వందేళ్ల తర్వాత వేలానికి | world most expensive coin collection is going up for auction | Sakshi
Sakshi News home page

వందేళ్ల తర్వాత వేలానికి

Published Tue, Aug 27 2024 5:56 AM | Last Updated on Tue, Aug 27 2024 5:56 AM

world most expensive coin collection is going up for auction

కొందరికి నాణేలు, ఇంకొందరికి పోస్టల్‌ స్టాంప్స్, మరికొందరికి కరెన్సీ. బాల్యంలో సేకరణ చాలామందికి ఓ అభిరుచి. అచ్చం ఇలాగే ఆ డానిష్‌ వాణిజ్యవేత్తకూ నాణేలంటే పిచ్చి. అందుకే పదీ, ఇరవై కాదు 20వేల నాణేలను సేకరించాడు. అత్యంత ఖరీదైన ఆ నాణేల నుంచి కొన్నింటిని వచ్చే నెలలో వేలం వేయనున్నారు. ఆ నాణేల ప్రత్యేకత ఏమిటి? వందేళ్ల తరువాతే ఎందుకు వేలం వేస్తున్నారు? ఆ విశేషాలు ఓసారి చూద్దాం..  

డెన్మార్క్‌కు చెందిన లార్స్‌ఎమిల్‌ బ్రూన్‌ (ఎల్‌.ఇ.బ్రూన్‌) భూస్వాముల కొడుకు. అయితే కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని 20 ఏళ్ల వయసులోనే తెలుసుకున్నారు. మరి కొంత రుణం తెచ్చి వెన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అమ్మకాలు, ఎగుమతులతో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అతని మేనమామకు నాణేల సేకరణ ఇష్టం. అది కాస్తా బ్రూన్‌కు వారసత్వంగా వచి్చంది. చిన్నతనంలో 1859 నుంచే కరెన్సీని సేకరించడం ప్రారంభించారు. సంపన్నుడిగా ఎదిగాక.. అతని నాణేల సేకరణ కూడా సుసంపన్నమయ్యింది. దాదాపు 20వేల అత్యంత విలువైన నాణేలను సేకరించారు. 1885లో డానిష్‌ న్యూమిస్మాటిక్‌ (నాణేల సేకరణ, అధ్యయనం) సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా మారారు. 1923లో బ్రూన్‌ మరణించారు. తన నాణేల సేకరణను వందేళ్లపాటు దాచి ఉంచేలా వీలునామా రాశారు.  

వింత వీలునామా..  
‘‘ఆరు దశాబ్దాలకు పైగా కూడబెట్టిన విస్తారమైన నాణేలు, నోట్లు, పతకాలు డెన్మార్క్‌ జాతీయ సేకరణ అత్యవసర రిజర్వ్‌లో ఉంచాలి. అంతా సవ్యంగా ఉంటే.. నా వారసులకు ప్రయోజనం కలిగేలా వందేళ్ల తరువాత వాటిని విక్రయించవచ్చు’’అని బ్రూన్‌ తన వీలునామాలో పేర్కొన్నారు. నిధిని ఇంతకాలం దాచడానికి ఓ కారణం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో విధ్వంసం చూసిన అతను.. తన రాయల్‌ డానిష్‌ కాయిన్‌ అండ్‌ మెడల్‌ కలెక్షన్‌ ఏదో ఒక రోజు బాంబు దాడి ఎదుర్కోవచ్చు లేదా దోపిడీకి గురికావచ్చని భావించారు. అందుకే వందేళ్ల తరువాత అని వీలునామాలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ వందేళ్లు నాణేలను రహస్యంగా ఉంచారు. అవి ఎక్కడున్నాయో చాలా తక్కువ మందికి తెలుసు. 

గతేడాది ముగిసిన గడువు..  
వందేళ్ల గడువు 2023తో ముగిసిపోయింది. బ్రూన్‌ వ్యక్తిగత 20,000 నాణేల సేకరణ నుంచి మొదటి సెట్‌ నాణేలు వచ్చే నెలలో వేలానికి రానున్నాయి. బ్రూన్‌ ఖజానా మొత్తం ఖాళీ కావాలంటే.. అనేక వేలాలు నిర్వహించాలి. వేలం మొత్తం పూర్తయితే ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన అంతర్జాతీయ నాణేల సేకరణ అవుతుందని అరుదైన నాణేల డీలర్, అమ్మకాలను నిర్వహించే వేలం సంస్థ స్టాక్స్‌ బోవర్స్‌ తెలిపింది. బ్రూన్‌ కలెక్షన్‌ 500 మిలియన్‌ డానిష్‌ క్రోనర్‌ లేదా సుమారు 72.5 మిలియన్‌ డాలర్లకు బీమా చేసినట్లు వెల్లడించింది. మార్కెట్లోకి వచి్చ న ప్రపంచ నాణేలలో అత్యంత విలువైన సేకరణగా వేలం సంస్థ దీనిని అభివర్ణించింది.  

అత్యంత ఖరీదైన కింగ్‌ హాన్స్‌ నాణెం..  
సెప్టెంబర్‌ 14 న జరిగే మొదటి సేల్‌ కోసం డెన్మార్క్, నార్వే, స్వీడన్‌కు చెందిన బంగారం, వెండి నాణేలతో సహా 280కి పైగా లాట్లను స్టాక్స్‌ బోవర్స్‌ ఉంచనుంది. వీటిలో 15వ శతాబ్దం చివరి నుంచి బ్రూన్‌ జీవితం చివరి సంవత్సరాల వరకు ఉన్నాయి. వీటి విలువ 10 మిలియన్‌ డాలర్లకు పైగా ఉంటుంది. ఇందులో స్టార్‌లాట్‌.. స్కాండినేవియా పురాతన బంగారు నాణేలలో ఒకటి. 1496 నాటి కింగ్‌ హాన్స్‌ నాణెం అత్యంత ఖరీదైనది. డెన్మార్క్‌ ముద్రించిన మొదటి బంగారు నాణెం. దీనిని 600,000 యూరోలు లేదా 672,510 డాలర్లకు విక్రయించవచ్చు. ఈ నాణేలను వివిధ గత కొన్ని నెలలుగా వివిధ ఎగ్జిబిషన్స్‌లో, స్టాక్స్‌ బోవర్స్‌ గ్యాలరీలలో ప్రదర్శించారు. అమ్మకానికి ముందు వీటిని కోపెన్‌హాగన్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు.     

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement