చెత్త డంప్ కూలి ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్‌లో కొండలా పేరుకుపోయిన ఓ చెత్త డంప్ కుప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గత మూడేళ్లలో ఎన్నడూలేనంతగా ఢిల్లీలో ఈసారి వర్షాలు పడ్డాయి. దీంతో శుక్రవారం ఈ డంప్‌లో కొంతభాగం కుంగిపోయి ఒక్కసారిగా పక్కనే ఉన్న రోడ్డుపై పడింది. పెద్దమొత్తంలో చెత్త గుట్ట మీదపడడంతో రోడ్డుపై వెళ్తున్న కారు, మూడు బైకులు అదుపుతప్పి పక్కనే ఉన్న కోండ్లీ కాలువలో పడిపోయాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించారు.
రంగంలోకి దిగిన సహాయకసిబ్బంది కాలువలో పడిన ఐదుగురిని రక్షించారు. ఈ సహాయక కార్యక్రమంలో 45 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది 15 అగ్నిమాపక యంత్రాలను వినియోగించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఘటనాస్థలికి వచ్చి సహాయకచర్యలను పర్యవేక్షించారు. ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌లను కలిపే అత్యంత రద్దీగా ఉండే 24వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఈ భారీ డంప్ ఉంది. ఈ చెత్త డంప్ 70 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 15 అంతస్తుల భవంతి ఎత్తులో పేరుకుపోయింది. ఉత్తర భారతదేశంలో ఇదే అతిపెద్ద చెత్త డంప్. రోజుకు 2500 మెట్రిక్ టన్నుల చెత్తను మున్సిపాలిటీవారు ఇక్కడికి తరలించి పడేస్తున్నారు.