malishka
-
RJ Malishka: ముంబై కీ రాణీ.. ఆమె స్పెషాలిటీ ఏంటంటే!
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త కుండీలో చెత్త పేరుకుపోయి, దుర్గంధం వెలువడుతుంటే ముక్కు మూసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోతాం. కానీ రేడియో జాకీ మలిష్క అలా చేయదు. ఆ చెత్తనంతటిని క్లియర్ చేసే అధికారులు వచ్చేంత వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటుందామె. రేడియో జాకీ మలిష్క మెండన్సా ఆర్జే అయ్యిండి చెత్త గురించి మాట్లాడటం ఏంటీ? అని అంతా అనుకునేవారు. కానీ ముంబైలో పరిష్కారం కాని అనేక సమస్యలు.. సరిగా లేని రోడ్లు, వర్షంనీటితో నిండిపోయిన కాలనీలు... ఏవైనా సరే వాటి గురించి వెంటనే మలిష్క తన షోలో చెప్పేస్తుంది. అది మున్సిపల్ అధికారులకు చేరగానే వాటిని సరిచేస్తారు. కొన్నిసార్లు మలిష్క పద్ధతి అధికారులకు కోపం తెప్పించినప్పటికీ తను ఏమాత్రం వెనక్కు తగ్గదు. ఒకపక్క దేశంలోనే నంబర్ వన్ ఆర్జేగా శ్రోతల్ని అలరిస్తూ, మరోపక్క సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దీంతో మలిష్కను సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలో అవుతున్నారు. వినేకొద్ది వినాలనిపించే స్వరం, తన మాటల గారడీతో శ్రోతల్ని కట్టిపడేసే మలిష్క ముంబైలో పుట్టిపెరిగిన అమ్మాయి. పదమూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. దీంతో ఆమె తల్లి లిల్లీ మెండన్సా అన్నీ తానై మలిష్కను పెంచారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, ముంబై యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్లో మాస్టర్స్ చేసింది మలిష్క. ముంబైకీ రాణీ చిన్నప్పటి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే మలిష్క చాలా యాక్టివ్‌గా స్టేజ్ మీద మంచి ప్రతిభ కనబరిచేది. స్కూల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది, భరత నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకోవడంతో.. టీచర్స్‌డే, చిల్డ్రన్స్ డేకు తప్పకుండా తన ఫెర్ఫార్మెన్స్ ఉండి తీరేది. కాలేజీ రోజుల్లో కాలేజ్ బ్యాండ్‌లో గాయనిగా రాణించింది. చదువు పూర్తయిన వెంటనే, అడ్వరై్టజింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరింది. బాలీవుడ్ దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్ దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, మానేసి హిందీ డిస్కవరి ఛానెల్లో వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఇలా రెండేళ్లు్ల పనిచేసాక...‘‘విన్ 94.6 ఎఫ్ఎమ్’’ లో ఆర్జేగా అవకాశం వచ్చింది. దీంతో మలిష్క ఆర్జే ప్రయాణం మొదలైంది. దీనిలో రెండేళ్లు చేసిన తరువాత రెడిఫ్ రేడియోకు మారింది. ఇక్కడ కొన్ని నెలలు మాత్రమే ఉంది. తరువాత రెడ్ ఎఫ్ఎమ్లో చేరింది. ఇక్కడ తను పాల్గొనే షోలలో మాటలతో గారడీ చేస్తూ, ముంబైలోని సామాజిక అంశాలపై మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. తన షోకు వచ్చే కాలర్స్‌ను అలరిస్తూ ‘ముంబై కీ రాణి’గా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం రెడ్ ఎఫ్ఎమ్ 93.5లో ఆర్జేగా పనిచేస్తో్తంది. మలిష్క చేసిన.. మార్నింగ్ నంబర్ వన్ విత్ మలిష్క, ఎమ్ బోలే షోలు బాగా పాపులర్ అయ్యాయి. హిందీలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ షో గా ‘మార్నింగ్ వన్’ నిలిచి వరుసగా నాలుగేళ్లపాటు ఇండియన్ ఎక్స్‌లెన్స్ రేడియో అవార్డులను అందుకుంది. అంతేగాక ఓటీటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అవార్డుల కార్యక్రమంలో ‘డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు మలిష్కకు దక్కింది. 2019లో తొలిసారిగా దాదాసాహేబ్ ఫాల్కే ఆర్జే అవార్డులను ప్రవేశపెట్టగా.. తొలి అవార్డుని మలిష్క అందుకుంది. ఆర్జేగానేగాక.. రేడియో జాకీగా పనిచేస్తూనే మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, తుమారి సులులో విద్యాబాలన్ ఆర్జేగా నటించేందుకు మలిష్క శిక్షణ ఇచ్చింది. హాలీవుడ్ సినిమాలు ద ఇన్క్రెడి బుల్స్, మిరాగే, థోర్: రంగ్రూక్, స్క్రేపర్ –14 వంటి వాటికి హిందీలో డబ్బింగ్చెప్పింది. సామాజిక కార్యకర్తగా.. రాజకీయ నాయకులు, ముంబై మున్సిపల్ అథారటీ, బీఎమ్సీ కేంద్రంగా సమస్యలపై రేడియో కేంద్రంగా తన గళమెత్తడమేగాక, ప్రేమ పెళ్లిళ్ల గురించి యువతీ యువకులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఈక్రమంలోనే సెక్స్ వర్కర్ల పిల్లలను కలవడానికి షారుఖ్ ఖాన్‌ను, చార్ బాటిల్ రాజ్ కా క్యాంపెయిన్‌కు సల్మాన్‌ఖాన్‌ను, అమితాబ్ బచన్ గార్డెన్ లో ధారావి మురికివాడల పిల్లలను ఆహ్వానించేలా కృషిచేసింది. గత పదిహేనేళ్లుగా ముంబై రెడ్ ఎఫ్ఎమ్లో సక్సెస్‌పుల్ రేడీయో జాకీగా... నంబర్‌వన్ ఆర్జేగా నిలుస్తూ ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణనిస్తోంది. -
మలిష్క డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్ సిరీస్ అండర్–14 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కె. మలిష్క సత్తా చాటింది. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మలిష్క సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ మలిష్క (తెలంగాణ) 6–0, 6–3తో రెండోసీడ్ హర్షిణి విశ్వనాథ్ (ఏపీ)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో మలిష్క 6–1, 6–2తో రాహీన్ తరనమ్ (తెలంగాణ)పై, క్వార్టర్స్‌లో 6–2, 6–1తో జ్యోత్స్న (ఏపీ)పై నెగ్గింది. మరోవైపు బాలికల డబుల్స్ టైటిల్‌పోరులో మలిష్క–రాహీన్ (తెలంగాణ) ద్వయం 7–5, 6–2తో హర్షిణి–జ్యోత్స్న (ఏపీ) జోడీపై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. సెమీస్‌లో మలిష్క జంట 6–1, 6–2తో శవినిత–చరిష్మా జోడీపై గెలిచింది. బాలుర విభాగంలో మహారాష్ట్రకు చెందిన అర్నవ్ విజేతగా నిలవగా... ఏపీ ప్లేయర్ సుహృధ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో అర్నవ్ 7–6 (1), 6–1తో సుహృధ్‌ను ఓడించాడు. డబుల్స్ ఫైనల్లో మురళీ సాత్విక్–సుహృధ్ (ఏపీ) జంట 6–3, 6–1తో సిద్ధాంత్ కృష్ణ (హరియాణా)–యజ్ఞేశ్ (తెలంగాణ) జోడీపై విజయం సాధించి టైటిల్‌ను అందుకుంది., , , -
రన్నరప్ మలిష్క జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–14 సూపర్ సిరీస్ టోర్న మెంట్లో హైదరాబాద్ జోడీ మలిష్క– ఆర్నిరెడ్డి డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. గువాహటిలో జరిగిన ఈ టోర్నీ బాలికల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ పరీ సింగ్ (మహారాష్ట్ర)– శ్వేత సమంత (పశ్చిమ బెంగాల్) జంట చేతిలో మలిష్క ద్వయం ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌లో మలిష్క– ఆర్నిరెడ్డి 5–3, 5–4 (7)తో జెన్నిక (మహారాష్ట్ర)– అదితి(కర్ణాటక) జంటపై, క్వార్టర్స్‌లో 4–0, 4–0తో చాందిని (తెలంగాణ)– పరి చవాన్ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొందింది. -
డబుల్స్ విజేత మలిష్క జంట
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సూపర్ సిరీస్ అండర్–12 టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి కె. మలిష్క ఆకట్టుకుంది. గువాహటిలోని ఆల్ అస్సాం టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో మలిష్క– అనన్య జంట 6–3, 6–1తో స్నిగ్ధ–తాన్య (అస్సాం) జోడీపై గెలుపొందింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఈ జంట అంతకుముందు జరిగిన సెమీస్‌లో 7–5, 7–6 (7/5)తో టాప్ సీడ్ దుర్గాన్షి (ఢిల్లీ)–రిధి చౌదరి (ఏపీ) జోడీకి షాకిచ్చింది. క్వార్టర్స్‌లో 2–6, 6–4, 10–2తో నాలుగోసీడ్ సోహా సింగ్ (కర్ణాటక)–అస్మీ అడ్కర్ (మహారాష్ట్ర) జంటను ఓడించింది. పోటీల అనంతరం ఐటీఎఫ్ చీఫ్ రిఫరీ సురజిత్ బందోపాధ్యాయ్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
భారత టెన్నిస్ జట్టులో మలిష్క
సాక్షి, హైదరాబాద్: ‘దక్షిణాసియా రీజనల్ క్వాలిఫయింగ్ టెన్నిస్ చాంపియన్‌షిప్’లో పాల్గొనే అండర్–12 భారత టెన్నిస్ జట్టుకు హైదరాబాద్ అమ్మాయి మలిష్క ఎంపికైంది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో మలిష్క భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. నేపాల్‌లోకి కఠ్మాండులో ఏప్రిల్ 21 నుంచి 28 వరకు టీమ్ విభాగంలో ఈ టోర్నీ జరుగుతుంది. బాలికల జట్టుకు శ్రుతి అహ్లావత్, అంజలి రాఠి, దుర్గాన్షి ఎంపికవగా... మలిష్క రిజర్వ్ ప్లేయర్‌గా చోటు దక్కించుకుంది. బాలుర జట్టులో వన్ష్ నందల్, హర్ష్ ఫొగాట్, రుషీల్ ఖోస్లా చోటు దక్కించుకోగా... మానస్ మనోజ్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి భారత జట్టుకు ఎంపికైన మలిష్కను అభినందించారు. -
గేయం రేపిన దుమారం
విశ్లేషణ బీఎంసీ సొంత నివేదికలే దాని నిర్వహణపై ఏ ప్రభావమూ చూపనప్పుడు.. మాలిష్కా అధికార వ్యవస్థను చికాకుపరచడం ఎందుకు? అనేది ఆసక్తికరంగా మారింది. సామాజిక మాధ్యమాలకే ఎక్కువ విశ్వసనీయత ఉండటమే కారణమా? ముంబై గతుకుల రోడ్లు ఇప్పటికే అప్రతిష్టాకరంగా ప్రసిద్ధి చెందాయి. వాటి వార్తలు ఏటేటా, ప్రతి వానాకాలం వార్తాపత్రికలను, టెలి విజన్ తెరలను ముంచెత్తుతున్నాయి. వానలు పడటానికి ముందే రోడ్ల పరిస్థితిని చక్కదిద్దేస్తామని నగర పాలక సంస్థ వాగ్దానాలు చేస్తూనే ఉంటుంది. అది ఆ పని చేయగలగడం మాత్రం అరుదు. తొలి వానలు పడీ పడటంతోనే రోడ్లు చంద్ర బిలాలను తలపింపజేస్తుం టాయి. రోడ్ల మీది గుంతలన్నిటినీ సక్రమంగా పూడ్చి వేయాలంటూ హైకోర్టు గతంలో కొన్ని సందర్భాల్లో నగర పాలక సంస్థకు మొట్టికాయలు వేసి, అందుకు గడువును కూడా విధించింది. కనీసం ఒక ఏడాదైనా మనగలిగేపాటి నాణ్యతగల రోడ్లకు హామీని కల్పిం చేలా అది సైతం నగర ప్రభుత్వాన్ని మేల్కొలపలేకపోయింది. ప్రతి ఏటా రోడ్ల మీద బిలాలు తిరిగి ప్రత్యక్షమౌతూనే ఉంటాయి. రోడ్ల పనులను చేపట్టడంలో జరుగుతున్న దగానే ఈ దుస్థితికి అసలు కారణమనేది స్పష్టమే. గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఒక స్విస్ కంపెనీని కన్సల్టెంటుగా పెట్టుకుని జరిపించిన దానితో సహా అంతర్గత దర్యాప్తులన్నీ... రోడ్లు వేయడానికి వాడిన వస్తు సామగ్రి నాణ్యత అధ్వానమైనదని, రోడ్లు వేసే పని అధ్వానంగా జరిగిందని తేల్చి చెప్పాయి. కాబట్టి ఇందులో అవినీతి చోటుచేసుకున్నదంటే పౌరులు ఆశ్చ ర్యపోరు. పైగా, దగాకోరుతనం నేడు సర్వసాధారణమేనని చెబుతారు. అయినాగానీ, గతవారం మాలిష్కా మెండోన్సా ఆలపించిన ఓ ర్యాప్ గీతం ముంబై నగర ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న పార్టీ నాయకులకు మంట పుట్టించగలిగింది. దాదాపు పన్నెం డేళ్లుగా రేడియో జాకీ(ఆర్జే)గా పనిచేస్తున్న మాలిష్కా విడుదల చేసిన ఆ మరాఠీ వెక్కిరింత ర్యాప్ వెంటనే విస్తృతమైన ప్రాచుర్యాన్ని పొందింది. శివసేన యువ విభాగం ఆ ఆర్జేకు వ్యతిరేకంగా రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేయాలని నగర కమిషనర్‌ను కోరింది. దానిపై ఆయన ఇంకా ప్రతిస్పందించలేదుగానీ, ఆ మరుసటి రోజునే నగర పాలక సంస్థ ఇన్స్పెక్టర్లు ఆమె ఇంట్లోని కొన్ని చోట్ల ఏడెస్ దోమలు పుట్టిపెరిగే స్థానాలున్నాయని కనిపెట్టారు. అది డెంగ్యూను వ్యాపి ంపజేసే జాతి దోమ. నగర పాలక సంస్థ ఆమెకు నోటీసును జారీచేసింది. ఇది, ప్రజల భాగస్వామ్యానికి వ్యతి రేకంగా దాఖలు చేసిన దావా ( ఔఅ్క్క) (చెంబదెబ్బ) అని పౌర సమాజం భావిస్తోంది. పౌర పాలక సంస్థ అంటున్నట్టుగా ఇది యాదృచ్ఛికమే అనుకున్నా, ఈ నోటీసును జారీ చేసిన సమయం నిజంగానే అనుమానాన్ని రేకెత్తించేది. అయినా ఆమె ఒక్కరిపైనా ఎందు కు? నగర శివార్లకే రాణిగా ఒకప్పుడు వెలుగొందిన సంపన్న ప్రాంతం బాంద్రాలోని ఆమె నివాసంలో అలాంటి దోమలు పుట్టిపెరిగే స్థావరాలుండవచ్చనే నిర్ధారణకు అసలు వారు ఎలా వచ్చారు? ఫిర్యాదులేమైనా వచ్చాయా? నగర పాలక సంస్థ ప్రదర్శించిన ఈ జాగరూకతకు–ఇదే గనుక జాగరూకత అయితే–దాన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ, సదరు ఆర్జే నగరపాలక సంస్థ ప్రతిష్టకు భంగం కలుగజేశారని, అహోరాత్రాలు పనిచేస్తున్న ఆ సంస్థ కార్మికులను అవమానించిందని శివసేన ఆరోపిస్తోంది. అది నిజం కూడా కావచ్చు. కానీ ముంబైలోని ఏ పౌరుడినైనా అడగండి, అది సమర్థవంతంగా కృషి చేస్తున్నదని మాత్రం అనరు. మాలిష్కా మెండోన్సా ర్యాప్ మొదట ఒక ఎఫ్ఎమ్ రేడియోలో ప్రసారమైంది, ఆ తర్వాత ఆ వీడియో యూట్యూబ్‌కు చేరింది. ఒకటిన్నర నిమిషం కూడా లేని అది ఎంత గొప్ప ప్రభావాన్ని కలిగించింది! ‘‘నమ్మకం లేదా బీఎంసీపై మీకు?’’ అంటూ మొదలయ్యే ఆ ర్యాప్, గుంతలు పడ్డ రోడ్లు, తత్పర్యవసానమైన ట్రాఫిక్ సమస్యలు, నగర పాలక సంస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోవడాన్ని ఏకరువు పెడుతుంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలన్నీ శివసేన వైఖరిని వాక్స్వాతంత్య్రాన్ని అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలంటూ విరుచుకుపడ్డ మాట నిజమే. శివసేన నేత ఒకరు టీవీ తెరపై నుంచి అదే బాణీలో ‘‘నోరు ముయ్యకపోతే నువ్వు అయిపోతుంది రభస’’ అని ఆలపించారు. దీనికి జంకని మాలిష్కా, తన బుర్రలో మరో ఆరు ర్యాప్‌లు ఉన్నాయన్నారు. ముంబై పౌర పాలనా సంస్థ స్వయంగా జరి పించిన లోతైన పరిశోధనల నివేదికలే దాని నిర్వహణా తీరుపై ఎలాంటి ప్రభావమూ చూపనప్పుడు.. ఈ ర్యాప్ గాయని అధికార రాజకీయ వ్యవస్థను చికాకుపరచడం ఎందుకు? అనేది ప్రధాన వార్తా పత్రికలకు, చానళ్లకు ఆసక్తికరమైన అంశంగా మారింది. పక్షపాతంతో వక్రీకరించడానికి అవకాశమున్న సామాజిక మాధ్యమాలకే పౌరుల్లో ఎక్కువ విశ్వసనీయత ఉండటం వల్లనా? ఇప్పటికే మరో రెండు వీడియోలు వెలుగుచూశాయి. వాటిలో ఒకటి అదే బాణీలో ‘‘ఆర్జేపై నమ్మకం లేదా మీకు?’’ అంటూ మొదలై పౌర పాలక సంస్థను పట్టి పీడిస్తున్న మరింత తీవ్ర రుగ్మతలను... ఇక్కడి వాటిని గురించే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలన్నిటి గురించి ప్రస్తావిస్తుంది. ఇçప్పుడే ఒక పౌరుడు ‘‘టీ సముద్రం లాంటి’’ ముదురు గోధుమరంగు నీళ్లతో ఉన్న గుంతలను చూపిస్తూ ‘‘వచ్చి కాస్త తీనుకుపోండి. దోమల్ని చంపేస్తుంది’’ అంటూ మరో వీడియోను పోస్ట్ చేశాడు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఫైనల్లో మలిష్క, అపూర్వ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్లో మలిష్క, అపూర్వ ఫైనల్‌కు చేరుకున్నారు. మొయినాబాద్‌లోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో మలిష్క 6–3, 6–0తో అమూల్యపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో అపూర్వ వేమూరి 6–4, 6–1తో అభయ వేమూరిని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బాలుర సెమీఫైనల్ మ్యాచ్‌లలో జై అర్జున్ 4–6, 6–2, 6–2తో వరుణ్‌పై, రోహన్ కుమార్ 6–1, 6–1తో సిద్ధార్థ్ రెడ్డిపై గెలుపొంది ఫైనల్లో ప్రవేశించారు. మరోవైపు బాలుర డబుల్స్ క్వార్టర్స్‌లో రోహన్ కుమార్– సిద్ధార్థ్ రెడ్డి ద్వయం 6–1, 6–1తో నరైన్ వర్మ– రిషిక్ జంటపై గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో మోహిత్ సాయి చరణ్– ప్రతినవ్ జంట 2–6, 6–2, 11–9తో సాధిష్ట లింగ– రాజేశ్వర్ రెడ్డి జోడీపై, వర్షిత్ కుమార్– ఆర్యంత్ రెడ్డి జంట 6–4, 6–1తో ఆది కపూర్– శ్రేయస్ శంకర్ జోడీపై, వరుణ్– కుషాల్ జంట 6–4, 2–6, 10–7తో జై అర్జున్– రోహన్ గాంధీ జోడీపై గెలిచాయి.