
అవన్నీ అరుదైన నాణేలు. కొన్ని అయితే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా వేలానికి రాలేదు. మరికొన్ని నాణేలను చరిత్రకారులు కూడా ఎన్నడూ చూడలేదు. ఇంతటి విశేషాలున్న పురాతన నాణేలు ఇప్పుడు వేలంపాటకు వచ్చాయి. వీటిని దక్కించుకోవాలంటే దాదాపు రూ.860 కోట్లు చెల్లించాల్సి రావొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంత రేటు పలుకుతున్న ఈ నాణేల కథాకమామిషు ఓసారి చూద్దాం.
ఒక ట్రావెలర్ కథ..
ప్రపంచంలోనే 100 వేర్వేరు ప్రాంతాలకు చెందిన అరుదైన నాణేలను మే 20వ తేదీన స్విట్జర్లాండ్‌లో వేలం వేయనున్నారు. అన్నింటినీ ఒకేసారిగా కాకుండా మూడేళ్లకాలంలో కొద్ది కొద్దిగా వేలంలో విక్రయించనున్నారు. దాదాపు 15,000 నాణేలను ఏకంగా 50 సంవత్సరాలపాటు ఎవరికీ దక్కకుండా భూగర్భంలో దాచేసి తర్వాత బయటకు తీయడంతో ఇప్పుడీ నాణేల గురించి చర్చ మొదలైంది. యూరప్‌కు చెందిన ఒక వ్యక్తి గతంలో అమెరికాలో స్థిరపడ్డాడు.
అత్యంత దారుణమైన స్టాక్‌మార్కెట్ (Stock Market) పతనంగా చరిత్రలో నిలిచిపోయిన ‘1929 వాల్‌స్ట్రీట్ క్రాష్’ ఉదంతం తర్వాత మదుపరులు స్టాక్‌మార్కెట్‌పై నమ్మకం కోల్పోయారు. అంతా బంగారం కొనడంపై దృష్టిపెట్టారు. అదే సమయంలో ఇతను సైతం తొలుత బంగారు కొన్నాడు. తర్వాత పాత నాణేలను కొని వాటిని అధిక ధరలకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అలా తన బంగారు నాణేల కొనుగోలు ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు.
1930వ దశకంలో భార్యతో కలిసి ప్రపంచయాత్ర మొదలెట్టి ఎన్నో దేశాల్లో అరుదైన నాణేలను సేకరించడం మొదలెట్టాడు. ఎక్కువగా అమెరికా, యురప్ ప్రాంతాల నాణేలను సేకరించారు. ప్రతి నాణెం ప్రత్యేకత, విశిష్టతలను రాసిపెట్టుకున్నాడు. తర్వాత ఈ జంట యూరప్‌లో స్థిరపడింది. అయితే యూరప్‌ను అడాల్ఫ్ హిట్లర్ సారథ్యంలోని నాజీ పార్టీ దురాక్రమిస్తుండటంతో భయపడిపోయి తమ నాణేలను సురక్షితంగా దాచాలని భావించారు.
15,000 నాణేలను వేర్వేరుగా సిగార్ పెట్టెల్లో పెట్టి వాటిని అల్యూమినియం డబ్బాల్లో నింపి భూమిలో పాతిపెట్టారు. వాటిని దాచిన రహస్యప్రాంతం జాడను తమ కుటుంబసభ్యులకు మాత్రం చెప్పారు. అలా ఆ నాణేలు ఏకంగా 50 సంవత్సరాలపాటు భూమిలోనే ఉండిపోయాయి. ఇటీవల వాళ్ల వారసులు వాటిని బయటకు తీసి కొంతకాలం బ్యాంక్ లాకర్‌లో దాచారు. తాజాగా వేలం సంస్థకు అప్పగించారు. స్విట్లర్లాండ్‌లోని నమిస్మాటికా ఆర్స్ క్లాసికా వేలం సంస్థ వీటిని వేర్వేరు లాట్‌లుగా వేలం(Auction) వేయనుంది.
ఎన్నెన్నో అరుదైన బంగారు నాణేలు
దాదాపు 80 సంవత్సరాలుగా ఎవ్వరూ చూడని అరుదైన బంగారు నాణేలు (Gold Coins) ఈ ‘ట్రావెలర్ కలెక్షన్’లో ఉన్నాయి. 1629లో ముద్రించిన ‘100’డ్యూకాట్ ఫెర్డినాడ్–3 రాజు బంగారు నాణెం సైతం ఇందులో ఉంది. ఫెర్డినాడ్–3 రాజు చెక్ రాజ్యం, క్రొయేషియా, హంగేరీ, ఆస్ట్రియాలకు పాలించారు. స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఈ నాణెం బరువు ఏకంగా 348.5 గ్రాములు. ఆనాడు యూరప్‌లో ముద్రించిన అతిబరువైన నాణేల్లో ఇదీ ఒకటి. ఇరాన్‌లో 18వ శతాబ్దం చివర్లో, ఆఘా మొహమ్మద్ ఖాన్ ఖాజర్ కాలంలో ఇస్ఫమాన్, టెహ్రాన్‌లలో ముద్రించిన టోమాన్ బంగారు నాణేలు సైతం ఈయన కలెక్షన్‌లో ఉన్నాయి.
చదవండి: పాస్‌పోర్టు మర్చిపోయిన పైలట్.. విమానం యూటర్న్!
‘‘ఏమాత్రం పాడవకుండా కొత్తగా ఉన్న ఈ నాణేలు చరిత్రలోని ఎన్నో విశేషాలను మనకందిస్తాయి. మా వేలం సంస్థ కీర్తినీ పెంచుతాయి’’అని వేలం సంస్థ డైరెక్టర్ ఆర్టురో రూసో అన్నారు. ‘‘ఈ రకం డిజైన్ నాణేలను నేనెప్పుడూ చూడలేదు. ఇలాంటి నాణేలు గత 80 ఏళ్లలో ఎక్కడా వేలానికి రాలేదు’’ అని కలెక్షన్ కన్సల్టెంట్ డేవిడ్ గెస్ట్ అన్నారు. ప్రమాదంలో అలనాటి ఏథెనా పాథినోస్ బంగారు శిల్పం కరిగిపోగా వచ్చిన బంగారం నుంచి క్రీస్తుపూర్వం 296 ఏడాదిలో తయారుచేసిన నాణేన్ని సైతం వేలానికి ఉంచారు.
– సాక్షి, నేషనల్ డెస్క్