హాలాండ్ చారిత్రక ఒప్పందం(PC: mancity Insta)
నార్వే ఫుట్‌బాల్ స్టార్ ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland) జాక్‌పాట్ కొట్టేశాడు. ఊహకందని రీతిలో వారానికి రూ. 5 కోట్ల చొప్పున సంపాదించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సిటీ(Manchester City) ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా 2000 సంవత్సరంలో జన్మించిన హాలాండ్ నార్వే జాతీయ జట్టు తరఫున ఫుట్‌బాల్ ఆడుతున్నాడు.
రెండుసార్లు ‘గోల్డెన్ బూట్’
ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో జరిగే ప్రీమియర్ లీగ్(Premier League)లో అడుగుపెట్టిన హాలాండ్.. అరంగేట్రంలోనే రికార్డులు బద్దలుకొట్టాడు. తొలి సీజన్‌లోనే 36 గోల్స్‌తో దుమ్ములేపాడు ఈ స్ట్రైకర్. ఇక గత సీజన్‌లో మాంచెస్టర్ తరఫున 27 గోల్స్ కొట్టిన అతడు.. రెండుసార్లు ‘గోల్డెన్ బూట్’ గెలిచాడు.
కానీ ఈ దఫా 16 గోల్స్‌తో సరిపెట్టాడు. ఇక గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. అతడు మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఇంకో రెండేళ్లు మాత్రమే కొనసాగాల్సి ఉంది. కానీ తాజాగా ఈ డీల్‌ను పొడగిస్తూ మాంచెస్టర్ సిటీ నిర్ణయం తీసుకుంది. తొమ్మిదిన్నరేళ్ల పాటు హాలాండ్‌ను కొనసాగించనుంది.
కళ్లు చెదిరే మొత్తం
ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఇది సుదీర్ఘకాలం పాటు సాగే ఒప్పందం. అంతేకాదు.. ఈ డీల్ ద్వారా హాలాండ్ వారానికి ఐదు లక్షల పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు ఐదున్నర కోట్లకు పైగా) ఆర్జించనున్నాడట.
ఈ నేపథ్యంలో హాలాండ్ స్పందిస్తూ.. ‘‘నేను చాలా చాలా సంతోషంగా.. గర్వంగా ఉన్నాను. సిటీ క్లబ్‌తో సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఒప్పందం గురించి సులువుగానే నిర్ణయానికి వచ్చేశాను.
ఇక ఆటపై నేను మరింత దృష్టి పెట్టగలను. ఒకే జట్టుతో ఎక్కువకాలం కలిసి ప్రయాణించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. ఇక మాంచెస్టర్ సిటీ టీమ్ మేనేజర్(కోచ్) జోసెప్ గ్వార్డియోలా సలాతో కలిసి మరికొంతకాలం పనిచేయడం ద్వారా తన నైపుణ్యాలు మరింత మెరుగుపరచుకోవచ్చని హాలాండ్ హర్షం వ్యక్తం చేశాడు.
అలాంటి వ్యక్తిని చూడలేదు
‘‘నేను ఇప్పటికే చాలా మెరుగయ్యాను. అతడితో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. అతడు కేవలం అత్యుత్తమ వ్యక్తి మాత్రమే కాదు.. హార్డ్‌వర్కర్ కూడా. అలాంటి వ్యక్తిని నేను ఇంతకు ముందు చూడనేలేదు’’ అని గ్వార్డియోలాపై హాలాండ్ ప్రశంసలు కురిపించాడు.
కాగా స్పెయిన్‌కు చెందిన గ్వార్టియోలా మాంచెస్టర్ సిటీ క్లబ్‌కు 2016 నుంచి కోచ్‌గా ఉన్నాడు. వివిధ టోర్నీల్లో కలిపి మొత్తంగా 18 సార్లు ట్రోఫీ అందించాడు. ఇదిలా ఉంటే.. తాజా ఒప్పందం ప్రకారం ఎర్లిండ్ హాలాండ్ మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో 2034 వరకు కొనసాగనున్నాడు.
చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్
Comments
Please login to add a commentAdd a comment