
‘నీ కన్నీళ్లను మోసే శక్తి నాకు లేదు’ అని నటులు ఏదో ఒక సందర్భంలో మనసులోనో, మనసు దాటో అని ఉండవచ్చు. కొన్ని పాత్రలు అలా ఉంటాయి మరి! పాత్ర పండాలంటే జీవం ఉట్టిపడాలి. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నం ఫలించకపోవచ్చు. తేలిపోవచ్చు. మరి బాధితులే నటమాధ్యమంలోకి, తమ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తే..? వారి జీవితం మన కళ్ల ముందుకు నడిచొస్తుంది. జీవం ఉట్టిపడుతుంది. పదిమందికి మంచి చేసే సందేశం వేగిరంగా అందుతుంది...
ప్రియ జోషి (హైదరాబాద్) నటి, రచయిత్రి. ఆమె ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడింది. ఆ సమయంలో ప్రియ మానసిక ప్రపంచం ఏమిటో మనకు తెలియదు. ధైర్యంగా కనిపించి ఉండొచ్చు. కాని నిజంగానే ధైర్యంగా ఉందా? కళ్లలో నీటిపొరలేవీ కనిపించకపోవచ్చు. కానీ మనకు కనిపించని దుఃఖసముద్రాలు ఆమె మనసులో ఏమైనా ఉన్నాయా? తనకు క్యాన్సర్ ఉందన్న చేదునిజం తెలిసిన క్షణం నుంచి క్యాన్సర్ నుంచి బయట పడిన రోజు వరకు ఆమె హృదయం రణరంగంగా మారి ఉండవచ్చు. అక్కడ ఆశ, నిరాశలకు మధ్య ఎన్నో యుద్ధాలు జరిగి ఉండవచ్చు. ఆత్మవిశ్వాసం అనే ఆయుధం అప్పుడప్పుడూ చేజారిపోతూ ఉండవచ్చు. దాని జాడ కనిపించకుండా ఉండవచ్చు. చేజారిన ఆయుధాన్ని ఆమె కష్టపడి వెదికి పట్టుకొని ఉండవచ్చు.
ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు ఒక ఏకాంకిక సమాధానం చెప్పబోతుంది. ప్రియ జోషి ఆత్మబలం, పోరాట పటిమను నితిన్ బస్రూర్ హిందీలో ‘ఔర్ షమా జల్తీ రహీ’ పేరుతో సోలో ప్లేగా మలిచారు. ఈ ప్లేలో ప్రియ జోషి తన పాత్రలో తానే నటించడానికి సన్నద్ధం కావడం ఒక విశేషం అయితే, కస్ట్యూమ్, స్టేజ్ సపోర్ట్, మ్యూజిక్, లైట్ ఆరెంజ్‌మెంట్‌లాంటి బాధ్యతలను స్త్రీలే నిర్వహించడానికి రెడీ కావడం మరో విశేషం.
ఆర్మీ ఆఫీసర్ భార్యగా, కాన్సర్ సర్వైవర్‌గా తన అనుభవాలతో రెండు పుస్తకాలు రాసింది ప్రియ. గతంలో టీచర్‌గా పనిచేసిన ప్రియ ఇప్పుడు ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేస్తుంది. రంగస్థలం అనేది సృజనాత్మక వేదిక మాత్రమే కాదు...సందేశం అందే విశాల వేదిక కూడా. అంకితభావం, ఆశావహæదృక్పథం, సంకల్పబలం ఉంటే ఎంతటి జటిలమైన పరిస్థితి నుంచైనా బయటపడవచ్చు అనే సందేశాన్ని ‘ఔర్ షమా జల్తీ రహీ’ ద్వారా ఇవ్వాలన్నది ప్రియ జోషి ఉద్దేశం. నిజజీవితం నుంచి నడిచొచ్చిన కథ, నాటకంలాంటి సృజనాత్మక రూపాలకు జనాలు జేజేలు పలకడం కొత్త కాదు. అయితే ఈ సింగిల్ ప్లే మనం ప్రశంసించడానికి మాత్రమే పరిమితమైన కళారూపం కాదు. మనకు ధైర్యాన్ని ఇచ్చే ఆయుధం కూడా!
Comments
Please login to add a commentAdd a comment