ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తిహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ బరువు 8. 5 కేజీలు తగ్గారని, అదేవిధంగా ఆయన షుగర్ లెవల్స్ 5 సార్లు 50 ఎంజీ/డీఎల్ కిందికి పడిపోయాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ జైలులో తీవ్రమైన అనారోగ్యంతో బాధపెట్టాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇలా చేయటం అత్యంత ఆందోళనకరమైన విషయమని అన్నారు.
‘‘మార్చి 21 తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్ట్ చేసేనాటికి ఆయన బరువు 70 కేజీలు, కానీ, ప్రస్తుతం కేజ్రీవాల్ బరువు 61. 5 కేజీలకు పడిపోయింది. అంటే 8. 5 కేజీల బరువు తగ్గారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, బీజేపీ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ను చిత్రహింసలకు గురిచేసి.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా కేజ్రీవాల్‌ను బాధ పెట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇలా బరువు తగ్గటంపై ఎటువంటి పరీక్షలు నిర్వహించటం లేదు. బరువు తగ్గటం, షుగర్ లేవల్స్ పడిపోవటం కేజ్రీవాల్ తీవ్ర అనారోగ్యానికి సంకేతాలు. ఇప్పటికే ఐదుసార్లు షుగర్ లేవల్స్ లెవల్స్ పడిపోయాయి. 50 ఎంజీ/డీఎల్ కంటే కిందికి పడిపోతే ఆరోగ్యం క్షీణించి కోమాకు వెళ్తారు. కేజ్రీవాల్‌పైనే ఎందుకు ఇలా చేస్తున్నారు?’అని సంజయ్ సింగ్ మండిపడ్డారు.
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయటంతో కేజ్రీవాల్ ఏప్రిల్1 నుంచి తిహార్ జైలులో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ అరెస్ట్ కేసులో శుక్రవారం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజారు చేసింది. అయినా కూడా కేజ్రీవాల్ తిహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. లిక్కర్ కేసులో ఆయన్ను దర్యాప్తు కోసం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment