందే తెలుసుకోవాలి. సమస్యలు ఉన్నట్లయితే వాటికి చికిత్స తీసుకుని, వాటిని అదుపులో ఉంచుకుని గర్భం కోసం ప్రయత్నం చేయడం మంచిది. ఫిట్స్, కిడ్నీ, గుండె సమస్యలు ఉన్నట్లయితే, ఇంకా ఇతరత్రా సమస్యలకు మందులు వాడుతున్నట్లయితే, వాటికి డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు మందులలో మార్పులు ఉంటే చేసుకుని గర్భం కోసం ప్రయత్నం చెయ్యడం మంచిది. రుబెల్లా పరీక్ష చేయించుకుని, రుబెల్లా యాంటీబాడీస్ నెగటివ్ వస్తే, రుబెల్లా వ్యాక్సిన్ తీసుకుని నెల తర్వాత గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భధారణకు మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున వాడాలి. సిగరెట్, మద్యపానం అలవాటుంటే మానేయాలి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ముందుగానే చికిత్స తీసుకోవాలి. కుటుంబంలో ఏవైనా జన్యుపరమైన సమస్యలు వంటి ఇతర సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, సలహా తీసుకుని, అవసరమైతే దంపతులిద్దరూ రక్తపరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. రక్తహీనత ఉంటే ఐరన్ మాత్రలు, థైరాయిడ్ సమస్య ఉంటే దానికి మాత్రలు వేసుకుని, అదుపులోకి వచ్చిన తర్వాత గర్భం కోసం ప్లాన్ చెయ్యడం మంచిది. ∙నా వయసు 29 సంవత్సరాలు. మర్మాగంపై పుండు ఏర్పడింది. సిఫిలిస్ అంటున్నారు. ఇది ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలు ఏమిటి? – యన్ఎన్, విజయనగరం సిఫిలిస్ అనేది ‘ట్రిపోనిమా ప్యాలిడమ్’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది కలయిక ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే లైంగిక వ్యాధి. దీనిలో మొదటగా జననేంద్రియాల దగ్గర, నోట్లోను, మలద్వారం దగ్గర నొప్పిలేని చిన్నపుండులాగ ఏర్పడుతుంది. అవి వాటంతట అవే తగ్గిపోతాయి. కాని, తర్వాత ఈ పుండ్లు దశల వారీగా శరీరమంతా పాకుతాయి. త్వరగా గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఇది నరాలకు, గుండెకు, కాలేయానికి, కీళ్లకు, ఎముకలకు, రక్తనాళాలకు పాకి వాటిని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. చికిత్స తీసుకోకపోతే ఈ బ్యాక్టీరియా జీవితకాలం శరీరంలోనే ఉండిపోతుంది. గర్భవతులలో తల్లి నుంచి బిడ్డకు పాకి అబార్షన్లు, కడుపులోనే శిశువు చనిపోవడం, పుట్టిన పిల్లల్లో అవయవ లోపాలు ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. నిర్ధారణ కోసం వీడీఆర్ఎల్, ఆర్పీఆర్ వంటి రక్తపరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ తర్వాత పెన్సిలిన్ వంటి యాంటీబయోటిక్స్‌తో చికిత్స చేయడం జరుగుతుంది. చికిత్సలో బ్యాక్టీరియా నశించిపోతుంది. కాని,దాని వల్ల ముందుగా అవయవాలపై ఏర్పడిన దుష్ప్రభావాన్ని తిరిగి తగ్గించడం జరగదు. నివారణ మార్గాలలో అనేక లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. కండోమ్స్ వాడుకోవాలి. చికిత్స ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. ∙నాకు కొత్తగా పెళ్లయింది. ‘వెజైనిస్మస్’ సమస్యతో బాధ పడుతున్నాను. ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం కాదని ఒకరంటే, తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలనుంటున్నారు మరొకరు. ఏది నిజం? చికిత్స ఏ విధంగా ఉంటుందో తెలియజేయగలరు. – ఆర్వి, హైదరాబాద్ యోని భాగంలోని కండరాలు కొన్ని సందర్భాల్లో బిగుసుకుపోవడాన్ని వెజైనిస్మస్ అంటారు. ఇది కలయిక సమయంలో కావచ్చు. పెల్విక్ పరీక్ష చేసేటప్పుడు కావచ్చు. దాని వల్ల ఆ సమయంలో బాగా నొప్పిగా ఉండటం, కలయికకు, పరీక్షకు సహకరించకపోవడం వంటివి జరుగుతాయి. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. కొందరిలో నొప్పి ఉంటుందనే భయంతో, గర్భం వస్తుందనే భయంతో ఆందోళన, మానసిక సమస్యలు, జననేంద్రియాల దగ్గర దెబ్బలు, ఆపరేషన్లు, ఏవైనా లైంగిక సమస్యలు, బాల్యంలో కొన్ని సంఘటనలు చూడటం, చదవడం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చు. దీనికి చికిత్సలో భాగంగా కారణం తెలుసుకోవడానికి వారితో విడిగా మాట్లాడటం, కౌన్సెలింగ్ చెయ్యడం, మెల్లగా యోని భాగం దగ్గర పరీక్ష చేయడం వంటివి అవసరం. తర్వాత సమస్యను విశ్లేషించి, కౌన్సెలింగ్ చెయ్యడం వల్ల చాలామందిలో సమస్య తగ్గుతుంది. ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే చికిత్స తీసుకోవడం, పెల్విక్ కండరాల వ్యాయామాలు, మానసిక ఒత్తిడి తగ్గడానికి నడక, యోగా, ధ్యానం వంటివి పాటించడం, యోని భాగంలో లూబ్రికేషన్ జెల్ వాడటం, లేదా డైలేటర్స్ వాడటం, భార్యా భర్త అన్యోన్యంగా ఉంటూ ఓపికగా కలయికకు ప్రయత్నం చేయడం వల్ల చాలామందిలో మార్పు ఉంటుంది. అరుదుగా కొద్ది మందిలో ఎలాంటి మార్పు లేనప్పుడు చిన్నగా కోసి కండరాలను వదులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా బోటిలినమ్ టాక్సిన్ (బోటాక్స్) అనే ఇంజెక్షన్ నేరుగా యోని కండరాలకు ఇవ్వడం వల్ల యోని కండరాలు వదులయ్యి వెజైనిస్మస్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్, హైదరాబాద్ -
మీరే డిజైనర్ అవ్వండిక!
వాయనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసిన దుస్తులు ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటాయి. అందుకే మహిళలందరికీ వాటి మీద మక్కువ ఎక్కువ. కేవలం చీరలు, డ్రెస్సులనే కాదు... కర్టెన్లు, దిండు కవర్లు, సోఫా కవర్లు, టేబుల్ క్లాత్‌లు, ఖర్చీఫ్‌లు... ఏవైనా సరే, ఓ చిన్న డిజైన్ వేస్తే దాని లుక్కే మారిపోతుంది. ఎలాగూ పిల్లలకి పరీక్షలు అయిపోయాయి. సెలవులిచ్చేశారు. వాళ్లు ఫ్రీ అయితే మనమూ ఫ్రీనే కదా! ఈ టైమ్‌ని వృథా చేయకుండా కొన్ని డిజైన్లు వేస్తే పోలా! కాకపోతే ఆ పని చేసేముందు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేటప్పుడు పాటించాల్నిన కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. పెయింట్ చేయాలనుకున్నప్పుడు ముందు దృష్టి పెట్టాల్సింది వస్త్రం మీద. చీర, కర్టెన్... ఏదైనా సరే, ముందు దాన్ని నీటిలో పులిమి ఆరబెట్టాలి. ఒకవేళ బట్ట ముడుచుకుపోతే దాని మీద పెయింట్ వేయకూడదు. ఎందుకంటే... ఉతికిన ప్రతిసారీ అలా ముడుచుకుపోతూ ఉంటే, రంగులు వేసిన చోట బీటల మాదిరి వస్తుంది. ఆపైన రంగు మెల్లగా ఊడిపోతుంది. ముందు ఏదైనా పాత బట్టమీద డిజైన్ గీసుకుని, ఏయే కాంబినేషన్ల రంగులు వేస్తే బాగుంటుందో వేసి చూసుకోవాలి. పూర్తి అవగాహన వచ్చిన తరువాత అసలు బట్ట మీద వేయాలి. రంగుల్ని ఏ తరహాలో వేయాలో నిర్ణయించుకోవాలి. బ్రష్, కోన్స్, ట్యూబ్స్, మ్యాగ్నెట్ పెన్, రోలర్ అంటూ రకరకాల పెయింటింగ్ టూల్స్ లభిస్తున్నాయి. డిజైన్‌ను బట్టి వేటిని ఉపయోగించాలో ముందే నిర్ణయించుకోవాలి. డిజైన్ని పెన్సిల్‌తో గీస్తే ఓకే. కార్బన్ పెట్టి గీస్తుంటే కనుక మరీ కొత్త కార్బన్ పెట్టకూడదు. ఎందుకంటే దాని రంగు బట్టకు అంటుకుపోతుంది. నాలుగైదుసార్లు వాడేసింది అయితే మరకలు పడవు. ఏ రెండు రంగులకీ ఒకే బ్రష్ వాడకూడదు. రంగులు కలసిపోయి వేరే షేడ్ వచ్చేస్తుంది. రంగుల్లో నీరు కూడా ఎక్కువ కలపకూడదు. నీరు బట్టలోకి ఇంకిపోయి రంగు పాకిపోతుంది. వేసేశాక ఒక్కోసారి రంగులు కొంచెం అంటీ అంటనట్టుగా కనిపిస్తూ, అక్కడక్కడా చుక్కల మాదిరి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని సరి చేయడానికి మిస్టర్ బాటిల్ (మార్కెట్లో దొరకుతుంది)లో నీరుపోసి, డిజైన్ మీద స్ప్రే చేయాలి. వెంటనే డ్రయ్యర్‌తో ఆరబెట్టి, తక్కువ వేడిమితో ఇస్త్రీ చెయ్యాలి. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయ్యాక డిజైన్ వేసిన వస్త్రాన్ని ఓ రోజంతా ఆరబెట్టాలి. మూడు రోజుల వరకూ ఉతకకూడదు. ఫటాఫట్... ఫింగర్ చిప్స్! ఫింగర్ చిప్స్ అంటే ఇష్టం ఉండనిదెవరికి! అయితే ఏ కేఎఫ్సీలోనో, మెక్ డొనాల్డ్స్ లోనో తినాలంటే రేటు చూసి భయమేస్తుంది. అదే ఇంట్లో చేసుకుంటే... అక్కడయ్యే ఖర్చులో సగం కూడా అవ్వదు. కాకపోతే చేయడం కాస్త కష్టమనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే... ఫింగర్ చిప్స్ అన్నీ ఒకే ఆకారంలో, ఒకే పరిమాణంలో ఉండకపోతే తినబుద్ధి కాదు. పోనీ అలా కోద్దాం అంటే చేతనవ్వదు. అలాంటప్పుడు ఈ ‘ఫింగర్ చిప్ మేకర్’ బాగా ఉపయోగపడుతుంది. బంగాళాదుంపను ఒలిచి, ఇందులో పెట్టి ఒక్క నొక్కు నొక్కితే చాలు... ఇదిగో, ఇలా ముక్కలు బయటకు వస్తాయి. వాటికి ఉప్పు, కారం, మసాలా పొడి అద్ది నూనెలో వేయించుకోవడమే. రెండు మూడు రకాల బ్లేడులుంటాయి. నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ మేకర్ ధర 800 రూపాయలు. అదీ మెటల్ది అయితే. ప్లాస్టిక్‌వి ఆరు వందలకే దొరుకుతాయి!