coin collection
-
వందేళ్ల తర్వాత వేలానికి
కొందరికి నాణేలు, ఇంకొందరికి పోస్టల్ స్టాంప్స్, మరికొందరికి కరెన్సీ. బాల్యంలో సేకరణ చాలామందికి ఓ అభిరుచి. అచ్చం ఇలాగే ఆ డానిష్ వాణిజ్యవేత్తకూ నాణేలంటే పిచ్చి. అందుకే పదీ, ఇరవై కాదు 20వేల నాణేలను సేకరించాడు. అత్యంత ఖరీదైన ఆ నాణేల నుంచి కొన్నింటిని వచ్చే నెలలో వేలం వేయనున్నారు. ఆ నాణేల ప్రత్యేకత ఏమిటి? వందేళ్ల తరువాతే ఎందుకు వేలం వేస్తున్నారు? ఆ విశేషాలు ఓసారి చూద్దాం.. డెన్మార్క్‌కు చెందిన లార్స్ఎమిల్ బ్రూన్ (ఎల్.ఇ.బ్రూన్) భూస్వాముల కొడుకు. అయితే కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని 20 ఏళ్ల వయసులోనే తెలుసుకున్నారు. మరి కొంత రుణం తెచ్చి వెన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అమ్మకాలు, ఎగుమతులతో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అతని మేనమామకు నాణేల సేకరణ ఇష్టం. అది కాస్తా బ్రూన్కు వారసత్వంగా వచి్చంది. చిన్నతనంలో 1859 నుంచే కరెన్సీని సేకరించడం ప్రారంభించారు. సంపన్నుడిగా ఎదిగాక.. అతని నాణేల సేకరణ కూడా సుసంపన్నమయ్యింది. దాదాపు 20వేల అత్యంత విలువైన నాణేలను సేకరించారు. 1885లో డానిష్ న్యూమిస్మాటిక్ (నాణేల సేకరణ, అధ్యయనం) సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా మారారు. 1923లో బ్రూన్ మరణించారు. తన నాణేల సేకరణను వందేళ్లపాటు దాచి ఉంచేలా వీలునామా రాశారు. వింత వీలునామా.. ‘‘ఆరు దశాబ్దాలకు పైగా కూడబెట్టిన విస్తారమైన నాణేలు, నోట్లు, పతకాలు డెన్మార్క్ జాతీయ సేకరణ అత్యవసర రిజర్వ్‌లో ఉంచాలి. అంతా సవ్యంగా ఉంటే.. నా వారసులకు ప్రయోజనం కలిగేలా వందేళ్ల తరువాత వాటిని విక్రయించవచ్చు’’అని బ్రూన్ తన వీలునామాలో పేర్కొన్నారు. నిధిని ఇంతకాలం దాచడానికి ఓ కారణం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో విధ్వంసం చూసిన అతను.. తన రాయల్ డానిష్ కాయిన్ అండ్ మెడల్ కలెక్షన్ ఏదో ఒక రోజు బాంబు దాడి ఎదుర్కోవచ్చు లేదా దోపిడీకి గురికావచ్చని భావించారు. అందుకే వందేళ్ల తరువాత అని వీలునామాలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ వందేళ్లు నాణేలను రహస్యంగా ఉంచారు. అవి ఎక్కడున్నాయో చాలా తక్కువ మందికి తెలుసు. గతేడాది ముగిసిన గడువు.. వందేళ్ల గడువు 2023తో ముగిసిపోయింది. బ్రూన్ వ్యక్తిగత 20,000 నాణేల సేకరణ నుంచి మొదటి సెట్ నాణేలు వచ్చే నెలలో వేలానికి రానున్నాయి. బ్రూన్ ఖజానా మొత్తం ఖాళీ కావాలంటే.. అనేక వేలాలు నిర్వహించాలి. వేలం మొత్తం పూర్తయితే ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన అంతర్జాతీయ నాణేల సేకరణ అవుతుందని అరుదైన నాణేల డీలర్, అమ్మకాలను నిర్వహించే వేలం సంస్థ స్టాక్స్ బోవర్స్ తెలిపింది. బ్రూన్ కలెక్షన్ 500 మిలియన్ డానిష్ క్రోనర్ లేదా సుమారు 72.5 మిలియన్ డాలర్లకు బీమా చేసినట్లు వెల్లడించింది. మార్కెట్లోకి వచి్చ న ప్రపంచ నాణేలలో అత్యంత విలువైన సేకరణగా వేలం సంస్థ దీనిని అభివర్ణించింది. అత్యంత ఖరీదైన కింగ్ హాన్స్ నాణెం.. సెప్టెంబర్ 14 న జరిగే మొదటి సేల్ కోసం డెన్మార్క్, నార్వే, స్వీడన్‌కు చెందిన బంగారం, వెండి నాణేలతో సహా 280కి పైగా లాట్లను స్టాక్స్ బోవర్స్ ఉంచనుంది. వీటిలో 15వ శతాబ్దం చివరి నుంచి బ్రూన్ జీవితం చివరి సంవత్సరాల వరకు ఉన్నాయి. వీటి విలువ 10 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. ఇందులో స్టార్లాట్.. స్కాండినేవియా పురాతన బంగారు నాణేలలో ఒకటి. 1496 నాటి కింగ్ హాన్స్ నాణెం అత్యంత ఖరీదైనది. డెన్మార్క్ ముద్రించిన మొదటి బంగారు నాణెం. దీనిని 600,000 యూరోలు లేదా 672,510 డాలర్లకు విక్రయించవచ్చు. ఈ నాణేలను వివిధ గత కొన్ని నెలలుగా వివిధ ఎగ్జిబిషన్స్‌లో, స్టాక్స్ బోవర్స్ గ్యాలరీలలో ప్రదర్శించారు. అమ్మకానికి ముందు వీటిని కోపెన్‌హాగన్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అపూరూప కలెక్షన్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): చరిత్రకు సాక్ష్యాలు స్టాంపులు, నాణేలు. వివిధ దేశాలకు చెందిన నాణేలు, స్టాంపులను సేకరించి ఎన్నో ప్రదర్శనలిచ్చారు నగరానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి అమ్ము కృష్ణారావు. 1978లో ఆయన కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను సందర్శించారు. ఆ సమయంలో గంగా నదిలో నేపాల్ దేశానికి చెందిన 2 పైసలు, చిన్న సైజు కోడిగుడ్డు ఆకారంలో ఉన్న నున్నని రాయి ఆయనకు దొరికాయి. నేపాల్ 2 పైసల మీద ఆవు, ఎవరెస్ట్ శిఖరం, త్రిశూలం, ఢమరుకం గుర్తులు ఉండడంతో ఆ నాణేన్ని, రాయిని తన పూజ గదిలోకి చేర్చారు. అంతకుముందు 1972లో హైదరాబాద్‌లో నివసిస్తున్న సమయంలో రోజువారీ ఖర్చులు పోనూ మిగిలిన చిల్లర నాణేల్లో బొమ్మలున్న వాటిని పక్కన పెట్టడం అలవాటు చేసుకున్నారు. 1984లో సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో టెక్నీషియన్ గ్రేడ్–3గా టిట్లాఘడ్లో రైల్వేలో కృష్ణారావు ప్రస్థానం ప్రారంభించారు. 1985లో కుటుంబంతో కలిసి దక్షిణ భారత యాత్ర చేస్తున్న సమయంలో రామేశ్వరంలో శ్రీలంక నాణేలు కొన్ని దొరికాయి. అలా నాణేల సేకరణ పట్ల ఆకర్షితులై నాటి నుంచి నేటి వరకు వందల సంఖ్యలో నాణేలను ఆయన సంపాదించారు. 1990లో విశాఖపట్నం డీజిల్ లోకో షెడ్‌కు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఏటా జరిగే విశ్వకర్మ పూజ రోజున ఈ నాణేలను ప్రదర్శించేవారు కృష్ణారావు. 2000లో వారణాసిలోని ఓ ఆలయ ప్రాంగణంలో నేలపై వెండి నాణేలు తాపడం చేసి ఉండడం చూసిన ఆయన తన దృష్టిని అటు వైపుగా సారించారు. ఇంకా ఎంతో సాధించాల్సింది ఉందని ఆ రోజు తెలుసుకున్నారు. అప్పుడే విశాఖపట్నంలోని న్యూమిస్మాటిక్ అండ్ ఫిలాటెలిక్ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యుడిగా చేశారు. నాణేలు, కరెన్సీ సేకరణలో మెళకువలు నేర్చుకున్నారు. 2022 ఏప్రిల్ 30న ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా రిటైర్ అయ్యారు. రైల్వేపై ఆసక్తి ఇలా... ఇలా సాగిపోతున్న సమయంలో 2003లో నాగ్‌పూర్ పోస్ట్ ఆఫీస్‌లో 150 ఏళ్ల భారతీయ రైల్వేల ప్రస్థానంపై విడుదల చేసిన ప్రత్యేక స్టాంప్, మినీయేచర్ షీట్‌ను ఆయన చూశారు. అప్పుడే రైల్వే మీద విడుదల చేసిన స్టాంపుల సేకరణ మొదలుపెట్టారు. రైల్ జర్నీ త్రూ పోస్టల్ స్టాంప్స్ అనే పేరుతో 2004లో నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొని రజత పతకం కైవసం చేసుకున్నారు. 2007లో చెన్నైలో జాతీయస్థాయి ప్రదర్శనలో రజతం, 2011లో న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీనికి కొనసాగింపుగా రైల్వే టోకెన్లు, నాణేలు, కరెన్సీ మొదలైనవి సేకరించారు. వీటితో సుమారు 100 ప్రదర్శనలిచ్చి ఎన్నో ప్రశంసలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు కృష్ణారావు. ఇవే కాకుండా... ఇవి మాత్రమే కాకుండా బ్రిటిష్ ఇండియా కాయన్ల కలెక్షన్ ఆయన వద్ద ఉంది. 1835 నుంచి 1947 వరకు గల వివిధ నాణేలను ఆయన సేకరించారు. 1950 నుంచి నేటి వరకు అన్ని మింట్లు విడుదల చేసిన నాణేలు ఆయన వద్ద ఉన్నాయి. స్మారక నాణేల సెట్, 1, 2, 5, 20 రూపాయల కరెన్సీ, సిగ్నేచర్, ఇన్సెట్, ప్రిఫిక్స్ ప్రకారం సేకరించారు. స్టార్ నోట్స్ 1, 10, 20, 50, 100, 200 ఆయన కలెక్షన్లో చేరాయి. అమృతోత్సవాల్లో సైతం... ఇటీవల వాల్తేర్ డివిజన్ నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో కృష్ణారావు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాపూజీ జీవిత విశేషాలతో కూడిన 200 ప్రత్యేక ఫొటోలతో ఎగ్జిబిషన్, స్టాంపుల, నాణేల ప్రదర్శనను ఆయన ఏర్పాటు చేశారు. దీనిని తిలకించిన డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్ కుమార్ సత్పతి కృష్ణారావును ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? -
పాత నాణెం.. బంగారం!
నాణేలను సేకరించే అభిరుచి ఉన్న వారు అరుదుగా కనిపిస్తుంటారు. కానీ, నాణేల సేకరణ అన్నది ఒక చక్కని హాబీగా ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. నాణేల వినియోగానికి 2,800 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. ముఖ్యంగా స్వాతంత్య్రానికి పూర్వం రాజుల కాలం నాటి నాణేలు, బ్రిటిష్ కాలంలో ముద్రించిన నాణేలను కోరుకున్నంత ఇచ్చి తీసుకునేవారు ఉన్నారు. బుద్ధుని రూపాన్ని కనిష్కకాలం నాటి నాణేల్లో చూడొచ్చు. ఇవే మన దేశంలో అత్యంత ఖరీదైన కాయిన్లు. గత కాలపు వైభవాలకు, పాలనకు సాక్షీభూతాలుగా నిలిచే కాయిన్లకు డిమాండ్ చెప్పలేనంత. ఒకప్పుడు అభిరుచిగా సాగిన నాణేల వేట.. నేడు కాసులు కురిపించే పెట్టుబడిగానూ మారిపోయింది. దీంతో గతంలో పాత కాయిన్లను కొనేవారు కొద్ది మందే ఉండగా.. ప్రస్తుతం కొనుగోలుదారులు, విక్రయదారులు కూడా పెరుగుతూ ఉన్నారు. గొప్ప చిత్రకారులు వేసిన పెయింటింగ్‌లు కోట్ల రూపాయలు పలికినట్టే.. మీ బీరువాలోని పూర్వకాలపు నాణెం కూడా కాసులు కురిపించొచ్చు. నేటి కాలపు అరుదైన కాయిన్ కొన్ని తరాల తర్వాతి వారికి అపురూపంగాను అనిపించొచ్చు. అందుకే నాణేల సేకరణ వెనుకనున్న విలువైన కోణాన్ని తరచి చూసే కథనమే ఇది. మన తాతల కాలంలో అయితే నాణేల సేకరణకు పెట్టుబడి కోణం ఉండేది కాదు. ఇష్టంతో వివిధ రకాల కాయిన్లను పోగు చేసుకోవాలన్న అభిలాష కొందరిలో ఉంటే, తమకు ఇష్టమైన గొప్ప వ్యక్తుల చిత్రాలతో ఉండే నాణేల పట్ల కొందరు మక్కువ చూపించేవారు. శతాబ్దాల ఘనచరిత్రకు నిదర్శనంగా నిలిచే ఆ నాణేలకు ఊహించనంత విలువ, డిమాండ్ తోడయ్యాయి. నాణేల సేకరణ తొలుత అభిరుచితో మొదలైనా.. ఆ తర్వాత వాటిపై మరింత అధ్యయనానికి, చరిత్ర ఆధారాల అన్వేషణకు కీలకంగా మారిపోయింది. నాణేల సేకరణదారులు, అధ్యయనకారులను న్యూమిస్మ్యాటిస్ట్గా పేర్కొంటారు. ఇతరులతో పోలిస్తే నాణేల విషయంలో వీరు భారీగా సంపదను గడిస్తున్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే నాణేలు, అంతర్జాతీయంగా వాటి డిమాండ్‌పై వీరికి లోతైన అవగాహన ఉంటుంది. మన దేశంలో నాణేలను సేకరించడం అన్నది అలవాటు నుంచి పెట్టుబడిగా మారుతోంది. కానీ, ఇప్పటికీ ఇది ఆరంభ దశలోనే ఉందంటున్నారు నిపుణులు. ‘‘50 ఏళ్ల క్రితం నాణేలు, మెడల్స్, బ్యాంక్ నోట్లను కొనుగోలు చేసేవారు చాలా కొద్ది మందే ఉండేవారు. కాలక్రమేణా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. 1990ల నుంచి ముంబైలో ఏటా కాయిన్షోను మేము నిర్వహిస్తూ వస్తున్నాం. దీంతో నాణేల పట్ల ఆసక్తి పెరుగుతోంది. ’’ అని టోడీవాలా ఆక్షన్స్ అధినేత ఫారూక్ ఎస్ టోడీవాలా తెలిపారు. సురక్షితమైన పెట్టుబడి నాణేల సేకరణ నేడు సురక్షితమైన, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారిందంటున్నారు నిపుణులు. 2008–2012 కాలంలో నాణేల పెట్టుబడిపై రెట్టింపు రాబడులు వచ్చాయి. దీంతో నాణేలను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి ఏర్పడింది. దీంతో మరింత మంది కొత్తవారు ఈ దిశగా అడుగులు వేసేందుకు కారణమైంది. ‘‘నా వరకు అయితే కాయిన్ల సేకరణ అభిరుచిలో భాగమే. కానీ, కొనుగోలు చేస్తున్న నాణెం విలువ భవిష్యత్తులో పెరుగుతుందా, లేదా అని తెలుసుకునేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తాను. నా తదుపరి తరం వారికి నాణేలపై సరిపడా సమాచారం, విజ్ఞానం ఉండకపోవచ్చు. లేదంటే వారికి ఆసక్తి అయినా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో నా సేకరణలు అన్నింటినీ విక్రయించేస్తాను’’ అని ముంబైకి చెందిన నాణేల సేకరణకర్త దిన్యర్ మదన్ చెప్పారు. అవగాహనతోనే అడుగు నాణేలను గుర్తించడం, వాటి చారిత్రక నేపథ్యం, విలువపై అవగాహన కల్పించే ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. నాణేలను సేకరించే వారు వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడమే కాకుండా, పరిజ్ఞానాన్ని పెంచుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ‘‘ఏ కాలం నాటిది, చారిత్రకంగా ప్రాధాన్యం ఉన్నదా తదితర విషయ పరిజ్ఙానం అవసరం. అప్పుడు సేకరించిన నాణేనికి కాలం గడుస్తున్న కొద్దీ అనూహ్యమైన విలువ తోడవుతుంది. గుప్తా గోల్డ్ కాయిన్లు, మొఘలుల నాటి కాయిన్లు, రాజ సంస్థానాల నాటివి, బ్రిటిష్ ఇండియా కాయిన్లకు దేశంలో ఎంతో ప్రాచుర్యం ఉంది. అంతర్జాతీయంగా వేరు.. అమెరికా, బ్రిటన్‌లో అయితే నాణేలకు సంఘటిత మార్కెట్ ఉంది. అక్కడ నియంత్రణల పరిధిలోకి వస్తుంది. బ్యాంకులు, కార్పొరేట్లు సైతం నాణేలపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. నాణేల దిగుమతిపై సుంకాలు, ఆంక్షలను కూడా చాలా దేశాలు అమలు చేయడం లేదు. ‘‘కానీ, మనదేశంలో పరిస్థితి వేరు. భారత్‌లో తయారైన భారత్‌కే చెందిన నాణేలు, మెడల్స్, బ్యాంకు నోట్ల దిగుమతికి కస్టమ్స్ విభాగం సులభంగా అనుమతించడం లేదు. వీటి దిగుమతి కోసం ఎన్నో గంటల సమయం వెచ్చించడమే కాకుండా.. విపరీతమైన సుంకాలు, జరిమానాలు కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంది’’ అని టోడీవాలా ఆక్షన్స్ అధినేతటోడీవాలా వివరించారు. వీటికి తోడు అసంఘటిత స్థాయిలోనే పరిశ్రమ ఉన్నట్టు పేర్కొన్నారు. విలువను నిర్ణయించే అంశాలు నాణేలకు విలువ కట్టడంలో కీలకంగా చూసేది నాణ్యతే. పాలిష్, గీతలు, ధరించడానికి అనుకూలంగా ఉంటుందా ఇలా ఎన్నో అంశాల ఆధారంగా విలువ నిర్ణయిస్తుంటారు. మంచి, ఎంతో మంచి, శ్రేష్టమైన, ఎంతో శ్రేష్టమైన, అత్యున్నత శ్రేష్టమైన, చెలామణిలోనివి ఇలా పలు విభాగాలుగా నాణేలను వేరు చేస్తారు. చెలామణిలో లేకపోయినా ఫర్వాలేదు కానీ.. ఆ నాణేలపై చిత్రాలు, అక్షరాలు చెదిరిపోకుండా స్పష్టంగా ఉంటే అధిక విలువను చెల్లించేందుకు కొనుగోలుదారులు వెనుకాడరు. మంచి నాణెం అనుకున్నది చెత్తనాణెం కూడా కావచ్చన్నారు కోల్‌కతాకు చెందిన న్యూమిస్మ్యాటిస్ట్ అనింద్య జ్యోతి మజుందార్. ఉదాహరణకు 2,000 సంవత్సరాల కిత్రం నాటి గ్రీక్ కాయిన్‌ను చెక్కుచెదరని స్థితిలో (మింట్ కండీషన్)లో వేలానికి ఉంచితే ఊహించనంత విలువ లభిస్తుందని తెలిపారు. ప్రాచీన కాలం నాటి కాయిన్ల లభ్యత కొత్తగా పెరిగేది కాదంటూ.. అదే సమయంలో డిమాండ్ క్రమంగా పెరుగుతూనే వెళుతుందన్న విషయాన్ని టోడీవాలా ప్రస్తావించారు. అంటే పూర్వ కాలపు కాయిన్ల లభ్యత కొద్దిగా ఉన్నందున వాటికి విలువ క్రమంగా పెరుగుతూనే వెళుతుందని అర్థం చేసుకవోచ్చు. ‘‘అవగాహన పెరుగుతోంది. వ్యక్తుల దగ్గర మిగులు ధనంలోనూ వృద్ధి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు నాణేల ప్రదర్శనలతో కాయిన్లకు డిమాండ్ అనూహ్యంగా వృద్ధి చెందుతోంది’’ అని టోడీవాలా పేర్కొన్నారు. ఎన్నో వేదికలు వేలం కంపెనీలు, డీలర్‌షిప్‌లు ఉన్నందున ఈ పరిశ్రమ ఎంతో కాలం అసంఘటిత స్థాయిలోనే ఉండదన్నది టోడీవాలా అభిప్రాయం. నాణేల కొనుగోలు, విక్రయాలకు ఆన్లైన్లో ఎన్నో వేదికలు అందుబాటులోకి వచ్చాయి. విక్రయదారులు కోరుతున్నంత ధర పెట్టి కొనేవారు ముందుకు వచ్చినప్పుడే లావాదేవీ నమోదవు తుంది. లేదంటే ఆక్షన్ కంపెనీని సంప్రదించి నాణేన్ని ప్రదర్శనకు ఉంచుకోవచ్చని, లేదంటే ఆన్లైన్ పోర్టళ్లలో విక్రయించుకోవచ్చని టోడీవా లా సూచించారు. ఆన్లైన్లో అయితే విక్రయదారుల వివరాలు, పూర్వపరాలు తెలియడం కష్టం. మోసాలకూ అవకాశం ఉంటుంది. ఇటువంటి సందేహాలతో ఉండేవారికి వేలం కంపెనీలను, డీలర్లను ఆశ్రయించడం చక్కని మార్గం అవుతుంది. ‘‘గతంలో ఒక వేలానికి మూడు నెల పాటు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతీ నెలా 7–8 వేలాలు కొనసాగుతున్నాయి’’ అని ముంబై కాయిన్ సొసైటీ సభ్యుడు అజయ్‌గోయల్ తెలిపారు. కాయిన్ బజార్ మీ దగ్గర 1, 2, 5 రూపాయల అరుదైన నాణేలు, నోట్లు ఉంటే రూ.లక్షలు పెట్టికొనే వారు ఉన్నారు. కాయిన్‌బజార్ పోర్టల్‌లో ఇటువంటి వేలాలు కనిపిస్తుంటాయి. మాతా వైష్ణోదేవి చిత్రం ఉన్న రూ.10 నాణెం రూ.లక్షలు పలికిన సందర్భాలున్నాయి. 1977–79 మధ్యకాలం నాటి రూపాయి నోట్‌కు రూ.45,000 చెల్లించిన వారు కూడా ఉన్నారు. కాకపోతే ఆయా నోట్లు, నాణేలపై వివరాలు చెదిరిపోకుండా ఉండాలి. అంతేకాదు ఆర్బీఐ పరిధిలోని ముద్రణ శాల కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకమైన కాయిన్లను ముద్రిస్తూ ఉంటుంది. వాటికి సైతం మంచి డిమాండ్ ఉంటోంది. -
నాణేల ప్రేమికులకు ‘ఒలింపిక్స్’ ఉత్సాహం
ఒలింపిక్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులకే కాదు.. నాణేల ప్రేమికులకు కూడా కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. ఈ ప్రపంచ క్రీడా సంబరాన్ని పురస్కరించుకుని వివిధ దేశాలు సరికొత్త నాణేలు విడుదల చేశాయి. వీటిల్లో ఆస్ట్రేలియా విడుదల చేసిన నాణేలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన ప్రముఖ నాణేల సేకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ప్రత్యేక ఆర్డర్‌పై అయిదు ఒలింపిక్స్ నాణేలను సేకరించారు. వీటి గురించి ఆయన ఇలా వివరించారు. ‘ఒలింపిక్స్ చిహ్నాన్ని 1912లో రూపొందించారు. అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య 1914 జూన్‌లో దీనిని స్వీకరించి 1920 నుంచి వినియోగిస్తోంది. ఒకదానితో ఒకటి గొలుసులా కలిసిన అయిదు రింగులు ఒలింపిక్ క్రీడల చిహ్నం. నీలం, పసుపుపచ్చ, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉండే ఈ అయిదు రింగులు వరుసగా యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలను సూచిస్తాయి. ఇవి క్రీడా స్ఫూర్తికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ చిహ్నాన్ని శాంతికి ప్రతీకగా నిలిచే తెల్లని వస్త్రంపై ముద్రిస్తారు. రియో ఒలింపిక్స్ సందర్భంగా ఆస్ట్రేలియా రెండు డాలర్ల ముఖ విలువ ఉన్న అయిదు నాణేలను ముద్రించింది. ఒక్కో నాణెంపై ఒలింపిక్ చిహ్నంలోని ఒక్కో రంగును ముద్రించింది. అలాగే ఈ అయిదు నాణేలపై ఆస్ట్రేలియా క్రీడాకారులు పాల్గొనే పలు క్రీడాంశాలను కూడా ముద్రించారు’ అని కామేశ్వర్ తెలిపారు. – అమలాపురం టౌన్