ఆప్‌లో లుకలుకలు, సిసోడియాతో కేజ్రీవాల్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీలో కుమార్ విశ్వాస్ వ్యవహారం ముగిసిపోకముందే...తాజాగా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ పేరు తెర మీదకు వచ్చింది.ఆప్‌ను చీల్చేందుకు అమానతుల్లా ఖాన్ కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
40మంది ఎమ్మెల్యేలు అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఏసీ అధ్యక్ష పదవి నుంచి అమానతుల్లా ఖాన్ ను తొలగించాలంటూ వారు ఈ సందర్భంగా సీఎంకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆప్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీలో తాజా పరిణామాలపై చర్చలు జరుపుతున్నారు.
కాగా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ఎమ్మెల్యే కుమార్ విశ్వాస్ కూడా చేజారిపోతున్నట్లు సంకేతాలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని మరీ కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతారని పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే కుమార్ విశ్వాస్ తన సోదరుడి లాంటివాడంటూ కొంతమంది వ్యక్తులు తామిద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వాళ్లు పార్టీకి శత్రువులని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు.