సాక్షి, ముంబై: నగరవాసులకు రవాణా సేవలందిస్తున్న బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థకు ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. ఇందుకు కారణం మోనో రైలు సేవలు ఇప్పటికే అందుబాటులోకి రాగా, మెట్రో రైలు సేవలు కూడా త్వరలో అందుబాటులోకి రానుండడమే. ప్రస్తుతం ఈ ప్రజా రవాణా వ్యవస్థకు తగినంత ఆదాయం రాకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. మోనో రైలు సేవల కారణంగా కొన్ని చోట్ల ఈ సంస్థ రాబడి గణనీయంగా తగ్గిపోయింది. ఇక మెట్రో రైలు సేవలుకూడా అందుబాటులోకి వస్తే పరిస్థితి మరింత దిగజారొచ్చని ఈ సంస్థ యాజమాన్యానికి దిగులు పట్టుకుంది. మరోవైపు త్వరలో 16 వేల ఆటో పర్మిట్లు జారీచేసేందుకు రవాణా శాఖ ఓ ప్రణాళికను రూపొందించింది.
దీంతో పెద్దసంఖ్యలో కొత్త ఆటోలు రోడ్డుపైకి రానున్నాయి. దీంతో ఇప్పటికే ఆటోలు కొనుగోలు చేసి బతుకుజీవనం సాగిస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు. ఠాణే, కల్యాణ్, కర్జత్ తదితర దూర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు లోకల్ రైళ్ల ద్వారా అంధేరీ, బాంద్రా, కుర్లా, ఘాట్కోపర్‌లకు చేరుకుంటారు. ఇక్కడ అనేక వాణిజ్య, కార్పొరేటర్ సంస్థలకు చెందిన కార్యాలయాలున్నాయి. వీరంతా గతంలో బెస్ట్ బస్సులతోపాటు ఆటోలపై ఆధారపడేవారు. అయితే ఈ పరిస్థితి మారిపోనుంది. త్వరలో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ కారణంగా బెస్ట్ సంస్థతోపాటు, ఆటో యజమానుల ఆదాయానికి గండిపడడం అనివార్యం. ఇప్పటికే బెస్ట్ సంస్థ నష్టాల బాటలో నడుస్తోంది. ఆదాయం పెంపు కోసం సంబంధిత అధికారులు అనేక ప్రణాళికలు రూపొందించారు.
పలు స్కీంలు, రాయితీలు ప్రకటించి ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇప్పటికే ఆదాయం వచ్చే కొన్ని మార్గాల్లో మోనో రైలు సేవల కారణంగా కలెక్షన్లు తగ్గిపోయాయి. ఇక మెట్రో రైలు సేవలు కూడా అందుబాటులోకి వస్తే బెస్ట్‌తోపాటు ఆటో యజమానుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. పైగా రోడ్డు మార్గంలో వెళితే ఎదుర య్యే ట్రాఫిక్ జాం, దుమ్ము, ధూళి, ఎండ కారణంగా ఉక్కపోతను భరించాల్సి ఉంటుంది. అదే మోనో, మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితినుంచి గట్టెక్కడమే కాకుండా ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల అత్యధిక శాతం మంది ముంబైకర్లు మోనో, మెట్రో సేవలకే మొగ్గుచూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
‘బెస్ట్’కు కొత్త కష్టాలు
Published Tue, Apr 8 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement
Advertisement