సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై 845 పేజీల అఫిడవిట్‌ను సమర్పించడం పట్ల కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరకొర సమాచారంతో భారీ అఫిడవిట్ దాఖలు చేయడాన్ని ప్రస్తావిస్తూ తాము చెత్త సేకరించేవారం కాదని తీవ్రస్ధాయిలో మండిపడింది. కేంద్రం తమ ముందు చెత్త పడేసి చేతులు దులుపుకోవడాన్ని అంగీకరించబోమని, అఫిడవిట్‌ను స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. ‘మీరు మమ్మల్ని ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారా..? మేం ప్రభావితం కాబోం.. అఫిడవిట్‌ను తాము స్వీకరించేది లేద’ని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
మీ దగ్గరున్న చెత్తంతా ఇక్కడ పడేయడానికి మేం గార్బేజ్ సేకరించేవారం కాదని తేల్చిచెప్పింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఘనవ్యర్థాల నిర్వహణకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి సలహా బోర్డులను ఏర్పాటు చేశాయా, లేదా అనే వివరాలు సూచిస్తూ మూడు వారాల్లోగా ఓ చార్ట్‌ను సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీం బెంచ్ ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో డెంగూ, చికున్‌గున్యా వంటి విషజ్వరాలు ప్రబలి పెద్దసంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని గతంలో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment