పాత నాణెం.. బంగారం! | Investment in old coin market, auctions, online sales | Sakshi
Sakshi News home page

పాత నాణెం.. బంగారం!

Published Mon, Nov 1 2021 4:30 AM | Last Updated on Mon, Nov 1 2021 5:29 AM

Investment in old coin market, auctions, online sales - Sakshi

నాణేలను సేకరించే అభిరుచి ఉన్న వారు అరుదుగా కనిపిస్తుంటారు. కానీ, నాణేల సేకరణ అన్నది ఒక చక్కని హాబీగా ఎప్పటినుంచో  కొనసాగుతూ వస్తోంది. నాణేల వినియోగానికి 2,800 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. ముఖ్యంగా స్వాతంత్య్రానికి పూర్వం రాజుల కాలం నాటి నాణేలు, బ్రిటిష్‌ కాలంలో ముద్రించిన నాణేలను కోరుకున్నంత ఇచ్చి తీసుకునేవారు ఉన్నారు. బుద్ధుని రూపాన్ని కనిష్కకాలం నాటి నాణేల్లో చూడొచ్చు. ఇవే మన దేశంలో అత్యంత ఖరీదైన కాయిన్లు. గత కాలపు వైభవాలకు, పాలనకు సాక్షీభూతాలుగా నిలిచే కాయిన్లకు డిమాండ్‌ చెప్పలేనంత.

ఒకప్పుడు అభిరుచిగా సాగిన నాణేల వేట.. నేడు కాసులు కురిపించే పెట్టుబడిగానూ మారిపోయింది. దీంతో గతంలో పాత కాయిన్లను కొనేవారు కొద్ది మందే ఉండగా.. ప్రస్తుతం కొనుగోలుదారులు, విక్రయదారులు కూడా పెరుగుతూ ఉన్నారు. గొప్ప చిత్రకారులు వేసిన పెయింటింగ్‌లు కోట్ల రూపాయలు పలికినట్టే.. మీ బీరువాలోని పూర్వకాలపు నాణెం కూడా కాసులు కురిపించొచ్చు. నేటి కాలపు అరుదైన కాయిన్‌ కొన్ని తరాల తర్వాతి వారికి అపురూపంగాను అనిపించొచ్చు. అందుకే నాణేల సేకరణ వెనుకనున్న విలువైన కోణాన్ని తరచి చూసే కథనమే ఇది.

మన తాతల కాలంలో అయితే నాణేల సేకరణకు పెట్టుబడి కోణం ఉండేది కాదు. ఇష్టంతో వివిధ రకాల కాయిన్లను పోగు చేసుకోవాలన్న అభిలాష కొందరిలో ఉంటే, తమకు ఇష్టమైన గొప్ప వ్యక్తుల చిత్రాలతో ఉండే నాణేల పట్ల కొందరు మక్కువ చూపించేవారు. శతాబ్దాల ఘనచరిత్రకు నిదర్శనంగా నిలిచే ఆ నాణేలకు ఊహించనంత విలువ, డిమాండ్‌ తోడయ్యాయి. నాణేల సేకరణ తొలుత అభిరుచితో మొదలైనా.. ఆ తర్వాత వాటిపై మరింత అధ్యయనానికి, చరిత్ర ఆధారాల అన్వేషణకు కీలకంగా మారిపోయింది. నాణేల సేకరణదారులు, అధ్యయనకారులను న్యూమిస్‌మ్యాటిస్ట్‌గా పేర్కొంటారు.

ఇతరులతో పోలిస్తే నాణేల విషయంలో వీరు భారీగా సంపదను గడిస్తున్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే నాణేలు, అంతర్జాతీయంగా వాటి డిమాండ్‌పై వీరికి లోతైన అవగాహన ఉంటుంది. మన దేశంలో నాణేలను సేకరించడం అన్నది అలవాటు నుంచి పెట్టుబడిగా మారుతోంది. కానీ, ఇప్పటికీ ఇది ఆరంభ దశలోనే ఉందంటున్నారు నిపుణులు. ‘‘50 ఏళ్ల క్రితం నాణేలు, మెడల్స్, బ్యాంక్‌ నోట్లను కొనుగోలు చేసేవారు చాలా కొద్ది మందే ఉండేవారు. కాలక్రమేణా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. 1990ల నుంచి ముంబైలో ఏటా కాయిన్‌షోను మేము నిర్వహిస్తూ వస్తున్నాం. దీంతో నాణేల పట్ల ఆసక్తి పెరుగుతోంది. ’’ అని టోడీవాలా ఆక్షన్స్‌ అధినేత ఫారూక్‌ ఎస్‌ టోడీవాలా తెలిపారు.  

సురక్షితమైన పెట్టుబడి
నాణేల సేకరణ నేడు సురక్షితమైన,       ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారిందంటున్నారు నిపుణులు. 2008–2012 కాలంలో నాణేల పెట్టుబడిపై రెట్టింపు రాబడులు వచ్చాయి. దీంతో నాణేలను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి ఏర్పడింది. దీంతో మరింత మంది కొత్తవారు ఈ దిశగా అడుగులు వేసేందుకు కారణమైంది. ‘‘నా వరకు అయితే కాయిన్ల సేకరణ అభిరుచిలో భాగమే. కానీ, కొనుగోలు చేస్తున్న నాణెం విలువ భవిష్యత్తులో పెరుగుతుందా, లేదా అని తెలుసుకునేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తాను. నా తదుపరి తరం వారికి నాణేలపై సరిపడా సమాచారం, విజ్ఞానం ఉండకపోవచ్చు. లేదంటే వారికి ఆసక్తి అయినా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో నా సేకరణలు అన్నింటినీ విక్రయించేస్తాను’’ అని ముంబైకి చెందిన నాణేల సేకరణకర్త       దిన్యర్‌ మదన్‌ చెప్పారు.  

అవగాహనతోనే అడుగు
నాణేలను గుర్తించడం, వాటి చారిత్రక నేపథ్యం, విలువపై అవగాహన కల్పించే ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. నాణేలను సేకరించే వారు వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడమే కాకుండా, పరిజ్ఞానాన్ని పెంచుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ‘‘ఏ కాలం నాటిది, చారిత్రకంగా ప్రాధాన్యం ఉన్నదా తదితర విషయ పరిజ్ఙానం అవసరం. అప్పుడు సేకరించిన నాణేనికి కాలం గడుస్తున్న కొద్దీ అనూహ్యమైన విలువ తోడవుతుంది. గుప్తా గోల్డ్‌ కాయిన్లు, మొఘలుల నాటి కాయిన్లు, రాజ సంస్థానాల  నాటివి, బ్రిటిష్‌ ఇండియా కాయిన్లకు దేశంలో ఎంతో ప్రాచుర్యం ఉంది.

అంతర్జాతీయంగా వేరు..
  అమెరికా, బ్రిటన్‌లో అయితే నాణేలకు సంఘటిత మార్కెట్‌ ఉంది. అక్కడ నియంత్రణల పరిధిలోకి వస్తుంది. బ్యాంకులు, కార్పొరేట్‌లు సైతం నాణేలపై ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. నాణేల దిగుమతిపై సుంకాలు, ఆంక్షలను కూడా చాలా దేశాలు అమలు చేయడం లేదు. ‘‘కానీ, మనదేశంలో పరిస్థితి వేరు. భారత్‌లో తయారైన భారత్‌కే చెందిన నాణేలు, మెడల్స్, బ్యాంకు నోట్ల దిగుమతికి కస్టమ్స్‌ విభాగం సులభంగా అనుమతించడం లేదు. వీటి దిగుమతి కోసం ఎన్నో గంటల సమయం వెచ్చించడమే కాకుండా.. విపరీతమైన సుంకాలు, జరిమానాలు కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంది’’ అని టోడీవాలా ఆక్షన్స్‌ అధినేతటోడీవాలా వివరించారు. వీటికి తోడు అసంఘటిత    స్థాయిలోనే పరిశ్రమ ఉన్నట్టు పేర్కొన్నారు.  

విలువను నిర్ణయించే అంశాలు
నాణేలకు విలువ కట్టడంలో కీలకంగా చూసేది నాణ్యతే. పాలిష్, గీతలు, ధరించడానికి అనుకూలంగా ఉంటుందా ఇలా ఎన్నో అంశాల ఆధారంగా విలువ నిర్ణయిస్తుంటారు. మంచి, ఎంతో మంచి, శ్రేష్టమైన, ఎంతో శ్రేష్టమైన, అత్యున్నత శ్రేష్టమైన, చెలామణిలోనివి ఇలా పలు విభాగాలుగా నాణేలను వేరు చేస్తారు. చెలామణిలో లేకపోయినా ఫర్వాలేదు కానీ.. ఆ నాణేలపై చిత్రాలు, అక్షరాలు చెదిరిపోకుండా స్పష్టంగా ఉంటే అధిక విలువను చెల్లించేందుకు కొనుగోలుదారులు వెనుకాడరు. మంచి నాణెం అనుకున్నది చెత్తనాణెం కూడా కావచ్చన్నారు కోల్‌కతాకు చెందిన న్యూమిస్‌మ్యాటిస్ట్‌ అనింద్య జ్యోతి మజుందార్‌.

ఉదాహరణకు 2,000 సంవత్సరాల కిత్రం నాటి గ్రీక్‌ కాయిన్‌ను చెక్కుచెదరని స్థితిలో (మింట్‌ కండీషన్‌)లో వేలానికి ఉంచితే ఊహించనంత విలువ లభిస్తుందని తెలిపారు. ప్రాచీన కాలం నాటి కాయిన్ల లభ్యత కొత్తగా పెరిగేది కాదంటూ.. అదే సమయంలో డిమాండ్‌ క్రమంగా పెరుగుతూనే వెళుతుందన్న విషయాన్ని టోడీవాలా ప్రస్తావించారు. అంటే పూర్వ కాలపు కాయిన్ల లభ్యత కొద్దిగా ఉన్నందున వాటికి విలువ క్రమంగా పెరుగుతూనే వెళుతుందని అర్థం చేసుకవోచ్చు. ‘‘అవగాహన పెరుగుతోంది. వ్యక్తుల దగ్గర మిగులు ధనంలోనూ వృద్ధి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు నాణేల ప్రదర్శనలతో కాయిన్లకు డిమాండ్‌ అనూహ్యంగా వృద్ధి చెందుతోంది’’ అని టోడీవాలా పేర్కొన్నారు.  

ఎన్నో వేదికలు
వేలం కంపెనీలు, డీలర్‌షిప్‌లు ఉన్నందున ఈ పరిశ్రమ ఎంతో కాలం అసంఘటిత స్థాయిలోనే ఉండదన్నది టోడీవాలా అభిప్రాయం. నాణేల కొనుగోలు, విక్రయాలకు ఆన్‌లైన్‌లో ఎన్నో వేదికలు అందుబాటులోకి వచ్చాయి. విక్రయదారులు కోరుతున్నంత ధర పెట్టి కొనేవారు ముందుకు వచ్చినప్పుడే లావాదేవీ నమోదవు తుంది. లేదంటే ఆక్షన్‌ కంపెనీని సంప్రదించి నాణేన్ని ప్రదర్శనకు ఉంచుకోవచ్చని, లేదంటే ఆన్‌లైన్‌ పోర్టళ్లలో విక్రయించుకోవచ్చని టోడీవా లా సూచించారు. ఆన్‌లైన్‌లో అయితే విక్రయదారుల వివరాలు, పూర్వపరాలు తెలియడం కష్టం. మోసాలకూ అవకాశం ఉంటుంది. ఇటువంటి సందేహాలతో ఉండేవారికి వేలం కంపెనీలను, డీలర్లను ఆశ్రయించడం చక్కని మార్గం అవుతుంది. ‘‘గతంలో ఒక వేలానికి మూడు నెల పాటు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతీ నెలా 7–8 వేలాలు కొనసాగుతున్నాయి’’ అని ముంబై కాయిన్‌ సొసైటీ సభ్యుడు అజయ్‌గోయల్‌ తెలిపారు.

కాయిన్‌ బజార్‌
మీ దగ్గర 1, 2, 5 రూపాయల అరుదైన నాణేలు, నోట్లు ఉంటే రూ.లక్షలు పెట్టికొనే వారు ఉన్నారు. కాయిన్‌బజార్‌ పోర్టల్‌లో ఇటువంటి వేలాలు కనిపిస్తుంటాయి. మాతా వైష్ణోదేవి చిత్రం ఉన్న రూ.10 నాణెం రూ.లక్షలు పలికిన సందర్భాలున్నాయి. 1977–79 మధ్యకాలం నాటి రూపాయి నోట్‌కు రూ.45,000 చెల్లించిన వారు కూడా ఉన్నారు. కాకపోతే ఆయా నోట్లు, నాణేలపై వివరాలు చెదిరిపోకుండా ఉండాలి. అంతేకాదు ఆర్‌బీఐ పరిధిలోని ముద్రణ శాల కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకమైన కాయిన్లను ముద్రిస్తూ ఉంటుంది. వాటికి సైతం మంచి డిమాండ్‌ ఉంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement