
అతిథి
చందమామ కథల్లో విన్న జలకన్యలు కళ్ల ముందు ప్రత్యక్షమై ‘హాయ్’ అని పలకరిస్తే ఎలా ఉంటుంది? సినిమాల్లోనే చూసిన రంగుల వెలుగుల జలకన్యలు ‘పదండి మా లోకంలోకి’ అని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం సొంతమై మరో ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. విశాఖ ఎక్స్‌పో– 2025 మెర్మైడ్స్ (జల కన్యలు) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎక్కడెక్కడి నుంచో విశాఖకు రెక్కలతో ఎగిరొచ్చిన జలకన్యల పరిచయం...
చిన్నతనంలో కథలు, కార్టూన్‌లలో జలకన్యలను చూసి తెగ సంతోషించేది ఫిలిప్పీన్స్‌కి చెందిన కినా. ‘జలకన్యలు’ నిజం అనే భావనతోనే పెరిగింది. తాను కూడా వారిలా మారాలని బలంగా అనుకుంది. తరువాత కాలంలో స్కూబా డైవింగ్‌లో శిక్షణ తీసుకుంది. సముద్రంలో కూడా ఈద గలిగే నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న కినా మెర్మైడ్‌ప్రొఫెషన్ ఎంచుకుంది. ‘శ్వాసను మన ఆధీనంలో ఉంచుకోవడం ఎంతో ప్రధానం’ అంటున్న కినా నాలుగు సంవత్సరాలుగా ఈ రంగంలో ఉంది. మెర్మైడ్ ఇన్‌స్ట్రక్టర్‌గా విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.
‘మెర్మైడ్‌గా నీటిలో ఈదుతూ ప్రేక్షకులను అలరించాలంటే ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. దీనికి మంచినిద్ర, తగినంత వ్యాయాయం అవసరం. నిత్యం ఉదయంవేళల్లో స్ట్రెచ్చింగ్ ఎక్సర్‌సైజ్‌లు, యోగా చేస్తాము. దీనివల్ల నీటిలో ఎక్కువ సమయం శ్వాస తీసుకోకుండా ఉండటం సాధ్యపడుతుంది. ప్రత్యేకమైన మాస్క్, ఇయర్ ప్లగ్స్, ప్రత్యేకమైన సూట్, నడుముకి 2 నుంచి 4 కేజీల బరువుండే బెల్ట్, ఫిన్ వంటివి ధరిస్తాము’ అంటుంది ఫిలిప్పీన్స్ కు చెందిన రుత్.
ఇటలీకి చెందిన క్లియోప్రొఫెషనల్ సింగర్. చిన్నప్పటి నుంచి మెర్మైడ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే పాటకు వీడ్కోలు చెప్పి శిక్షణ తరువాత మెర్మైడ్ ప్రొషెషన్‌లోకి వచ్చింది. ‘మమ్మల్ని చూసిన తరువాత చిన్నారుల మోముల్లో కనిపించే చిరునవ్వులు ఎంతోసంతోషాన్ని, వృత్తిపరమైన సంతృప్తిని ఇస్తాయి. మా వృత్తిలో గౌరవప్రదమైన వేతనం ఉంటుంది’ అంటుంది క్లియో.
ఫిజికల్ థెరపిస్ట్‌గా ఫిలిప్పీన్స్‌లోని హాస్పిటల్స్‌లో రెండేళ్లు పనిచేసిన విరోనికకు మెర్మైడ్‌ప్రొఫెషన్ అనేది చిన్ననాటి కల. తన కలను సాకారం చేసుకోవడమే కాదు రెండువృత్తులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ‘భారత్‌లో మమ్మల్ని బాగా ఆదరించారు’ అంటుంది విరోనిక.
మూవీ థియేటర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఇటలీకి చెందిన క్లియో మెర్మైడ్ ప్రొఫెషన్‌లోకి రావడం ద్వారా తన చిన్నప్పటి కలను నెరవేర్చుకుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన, వృత్తిపరమైన సంతృప్తి, సంతోషాల మాట ఎలా ఉన్నా....ఇది ఆషామాషీ వృత్తేమీ కాదు. నిత్యం రెండు నుంచి నాలుగు గంటల సమయం నీటిలో ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.హైపోథేమియా, హైకోక్సియావంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పరిశుభ్రమైన నీరు లేని పక్షంలో చర్మసమస్యలు వస్తాయి. చర్మ, కేశ సంరక్షణకు ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఖర్చు చేయాల్సి వస్తుంది. నీటిలో దిగే సమయంలో శరీరానికి వివిధ లోషన్లు పూసుకుంటారు. పైభాగంలో ఉంచే లైట్ల నుంచి వచ్చే వేడిని దృష్టిలో పెట్టుకొని సన్‌స్క్రీన్ వాడతారు. కాళ్లకు ఉపయోగించే ప్రత్యేకమైన తోక వంటి పరికరం వల్ల కాళ్లపై గాయాలు కావడం అనేది సర్వసాధారణం.
నాలుగు దశల శిక్షణ
మెర్మైడ్‌ప్రొఫెషన్ కోసం ప్రాథమిక స్థాయి, ఓషన్ మెర్మైడ్, అడ్వాన్స్‌డ్, ఇన్‌స్ట్రక్టర్...నాలుగు దశల్లో శిక్షణ ఉంటుంది. తొలి దశలో ఈత కొట్టడంలోప్రాథమిక సూత్రాలు, రెండోదశలో సముద్రంలో, ద్వీపాలలో ఈత కొట్టడం, మూడోదశలో మరింత నైపుణ్యంతో ఈత కొట్టడం నేర్పిస్తారు. నాల్గవ దశలో ఈతలో, మెర్మైడ్స్‌గా ఉపాధిని పొందడానికి వచ్చే వారికి అవసరమైన శిక్షణ అందించే ఇన్‌స్ట్రక్టర్‌గా మారడానికి అవసరమైన శిక్షణ ఇస్తారు.
– వేదుల నరసింహం
ఎ.యూ. క్యాంపస్, సాక్షి, విశాఖపట్నం
ఫోటోలు: ఎం.డి. నవాజ్
Comments
Please login to add a commentAdd a comment