hundred years old
-
ఉత్తరం కలిపింది వారిని...!
బ్రిటన్‌లో పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరిన ఓ పోస్టు కార్డు ఎప్పుడో వందేళ్ల కింద విడిపోయిన రెండు కుటుంబాలను కలిపింది. 1903లో ఎవార్ట్ అనే బాలుడు తన సోదరి లిడియాకు పంపిన పోస్టు కార్డు ఇటీవలే స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ క్రాడాక్ స్ట్రీట్ బ్రాంచ్‌కు చేరడం, ఈ సంఘటన విపరీతంగా వైరల్ కావడం తెలిసిందే. వారి కుటుంబాలను వెదికేందుకు సొసైటీ పూనుకుంది. కార్డు గురించి పత్రికల్లో వచి్చన కథనాలతో ఎవార్ట్, లిడియాల మనవడు నిక్ డేవిస్, మనవరాళ్లు హెలెన్ రాబర్ట్, మార్గరెట్ స్పూనర్, ముని మనవరాలు ఫెయిత్ రేనాల్డ్స్ తమ బంధాన్ని గుర్తించారు. వారంతా బుధవారం స్వాన్సీలోని వెస్ట్ గ్లామోర్గాన్ ఆరై్కవ్స్లో కలుసుకున్నారు. ఎవరు ఎవరికి ఏమవుతారంటే..? ఎవార్ట్, లిడియా కుటుంబం 121 ఏళ్ల కిందట స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో నివసించేది. ఆరుగురు తోబుట్టువుల్లో లిడియా పెద్దది. తమ్ముడైన ఎవార్ట్ ఆమెకు పోస్టు కార్డు రాశాడు. వీరికి స్టాన్లీ అనే సోదరుడున్నాడు. అతని మనవరాళ్లే హెలెన్ రాబర్ట్ (58), మార్గరెట్ స్పూనర్ (61). వెస్ట్ ససెక్స్‌కు చెందిన నిక్ డేవిస్ (65) ఎవార్ట్ మనవడు. డెవాన్‌కు చెందిన ఫెయిత్ రేనాల్డ్స్ (47) లిడియా ముని మనవరాలు. తామంతా కలిసినందుకు లిడియా, ఎవార్ట్, స్టాన్లీ పైనుంచి చూసి సంతోíÙస్తూ ఉంటారని వారంటున్నారు. రెండు కుటుంబాలను ఏకం చేసిన వందేళ్ల నాటి పోస్టును తిరిగి ఆర్కైవ్స్లోనే ఉంచాలని నిర్ణయించారు. తాత ఇంటి నుంచి లేఖ.. ‘‘పోస్టు కార్డు రాసినప్పుడు ఎవార్ట్కు 13 ఏళ్లుండి ఉంటాయి. వేసవి సెలవుల్లో ఫిష్ గార్డ్‌లోని తన తాత ఇంట్లో గడిపేవాడు. పెద్ద సోదరి లిడియాకు పోస్టు కార్డులు సేకరించే అభిరుచి ఉంది. అద్భుతంగా కనిపించిన ఓ పోస్టు కార్డును తన సోదరికి పంపించాడు’’ అంటూ ఎవార్ట్ మనవడు నిక్ డేవిస్ అప్పటి విషయాలను పంచుకున్నాడు. కార్డు కారణంగా ఇలా బంధువులను కలవడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెబుతున్నాడు. ఆశ్చర్యపోయా.. ‘‘పోస్టుకార్డు మా కుటుంబానికి చెందినదని భావించిన వారెవరో మమ్మల్ని సంప్రదించారు. దాంతో ఆశ్చర్యపోయా. మా బామ్మకు సోదరులున్నారని తెలియడం, వారి పిల్లలను కలవడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం గురించి ఇంకా ఏమేం తెలుస్తాయోనన్న ఎగ్జైట్మెంట్ ఉంది’’ అని లిడియా ముని మనవరాలు ఫెయిత్ రేన్లాడ్స్ చెప్పుకొచి్చంది. బంధువులను కలవడం బాగుంది... ‘‘ఆరేళ్లుగా మా కుటుంబ వృక్షాన్ని నిర్మిస్తున్నా. ఇలాంటి కుటుంబ సభ్యులున్నారని ఇన్నాళ్లూ తెలియకపోవడం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. వారిని కలుసుకోవడం బాగుంది. అప్పుడు వాళ్లున్న ఇంట్లోని వస్తువులను వేలానికి పంపినప్పుడు ఆ పోస్టు కార్డు బహుశా బైబిల్ లోంచి పడిపోయి ఉంటుంది. తరవాత ఎవరో దాన్ని తిరిగి పోస్టాఫీసుకు పంపి ఉంటారు’’ అని స్టాన్లీ మనవరాళ్లు హెలెన్, స్పూనర్ చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వందేళ్ల తర్వాత వేలానికి
కొందరికి నాణేలు, ఇంకొందరికి పోస్టల్ స్టాంప్స్, మరికొందరికి కరెన్సీ. బాల్యంలో సేకరణ చాలామందికి ఓ అభిరుచి. అచ్చం ఇలాగే ఆ డానిష్ వాణిజ్యవేత్తకూ నాణేలంటే పిచ్చి. అందుకే పదీ, ఇరవై కాదు 20వేల నాణేలను సేకరించాడు. అత్యంత ఖరీదైన ఆ నాణేల నుంచి కొన్నింటిని వచ్చే నెలలో వేలం వేయనున్నారు. ఆ నాణేల ప్రత్యేకత ఏమిటి? వందేళ్ల తరువాతే ఎందుకు వేలం వేస్తున్నారు? ఆ విశేషాలు ఓసారి చూద్దాం.. డెన్మార్క్‌కు చెందిన లార్స్ఎమిల్ బ్రూన్ (ఎల్.ఇ.బ్రూన్) భూస్వాముల కొడుకు. అయితే కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని 20 ఏళ్ల వయసులోనే తెలుసుకున్నారు. మరి కొంత రుణం తెచ్చి వెన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అమ్మకాలు, ఎగుమతులతో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అతని మేనమామకు నాణేల సేకరణ ఇష్టం. అది కాస్తా బ్రూన్కు వారసత్వంగా వచి్చంది. చిన్నతనంలో 1859 నుంచే కరెన్సీని సేకరించడం ప్రారంభించారు. సంపన్నుడిగా ఎదిగాక.. అతని నాణేల సేకరణ కూడా సుసంపన్నమయ్యింది. దాదాపు 20వేల అత్యంత విలువైన నాణేలను సేకరించారు. 1885లో డానిష్ న్యూమిస్మాటిక్ (నాణేల సేకరణ, అధ్యయనం) సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా మారారు. 1923లో బ్రూన్ మరణించారు. తన నాణేల సేకరణను వందేళ్లపాటు దాచి ఉంచేలా వీలునామా రాశారు. వింత వీలునామా.. ‘‘ఆరు దశాబ్దాలకు పైగా కూడబెట్టిన విస్తారమైన నాణేలు, నోట్లు, పతకాలు డెన్మార్క్ జాతీయ సేకరణ అత్యవసర రిజర్వ్‌లో ఉంచాలి. అంతా సవ్యంగా ఉంటే.. నా వారసులకు ప్రయోజనం కలిగేలా వందేళ్ల తరువాత వాటిని విక్రయించవచ్చు’’అని బ్రూన్ తన వీలునామాలో పేర్కొన్నారు. నిధిని ఇంతకాలం దాచడానికి ఓ కారణం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో విధ్వంసం చూసిన అతను.. తన రాయల్ డానిష్ కాయిన్ అండ్ మెడల్ కలెక్షన్ ఏదో ఒక రోజు బాంబు దాడి ఎదుర్కోవచ్చు లేదా దోపిడీకి గురికావచ్చని భావించారు. అందుకే వందేళ్ల తరువాత అని వీలునామాలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ వందేళ్లు నాణేలను రహస్యంగా ఉంచారు. అవి ఎక్కడున్నాయో చాలా తక్కువ మందికి తెలుసు. గతేడాది ముగిసిన గడువు.. వందేళ్ల గడువు 2023తో ముగిసిపోయింది. బ్రూన్ వ్యక్తిగత 20,000 నాణేల సేకరణ నుంచి మొదటి సెట్ నాణేలు వచ్చే నెలలో వేలానికి రానున్నాయి. బ్రూన్ ఖజానా మొత్తం ఖాళీ కావాలంటే.. అనేక వేలాలు నిర్వహించాలి. వేలం మొత్తం పూర్తయితే ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన అంతర్జాతీయ నాణేల సేకరణ అవుతుందని అరుదైన నాణేల డీలర్, అమ్మకాలను నిర్వహించే వేలం సంస్థ స్టాక్స్ బోవర్స్ తెలిపింది. బ్రూన్ కలెక్షన్ 500 మిలియన్ డానిష్ క్రోనర్ లేదా సుమారు 72.5 మిలియన్ డాలర్లకు బీమా చేసినట్లు వెల్లడించింది. మార్కెట్లోకి వచి్చ న ప్రపంచ నాణేలలో అత్యంత విలువైన సేకరణగా వేలం సంస్థ దీనిని అభివర్ణించింది. అత్యంత ఖరీదైన కింగ్ హాన్స్ నాణెం.. సెప్టెంబర్ 14 న జరిగే మొదటి సేల్ కోసం డెన్మార్క్, నార్వే, స్వీడన్‌కు చెందిన బంగారం, వెండి నాణేలతో సహా 280కి పైగా లాట్లను స్టాక్స్ బోవర్స్ ఉంచనుంది. వీటిలో 15వ శతాబ్దం చివరి నుంచి బ్రూన్ జీవితం చివరి సంవత్సరాల వరకు ఉన్నాయి. వీటి విలువ 10 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. ఇందులో స్టార్లాట్.. స్కాండినేవియా పురాతన బంగారు నాణేలలో ఒకటి. 1496 నాటి కింగ్ హాన్స్ నాణెం అత్యంత ఖరీదైనది. డెన్మార్క్ ముద్రించిన మొదటి బంగారు నాణెం. దీనిని 600,000 యూరోలు లేదా 672,510 డాలర్లకు విక్రయించవచ్చు. ఈ నాణేలను వివిధ గత కొన్ని నెలలుగా వివిధ ఎగ్జిబిషన్స్‌లో, స్టాక్స్ బోవర్స్ గ్యాలరీలలో ప్రదర్శించారు. అమ్మకానికి ముందు వీటిని కోపెన్‌హాగన్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేలకూలిన నూరేళ్ల చెట్టు
మంచిర్యాల: వేమనపల్లి మండంలోని నాగారం గ్రామంలో మంగళవారం ఉదయం భారీ వర్షానికి నూరేళ్ల కాలం నాటి చింత చెట్టు నేలకులింది. వేమనపల్లి–బెల్లంపల్లి మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై చెట్టు పడిపోవడంతో నియోజకవర్గం కేంద్రానికి, కాగజ్‌నగర్ వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. త్రీఫేజ్ విద్యుత్ లైన్ తెగిపోవడంతో పంట పొలాలు, గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. ఎంపీవో బాపురావు సూచన మేరకు స్థానిక సర్పంచ్ గ్రామస్తులతో చెట్టు తొలగించే ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి నుంచి కటింగ్ మిషన్ తెప్పించి అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించారు. ట్రాన్స్‌కో ఏఈ దీక్షిత్‌తో మాట్లాడి విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించి సరఫరా చేపట్టారు. సాయంత్రం వరకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. -
110 ఏళ్ల వృద్ధురాలి మృతి
జిన్నారం మండలం నల్తూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొర్లకుంట గ్రామానికి చెందిన 110 ఏళ్ల ఓ వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామానికి చెందిన గంగనోళ్ల పెంటమ్మ (110) కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. పెంటమ్మ కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవటంతో టీడీపీ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి స్పందించి అంత్యక్రియలకు గాను రూ. 5వేల ఆర్థిక సాయాన్ని అందించారు. శతాధిక వృద్దురాలిని చివరి సారి చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్తులు కూడా తరలి వచ్చారు.