దిగొచ్చిన కేజ్రీవాల్.. సాహో కుమార్ విశ్వాస్
ఎప్పుడూ తన వ్యతిరేకుల విషయంలో ఫైర్‌బ్రాండ్ కామెంట్లు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిగొచ్చారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, తనకు అత్యంత సన్నిహితుడు అయిన కుమార్ విశ్వాస్‌ను వదులుకోడానికి ఏమాత్రం ఇష్టపడక.. ఆయన పెట్టిన షరతులకు తలొగ్గారు. గత కొన్ని రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడానికి ఇంతకాలం తనకు ఏ మాత్రం అలవాటు లేని రాజీ ధోరణిలోకి వచ్చారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాల మీద బహిరంగంగా ధ్వజమెత్తిన కుమార్ విశ్వాస్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లతో కలిసిపోయారని, అందుకే అలా మాట్లాడుతున్నారని పీఏసీ సభ్యుడు అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనతో పాటు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను ఆయన బీజేపీలోకి తీసుకెళ్లిపోతున్నారని, అందుకు ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున ముట్టజెబుతున్నారని కూడా ఆయన అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది. అమానతుల్లాఖాన్ ఆరోపణలను ఖండించిన కుమార్ విశ్వాస్.. ఆయన ముసుగులో ఎవరు మాట్లాడుతున్నారో కూడా తనకు తెలుసని వ్యాఖ్యానించారు. పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వం మీద ఆయన విమర్శలు గుప్పించారు.
కేజ్రీవాల్ ఎందుకు తగ్గారు...
తాను మోనార్క్‌నని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఎప్పుడూ మండిపడుతుండే అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా ఒక నాయకుడి విషయంలో మాత్రం తలవంచారు. ఎందుకంటే.. పార్టీ వ్యవస్థాపకులలో కుమార్ విశ్వాస్ కూడా ఒకరు. ఆయన పార్టీ కోసం పోస్టర్లు అతికించిన స్థాయి నుంచి వచ్చారు. అవినీతి మరకలు ఏమాత్రం అంటని వ్యక్తి. దానికితోడు క్షేత్రస్థాయిలో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఉంది. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కావడంతో.. పొరపాటున ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే సామాన్య ప్రజల్లో కూడా పార్టీ బాగా దెబ్బతింటుందని కేజ్రీవాల్ భావించారు. దానికితోడు ఇటీవల జరిగిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత కీలకమైన నాయకులలో ఒకరైన కుమార్ విశ్వాస్‌ను పోగొట్టుకుంటే రాబోయే ఎన్నికల్లో మరింత నష్టం తప్పదని కేజ్రీవాల్ భావించారు. అందుకే పార్టీలో కొనసాగాలంటే.. అంటూ ఆయన పెట్టిన షరతులను కూడా ఆమోదించారు. అందుకే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా చర్చల తర్వాత బయటకు వచ్చి.. కుమార్ విశ్వాస్ పార్టీలోనే కొనసాగుతారని, రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉంటారని చెప్పారు.