ఎఫ్‌ఎం రేడియోలకు గుడ్‌బై | Norway to switch off FM radio in shift to digital | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎం రేడియోలకు నార్వే గుడ్‌బై

Published Sat, Jan 7 2017 6:58 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

ఎఫ్‌ఎం రేడియోలకు గుడ్‌బై

ఎఫ్‌ఎం రేడియోలకు గుడ్‌బై

ఆస్లో: కారులో ఎక్కడికెళ్లినా ఎఫ్‌ఎం రేడియో మోగాల్సిందే. ఏ దేశంలోనైనా ఇప్పుడు ఇదే పరిస్థితి. దీన్ని మొట్టమొదటి సారిగా నార్వే బ్రేక్‌ చేయనుంది. ఎఫ్‌ఎం రేడియోకు తిలోదకాలిచ్చి డిజిటల్‌ రేడియో (డీఏబీ)కు తలుపులు తెరవనుంది. వారం రోజుల్లో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ 2017 చివరి నాటికి పూర్తవుతుందని నార్వే ప్రభుత్వం ప్రకటించింది.

ఎల్తైన పర్వత శిఖరాలు, వాటి మధ్య లోతైన లోయల్లో నదులు, సముద్ర మార్గాలు, అక్కడక్కడ చెల్లా చెదురుగా విసిరేసి నట్లుండే జనావాసాలున్న నార్వేలో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను నిర్వహించడమన్నదే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఎఫ్‌ఎం రేడియో రద్దు దిశగా అడుగులు వేసింది. ఇందుకోసం దశాబ్దకాలం నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రయోగం ఈ దేశంలో విజయవంతమైతే అనుసరించేందుకు బ్రిటన్‌ సిద్ధంగా ఉంది. ఎఫ్‌ఎమ్‌ రేడియో స్టేషన్లను మూసేసి డిజిటల్‌ రేడియోలను తెరవడం ద్వారా ఏడాదికి 23 లక్షల డాలర్లు మిగులుతాయన్నది నార్వే ప్రభుత్వం అంచనా.

డిజిటల్‌ రేడియో వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా ఆడియో క్లారిటీ పెరగుతుందని, దూరప్రాంతాలకు కూడా సిగ్నల్స్‌ సులభంగా వెళతాయని, ఎక్కువ ఛానళ్లను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం వాదిస్తోంది. సిబ్బంది ఉద్యోగాలు పోతాయని, వినియోగదారులకు భారం అవుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాలు ఏమీ పోవని, ఆ మేరకు డిజిటల్‌ రేడియో స్టేషన్లను పెంచుతామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అయితే డిజిటల్‌ రేడియోలను కొనుగోలు చేయడానికి ఒక్కసారి మాత్రమే ప్రజలపై భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. దేశంలో నడుస్తున్న 20 లక్షల కార్లలో ఎఫ్‌ఎం రేడియోలు మూగబోతాయని ఆటోమొబైల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 52 లక్షల జనాభా కలిగిన నార్వేలో 70 శాతం ఇళ్లలో ఇప్పటికే డిజిటల్‌ రేడియోలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement