గోవా పోరాటంలో భాగమైన రహస్య రేడియో | World Radio Day Special Article By Dr Nagasuri Venugopal | Sakshi
Sakshi News home page

గోవా పోరాటంలో భాగమైన రహస్య రేడియో

Published Sat, Feb 13 2021 12:57 AM | Last Updated on Sat, Feb 13 2021 4:02 AM

World Radio Day Special Article By Dr Nagasuri Venugopal - Sakshi

1955–61 మధ్యకాలంలో గోవాలో అజ్ఞాత రేడియో కార్యక్రమాలను నిర్వహించిన వామన్, లిబియా సర్దేశాయి

విమానానికి రేడియో ట్రాన్స్‌ మీటర్‌ బిగించారు. ఇంకో లౌడ్‌ స్పీకర్‌ అమర్చారు. ఆ ప్రసార బృందం పూలు చల్లుతూ 450 సంవత్సరాల చరిత్రలో అపు రూపమైన వార్తను ప్రకటిస్తూ రెండు గంటలపాటు ఆకాశ యానం చేశారు! ఆశ్చర్యమని పించే ఈ సంఘటన 1961 డిసెంబర్‌ 19న స్వేచ్ఛ సిద్ధించిన గోవాలో జరిగింది. అది గోవా స్వాతంత్య్రం కోసం మొదలైన ‘ద వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ అండర్‌ గ్రౌండ్‌ రేడియో స్టేషన్‌. కొత్త ప్రపంచం–కొత్త రేడియో అనే ఇతివృత్తంతో ప్రపంచ వ్యాప్తంగా రేడియో దినోత్సవం జరుపుకుంటున్న వేళ మనం మరచిపోయిన రేడియో చరిత్రను కొత్తగా తెలుసుకుందాం. 1955 నవంబర్‌ 25న మొదలైన ఈ రేడియో స్టేషన్‌ గోవాకు స్వాతంత్య్రం లభించిన రోజు విజయోత్సవంలో పాల్గొని తన ప్రసారాలు ఆపివేసి  చరిత్రలో విలక్షణ పుటగా మారిపోయింది.

1510లో గోవా పోర్చుగీసు స్థావరంగా మారింది. పాండిచ్చేరి ఫ్రెంచి వారి చేతిలోకి పోయినట్టు గోవా, డయ్యు, డమన్‌ పోర్చుగీసు చేతిలో ఉండిపోయాయి.  1932లో గోవా గవర్నర్‌గా యాంటోనియో డి ఒలివీరా సలాజార్‌ వచ్చిన తర్వాత ఆంక్షలు పెరగడం, ప్రజల హక్కులు హరించడం మొదలైంది. 1940వ దశకం నుంచి స్వాతంత్య్ర పోరాటం గురించి ఆలోచనలు మొదలయ్యాయి. 1954లో దాద్రా నగర్‌ హవేలీ విముక్తి పొందడం కొత్త ఆశలకు ద్వారాలు తెరిచింది. 1955లో భారత ప్రభుత్వం ‘ఎకనమిక్‌ బ్లాకేడ్‌’ ప్రకటించడంతో గోవా బంగాళదుంపలు (నెద ర్లాండ్స్‌), వైన్‌ (పోర్చుగీసు), కూరలు, బియ్యం (పాకి స్తాన్‌), టీ (శ్రీలంక), సిమెంట్‌ (జపాన్‌), ఉక్కు (బెల్జియం) ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 1961లో చేపలు పట్టే భారతీయుల పడవలపై గోవా కాల్పులకు దిగడంతో పరిస్థితి మరింత దిగజారింది.

1955 నవంబర్‌ 25న ‘వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ గోవా సరిహద్దు రాష్ట్ర ప్రాంతం అంబోలి అడవుల నుంచి మొదలైంది. భారత స్వాతంత్య్ర స్ఫూర్తితో వామన్‌ సర్దేశాయి, లిబియా లోబో కలిసి పోర్చుగీసు, కొంకణి భాషల కార్యక్రమాలతో దీన్ని ప్రారంభిం చారు. రేడియో స్టేషన్‌ ట్రాన్స్‌మీటర్‌ను ఒక ట్రక్కుకు బిగించి, దట్టమైన అడవుల నుంచి ప్రసారాలు చేసే వారు. గోవా అధికారికంగా చేసే ప్రాపగాండాను వమ్ము చేస్తూ నడిచిన ఈ సీక్రెట్‌ రేడియో ప్రసారాలకు భారతదేశం నుంచి, ఇతర దేశాల నుంచి మద్దతు లభించేది. ఈ విషయంలో గోవా ఒంటరి కాదనే భావం కల్గించి, ధైర్యం నూరిపోయడానికి వార్తల పరి ధిని పెంచారు. ఇండియా భూభాగం నుంచి ప్రసారం అయ్యేది కనుక భారతీయ నాయకుల ప్రసంగాలు కూడా ప్రసారం చేశారు.

1956 జూలై 15న వినోబా భావే తన రేడియో ప్రసంగంలో శాంతియుతంగా గోవాను వదిలి వెళ్ళిపొమ్మని పోర్చుగీసు వారిని కోరారు. భారత్‌ పార్లమెంటులో, ఇతర దేశాలలో ఈ విషయంపై జరిగే చర్చల సారాంశాలను కూడా శ్రోత లకు ఎప్పటికప్పుడు అందించేవారు. 1961 డిసెం బర్‌లో ‘ఆపరేషన్‌ విజయ్‌’ మొదలయ్యాక వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ బృందం అడవుల నుంచి బెల్గాం ప్రాంతా నికి వచ్చింది. ఆ సమయం నుంచి ప్రతి గంటకూ ప్రసారాలు చేశారు. గోవా ఆర్మీనుద్దేశించి భారత రక్షణ మంత్రి వి.కె.కృష్ణ మీనన్‌ 1961 డిసెంబర్‌ 15న ఈ సీక్రెట్‌ రేడియోలో ప్రసంగిస్తూ చర్చలకు ఆహ్వానిం చారు. భారత సైన్యం లోపలికే రాకుండా గోవా ఆర్మీ డిసెంబర్‌ 17న బ్రిడ్జిని కూల్చివేసింది. సుమారు 36 గంటల పాటు వాయు, సముద్ర, భూతలాలపై భీకర పోరాటం నడిచింది. డిసెంబర్‌ 19న గోవా ప్రాంతం భారత భూభాగంలో కలిసిపోయింది. 1955 నుంచి 1961 దాకా వామన్‌ సర్దేశాయి, లిబియా లోబో అడవుల్లో  పడిన ఇబ్బందులు ఏమిటో మనకు తెలియదు. కానీ ఈ కాలంలోనే వారిరువురూ భార్యాభర్తలుగా మారిపోయారు. రేడియో చరిత్రలో ‘వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ ఒక స్ఫూర్తి పుంజం. 


డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్
వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్‌ : 94407 32392
(నేడు ప్రపంచ రేడియో దినోత్సవం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement