66 ఎఫ్‌ఎం చానళ్లు @రూ. 200 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎం రేడియో చానళ్ల ఫేజ్–3 రెండో రౌండ్ వేలంలో మొత్తం 66 చానళ్లు రూ. 200 కోట్లకు అమ్ముడుపోయాయి. 48 పట్టణాలు, నగరాల్లో ఈ కొత్త ఎఫ్‌ఎం చానళ్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించిన వేలం వివరాల్ని సోమవారం వెల్లడించారు. హైదరాబాద్‌లో ఎఫ్‌ఎం చానల్ ఏర్పాటుకు అత్యధికంగా రూ. 23.4 కోట్లకు సన్ గ్రూపునకు చెందిన కల్ రేడియో బిడ్ చేసింది.
డెహ్రాడూన్‌లో ఎఫ్‌ఎం కోసం రూ. 15.61 కోట్లతో సౌత్ ఆసియా ఎఫ్‌ఎం బిడ్ వేసింది. ఇది కూడా కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్‌దే కావడం విశేషం. అయితే లేహ్, భాదేర్వా, పూంచ్, కతువా, కార్గిల్‌లో ఎఫ్‌ఎంల ఏర్పాటు కోసం కేవలం రూ. 5 లక్షలకే బిడ్లు దాఖలయ్యాయి. ఫేజ్–3 రెండో దశలో 92 నగరాల్లో 266 ఎఫ్‌ఎం చానళ్ల ఏర్పాటు కేంద్రం లక్ష్యం. అయితే 200 చానళ్ల ఏర్పాటుకు ఎలాంటి స్పందన రాలేదు.