పొగ కమ్మిన రోడ్డుపై వెళుతున్న వాహనం
సాక్షి, కాణిపాకం: కాణిపాకం దేవస్థానం వద్ద ప్రతిరోజూ చెత్త కుప్పలకు నిప్పు పెడుతుండటంతో వచ్చే దుర్వాసనకు భక్తులు, వృద్ధులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి కూతవేటు దూరంలోని నిత్యాన్నదాన కేంద్రం, కల్యాణకట్ట సమీపంలో నుంచి వచ్చే దట్టమైన పొగలతో జనం అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. నిత్యం కాణిపాక దేవస్థానం, పరిసరాల నుంచి వచ్చే చెత్తను (ప్లాస్టిక్ వ్యర్థాలను) సమీపంలోని బాహుదా నది ఒడ్డున ఆలయ అధికారులు పడేస్తున్నారు. ఆ చెత్త కుప్పలు పేరుకుపోయిన తరువాత సిబ్బంది వాటికి అక్కడే నిప్పుపెడుతున్నారు.
ఈ సందర్భంగా వచ్చే తీవ్రమైన దుర్వాసనతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాణిపాకం దేవస్థానం, పంచాయతీ పరిధిలో నలభైకిపైగా చిన్న, పెద్ద తరహా హోటళ్లు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది ఇక్కడ పడవేస్తున్నారు. వాటి నుంచి వచ్చే కాలుష్యంతో అనర్థాలు తప్పడం లేదు.
డంపింగ్ యార్డు వినియోగం ఎప్పటికో ?
కాణిపాకం పంచాయతీ లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు ప్రస్తుతం పూర్తి స్థాయిలో వినియోగానికి నోచుకోవడంలేదు. ప్రభుత్వం సరఫరా చేసిన బ్యాటరీ వాహనాలు ఉన్నప్పటికీ పంచాయతీ సిబ్బంది చెత్తను ఎక్కడబడితే అక్కడ పడేస్తున్నారు. దేవస్థానానికి సైతం డంపింగ్ యార్డు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ దేవస్థానం సైతం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఆలయం వద్ద చెత్త కుప్పలను ఎక్కడబడితే అక్కడ పడేస్తున్నారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment