World Radio Day
-
రేడియో.. ఓ మధుర జ్ఞాపకం
మిరుదొడ్డి(దుబ్బాక): రేడియో ఈ పేరు వింటే చాలు ఒకప్పుడు కాలక్షేపానికి వినోద ప్రచార సాధనంగా నిలిచింది. నాడు రేడియోలో వచ్చే ధ్వని కార్యక్రమాలు మనసుతో చూసేలా కంటికి కదలాడేవి. సుప్రభాత పాటలతో పల్లెలను, పట్టణాలను మేలుకొల్పేవి. సినిమా, జానపద గీతాల ప్రసారాలతో మనసును ఉరకలెత్తించేవి. మధ్యాహ్నం కారి్మక లోకాన్ని తట్టి లేపేవి. సాయంత్రం రేడియోలో వచ్చే వార్తలు, వ్యవ సాయ సాగు పద్ధతులు జనరంజకంగా పలకరించేవి. అలసిన ప్రతి ఒక్కరికీ కమ్మనైన సంగీతంతో మనసును ఓలలాడించి నిద్ర పుచ్చేవి. కానీ శాస్త్ర పరిజ్ఞానం పెరిగిపోయి కలర్ టీవీలు, సెల్ ఫోన్ల రాకతో రేడియోలు కనుమరుగయ్యాయి. రేడియోతో ఉన్న తమ అనుబంధాన్ని ఒదులుకో లేక కొందరు రేడియో ప్రియులు రేడియోలను భద్రంగా దాచుకుంటూ వాటితో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. కనిపించని రేడియో శాస్త్ర పరిజ్ఞానం పెరిగిపోవడంతో మొదట బ్లాక్ అండ్ వైట్ టీవీల రాకతో కాస్త వెనుక బడ్డ రేడియోలు కలర్ టీవీలు ఇంటింటికీ రంగ ప్రవేశం చేశాక పూర్తిగా మూలనపడ్డాయి. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జేబులో సెల్ ఫోన్లు మార్మోగి పోతుండడంతో రేడియోలు పూర్తిగా కనురుగయ్యాయి. సెల్ఫోన్లో ప్రపంచం నలు మూలల్లో ›జరిగే వార్తా విశేషాలు ఎప్పటికప్పుడూ తెలిసి పోతుండటంతో రేడియోల వినియోగం ప్రశ్నార్థకంగా మారింది. రేడియో దినోత్సవం రేడియో కనుమరుగైపోతున్న క్రమంలో యునె స్కో 36వ కాన్ఫరెన్స్ సమావేశంలో 2011 నవంబర్ 13న తీసుకున్న తీర్మాణం ప్రకారం 2012 ఫిబ్రవరి 13న తొలి సారిగా అంతర్జాతీయ రేడియో డేగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ దాచుకున్నా.. నా చిన్నప్పుడు ఎక్కువ రేడియోతోనే పోపతి ఉండేది. అప్పుడు రేడియోలు పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లల్లో ఉంటుండే. నాకు కూడా ఒక రేడియో కొనుక్కోవాలని అనిపించింది. నాడు బ్యాటరీలతో రేడియోలు పని చేస్తుండే. రాను రాను ఇంటింటికీ కలర్ టీవీలు, సెల్ ఫోన్లు రావడంతో రేడియోలు మూలకు పడ్డాయి. ఇప్పుడు రేడియోలు వాడాలంటే బ్యాటరీలు మార్కెట్లో దొరకడం లేదు. వాటిని రిపేరు చేసే వాళ్లు లేకుండా పోయారు. ఇప్పటికీ రేడియోను భద్రంగా దాచుకున్న. – ఎర్రోల్ల బాల్‌నర్సయ్య, మిరుదొడ్డి -
World Radio Day: భవిష్యత్ డిజిటల్ రేడియోదే..!
సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): కమ్మని కబుర్లు చెప్పే నెచ్చెలి.. సినిమా పాటలతో మైమరపించే సొగసరి.. వందల, వేల మైళ్ల దూరంలో జరిగే విషయాలను వార్తల రూపంలో అందించే గడసరి.. పొద్దున్నే సిగ్నేచర్ ట్యూన్ సుప్రభాతంతో నిద్రలేపి.. మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంలో పొద్దుపుచ్చి.. సాయంత్రం జనరంజకంగా పలకరించి.. రాత్రి కమ్మని పాటలతో ఆహ్లాదపరిచి నిద్రపుచ్చే ఒకప్పటి ఏకైక వినోద, విజ్ఞాన, వార్తా సాధనం రేడియో. రేడియో అంటే ఒక ఎమోషన్. ఒకప్పుడు సగటు మనిషి జీవితంలో రేడియో ఒక అంతర్భాగమంటే అతిశయోక్తి కాదు. అదొక ప్రెస్టేజ్ సింబల్‌గా ఉండేది. అప్పట్లో పెళ్లికి కట్నంగా రేడియో తీసుకునేవారంటే ఇపుడు వింతగా అనిపించవచ్చు. కానీ అదే నిజం. అటువంటి రేడియో వినియోగం తగ్గుతూ వచ్చింది. సాంకేతిక విప్లవంతో సరికొత్త ఆవిష్కరణలతో టీవీల రాకతో రేడియో లవర్స్ క్రమంగా కనుమరుగవుతున్నారు. ఎఫ్ఎంలు వచ్చాక కాస్త ఊపిరిపోసుకున్న రేడియో కూడా సాంకేతికతను అద్దుకొని భవిష్యత్తులో డిజిటల్ ప్రసారాలతో హల్చల్ చేయడానికి సిద్ధమవుతోంది. నేడు రేడియో దినోత్సవం సందర్భంగా ప్రయోగ దశలో ఉన్న డిజిటల్ రేడియో మోండియాల్ (డీఆర్ఎం) ప్రసారాలపై ప్రత్యేక కథనం. ఇప్పటివరకూ మనం వింటున్న అనలాగ్ రేడియో ప్రసారాల కాలం ముగియనుంది. ఇక భవిష్యత్ అంతా డీఆర్ఎం డిజిటల్ రేడియో ప్రసారాలదే. నగరంలోనే కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా ఎఫ్ఎం కంటే మరింత నాణ్యమైన, శక్తివంతమైన రేడియో ప్రసారాలను అందించే ప్రక్రియ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా కూడా డీఆర్ఎం డిజిటల్ రేడియో ప్రయోగాత్మక ప్రసార పరీక్షలు చేస్తున్నాయి. షార్ట్ వేవ్ ద్వారా నూతన సాంకేతికతతో బ్రెజిల్, సౌతాఫ్రికా, ఇటలీ, రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, రొమేనియా, నైజీరియా, న్యూజిలాండ్, కొరియా, జర్మనీ, యూకే వంటి దేశాల్లో ఈ డిజిటల్ రేడియో ప్రయోగాత్మక ప్రసారాలు మొదలు పెట్టారు. భారతదేశంలో 39 మీడియం వేవ్ ఆకాశవాణి కేంద్రాల ద్వారా ఈ డిజిటల్ రేడియో మోండియాల్ ప్రయోగాత్మక ప్రసారాలు చేస్తున్నారు. వన్ మేన్ డీఆర్ఎం మార్కెటింగ్ మెషీన్ కృష్ణారావు అత్యాధునిక డీఆర్ఎం డిజిటల్ రేడియో సాంకేతిక ఆవిష్కరణల పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ, అందుబాటులోకి తీసుకురావడంలోనూ తమ్మినాన కృష్ణారావు విశేష కృషిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా, వజ్రపు కొత్తూరు మండలం, మహాదేవిపురం గ్రామానికి చెందిన ఆయన ఏడేళ్ల పాటు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమ రూపకల్పన విభాగంలో పని చేశారు. ఆ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దృశ్య శ్రవణ కార్యక్రమ రూపకల్పన పరిశోధన కేంద్రంలో ప్రయోక్తగా, ఉప సంచాలకుడుగా పాతికేళ్ళ పాటు విధులు నిర్వర్తించారు. ప్రవృత్తినే వృత్తిగా చేసుకొని డిజిటల్ రేడియో టెక్నాలజీపై దృష్టి సారించి గత ఆరేళ్లుగా దేశీయ, అంతర్జాతీయంగా అవగాహన కార్యక్రమాలను సొంతంగా నిర్వహిస్తున్నారు. బిర్లా జంక్షన్ వద్ద హుందాయ్ షోరూంలో సేల్స్ మేనేజర్‌కు డీఆర్ఎం డిజిటల్ రేడియో ప్రసారాలపై అవగాహన కల్పిస్తున్న కృష్ణారావు అలాగే కార్లలో ఈ ప్రసారాలకు అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా అన్ని కార్ల షోరూంల సేల్స్ మేనేజర్లకు, టెక్నీషియన్లకు కొత్త కార్లలో ఉన్న డీఆర్ఎం డిజిటల్ రేడియోల కోసం అవగాహన కల్పించడం ద్వారా వినియోగ దార్లకు తెలియజేసే వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాను. ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ ప్రత్యేక కార్యక్రమంతో పాటు వ్యవసాయ సంబంధ కార్యక్రమాలను గ్రామీణులు, గిరిజనులు వినడానికి దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకీ డిజిటల్ రేడియో సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సైతం విజ్ఞప్తి చేశారు. డిజిటల్ రేడియో విద్యా ప్రసారాలపై తమ్మినాన కృష్ణారావు చేస్తున్న కృషిని గుర్తించిన లండన్‌లోని ప్రపంచ డిజిటల్ రేడియో మోండియల్ కన్సార్టియం వారు అంతర్జాతీయ ప్రత్యేక విశిష్ట పురస్కారాన్ని ‘ఏ ఒన్ మేన్ డీఆర్ఎం మార్కెటింగ్ మెషీన్’ పేరిట ప్రకటించారు. 918 ఫ్రీక్వెన్సీపై నాలుగు సర్వీసులు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 918 ఫ్రీకెన్సీపై డీఆర్ఎం డిజిటల్ రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రేడియో అంటే ఒకే ఫ్రీక్వెన్సీపై ఒకే ప్రసారం జరుగుతోంది. కానీ డీఆర్ఎం డిజిటల్ రేడియో ద్వారా 918 ఫ్రీక్వెన్సీ ద్వారా నాలుగు సర్వీసులు పొందే వెసులుబాటు కలుగుతుంది. ఒకే అలవరుసపై పారా మెట్రిక్ స్టీరియో కలిగిన మూడు ఆడియో కార్యక్రమాలతో పాటు ఒక అత్యవసర సందేశాల జర్న్లైన్, మల్టీమీడియా ప్రోటోకాల్ ఛాయా చిత్రాల వంటి సేవలను పొందవచ్చు. ఒకే ఫ్రీక్వెన్సీలో వార్తలు, సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతం ఈ మూడింటిలో నచ్చిన సర్వీసును ఎంచుకొని వినే అవకాశం ఉంటుంది. కొత్త తరం కార్లలో డీఆర్ఎం రేడియో ప్రసారాలు డీఆర్ఎం రేడియో ప్రసారాలకు రిసీవర్ కీలకం. అయితే ఆ రిసీవర్ రూ.10 వేల నుంచి 15 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో వాటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. అయితే 2017 సంవత్సరం తరువాత మోడల్ కార్లలో ఈ డిజిటల్ రేడియో ప్రసారాలు వినే అవకాశముంది. అయితే ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ప్రయోగదశలో ఉండడంతో ఎక్కువగా హిందీ భాషలోనే ప్రసారాలు జరుగుతున్నాయి. ప్రత్యేక సమయాల్లో తెలుగు కార్యక్రమాలు ఉంటున్నాయి. త్వరలో ఎఫ్ఎంలో డిజిటల్ రేడియో ప్రసారాలు ప్రస్తుతం ఎఫ్ఎం రేడియో హవా ఉంది. దీంతో ముందుగా ఎఫ్ఎం ద్వారా డీఆర్ఎం డిజిటల్ రేడియో ప్రసారాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎఫ్ఎంలో ఈ ప్రసారాలకు సంబంధించి రాజస్థాన్‌లో ప్రయోగాలను ప్రారంభించారు. అక్కడ ప్రయోగాత్మక ప్రసారాలు విజయవంతంగా జరుగుతుండడంతో త్వరలో ఎఫ్ఎంలో కూడా ఈ ప్రసారాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రోత్సహించాలి రోజుకో కొత్త అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఆ కారణంగానే డీఆర్ఎం డిజిటల్ రేడియో సెట్ల తయారీలో జాప్యం జరుగుతోందని అనిపిస్తోంది. చవకైన, నాణ్యమైన డిజిటల్ రేడియో సెట్ల తయారీ దార్లకు ప్రభుత్వం తగిన రాయితీలిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరముంది. తద్వారా సామాన్యులకు డిజిటల్ రేడియో సెట్లు అందుబాటులోకి వస్తాయి. – డాక్టర్ తమ్మినాన కృష్ణారావు, డిప్యూటీ డైరెక్టర్, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం దృశ్య శ్రవణ కార్యక్రమ రూపకల్పన పరిశోధనా కేంద్రం -
గోవా పోరాటంలో భాగమైన రహస్య రేడియో
విమానానికి రేడియో ట్రాన్స్ మీటర్ బిగించారు. ఇంకో లౌడ్ స్పీకర్ అమర్చారు. ఆ ప్రసార బృందం పూలు చల్లుతూ 450 సంవత్సరాల చరిత్రలో అపు రూపమైన వార్తను ప్రకటిస్తూ రెండు గంటలపాటు ఆకాశ యానం చేశారు! ఆశ్చర్యమని పించే ఈ సంఘటన 1961 డిసెంబర్ 19న స్వేచ్ఛ సిద్ధించిన గోవాలో జరిగింది. అది గోవా స్వాతంత్య్రం కోసం మొదలైన ‘ద వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్. కొత్త ప్రపంచం–కొత్త రేడియో అనే ఇతివృత్తంతో ప్రపంచ వ్యాప్తంగా రేడియో దినోత్సవం జరుపుకుంటున్న వేళ మనం మరచిపోయిన రేడియో చరిత్రను కొత్తగా తెలుసుకుందాం. 1955 నవంబర్ 25న మొదలైన ఈ రేడియో స్టేషన్ గోవాకు స్వాతంత్య్రం లభించిన రోజు విజయోత్సవంలో పాల్గొని తన ప్రసారాలు ఆపివేసి చరిత్రలో విలక్షణ పుటగా మారిపోయింది. 1510లో గోవా పోర్చుగీసు స్థావరంగా మారింది. పాండిచ్చేరి ఫ్రెంచి వారి చేతిలోకి పోయినట్టు గోవా, డయ్యు, డమన్ పోర్చుగీసు చేతిలో ఉండిపోయాయి. 1932లో గోవా గవర్నర్‌గా యాంటోనియో డి ఒలివీరా సలాజార్ వచ్చిన తర్వాత ఆంక్షలు పెరగడం, ప్రజల హక్కులు హరించడం మొదలైంది. 1940వ దశకం నుంచి స్వాతంత్య్ర పోరాటం గురించి ఆలోచనలు మొదలయ్యాయి. 1954లో దాద్రా నగర్ హవేలీ విముక్తి పొందడం కొత్త ఆశలకు ద్వారాలు తెరిచింది. 1955లో భారత ప్రభుత్వం ‘ఎకనమిక్ బ్లాకేడ్’ ప్రకటించడంతో గోవా బంగాళదుంపలు (నెద ర్లాండ్స్), వైన్ (పోర్చుగీసు), కూరలు, బియ్యం (పాకి స్తాన్), టీ (శ్రీలంక), సిమెంట్ (జపాన్), ఉక్కు (బెల్జియం) ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 1961లో చేపలు పట్టే భారతీయుల పడవలపై గోవా కాల్పులకు దిగడంతో పరిస్థితి మరింత దిగజారింది. 1955 నవంబర్ 25న ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ గోవా సరిహద్దు రాష్ట్ర ప్రాంతం అంబోలి అడవుల నుంచి మొదలైంది. భారత స్వాతంత్య్ర స్ఫూర్తితో వామన్ సర్దేశాయి, లిబియా లోబో కలిసి పోర్చుగీసు, కొంకణి భాషల కార్యక్రమాలతో దీన్ని ప్రారంభిం చారు. రేడియో స్టేషన్ ట్రాన్స్‌మీటర్‌ను ఒక ట్రక్కుకు బిగించి, దట్టమైన అడవుల నుంచి ప్రసారాలు చేసే వారు. గోవా అధికారికంగా చేసే ప్రాపగాండాను వమ్ము చేస్తూ నడిచిన ఈ సీక్రెట్ రేడియో ప్రసారాలకు భారతదేశం నుంచి, ఇతర దేశాల నుంచి మద్దతు లభించేది. ఈ విషయంలో గోవా ఒంటరి కాదనే భావం కల్గించి, ధైర్యం నూరిపోయడానికి వార్తల పరి ధిని పెంచారు. ఇండియా భూభాగం నుంచి ప్రసారం అయ్యేది కనుక భారతీయ నాయకుల ప్రసంగాలు కూడా ప్రసారం చేశారు. 1956 జూలై 15న వినోబా భావే తన రేడియో ప్రసంగంలో శాంతియుతంగా గోవాను వదిలి వెళ్ళిపొమ్మని పోర్చుగీసు వారిని కోరారు. భారత్ పార్లమెంటులో, ఇతర దేశాలలో ఈ విషయంపై జరిగే చర్చల సారాంశాలను కూడా శ్రోత లకు ఎప్పటికప్పుడు అందించేవారు. 1961 డిసెం బర్లో ‘ఆపరేషన్ విజయ్’ మొదలయ్యాక వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ బృందం అడవుల నుంచి బెల్గాం ప్రాంతా నికి వచ్చింది. ఆ సమయం నుంచి ప్రతి గంటకూ ప్రసారాలు చేశారు. గోవా ఆర్మీనుద్దేశించి భారత రక్షణ మంత్రి వి.కె.కృష్ణ మీనన్ 1961 డిసెంబర్ 15న ఈ సీక్రెట్ రేడియోలో ప్రసంగిస్తూ చర్చలకు ఆహ్వానిం చారు. భారత సైన్యం లోపలికే రాకుండా గోవా ఆర్మీ డిసెంబర్ 17న బ్రిడ్జిని కూల్చివేసింది. సుమారు 36 గంటల పాటు వాయు, సముద్ర, భూతలాలపై భీకర పోరాటం నడిచింది. డిసెంబర్ 19న గోవా ప్రాంతం భారత భూభాగంలో కలిసిపోయింది. 1955 నుంచి 1961 దాకా వామన్ సర్దేశాయి, లిబియా లోబో అడవుల్లో పడిన ఇబ్బందులు ఏమిటో మనకు తెలియదు. కానీ ఈ కాలంలోనే వారిరువురూ భార్యాభర్తలుగా మారిపోయారు. రేడియో చరిత్రలో ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ ఒక స్ఫూర్తి పుంజం. డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్ : 94407 32392 (నేడు ప్రపంచ రేడియో దినోత్సవం) -
వినిపించని ఆకాశ 'వాణి'
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.. అని రేడియో నుంచి మాటలు వినగానే నా మనస్సులో వార్తలు వినాలనే కుతూహలం పెరిగేది. కానీ నేడు ఈ రేడియోలు లేక టీవీలో వార్తలు సక్రమంగా వినలేకపోతున్నానంటూ తనకు రేడియోతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నాడు సిద్దిపేట పట్టణానికి చెందిన రాజయ్య. కేవలం రాజయ్య మాత్రమే కాదు అనేక మంది రేడియోతో అనుబంధం ఉన్నవారు అందరూ ఇదే విధంగా రేడియోను గుర్తు చేయగానే ఇలానే తమ అభిప్రాయాలు వెల్లడించారు. నేడు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గతంలో ఒక చోట నుంచి మరొక చోటుకు సందేశాలు, విషయాలు చేరాలంటే కేవలం రేడియో ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది, లేదంటే వ్యక్తి అక్కడికి వెళ్లడంతో మాత్రమే విషయం తెలిసేది. కాలక్రమంలో రేడియోల స్థానంలో టీవీలు వచ్చాయి. దీంతో అనేక సంవత్సరాల వైభవం పొందిన రేడియోలు నేడు ఎక్కడో ఒక చోట మాత్రమే దర్శనమిస్తున్నాయి. కేవలం ప్రధాని నరేంద్రమోడీ ప్రతీ నెలా దేశ ప్రజలకు అందించే సందేశాన్ని వినడానికి మాత్రమే అక్కడక్కడ రేడియోలు ఉన్నాయి. రేడియోలకు అనేక సంవత్సరాల చరిత్ర ఉంది. అనేక యుద్ధాల విషయాలు, విశేషాల విషయాలను ప్రజలకు తెలియజేసిన చరిత్ర రేడియోలది. అదే విధంగా ప్రపంచంలోనే శాంతియుతంగా స్వాతంత్య్రం సాధించిన భారత్‌ను కదిలించిన నాయకుల ప్రసంగాలు, తదితర విషయాలను ఈ రేడియోలే నాడు ప్రజలకు ప్రచార మాద్యమాలుగా నిలిచి, ప్రజలను ఐక్యంగా చేశాయి. ఇంతటి విశిష్టత ఉన్న రేడియోలు నేడు కనుమరుగవుతుండటం చింతించవలిసిన విషయం. అయినా నేటికి కూడా రేడియోలో వార్తలు వినే వారు, అదేవిధంగా ఎఫ్ఎమ్ లో పాటలు వినే వారు ఉన్నారు. అదే విధంగా దూరవిద్య పాఠాలు ఈ రేడియో ద్వారానే నేటికి వింటున్నారు. నాడు కాలక్షేపం ఈ రేడియోలే... నేడు టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు లేని ఇళ్లు, వ్యక్తులు లేరంటే ఆశ్యర్యపోవాల్సిందే. కానీ నాడు ఇంటికో రేడియో ఉంటే అదే గొప్పని పెద్దలు పేర్కొంటున్నారు. ఈ రేడియోలతోనే ప్రజల్లో చైతన్యం కలిగింది. వ్యవసాయం, పాడిపాంట, రైతే రాజ్యం తదితర పేర్లతో రేడియోలతో వ్యవసాయ సమాచారం, జానపదకథలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, సినిమా పాటలు, క్రికెట్ కామెంట్రీలు ఈ రేడియోల ద్వారానే వినేవారమని అనేక మంది వృద్ధులు తమ అనుభవాలను తెలపడం విశేషం. షాప్‌లో సందడిగా ఉండేది.. 1977 నుంచి రేడియో మెకానిక్‌గా షాప్ నిర్వహిస్తున్నాను. అప్పుడు చేతి నిండా పనులు ఉండేవి. అనంతరం టేప్రికార్డ్లు వచ్చాయి. తర్వాత టీవీలు రంగప్రవేశం చేశాక వివిధ మోడళ్లలో టీవీలు రావడంతో పనులు పూర్తిగా తగ్గాయి. రేడియోలు ఉన్నతం కాలం షాప్ నిండా రేడియోలే ఉండేవి. షాప్‌లో ప్రజలతో సందడిగా ఉండేది, నేడు ఆ సందడి లేదు. –విజయ్‌కుమార్,రేడియో మెకానిక్, సిద్దిపేట సంవత్సరానికి వంద మాత్రమే విక్రయిస్తున్నాం సిద్దిపేట జిల్లాలో కేవలం మా షాప్‌లో మాత్రమే రేడియోలు విక్రయిస్తాం. రేడియోలు అవసరం ఉన్నవారు ఖరీదు కోసం మెదక్, సిరిసిల్ల, కరీంనగర్, తదితర జిల్లా వాసులు, పాఠశాలలకు మా దగ్గరి నుంచే రేడియోలు ఖరీదు చేస్తున్నారు. మేము ఢిల్లీ నుంచి ఈ రేడియోలను ఖరీదు చేస్తున్నాం. ప్రతి సంవత్సరానికి కేవలం 100 వరకు మాత్రమే రేడియోలు విక్రయిస్తాం. టీవీలు రావడం ద్వారా వీటి విక్రయాలు పూర్తిగా తగ్గాయి. వీటి ధరలు రూ.750 నుంచి 2000 మధ్యలో ఉన్నాయి –చంద్రశేఖర్, వ్యాపారస్తడు, సిద్దిపేట రేడియోలోనే విషయాలు తెలిసేవి చిన్నతనంలో ఏ వార్తలు అయిన కేవలం రేడియో ద్వారా మాత్రమే వినేవాళ్లం. ప్రతి రోజు మా గృహంలో వ్యవసాయ సంబంధిత వార్తలతో పాటుగా, ధాన్యం రేట్లు, తదితర రేట్లను ఈ రేడియోల ద్వారానే వినేవాళ్లం. వార్తల సమయాలను గుర్తుకు పెట్టుకుని ఆ సమాయల్లో తప్పని సరిగా వార్తలు వినేవాళ్లం. నేటికి కూడా అప్పడప్పడు టీవీలోనే ఎఫ్ఎమ్ ద్వారా ఆకాశవాణి ప్రసారాలను వింటున్నాను.–ఆత్మారాములు, సిద్దిపేట -
తొలి రేడియో స్టేషన్ ఎక్కడో తెలుసా?
కవర్ స్టోరీ సమస్త సమాచారం, అభిరుచికి తగిన వినోదం ఇప్పుడు అరచేతిలోకే అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయింది. దాదాపు శతాబ్దం కిందట సమాచారం కోసం వార్తా పత్రికలే ఆధారం. రంగస్థల కళలు, జానపద కళారూపాలే వినోద సాధనాలు. అక్షరాస్యత తక్కువగా ఉన్న నాటి కాలంలో వార్తా పత్రికలతో జన సామాన్యానికి పెద్దగా నిమిత్తం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో రేడియో రాకడతో తొలితరం సమాచార విప్లవం మొదలైందనే చెప్పుకోవచ్చు. తొలినాళ్లలో సంపన్నుల ఇళ్లలో హోదాకు చిహ్నంగా ఉండే రేడియో సెట్లు అనతి కాలంలోనే పంచాయతీ కార్యాలయాల వరకు, ఆ తర్వాతి కొద్ది కాలానికే సామాన్యుల ఇళ్లకు విస్తరించాయి. రెండు మూడు తరాల వారికి రేడియో ఆనాటి ఆటవిడుపు. మన దేశంలో టీవీ ఎనభయ్యో దశకంలో అందుబాటులోకి వచ్చింది. టీవీ సెట్లు మధ్య తరగతి నట్టిళ్లకు చేరక ముందు సమాచార, వినోద రంగాల్లో రేడియో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగిం చింది. స్మార్ట్ఫోన్ల యుగం మొదలైనా, రేడియో ఇంకా శ్రోతలను అలరిస్తూనే ఉంది. సెల్ఫోన్ల లోనూ ఎఫ్ఎం స్టేషన్ల ప్రసారాలు రేడియో అభిమానులను ఇంకా ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ వంటివి రేడియో ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించినా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న రేడియో, కొత్త కొత్త సాధనాల ద్వారా శ్రోతలకు చేరువవుతూనే ఉంది. సాంకేతిక రంగంలో శరవేగంగా సంభవిస్తూ వస్తున్న మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో ఆరు ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి: బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 215 ఆకాశవాణి కేంద్రాల నుంచి 337 ప్రసార కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో 144 మీడియం వేవ్ కేంద్రాలు, 54 షార్ట్ వేవ్ కేంద్రాలు, 139 ఎఫ్ఎం కేంద్రాలు ఉన్నాయి. రేడియో పుట్టుక ఇలా... విద్యుదయస్కాంత శక్తి గల రేడియో తరంగాలను తొలుత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెర్ట్జ్1886లో గుర్తించాడు. దాదాపు దశాబ్దం తర్వాత 1895–96 నాటికి రేడియో తరంగాల ద్వారా ప్రసారాలను ఆచరణలో సాధించిన వాడు ఇటాలియన్ శాస్త్రవేత్త మార్కోనీ. రేడియో తరంగాలను తొలిసారిగా గుర్తించిన హెన్రిచ్ హెర్ట్జ్ పేరిట రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్లతో కొలవడం మొదలైంది. మార్కోనీ వివిధ దశల్లో కొనసాగించిన ప్రయోగాలు విజయవంతమవుతూ వచ్చాయి. ఇవి అనతికాలంలోనే తొలి రేడియో ప్రసార కేంద్రం ఆవిర్భావానికి దారి తీశాయి. పిట్స్‌బర్గ్‌లో నెలకొల్పిన తొలి రేడియో ప్రసార కేంద్రం 1920 నవంబరు 2న ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారనే వార్తతో పిట్స్బర్గ్ కేంద్రం నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా రేడియో వార్తా ప్రసారం మొదలైంది. రేడియో ప్రసారాలపై ఆసక్తి కనపరచిన తొలి యూరోపియన్ దేశం ఇంగ్లాండ్ అయినా, అక్కడి ప్రభుత్వ ఆంక్షల కారణంగా కొంత ఆలస్యంగా అక్కడ రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. వైర్లెస్ పరికరాలను తయారు చేసే అరడజను కంపెనీలు కలసి 1922లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) స్థాపించాయి. బీబీసీ 1922 నవంబరు 14 నుంచి లండన్ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది. రేడియో ప్రసారాలను ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ) నియంత్రిస్తుంది. సమాచార సాంకేతికత పురోగతిలో రేడియో సాంకేతిక పరిజ్ఞానానిదే కీలక పాత్ర. ఇది కేవలం రేడియో ప్రసారాలకు మాత్రమే పరిమితం కాదు. టీవీ ప్రసారాలకు, సెల్ఫోన్లు, రాడార్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, రిమోట్ కంట్రోల్, రిమోట్ సెన్సింగ్, వైర్లెస్ నెట్వర్కింగ్, ఉపగ్రహ ప్రసారాలు వంటి వాటన్నింటికీ రేడియో సాంకేతికతే మూలాధారం. రేడియో సాంకేతికత ఫలితంగానే నేడు ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయే స్థాయికి సమాచార సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి సాధ్యమైంది. రేడియో నిర్మాణంలో మార్పులు తొలినాటి రేడియో సెట్లలో ఇప్పటి మాదిరిగా లౌడ్ స్పీకర్లు ఉండేవి కావు. అప్పటి రేడియో నమూనాలను క్రిస్టల్ నెట్ అనేవారు. ఇది చాలా సున్నితమైన పరికరం. తొలినాళ్లలో రేడియో ప్రసారాలు లాంగ్ వేవ్, మీడియం వేవ్‌లలో జరిగేవి. వేవ్ లెంగ్త్ ఎక్కువయ్యే కొద్దీ ప్రసార కేంద్రాల కార్యక్రమాలు విడివిడిగా కాకుండా, కలగలసి వినిపించే పరిస్థితి తరచుగా తలెత్తేది. షార్ట్ వేవ్ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాక ఈ ఇబ్బంది కొంత దూరమైంది. రేడియో ప్రసారాల్లో ప్రసారమయ్యే శబ్దాలకు అనుగుణంగా తరంగాల వెడల్పును మార్చే ‘ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్’ (ఏఎం) ఉపయోగిస్తారు. అల్ట్రాషార్ట్ వేవ్స్‌తో ప్రసారాలు సాగించే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ (ఎఫ్ఎం) రేడియో ప్రసారాలు మొదలైన తర్వాత రేడియో ప్రసారాల్లో ఇదివరకు ఎదురయ్యే ఇబ్బందులు దూరమయ్యాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే శాటిలైట్ రేడియోలు, ఇంటర్నెట్ రేడియోలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని బెల్ టెలిఫోన్ ప్రయోగశాలల్లో పనిచేసే పరిశోధక బృందం 1948లో తొలి ట్రాన్సిస్టర్‌ను తయారు చేసింది. టార్చిలైట్లో వాడే బ్యాటరీలతో ట్రాన్సిస్టర్లు కొన్ని నెలల పాటు పనిచేసే వెసులుబాటు ఉండటంతో పాటు, పరిమాణంలోనూ ఇవి చిన్నగా ఉండటంతో ట్రాన్సిస్టర్లు అనతికాలంలోనే సామాన్యుల ఇళ్లకూ చేరుకున్నాయి. ట్రాన్సిస్టర్ల పుణ్యమా అని రేడియో ప్రసారాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యుల అవసరాలు, అభిరుచులకు అనుగుణమైన రేడియో కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు రూపొందుతూ, జనాలను అలరించసాగాయి. బాంబేలో మన తొలి రేడియో స్టేషన్ బ్రిటిష్ హయాంలో తొలి రేడియో స్టేషన్ బాంబేలో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ నెలకొల్పిన ఆ రేడియో స్టేషన్‌ను అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ 1927 జూలై 23న ప్రారంభించారు. అంతకు ముందు రేడియో క్లబ్ ఆఫ్ బాంబే 1923లో దేశంలోనే తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభించింది. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ 1936లో ఆలిండియా రేడియోగా మారింది. ఆలిండియా రేడియో ఏర్పడిన రెండేళ్లకు–1938 జూన్ 16న మద్రాసులో రేడియో స్టేషన్ ప్రారంభం కావడంతో అప్పటి నుంచి తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకట రెడ్డినాయుడు, మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ప్రారంభోపన్యాసాలు చేశారు. అంతకు ఐదేళ్ల ముందే హైదరాబాద్‌లో మహబూబ్ అలీ అనే తపాలా ఉద్యోగి రేడియో స్టేషన్‌ను ప్రారంభించారు. అప్పట్లో హైదరాబాద్‌ను పరిపాలిస్తున్న నిజాం రాజు 1935లో ఆ రేడియో స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కువగా ఉర్దూలో ఉండేవి. దీనికే 1939లో దక్కన్ రేడియోగా పేరు మార్చారు. దక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా పరిమిత ప్రసారాలు సాగేవి. దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు విశేషంగా కృషి చేశారు. ఆయన పట్టుదల ఫలితంగా 1948 డిసెంబరు 1 నాటికి దక్కన్ రేడియోలో తెలుగు ప్రసారాలకు కూడా తగిన ప్రాధాన్యం దక్కింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో భారత ప్రభుత్వం డెక్కన్ రేడియోను నిజాం నుంచి స్వాధీనం చేసుకుని, ఆలిండియా రేడియో (ఆకాశవాణి) పరిధిలోకి తెచ్చింది. అంతకు ముందే 1948 డిసెంబరు 1న విజయవాడలో రేడియో స్టేషన్ ప్రారంభమైంది. విశాఖపట్నం, కడపలలో 1963లో ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. తర్వాతి కాలంలో కర్నూలు, తిరుపతి, అనంతపురం, కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్‌లలో కూడా ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న రేడియోస్టేషన్లన్నింటినీ 2006 సంవత్సరం వరకు భారత ప్రభుత్వమే నడిపేది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఎఫ్ఎం ప్రసారాలను కూడా అందిస్తున్నాయి. ఇవికాకుండా, పలు ప్రైవేటు ఎఫ్ఎం రేడియో కేంద్రాలు కూడా వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. ఆకాశవాణి తొలినాళ్లలో విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల నుంచి వినోద విజ్ఞానాలను మేళవించిన జనరంజకమైన కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. అనతికాలంలోనే ఈ కార్యక్రమాలు ఆనాటి జనజీవితంలో భాగమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆకాశవాణి కేంద్రాలే కాకుండా, ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం తెలుగులో వార్తలను ప్రసారం చేస్తూ వస్తోంది. బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్ కేంద్రాలు కూడా తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. తెలుగులో తొలి ప్రసారాలు తెలుగులో తొలి రేడియో ప్రసారాలు 1938 జూన్ 16న సాయంత్రం5.30 గంటలకు ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామి తెలుగులో రచించిన ‘శ్రీగణపతిని సేవింపరాదే’ కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్లె నాదస్వరంపై వాయించగా, అది మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైంది. అదేరోజు రాత్రి 8.15 గంటలకు నాటి మద్రాసు రాష్ట్ర ప్రధాని కూర్మ వెంకటరెడ్డి నాయుడు ‘భారత దేశం–రేడియో’ అంశంపై తెలుగులో ప్రసంగించారు. ‘‘నేనిప్పుడు చెన్నపట్నము నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో నేను చెప్పజాలను. కాని అనేక స్థలములయందు ఉండి వినుచున్నారని తలచుచున్నాను.’’ అంటూ ప్రారంభించారు. తెలుగులో ఇదే తొలి రేడియో ప్రసంగం. అయితే, ఇది ప్రారంభోపన్యాసం మాత్రమే. రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులుకు దక్కుతుంది. ‘సజీవమైన తెలుగు’ అనే అంశంపై గిడుగు 1938 జూన్ 18న పదిహేను నిమిషాల ప్రసంగం చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రచించిన ‘అనార్కలి’ని ఆచంట జానకిరాం రేడియో నాటకంగా రూపొందించారు. ఇది 1938 జూన్ 24 రాత్రి 8.30 గంటలకు ప్రసారమైంది. ఇందులో సలీం పాత్రను దేవులపల్లి కృష్ణశాస్త్రి, అనార్కలి పాత్రను ‘రేడియో భానుమతి’గా ప్రసిద్ధి పొందిన పున్నావఝల భానుమతి, అక్బర్ పాత్రను అయ్యగారి వీరభద్రరావు పోషించారు. ఈ నాటకం ప్రసారమైన మరుసటి రోజు రాత్రి జానపద సంగీత కార్యక్రమం ప్రసారమైంది. మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా ప్రముఖ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరుడైన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన ‘రేడియో తాతయ్య’గా ప్రసిద్ధి పొందారు. ఆకాశవాణి కార్యక్రమాలు ఆకాశవాణి కేంద్రాలు వార్తలతో పాటు వివిధ వర్గాల ప్రజల కోసం విజ్ఞాన వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. టీవీ ప్రాచుర్యం పెరగక ముందు చాలామంది వ్యాఖ్యాతలు, న్యూస్ రీడర్లు, సంగీతకారులు, కవులు, రచయితలు ఆకాశవాణి ద్వారానే ప్రసిద్ధి పొందారు. సమాచార వ్యవస్థ పటిష్ఠంగా లేని రోజుల్లో జన సామాన్యానికి రేడియో వార్తలే ఆధారంగా ఉండేవి. ఆకాశవాణి ఏనాడూ సంచలనాల కోసం వార్తలు ప్రసారం చేయకపోయినా, పలు సంఘటనలకు సంబంధించిన బ్రేకింగ్ వార్తలను అందించిన ఘనతను దక్కించుకోగలిగింది. అంజయ్య మంత్రివర్గం రాజీనామా, విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం, ఎన్టీఆర్ మరణవార్త మొదటిగా వెల్లడి చేసిన ఘనత ఆకాశవాణి వార్తలకే దక్కుతుంది. ఢిల్లీ నుంచి తెలుగులో వార్తలు చదివిన తొలితరం వారిలో శ్రీశ్రీ, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాథరావు వంటి వారు ఉన్నారు. కపిల కాశీపతి, శ్రీవాస్తవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, కందుకూరి సూర్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాలరావు, మల్లాది రామారావు, అద్దంకి మన్నార్, పీఎస్సార్ ఆంజనేయ శాస్త్రి, డి.వెంకట్రామయ్య, ప్రయాగ రామకృష్ణ, మామిళ్లపలి రాజ్యలక్ష్మి, జోళిపాలెం మంగమ్మ, జ్యోత్స్నాదేవి తదితరులు ఎందరో రేడియోలో వార్తలు చదవడం ద్వారా ప్రసిద్ధులయ్యారు. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు రేడియో ద్వారానే బహుళ జనాదరణ పొందాయి. తొలినాళ్లలో ‘గీతావళి’ పేరుతో భావగీతాలు ప్రసారమయ్యేవి. ‘లలిత సంగీతం’ అనే పేరు మాత్రం ఆకాశవాణి ద్వారానే ప్రచారంలోకి వచ్చింది. పాలగుమ్మి విశ్వనాథం, బాలాంత్రపు రజనీకాంతరావు, ఎమ్మెస్ రామారావు, ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చిత్తరంజన్, మల్లిక్, సాలూరి రాజేశ్వరరావు, బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి, శ్రీరంగం గోపాలరత్నం, వేదవతీ ప్రభాకర్ వంటి సుప్రసిద్ధ స్వరకర్తలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి వంటి ప్రముఖ కవులు ఆకాశవాణి లలిత సంగీత కార్యక్రమాలకు వన్నె తెచ్చారు. విద్యార్థులకు, గ్రామీణులకు, కార్మికులకు, యువతరానికి, కవులు, రచయితలకు ఆకాశవాణి అనేక కార్యక్రమాలను ప్రసారం చేసేది. ఈ కార్యక్రమాల ద్వారా పలువురు వ్యాఖ్యాతలు శ్రోతల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఎందరో మహానుభావులు... సంగీత సాహిత్యాది రంగాలకు చెందిన ఎందరో ప్రఖ్యాతులకు ఆకాశవాణి కొలువులిచ్చింది. శ్రీశ్రీ, జాషువా వంటి కవులు కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు, త్రిపురనేని గోపీచంద్, ఆచంట జానకిరాం, తెన్నేటి హేమలత, దాశరథి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలంత్రపు రజనీకాంతరావు, బందా కనకలింగేశ్వరరావు వంటి సాహితీ సంగీత నాటకరంగ ప్రముఖులు ఆకాశవాణిలో పనిచేసిన వారే. గ్రామీణ కార్యక్రమాల వ్యాఖ్యాతగా ప్రయాగ నరసింహశాస్త్రి గ్రామీణ శ్రోతలకు చేరువైతే, ‘ధర్మ సందేహాలు’ కార్యక్రమం ద్వారా ఉషశ్రీ రేడియో శ్రోతల్లో ఆబాలగోపాలాన్నీ అలరించారు. రేడియో అన్నయ్య, అక్కయ్యలుగా ప్రసిద్ధి పొందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి బాలల కార్యక్రమాల ద్వారా కొన్ని తరాల పిల్లలను ప్రభావితం చేశారు. ఆకాశవాణికి సేవలందించిన ప్రముఖుల జాబితా చాలా పెద్దది. ఆకాశవాణిని జనరంజకంగా తీర్చిదిద్దడంలో ఎందరో మహానుభావులు ఎనలేని కృషి చేశారు. వారందరికీ వందనాలు. – పన్యాల జగన్నాథదాసు -
దిగజారని శ్రేణి, వాడి తగ్గని ‘వాణి’
ఎఫ్ఎం వంటి అధునాతన పరిజ్ఞానం కలిసిరావడంతో - ప్రయాణం చేస్తూ రేడియోను ఆనందంగా వినవచ్చు. సరిగ్గా ఈ విషయంలోనే రేడియో - అటు టెలివిజన్నూ, ఇటు పత్రికలతోను వస్తున్న పోటీని తట్టుకుని నిలబడగలుగుతున్నది. సమాచార వ్యవస్థలో రేడియో తొలి సంచల నమే. వార్తాపత్రికను మించిన సౌలభ్యం, టీవీ చానల్‌కు అతీతమైన సౌకర్యం రేడియోలో సాధారణ మానవుడికి లభించింది. అందుకే ఎన్ని దశాబ్దాలు గడిచినా ఆదరణ తగ్గలేదు. పత్రికారంగం కొత్తరూపు దాల్చింది. పరిధి పెంచుకుంది. టీవీ చానళ్ల హవా చెప్పక్కర్లేదు. అయినా రేడియో జనమాధ్యమంగా తన ప్రత్యేకతను నిలుపుకోవడానికి ఎన్నో కారణా లు కనిపిస్తాయి. సమాచార వ్యవస్థలో ప్రజా స్వామ్యానికి పెద్దపీట వేసిన వ్యవస్థ ఇది. సరి హద్దులు ఆపలేవు. రేడియో మన వెంట వచ్చే ప్రత్యక్ష ప్రసారం. 2012 నుంచి ప్రతి యేటా ఫిబ్రవరి 13వ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపు కుంటున్నారు. 1946 ఫిబ్రవరి 13 ఐక్యరాజ్య సమితి రేడియో మొదలైన తేదీ. ఈ కారణం గా ఫిబ్రవరి 13 తేదీని రేడియో దినోత్సవానికి ఎంపిక చేశారు. 2011 సెప్టెంబర్ 28న యునె స్కో 36వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకు న్నారు. 2012 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ సందర్భంగా రేడియో మాధ్యమం ప్రాధాన్యతను తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ధనిక దేశాలకు కాకుండా ఇతర దేశాలకు రేడియో చాలా రకాలుగా తగిన మాధ్యమం. కేవలం మీడియం లేక పోతే షార్ట్ ప్రసారాలు ఉన్నప్పుడు- కేటా యింపులలో అగ్ర దేశా ల దోపిడీ ఉండేది. ఎక్కువ ఫ్రీక్వెన్సీలు వారు తీసుకోవడమే కాక, అత్యంత శక్తిగల ప్రసారాలు చేసేవి. దీనితో తక్కువ శక్తి గల ప్రసారాలకు ఆటంకాలుగా ఏర్పడేవి. ఈ సమ స్యకు పూర్తిస్థాయి పరిష్కారం ఎఫ్ఎం (ఫ్రీక్వె న్సీ మాడ్యులేషన్)తో లభించింది. వాతావర ణం దెబ్బతీయని ప్రసారం ఎఫ్ఎంతో సాధ్య మైంది. అలాగే ప్రయాణం చేస్తూ రేడియో వినే సదుపాయం కలిగింది. 1995లో మన అత్యున్నత న్యాయస్థానం గొప్ప తీర్పు చెప్పి ఫ్రీక్వెన్సీలు ప్రజల పరం కావాలని వక్కాణిం చింది. ఇది మన దేశ రేడియో ప్రసారాలలో పెద్ద మలుపు. ఎంతో మంది ప్రైవేట్ రేడియో ఆపరేటర్లు ప్రవేశించారు. వీరంతా పత్రిక, టెలివిజన్ రంగాలలో తల పండినవారు. మిర్చి, మ్యాంగో, చాకొలెట్, ఫీపర్ వంటి పూర్తి స్థాయి వాణిజ్య స్థాయి కార్యక్రమాలతో ఈ రేడియో ప్రసారాలు రాణిస్తున్నాయి. మనిషికి చాలా అనువైన జనమాధ్యమం - రేడియో! టీవీ చానళ్లకు రేడియో సౌలభ్యం ఉండదు. వార్తా పత్రి కలు చదవాలంటే చదు వురావాలి. పత్రిక అం దుబాటులోకి రావాలి. అప్పుడే వార్తాపత్రిక పఠనమైనా సాధ్యం కాగలదు. ఆ రెండు మాధ్యమాలతో పోలిస్తే రేడియోకు దినసరి ఖర్చు చాలా తక్కువ! పైగా పని పాడు చేసుకోకుండా రేడియో ప్రసా రాలు వినవచ్చు. రేడియో చాలా చౌక అయిన, సరళమైన సాంకేతిక అద్భుతం. వినడం ఎంత తేలికో, కార్యక్రమాల నిర్మాణం కూడా అంతే తేలిక! ఒక్క మనిషే కార్యక్రమం రూపొందిం చి, ప్రసారం చేయగల సదుపాయం ఉంది. ఇలాంటి సౌలభ్యాలు రేడియోకు పుష్క లంగా ఉన్నాయి కనుక ఇంత పోటీలో కూడా రేడియో నిలబడింది. ఉపగ్రహ ప్రసారం సాధ్యం కావడంతో రేడియో ప్రసారాల నాణ్య త దెబ్బతినలేదు. ఎఫ్ఎం వంటి అధునాతన పరిజ్ఞానం కలసిరావడంతో- ప్రయాణం చేస్తూ రేడియోను ఆనందంగా వినవచ్చు. సరిగ్గా ఈ విషయంలోనే రేడియో- అటు టెలివిజన్నూ, ఇటు పత్రికలతోను వస్తున్న పోటీని తట్టుకుని నిలబడగలుగుతున్నది. ప్రత్యక్ష ప్రసారాల్లో టెలిఫోన్ కలసిపోవడం అనేది ఒక సాంకేతిక అంశం కూడా; దాని ఫలితంగా సాధ్యమైన రేడియో కార్యక్రమాల సృజనాత్మక అద్భుతం. ఇది ప్రజాస్వామిక ధోరణికి దారితీసింది. రేడియో ప్రసారాలు కేవలం నాలుగు గోడల మధ్యనే పరిమితం కాక, వ్యవసాయ క్షేత్రం లోనో, వంటింట్లోనో, కర్మా గారంలోనో ఉండే వ్యక్తి రేడియో కార్యక్ర మంలో పాలుపంచుకునే వీలు కలిగింది. కొం దరే మాట్లాడాలనే నియమాన్ని అధిగమించి, ఎవరైనా మాట్లాడగల సదుపాయం ఇచ్చింది. ఒకటి మాత్రం వాస్తవం. పొలంలో పని చేసే రైతుకూ, ఇంట్లో పాడి చేసుకునే గృహి ణికి, కార్యరంగంలో శ్రమిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యకర్తకు, విద్యాలయంలో చదువు కునే విద్యార్థికీ తోడ్పడే ప్రసారాలు ఇందులో తక్కువే! కొండకోనల్లో సాగిపోయే గిరిజను డికి ఉపయోగపడే రేడియో ప్రసారాలు రాగ లవా అని ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు. ఎక్కు వ భావనాశక్తికి దోహదపడే రేడియో మాధ్య మాన్ని మరింత ప్రయోజనకరంగా, సృజనా త్మకంగా వినియోగించడానికి ప్రపంచమంతా ఆలోచించాలి! దీనికి ప్రపంచ రేడియో దినో త్సవం చక్కని సందర్భం. డా. నాగసూరి వేణుగోపాల్ (వ్యాసకర్త ఆకాశవాణి ఉద్యోగి, రచయిత) (ప్రపంచ రేడియో దినోత్సవం నేడు)