brihanmumbai electric supply and transport
-
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు, బెస్ట్‌పై డీజిల్ పిడుగు!
సాక్షి, ముంబై: తరుచూ పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల బెస్ట్ సంస్థ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. సంస్థపై నెలకు సుమారు రూ.40 లక్షల మేర అదనపు భారం పడుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ.. తమ ఉద్యోగులకు నెలవారీ వేతనాలు ఇవ్వడానికి కష్టపడుతోంది. దీనికి డీజిల్ ధరలు కూడా తోడవడంతో సంస్థ మరింత నష్టాల్లోకి కూరుకుపోయే ప్రమాదముంది. నెలకు 20 వేల లీటర్ల డీజిల్ బెస్ట్ సంస్థ ఆధీనంలో సొంత, అద్దెకు తీసుకున్న ఇలా 3,400 వరకు బస్సులున్నాయి. ఇందులో కొన్ని బస్సులు సీఎన్జీ, మరికొన్ని ఎలక్ట్రిక్, డీజిల్ ద్వారా నడుస్తున్నాయి. బెస్ట్‌కు సొంతంగా 1,900 బస్సులు ఉండగా వాటిలో 302 బస్సులు డీజిల్‌తో నడుస్తాయి. అదేవిధంగా అద్దెకు తీసుకున్న కొన్ని బస్సుల్లో డీజిల్‌తో నడిచే బస్సులున్నాయి. కొద్ది రోజులుగా పెట్రోల్‌తోపాటు డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా బెస్ట్ సంస్థ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతకుముందు ముంబైలో లీటరు డీజిల్ ధర రూ.91.87 పైసలుండేది. ఇప్పుడు ధరలు పెరగడంతో రూ.96.16 పైసలకు చేరుకుంది. బెస్ట్‌కు నెలకు 20 వేల లీటర్ల డీజిల్ అవసరముంటుంది. అందుకు రూ.17 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పుడు నెలకు సుమారు రూ.40 లక్షల మేర అదనపు భారం పడుతోందని బెస్ట్ సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. తగ్గిన ప్రయాణికులు ఇప్పటికే లాక్‌డౌన్‌వల్ల ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆదాయం లేక బెస్ట్ సంస్థ తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. బీఎంసీ పరిపాలన విభాగం అడపాదడపా అందజేస్తున్న ఆర్థిక సాయంతో ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. బెస్ట్‌ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, నేటి పోటీ ప్రపంచంలో అనేక ప్రైవేట్ వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. లోకల్ రైల్వే స్టేషన్ల బయట షేర్ ఆటోలు, ట్యాక్సీలు బెస్ట్ బస్సుల కంటే ముందే ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిపోతున్నాయి. ఆ తరువాత వచ్చే బస్సుల్లో ఎక్కడానికి ప్రయాణికులే ఉండడం లేదు. బెస్ట్ నష్టాల్లో కూరుకుపోవడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి. -
సంచీ తీసుకెళ్తేనే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు!
సాక్షి, ముంబై: తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల వేతనంలో చిల్లర నాణేలు ఇవ్వాలని బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) యాజమాన్యం నిర్ణయించింది. ప్రతీరోజు టికెట్ల విక్రయం ద్వారా వివిధ బస్ డిపోలలో రూ. లక్షల్లో చిల్లర నాణేలు పోగవుతున్నాయి. ఇలా రూ. 12 కోట్లకు పైనే చిల్లర డబ్బులు బెస్ట్ ప్రధాన కార్యాలయమైన కొలాబాలోని బస్ భవన్లో నిల్వ ఉన్నాయి. వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేద్దామంటే ప్రతీరోజు పెద్ద మొత్తంలో చిల్లర నాణేలను స్వీకరించడానికి బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని బెస్ట్ యాజమాన్యం చిల్లర నాణేలకు ఉద్యోగుల జీతాలతో ముడిపెట్టింది. ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో భాగంగా రూ. 15 వేల చిల్లర నాణేలు ఇవ్వాలని, మిగతా జీతాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని బెస్ట్ సమితి నిర్ణయించింది. దీంతో ఉద్యోగులు వేతనాలు చెల్లించే రోజున సంచి వెంట తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. చార్జీలు తగ్గడంతో.. గతంలో బెస్ట్ బస్సుల్లో ప్రయాణించాలంటే కనీస చార్జీలు రూ. 8, ఆ తరువాత రూ. 10, రూ. 12, రూ. 14, రూ. 16 ఇలా ఉండేవి. దీంతో చిల్లర విషయంలో తరచూ గొడవలు జరిగేవి. టికెట్‌కు సరిపడా చిల్లర డబ్బులు ఇచ్చే విషయంలో ప్రయాణికులు, కండక్టర్లకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునేవి. కానీ యాప్ ఆధారిత ఓలా, ఊబర్, షేర్ ట్యాక్సీ, ఆటోల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కొనేందుకు 2019 అక్టోబర్‌లో బెస్ట్ సంస్థ ప్రయాణ చార్జీలను పునర్ వ్యవస్థీకరించింది. బస్సుల్లో ప్రయాణించేందుకు జనాలను ఆకట్టుకునేలా, ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు వీలుగా టికెట్ రేట్లను తగ్గించింది. మొదటి 5 కిలోమీటర్ల దూరానికి కనీస చార్జీలు రూ. 5, ఆ తరువాత రూ. 10, రూ. 15 ఇలా చార్జీలు మార్చింది. చార్జీలు తగ్గడంతో బెస్ట్ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పటి నుంచి చిల్లర నాణేలు వివిధ బస్ డిపోలలో కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. బ్యాంకులు నో.. ఉద్యోగులకు ముడి ఇలా 2021 జనవరి నుంచి భారీగా పోగవుతున్న చిల్లర నాణేలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఓ కాంట్రాక్టర్‌ను నియమించాలనే ప్రతిపాదన సైతం తెరమీదకు వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. బ్యాంకు సిబ్బంది కూడా పెద్ద మొత్తంలో చిల్లర డబ్బులు స్వీకరించేందుకు నిరాకరించడంతో అవి దాదాపు రూ. 12–15 కోట్ల మేర పేరుకుపోయాయి. సంస్థలో 40 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి నెలనెలా వేతనాలు చెల్లించడం సంస్థకు కష్టతరంగా మారింది. దీంతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న బెస్ట్ సంస్థ ఈ చిల్లర నాణేలను ఉద్యోగుల జీతాలకు ముడిపెట్టింది. ఉద్యోగుల వేతనంలో చిల్లర నాణేలు చేతికివ్వాలని, మిగతావి వారి వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. బెస్ట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతపెద్ద మొత్తంలో చెల్లించే చిల్లర నాణేలు ఇంటికెలా తీసుకెళ్లమంటారని సంస్థను ప్రశ్నిస్తున్నారు. ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు చిల్లర నాణేలు లెక్కపెట్టి ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా పెద్దమొత్తంలో చిల్లర స్వీకరించేందుకు వ్యాపారులు కూడా నిరాకరిస్తారు. దీంతో ఉద్యోగులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. -
‘బెస్ట్’కు కొత్త కష్టాలు
సాక్షి, ముంబై: నగరవాసులకు రవాణా సేవలందిస్తున్న బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థకు ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. ఇందుకు కారణం మోనో రైలు సేవలు ఇప్పటికే అందుబాటులోకి రాగా, మెట్రో రైలు సేవలు కూడా త్వరలో అందుబాటులోకి రానుండడమే. ప్రస్తుతం ఈ ప్రజా రవాణా వ్యవస్థకు తగినంత ఆదాయం రాకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. మోనో రైలు సేవల కారణంగా కొన్ని చోట్ల ఈ సంస్థ రాబడి గణనీయంగా తగ్గిపోయింది. ఇక మెట్రో రైలు సేవలుకూడా అందుబాటులోకి వస్తే పరిస్థితి మరింత దిగజారొచ్చని ఈ సంస్థ యాజమాన్యానికి దిగులు పట్టుకుంది. మరోవైపు త్వరలో 16 వేల ఆటో పర్మిట్లు జారీచేసేందుకు రవాణా శాఖ ఓ ప్రణాళికను రూపొందించింది. దీంతో పెద్దసంఖ్యలో కొత్త ఆటోలు రోడ్డుపైకి రానున్నాయి. దీంతో ఇప్పటికే ఆటోలు కొనుగోలు చేసి బతుకుజీవనం సాగిస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు. ఠాణే, కల్యాణ్, కర్జత్ తదితర దూర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు లోకల్ రైళ్ల ద్వారా అంధేరీ, బాంద్రా, కుర్లా, ఘాట్కోపర్లకు చేరుకుంటారు. ఇక్కడ అనేక వాణిజ్య, కార్పొరేటర్ సంస్థలకు చెందిన కార్యాలయాలున్నాయి. వీరంతా గతంలో బెస్ట్ బస్సులతోపాటు ఆటోలపై ఆధారపడేవారు. అయితే ఈ పరిస్థితి మారిపోనుంది. త్వరలో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ కారణంగా బెస్ట్ సంస్థతోపాటు, ఆటో యజమానుల ఆదాయానికి గండిపడడం అనివార్యం. ఇప్పటికే బెస్ట్ సంస్థ నష్టాల బాటలో నడుస్తోంది. ఆదాయం పెంపు కోసం సంబంధిత అధికారులు అనేక ప్రణాళికలు రూపొందించారు. పలు స్కీంలు, రాయితీలు ప్రకటించి ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇప్పటికే ఆదాయం వచ్చే కొన్ని మార్గాల్లో మోనో రైలు సేవల కారణంగా కలెక్షన్లు తగ్గిపోయాయి. ఇక మెట్రో రైలు సేవలు కూడా అందుబాటులోకి వస్తే బెస్ట్తోపాటు ఆటో యజమానుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. పైగా రోడ్డు మార్గంలో వెళితే ఎదుర య్యే ట్రాఫిక్ జాం, దుమ్ము, ధూళి, ఎండ కారణంగా ఉక్కపోతను భరించాల్సి ఉంటుంది. అదే మోనో, మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితినుంచి గట్టెక్కడమే కాకుండా ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల అత్యధిక శాతం మంది ముంబైకర్లు మోనో, మెట్రో సేవలకే మొగ్గుచూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
రోడ్డెక్కిన బస్సు
సాక్షి, ముంబై: బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్(బెస్ట్) బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. హాంకాంగ్ రవాణా వ్యవస్థ తరహాలో ఉద్యోగుల డ్యూటీ షెడ్యూల్లో మార్పులు చేయాలని బెస్ట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మంగళవారం చేపట్టిన మెరుపు సమ్మెను బుధవారం సాయంత్రం విరమించారు. బెస్ట్ అధికారులతో యూనియన్ నాయకులు జరిపిన చర్చలు సఫలీకృతమవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బెస్ట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన చర్చలు సఫలీకృతమవడంతో సమ్మె విరమిస్తున్నట్లు బెస్ట్ కార్మిక నాయకుడు శరద్ రావ్ ప్రకటించారు. అంతకుముందు బెస్ట్ ఉద్యోగుల సమ్మెవల్ల ముంబైకర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో ఇటు కోర్టు, అటు వివిధ రంగాల నుంచి బెస్ట్ యజమాన్యంపై ఒత్తిడి వచ్చింది. దీంతో బుధవారం మధ్యాహ్నం కార్మిక నేతలు, బెస్ట్ అధికారులు మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. అయినా ఓ కొలిక్కి రాలేదు. కొత్త డ్యూటీ షెడ్యూల్‌ను రద్దు చేయాలని శరద్రావ్ పట్టుబట్టారు. బెస్ట్ అధికారులు కొత్త షెడ్యూల్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలనుబట్టి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్కసారి అమలుచేసిన తర్వాత అలాగే కొనసాగిస్తారని శరద్ రావ్ వాగ్వాదానికి దిగారు. ఎటూ తేలకపోవడంతో కార్మిక నాయకులు సమావేశం నుంచి బయటకు వచ్చారు. చర్చలు విఫలమవడంతో సమ్మె తీవ్రత పెరిగే అవకాశముండటంతో బెస్ట్ యాజమాన్యం కొంతసేపటికి మళ్లీ యూనియన్ నాయకులను చర్చలకు ఆహ్వానించింది. డ్యూటీ షెడ్యూల్లో మార్పులు చేసి జూన్ ఒకటో తేదీ నుంచి అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు రావ్ ప్రకటించారు. సమ్మె కారణంగా బెస్ట్‌కు రూ.3.50 కోట్ల నష్టం.. 13 వేల మంది డ్రైవర్లు, 14 వేల మంది కండక్టర్లు చేపట్టిన సమ్మె వల్ల మంగళవారం రోజున బెస్ట్ సంస్థకు రూ. 3.50 కోట్ల నష్టం వచ్చింది. బుధవారం కూడా బస్సులు రోడ్డెక్కకపోవడంతో రూ.1.75 కోట్లకు పైగా నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. మంగళవారం కేవలం 20 మంది డ్రైవర్లు, 17 మంది కండక్టర్లు మాత్రమే విధులకు హాజరయ్యారు. అయితే సమ్మె వల్ల బస్సులు బయటకు తీయలేదు. అనంతరం అధికారులు కొన్ని బస్సులు నడిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పశ్చిమ కాందివలి ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు 276 నంబర్ బస్సుపై రాళ్లు విసిరి పారిపోయారు. ఈ ఘటనలో బస్సు ముందున్న అద్దాలు పగిలిపోయాయి. డ్రైవర్ మోతిలాల్ చవాన్ గాయపడ్డాడు. శతాబ్ది ఆస్పత్రికి తరలించగా, వైద్యులు తలకు మూడు కుట్లు వేశారు. స్థానిక చార్కోప్ పోలీసు స్టేషన్లో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదుచేశారు. రెండోరోజూ తిప్పలే... బెస్ట్ బస్సులు నడవకపోవడంతో మొదటిరోజు ఎదురైనా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం అనేకమంది ఉద్యోగులు, పరీక్షలు రాసే విద్యార్థులు త్వరగానే రోడ్లెక్కారు. బస్సు కోసం వేచి చూడకుండా ట్యాక్సీ, ఆటోలను ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఒకవైపు బస్సులు లేక ముంబైకర్లు ఉరుకులు పరుగులు తీస్తుంటే, మరోవైపు సందేట్లో సడేమియా అన్నట్లుగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ప్రయాణికుల నుంచి అందినకాడికి దండుకున్నారు. సమ్మె కారణంగా లోకల్ రైళ్లలో విపరీతంగా రద్దీ పెరిగింది. నిత్యం బస్సుల్లో రాకపోకలు సాగించేవారు లోకల్ రైళ్లను ఆశ్రయించారు. ఒక్కసారిగా జనం ఇటువైపు రావడంతో లోకల్ రైలు టికెట్ కౌంటర్లవద్ద క్యూ పెరిగిపోయింది. మరికొందరు రోడ్లపై ప్రైవేటు బస్సులు, టెంపోలు, త్రీ వీలర్లు, ఇలా ఏ వాహనం దొరికినా ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఎట్టకేలకు సమ్మె విరమించడంతో ముంబైకర్లు ఊపిరి పీల్చుకున్నారు. -
త్వరలో మోనో, మెట్రో సేవలు ప్రారంభం
సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న మెట్రో, మోనో రైళ్ల సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే నగరవాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే. మోనో రైలు సేవలను గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన పనులను చకచకా పూర్తిచేస్తున్నారు. అంతేకాకుండా మెట్రో, మోనో రైల్వే స్టేషన్ల నుంచి బస్సు సేవల విషయమై బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ పదాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు మార్గాల ద్వారా రైలు దిగిన ప్రయాణికులకు ఏ రూట్లో, ఏ సమయంలో బస్సులు నడిపితే సౌకర్యవంతంగా ఉంటుందనే అంశంపై ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇందుకు ముంబై మెట్రో-1 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా తనవంతు సహకారం అందిస్తోంది. సాధ్యమైనంత త్వరగా మోనో రైలు సేవలను ప్రారంభించాల ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కేవలం సేవ లు ప్రారంభిస్తే సరిపోదు కాబట్టి ముందుగా రైలు దిగిన ప్రయాణికులకు అన్ని స్టేషన్లలో ప్రజా రవాణా వ్యవస్థను సిద్ధం చేయా ల్సి ఉంటుంది. లోకల్ రైల్వే స్టేషన్ల మాదిరిగా మెట్రో, మోనో రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగనుంది. ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటపడగానే వారికి బస్సు సేవలు అందుబాటులో ఉంచేందుకు వీలుగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. త్వరలో వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైలు, చెంబూర్- వడాల-జాకబ్ సర్కిల్ (సాత్ రాస్తా) మోనో రైలు తొలి విడత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు మార్గాల రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా ఉంటాయి. -
ఉన్నతాధికారి ఇంట్లో 2లక్షల ‘అశ్లీలం’సీడీలు
రూ. 60 లక్షల విలువచేసే సీడీలు స్వాధీనం ముంబై: బృహ న్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ జనరల్ మేనేజర్ ఓంప్రకాశ్ గుప్తా ఫ్లాట్‌లో పోలీసులు దాడులు చేశారు. ఇందులో రూ.60 లక్షలు విలువచేసే రెండు లక్షల అశ్లీల సీడీలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఫ్లాట్ గుప్తాదే అయినా అందులో ఆయన ఉండడం లేదు. గత తొమ్మిదేళ్లుగా ఈ ఫ్లాట్‌ను అద్దెకు ఇస్తున్నారు. దీంతో అశ్లీల సీడీల కేసుకు, గుప్తాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. ఈ ప్లాట్‌లో ఉంటున్న తండ్రీకొడుకులు చంద్రకాంత్ ముఖర్జీ, సామ్రాట్ ముఖర్జీలను పోలీసులు అరెస్టు చేశారు. ఓషివర ప్రాంతంలోని మీరా టవర్ సీ-వింగ్ 15వ అంతస్తులో గుప్తాకు ఉన్న సొంత ఫ్లాట్‌ను పదేళ్ల ఒప్పందంపై అద్దెకు ఇచ్చారు. అయితే ఆ ఫ్లాట్‌లో పెద్ద ఎత్తున అశ్లీల సీడీలు నిల్వ ఉన్నట్లు పోలీసులకు సమాచారమందింది. ఈ మేరకు పోలీసులు గురువారం రాత్రి ఆకస్మాత్తుగా దాడులు చేశారు. భారీగా అశ్లీల సీడీలతోపాటు విడుదలయ్యే కొన్ని కొత్త సినిమాల పైరసీ డీవీడీలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తండ్రీకొడుకులను అరెస్టు చేశారు. అయితే ఈ ఇళ్లు అద్దెకు ఇవ్వడంవల్ల ఈ కేసుతో గుప్తాకు ఎలాంటి సంబంధం లేదని అదనపు పోలీసు కమిషనర్ (పశ్చిమ రీజియన్) విశ్వాస్ నాంగరే-పాటిల్ స్పష్టం చేశారు. తొమ్మిది నెలల నుంచి ఉంటున్నారు: గుప్తా ముఖర్జీ కుటుంబం తొమ్మిది నెలల నుంచి తమ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఇంతవరకు సొసైటీ యాజమాన్యం, ఇరుగుపొరుగువాళ్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని బెస్ట్ జనరల్ మేనేజరు గుప్తా చెప్పారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వెంటనే ఫ్లాట్ ఖాళీ చేయిస్తామని ఆయన వెల్లడించారు.