చీపురు పార్టీలో భారీ సంక్షోభం!
ఆప్‌కు కుమార్ విశ్వాస్ రాంరాం!
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో భగ్గుమన్న అంతర్గత అసమ్మతి అధికార ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తూనే ఉంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అసమ్మతి తీరంలో చేరిన ఆప్ కీలక నేత కుమార్ విశ్వాస్ సైతం ఇక కేజ్రీవాల్‌కు రాంరాం చెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కుమార్ విశ్వాస్ బీజేపీ ఏజెంట్ అని, ఆప్‌లో చీలిక తెచ్చేందుకు అతన్ని బీజేపీ, ఆరెస్సెస్ వాడుకుంటున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బాహాటంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విమర్శలు ఖండించకపోగా.. ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దంటూ సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు.
అయితే, అధినేత కేజ్రీవాల్ తీరుపై కుమార్ విశ్వాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ విమర్శించినట్టు తాను బీజేపీ ఏజెంటును కాదని, తాను ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 24గంటల్లోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసంలో ఆప్ అగ్రనేతలు భేటీ అయ్యారు. కుమార్ వ్యవహారంపై చర్చించినట్టు సమాచారం. కాగా, పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్న కుమార్ విశ్వాస్‌పై సీనియర్ నేత మనీష్ సిసోడియా మండిపడ్డారు. సమస్య ఏమైనా ఉంటే పార్టీలో చర్చించుకొని పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు. ఆయనను పార్టీ నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని వినిపిస్తోంది. మొత్తానికి రోజురోజుకు ఆప్ నాయకత్వానికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసమ్మతి గళాలు ఎగిసిపడుతున్నాయి.