మీరే డిజైనర్ అవ్వండిక!
వాయనం
ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసిన దుస్తులు ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటాయి. అందుకే మహిళలందరికీ వాటి మీద మక్కువ ఎక్కువ. కేవలం చీరలు, డ్రెస్సులనే కాదు... కర్టెన్లు, దిండు కవర్లు, సోఫా కవర్లు, టేబుల్ క్లాత్‌లు, ఖర్చీఫ్‌లు... ఏవైనా సరే, ఓ చిన్న డిజైన్ వేస్తే దాని లుక్కే మారిపోతుంది. ఎలాగూ పిల్లలకి పరీక్షలు అయిపోయాయి. సెలవులిచ్చేశారు. వాళ్లు ఫ్రీ అయితే మనమూ ఫ్రీనే కదా! ఈ టైమ్‌ని వృథా చేయకుండా కొన్ని డిజైన్లు వేస్తే పోలా! కాకపోతే ఆ పని చేసేముందు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేటప్పుడు పాటించాల్నిన కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
పెయింట్ చేయాలనుకున్నప్పుడు ముందు దృష్టి పెట్టాల్సింది వస్త్రం మీద. చీర, కర్టెన్... ఏదైనా సరే, ముందు దాన్ని నీటిలో పులిమి ఆరబెట్టాలి. ఒకవేళ బట్ట ముడుచుకుపోతే దాని మీద పెయింట్ వేయకూడదు. ఎందుకంటే... ఉతికిన ప్రతిసారీ అలా ముడుచుకుపోతూ ఉంటే, రంగులు వేసిన చోట బీటల మాదిరి వస్తుంది. ఆపైన రంగు మెల్లగా ఊడిపోతుంది.
ముందు ఏదైనా పాత బట్టమీద డిజైన్ గీసుకుని, ఏయే కాంబినేషన్ల రంగులు వేస్తే బాగుంటుందో వేసి చూసుకోవాలి. పూర్తి అవగాహన వచ్చిన తరువాత అసలు బట్ట మీద వేయాలి.
రంగుల్ని ఏ తరహాలో వేయాలో నిర్ణయించుకోవాలి. బ్రష్, కోన్స్, ట్యూబ్స్, మ్యాగ్నెట్ పెన్, రోలర్ అంటూ రకరకాల పెయింటింగ్ టూల్స్ లభిస్తున్నాయి. డిజైన్‌ను బట్టి వేటిని ఉపయోగించాలో ముందే నిర్ణయించుకోవాలి.
డిజైన్‌ని పెన్సిల్‌తో గీస్తే ఓకే. కార్బన్ పెట్టి గీస్తుంటే కనుక మరీ కొత్త కార్బన్ పెట్టకూడదు. ఎందుకంటే దాని రంగు బట్టకు అంటుకుపోతుంది. నాలుగైదుసార్లు వాడేసింది అయితే మరకలు పడవు.
ఏ రెండు రంగులకీ ఒకే బ్రష్ వాడకూడదు. రంగులు కలసిపోయి వేరే షేడ్ వచ్చేస్తుంది. రంగుల్లో నీరు కూడా ఎక్కువ కలపకూడదు. నీరు బట్టలోకి ఇంకిపోయి రంగు పాకిపోతుంది.
వేసేశాక ఒక్కోసారి రంగులు కొంచెం అంటీ అంటనట్టుగా కనిపిస్తూ, అక్కడక్కడా చుక్కల మాదిరి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని సరి చేయడానికి మిస్టర్ బాటిల్ (మార్కెట్లో దొరకుతుంది)లో నీరుపోసి, డిజైన్ మీద స్ప్రే చేయాలి. వెంటనే డ్రయ్యర్‌తో ఆరబెట్టి, తక్కువ వేడిమితో ఇస్త్రీ చెయ్యాలి.
ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయ్యాక డిజైన్ వేసిన వస్త్రాన్ని ఓ రోజంతా ఆరబెట్టాలి. మూడు రోజుల వరకూ ఉతకకూడదు.
ఫటాఫట్... ఫింగర్ చిప్స్!
ఫింగర్ చిప్స్ అంటే ఇష్టం ఉండనిదెవరికి! అయితే ఏ కేఎఫ్‌సీలోనో, మెక్ డొనాల్డ్స్ లోనో తినాలంటే రేటు చూసి భయమేస్తుంది. అదే ఇంట్లో చేసుకుంటే... అక్కడయ్యే ఖర్చులో సగం కూడా అవ్వదు. కాకపోతే చేయడం కాస్త కష్టమనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే... ఫింగర్ చిప్స్ అన్నీ ఒకే ఆకారంలో, ఒకే పరిమాణంలో ఉండకపోతే తినబుద్ధి కాదు. పోనీ అలా కోద్దాం అంటే చేతనవ్వదు. అలాంటప్పుడు ఈ ‘ఫింగర్ చిప్ మేకర్’ బాగా ఉపయోగపడుతుంది. బంగాళాదుంపను ఒలిచి, ఇందులో పెట్టి ఒక్క నొక్కు నొక్కితే చాలు... ఇదిగో, ఇలా ముక్కలు బయటకు వస్తాయి. వాటికి ఉప్పు, కారం, మసాలా పొడి అద్ది నూనెలో వేయించుకోవడమే. రెండు మూడు రకాల బ్లేడులుంటాయి. నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ మేకర్ ధర 800 రూపాయలు. అదీ మెటల్‌ది అయితే. ప్లాస్టిక్‌వి ఆరు వందలకే దొరుకుతాయి!