వైఎస్సార్ జిల్లా వాసులకు శుభవార్త. దాదాపు మూడేళ్లుగా ఇదిగో, అదిగో అంటూ ఊరించిన ఎఫ్‌ఎం రేడియో ఎట్టకేలకు ప్రారంభమైంది.
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ జిల్లా వాసులకు శుభవార్త. దాదాపు మూడేళ్లుగా ఇదిగో, అదిగో అంటూ ఊరించిన ఎఫ్‌ఎం రేడియో ఎట్టకేలకు ప్రారంభమైంది. శనివారం నుంచి ట్రయల్స్ కూడా సాగుతున్నాయి. అధికారుల ప్రయత్నాలు విజయవంతం అయినట్లే కనిపించడంతో వారు ఉత్సాహంగా మిగతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ సదుపాయం కల్పించేందుకు ఆకాశవాణి కడప కేంద్రం ప్రధాన కార్యాలయంలోగల టవర్‌కు ఎఫ్‌ఎం ప్రసారాలకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా కొన్నాళ్లపాటు ట్రయల్స్ చూడాలని నిర్ణయించి శనివారం కార్యక్రమాల ప్రసారాలు మొదలు పెట్టారు.
కడప నగరంతోపాటు పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగులో కూడా ఈ మూడు రోజులు కార్యక్రమాలు విజయవంతంగా ప్రసారమయ్యాయి. ట్రాన్స్‌మిషన్ టవర్ పనితీరు, దూరం, నాణ్యత, కార్యక్రమాలు వినిపిస్తున్న ప్రాంతాల గురించి ట్రయల్స్‌లో అధ్యయనం సాగుతోంది. ఆకాశవాణి కడపకేంద్రంలో ప్రసారమవుతున్న కార్యక్రమాలనే ప్రస్తుతం ఎఫ్‌ఎంలో కూడా ప్రసారం చేస్తున్నారు. ట్రయల్స్ విజయవంతమయ్యాయని అధికారులు పూర్తి స్థాయిలో ధ్రువీకరించుకున్నాక ఎఫ్‌ఎం ప్రసారాలకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం కడప నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో స్పష్టంగా ప్రసారమవుతున్నాయి.
ఇక రేడియోగా సెల్‌ఫోన్!
ఎఫ్‌ఎం సౌకర్యం ఉన్న సెల్‌ఫోన్‌ను రేడియోగా వాడుకోవచ్చు. 900 కిలో హెడ్స్‌పై కడప ఆకాశవాణి ప్రసారాలు వస్తుండగా, ఎఫ్‌ఎం నుంచి రేడియోలోగానీ, సెల్‌ఫోన్‌లోగానీ 103.6 మెగా హెడ్స్‌పై ప్రసారమవుతున్నాయి. కొన్ని సెల్‌ఫోన్లలో నేరుగా కార్యక్రమాలు వినే సౌకర్యం ఉంది. మరికొన్నింటిలో హెడ్ ఫోన్స్ వాడవలసిన అవసరం ఉంటుంది.
పూర్తి స్థాయిలో...
ప్రయోగాత్మక ప్రసారాలు కనీసం మూడు నుంచి ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉంది. ఈలోపు ఎఫ్‌ఎం ప్రసారాలకు అవసరమైన సిబ్బంది, కార్యక్రమాల రూపకల్పన, నెట్‌వర్క్ తదితరాలను ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు రేడియో వ్యాఖ్యాతల్లాగా ఎఫ్‌ఎం కార్యక్రమాల్లో జాకీలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రస్తుతం ప్రసారాలివి!
ప్రస్తుతం ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ ద్వారాతెలుగులో ఉదయం 6.45, మధ్యాహ్నం 1.10, సాయంత్రం 6.15 గంటలకు ప్రాంతీయ వార్తలు, ఉదయం 7.10, మధ్యాహ్నం 12.40, రాత్రి 7.05 గంటలకు తెలుగులో జాతీయ వార్తలను వినవచ్చు. ఆంగ్లంలో ఉదయం 8.15, మధ్యాహ్నం 2.00, రాత్రి 9.00 గంటలకు, హిందీలో ఉదయం 8.00, రాత్రి 8.45 గంటలకు, ఉర్దూలో సాయంత్రం 5.50 గంటలకు వార్తలను వినవచ్చు. ఇవిగాక ఉదయం 7.15 గంటల నుంచి 7.55 గంటల వరకు కాంతిరేఖలు కింద ఆరోగ్యం, సాహిత్యం తదితర అంశాలపై కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఉదయం 8.30 నుంచి 9.00 గంటల వరకు సినిమా పాటలు, 10 నుంచి 11గంటల వరకు శ్రోతలు కోరిన ి పాటలను వినిపిస్తారు. సాయంత్రం 5 గంటలకు యువవాణిలో యువతకు అవసరమైన సమాచారం, వినోద కార్యక్రమాలు ప్రసారవుతాయి.