సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): కమ్మని కబుర్లు చెప్పే నెచ్చెలి.. సినిమా పాటలతో మైమరపించే సొగసరి.. వందల, వేల మైళ్ల దూరంలో జరిగే విషయాలను వార్తల రూపంలో అందించే గడసరి.. పొద్దున్నే సిగ్నేచర్ ట్యూన్ సుప్రభాతంతో నిద్రలేపి.. మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంలో పొద్దుపుచ్చి.. సాయంత్రం జనరంజకంగా పలకరించి.. రాత్రి కమ్మని పాటలతో ఆహ్లాదపరిచి నిద్రపుచ్చే ఒకప్పటి ఏకైక వినోద, విజ్ఞాన, వార్తా సాధనం రేడియో. రేడియో అంటే ఒక ఎమోషన్. ఒకప్పుడు సగటు మనిషి జీవితంలో రేడియో ఒక అంతర్భాగమంటే అతిశయోక్తి కాదు. అదొక ప్రెస్టేజ్ సింబల్‌గా ఉండేది. అప్పట్లో పెళ్లికి కట్నంగా రేడియో తీసుకునేవారంటే ఇపుడు వింతగా అనిపించవచ్చు. కానీ అదే నిజం. అటువంటి రేడియో వినియోగం తగ్గుతూ వచ్చింది. సాంకేతిక విప్లవంతో సరికొత్త ఆవిష్కరణలతో టీవీల రాకతో రేడియో లవర్స్ క్రమంగా కనుమరుగవుతున్నారు. ఎఫ్‌ఎంలు వచ్చాక కాస్త ఊపిరిపోసుకున్న రేడియో కూడా సాంకేతికతను అద్దుకొని భవిష్యత్తులో డిజిటల్ ప్రసారాలతో హల్‌చల్ చేయడానికి సిద్ధమవుతోంది. నేడు రేడియో దినోత్సవం సందర్భంగా ప్రయోగ దశలో ఉన్న డిజిటల్ రేడియో మోండియాల్ (డీఆర్‌ఎం) ప్రసారాలపై ప్రత్యేక కథనం.
ఇప్పటివరకూ మనం వింటున్న అనలాగ్ రేడియో ప్రసారాల కాలం ముగియనుంది. ఇక భవిష్యత్ అంతా డీఆర్‌ఎం డిజిటల్ రేడియో ప్రసారాలదే. నగరంలోనే కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా ఎఫ్‌ఎం కంటే మరింత నాణ్యమైన, శక్తివంతమైన రేడియో ప్రసారాలను అందించే ప్రక్రియ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా కూడా డీఆర్‌ఎం డిజిటల్ రేడియో ప్రయోగాత్మక ప్రసార పరీక్షలు చేస్తున్నాయి. షార్ట్ వేవ్ ద్వారా నూతన సాంకేతికతతో బ్రెజిల్, సౌతాఫ్రికా, ఇటలీ, రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, రొమేనియా, నైజీరియా, న్యూజిలాండ్, కొరియా, జర్మనీ, యూకే వంటి దేశాల్లో ఈ డిజిటల్ రేడియో ప్రయోగాత్మక ప్రసారాలు మొదలు పెట్టారు. భారతదేశంలో 39 మీడియం వేవ్ ఆకాశవాణి కేంద్రాల ద్వారా ఈ డిజిటల్ రేడియో మోండియాల్ ప్రయోగాత్మక ప్రసారాలు చేస్తున్నారు.
వన్ మేన్ డీఆర్‌ఎం మార్కెటింగ్ మెషీన్ కృష్ణారావు
అత్యాధునిక డీఆర్‌ఎం డిజిటల్ రేడియో సాంకేతిక ఆవిష్కరణల పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ, అందుబాటులోకి తీసుకురావడంలోనూ తమ్మినాన కృష్ణారావు విశేష కృషిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా, వజ్రపు కొత్తూరు మండలం, మహాదేవిపురం గ్రామానికి చెందిన ఆయన ఏడేళ్ల పాటు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమ రూపకల్పన విభాగంలో పని చేశారు. ఆ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దృశ్య శ్రవణ కార్యక్రమ రూపకల్పన పరిశోధన కేంద్రంలో ప్రయోక్తగా, ఉప సంచాలకుడుగా పాతికేళ్ళ పాటు విధులు నిర్వర్తించారు. ప్రవృత్తినే వృత్తిగా చేసుకొని డిజిటల్ రేడియో టెక్నాలజీపై దృష్టి సారించి గత ఆరేళ్లుగా దేశీయ, అంతర్జాతీయంగా అవగాహన కార్యక్రమాలను సొంతంగా నిర్వహిస్తున్నారు.
బిర్లా జంక్షన్ వద్ద హుందాయ్ షోరూంలో సేల్స్ మేనేజర్‌కు డీఆర్‌ఎం డిజిటల్ రేడియో ప్రసారాలపై అవగాహన కల్పిస్తున్న కృష్ణారావు
అలాగే కార్లలో ఈ ప్రసారాలకు అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా అన్ని కార్ల షోరూంల సేల్స్ మేనేజర్లకు, టెక్నీషియన్లకు కొత్త కార్లలో ఉన్న డీఆర్‌ఎం డిజిటల్ రేడియోల కోసం అవగాహన కల్పించడం ద్వారా వినియోగ దార్లకు తెలియజేసే వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాను. ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ ప్రత్యేక కార్యక్రమంతో పాటు వ్యవసాయ సంబంధ కార్యక్రమాలను గ్రామీణులు, గిరిజనులు వినడానికి దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకీ డిజిటల్ రేడియో సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సైతం విజ్ఞప్తి చేశారు. డిజిటల్ రేడియో విద్యా ప్రసారాలపై తమ్మినాన కృష్ణారావు చేస్తున్న కృషిని గుర్తించిన లండన్‌లోని ప్రపంచ డిజిటల్ రేడియో మోండియల్ కన్సార్టియం వారు అంతర్జాతీయ ప్రత్యేక విశిష్ట పురస్కారాన్ని ‘ఏ ఒన్ మేన్ డీఆర్‌ఎం మార్కెటింగ్ మెషీన్’ పేరిట ప్రకటించారు.
918 ఫ్రీక్వెన్సీపై నాలుగు సర్వీసులు
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 918 ఫ్రీకెన్సీపై డీఆర్‌ఎం డిజిటల్ రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రేడియో అంటే ఒకే ఫ్రీక్వెన్సీపై ఒకే ప్రసారం జరుగుతోంది. కానీ డీఆర్‌ఎం డిజిటల్ రేడియో ద్వారా 918 ఫ్రీక్వెన్సీ ద్వారా నాలుగు సర్వీసులు పొందే వెసులుబాటు కలుగుతుంది. ఒకే అలవరుసపై పారా మెట్రిక్ స్టీరియో కలిగిన మూడు ఆడియో కార్యక్రమాలతో పాటు ఒక అత్యవసర సందేశాల జర్న్‌లైన్, మల్టీమీడియా ప్రోటోకాల్ ఛాయా చిత్రాల వంటి సేవలను పొందవచ్చు. ఒకే ఫ్రీక్వెన్సీలో వార్తలు, సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతం ఈ మూడింటిలో నచ్చిన సర్వీసును ఎంచుకొని వినే అవకాశం ఉంటుంది.
కొత్త తరం కార్లలో డీఆర్‌ఎం రేడియో ప్రసారాలు
డీఆర్‌ఎం రేడియో ప్రసారాలకు రిసీవర్ కీలకం. అయితే ఆ రిసీవర్ రూ.10 వేల నుంచి 15 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో వాటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. అయితే 2017 సంవత్సరం తరువాత మోడల్ కార్లలో ఈ డిజిటల్ రేడియో ప్రసారాలు వినే అవకాశముంది. అయితే ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ప్రయోగదశలో ఉండడంతో ఎక్కువగా హిందీ భాషలోనే ప్రసారాలు జరుగుతున్నాయి. ప్రత్యేక సమయాల్లో తెలుగు కార్యక్రమాలు ఉంటున్నాయి.
త్వరలో ఎఫ్‌ఎంలో డిజిటల్ రేడియో ప్రసారాలు
ప్రస్తుతం ఎఫ్‌ఎం రేడియో హవా ఉంది. దీంతో ముందుగా ఎఫ్‌ఎం ద్వారా డీఆర్‌ఎం డిజిటల్ రేడియో ప్రసారాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎఫ్‌ఎంలో ఈ ప్రసారాలకు సంబంధించి రాజస్థాన్‌లో ప్రయోగాలను ప్రారంభించారు. అక్కడ ప్రయోగాత్మక ప్రసారాలు విజయవంతంగా జరుగుతుండడంతో త్వరలో ఎఫ్‌ఎంలో కూడా ఈ ప్రసారాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వం ప్రోత్సహించాలి
రోజుకో కొత్త అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఆ కారణంగానే డీఆర్‌ఎం డిజిటల్ రేడియో సెట్ల తయారీలో జాప్యం జరుగుతోందని అనిపిస్తోంది. చవకైన, నాణ్యమైన డిజిటల్ రేడియో సెట్ల తయారీ దార్లకు ప్రభుత్వం తగిన రాయితీలిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరముంది. తద్వారా సామాన్యులకు డిజిటల్ రేడియో సెట్లు అందుబాటులోకి వస్తాయి. – డాక్టర్ తమ్మినాన కృష్ణారావు, డిప్యూటీ డైరెక్టర్, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం దృశ్య శ్రవణ కార్యక్రమ రూపకల్పన పరిశోధనా కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment