సంచీ తీసుకెళ్తేనే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు! | Mumbais BEST Employees Get Salaries In Coins | Sakshi
Sakshi News home page

ఆ ఆర్టీసీ ఉద్యోగులు.. జీతాలకు సంచీ తీసుకెళ్లాల్సిందే!

Published Sun, Apr 4 2021 12:42 AM | Last Updated on Sun, Apr 4 2021 11:45 AM

Mumbais BEST Employees Get Salaries In Coins - Sakshi

సాక్షి, ముంబై: తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల వేతనంలో చిల్లర నాణేలు ఇవ్వాలని బృహన్ముంబై ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (బెస్ట్‌) యాజమాన్యం నిర్ణయించింది. ప్రతీరోజు టికెట్ల విక్రయం ద్వారా వివిధ బస్‌ డిపోలలో రూ. లక్షల్లో చిల్లర నాణేలు పోగవుతున్నాయి. ఇలా రూ. 12 కోట్లకు పైనే చిల్లర డబ్బులు బెస్ట్‌ ప్రధాన కార్యాలయమైన కొలాబాలోని బస్‌ భవన్‌లో నిల్వ ఉన్నాయి.

వీటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేద్దామంటే ప్రతీరోజు పెద్ద మొత్తంలో చిల్లర నాణేలను స్వీకరించడానికి బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని బెస్ట్‌ యాజమాన్యం చిల్లర నాణేలకు ఉద్యోగుల జీతాలతో ముడిపెట్టింది. ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో భాగంగా రూ. 15 వేల చిల్లర నాణేలు ఇవ్వాలని, మిగతా జీతాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని బెస్ట్‌ సమితి నిర్ణయించింది. దీంతో ఉద్యోగులు వేతనాలు చెల్లించే రోజున సంచి వెంట తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది.  

చార్జీలు తగ్గడంతో.. 
గతంలో బెస్ట్‌ బస్సుల్లో ప్రయాణించాలంటే కనీస చార్జీలు రూ. 8, ఆ తరువాత రూ. 10, రూ. 12, రూ. 14, రూ. 16 ఇలా ఉండేవి. దీంతో చిల్లర విషయంలో తరచూ గొడవలు జరిగేవి. టికెట్‌కు సరిపడా చిల్లర డబ్బులు ఇచ్చే విషయంలో ప్రయాణికులు, కండక్టర్లకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునేవి. కానీ యాప్‌ ఆధారిత ఓలా, ఊబర్, షేర్‌ ట్యాక్సీ, ఆటోల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కొనేందుకు 2019 అక్టోబర్‌లో బెస్ట్‌ సంస్థ ప్రయాణ చార్జీలను పునర్‌ వ్యవస్థీకరించింది.

బస్సుల్లో ప్రయాణించేందుకు జనాలను ఆకట్టుకునేలా, ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు వీలుగా టికెట్‌ రేట్లను తగ్గించింది. మొదటి 5 కిలోమీటర్ల దూరానికి కనీస చార్జీలు రూ. 5, ఆ తరువాత రూ. 10, రూ. 15 ఇలా చార్జీలు మార్చింది. చార్జీలు తగ్గడంతో బెస్ట్‌ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పటి నుంచి చిల్లర నాణేలు వివిధ బస్‌ డిపోలలో కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. 

బ్యాంకులు నో.. ఉద్యోగులకు ముడి 
ఇలా 2021 జనవరి నుంచి భారీగా పోగవుతున్న చిల్లర నాణేలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి ఓ కాంట్రాక్టర్‌ను నియమించాలనే ప్రతిపాదన సైతం తెరమీదకు వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. బ్యాంకు సిబ్బంది కూడా పెద్ద మొత్తంలో చిల్లర డబ్బులు స్వీకరించేందుకు నిరాకరించడంతో అవి దాదాపు రూ. 12–15 కోట్ల మేర పేరుకుపోయాయి. సంస్థలో 40 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి నెలనెలా వేతనాలు చెల్లించడం సంస్థకు కష్టతరంగా మారింది. దీంతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న బెస్ట్‌ సంస్థ ఈ చిల్లర నాణేలను ఉద్యోగుల జీతాలకు ముడిపెట్టింది.

ఉద్యోగుల వేతనంలో చిల్లర నాణేలు చేతికివ్వాలని, మిగతావి వారి వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. బెస్ట్‌ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతపెద్ద మొత్తంలో చెల్లించే చిల్లర నాణేలు ఇంటికెలా తీసుకెళ్లమంటారని సంస్థను ప్రశ్నిస్తున్నారు. ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు చిల్లర నాణేలు లెక్కపెట్టి ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా పెద్దమొత్తంలో చిల్లర స్వీకరించేందుకు వ్యాపారులు కూడా నిరాకరిస్తారు. దీంతో ఉద్యోగులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement