లంచం ఇవ్వద్దు.. తీసుకోవద్దు: కేజ్రీవాల్
భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ప్రసంగాన్ని ఆరంభించారు. ఇది సామాన్యుల సభ అని, అయితే ఎవరూ అత్యుత్సాహంతో ముందుకు వచ్చి పోలీసులకు ఇబ్బంది కలిగించొద్దని కోరారు. అందరికీ ప్రమాణాలు తెలిపారు. ''ఈరోజు చాలా చరిత్రాత్మక దినం. ఇప్పుడు ప్రమాణస్వీకారం చేసింది కేవలం ఆరుగురు మంత్రులు, కేజ్రీవాల్ మాత్రమే కాదు.. ప్రతి సామాన్యుడూ చేశాడు. సామాన్యుడే అరవింద్ కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి చేశాడు. సామాన్యుడే గెలిచాడు. ఢిల్లీ ప్రజలు ఈసారి శాసన సభ ఎన్నికల్లో చాలా పెద్ద విజయం సాధించారు. దేశవాసులు చాలా నిరాశలో ఉన్నారు. ఈ దేశాన్ని ఏమీ బాగుచేయలేమని, రాజకీయాలు కుళ్లిపోయాయని అనుకున్నారు. కానీ, నిజాయితీతో కూడా రాజకీయాలు చేయొచ్చని, దాంతోనే గెలవచ్చని ఢిల్లీ ప్రజలు చేసి చూపించారు. అందుకు ముందుగా ఢిల్లీ వాసులకు అభినందనలు.
దేవుళ్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రెండేళ్ల క్రితం అసలు ఇలా ఆలోచించగలిగేవాళ్లం కూడా కాదు. ఇది కేవలం మా వల్ల కాదు. ఇదేదో దేవుడు చేసిన చమత్కారం. అందుకే ఈశ్వరుడు, అల్లా.. అందరికీ కృతజ్ఞతలు. ఇది కేవలం ప్రారంభమే. ఇంకా చాలా పోరాడాల్సి ఉంది. ఇది కేవలం మా ఆరుగురం మాత్రమే పోరాడలేం. ఢిల్లీకి చెందిన కోటిన్నర మంది మొత్తం పోరాడితేనే అవినీతిని అరికట్టగలం. సమస్యలన్నింటికీ పరిష్కారం మా వద్దే ఉందన్న గర్వం మాకు లేదు. అలాంటి సమాధానం కూడా మా దగ్గర లేదు. కానీ, ఢిల్లీ ప్రజలంతా ఒక్కటైతే పరిష్కారం లేని సమస్యలంటూ మిగలవు. ప్రభుత్వాన్ని నడిపించేది మంత్రులు, పోలీసులు, అధికారులు కారు.. మొత్తం కోటిన్నర మందీ నడిపిస్తారు. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం మనమంతా ఇక్కడే రాంలీలా మైదాన్లో కలిశాం. అవినీతిపై అన్నా హజారే నేతృత్వంలో పోరాటం చేశాం. రెండున్నరేళ్లలో చాలా చాలా చేశాం. నిరాహారదీక్షలు, పోరాటాలు, అన్నీ చేశాం. రాజకీయాలు మారితే తప్ప దేశం బాగుపడదని భావించి రాజకీయాల్లోకి వచ్చాం. అన్నా హజారే మాత్రం రాజకీయాలు బురద, అందులోకి వెళ్లద్దని అనేవారు. నేను మాత్రం ఆ బురదలోకే దిగి దాన్ని శుభ్రం చేయాలని చెప్పేవాడిని. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు ఎందుకు బాగోలేదంటే.. రాజకీయాలు బాగోలేదు. కరెంటు బిల్లులు ఎందుకు ఎక్కువ వస్తాయి, నీళ్లు ఎందుకురావు, రోడ్లు ఎందుకు పాడయ్యాయి.. అన్నీ కుళ్లు రాజకీయాల వల్లే. వాటిని బాగు చేయాలనే నేను వాటిలోకి వచ్చాను. సంతోష్ కోహ్లీ అనే సహచరురాలిని మేం కోల్పోయాం. ఆమె లేకపోవచ్చు గానీ, ఆమె ఆత్మ మాత్రం ఎక్కడున్నా సంతోషిస్తుంది.
గత కొన్ని రోజులుగా నేను ఢిల్లీలోని కొందరు అధికారులను కలిశాను. కొందరు అవినీతిపరులు కావచ్చు గానీ చాలామంది నిజాయితీపరులున్నారు. వాళ్లతోనే మనం వ్యవస్థను బాగుచేయచ్చు. దేశమంతా కూడా ఒక్కటిగా అయితే, ప్రజలు ఒక్కటిగా అయితే, నాయకులు ఒక్కటిగా అయితే అవినీతి, పేదరికాలను దేశం నుంచి తరిమి కొట్టగలం. మా మంత్రులు, కార్యకర్తలు అందరికీ చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాను. మన మనస్సులో ఎప్పుడూ గర్వం రాకూడదు. అలా వస్తే ఇన్నాళ్ల పోరాటం వృథా అవుతుంది. ఇతర పార్టీల గర్వాన్ని అణిచేందుకు వచ్చాం. మన గర్వాన్ని అణిచేందుకు మరో పార్టీ రావల్సిన అవసరం రాకూడదు. మేం మంత్రులు, ముఖ్యమంత్రులు అవ్వడానికి రాలేదు. సేవ చేయడానికి వచ్చాం. ఈ సేవా భావాన్ని మనం మరువకూడదు.
ఢిల్లీ ప్రజలంతా కలిసి చాలా పెద్ద శక్తులతో పోరాడారు. ఆ శక్తులన్నీ ఊరికే కూర్చోవు. నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి గానీ ఇప్పుడు వాటిని ప్రస్తావించను. మన మార్గంలో చాలా రాళ్లు, ముళ్లు ఎదురవుతాయి. వాటన్నింటినీ ఎదుర్కోడానికి మేం సిద్ధం. రాబోయే ఏ ఎన్నికనైనా కూడా ఎదుర్కోడానికి నేను సిద్ధం. మామీద చాలా పెద్ద బాధ్యతను ఢిల్లీ వాసులు ఉంచారు. కానీ ఈ బాధ్యతను నెరవేర్చాలంటే మాకు ఢిల్లీ ప్రజల సాయం కావాలి. వారి ఆశలు చూస్తే నాకు భయం వేస్తుంది. మాతో ఎలాంటి తప్పులు తెలిసి, తెలియక చేయించద్దని భగవంతుడిని కోరుతున్నాను.
ఈ పోరాటంలో నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ చాలా మంచి వ్యక్తి. ఆయన పార్టీ గురించి మాత్రం నేను చెప్పలేను. కాంగ్రెస్, బీజేపీ, అన్ని పార్టీలకూ ఇదే వినతి. మీరు చేస్తున్న పని దేశం కోసమే అయితే.. పార్టీ విభేదాలు మర్చిపోండి. ఈ పోరాటంలో నాతో కలిసి రండి. వారం రోజుల తర్వాత విశ్వాస తీర్మానం వస్తుంది. కొందరు అందులో మేం ఓడిపోతామంటున్నారు. దాని గురించి మాకు బాధ లేదు. ఓడిపోతే మళ్లీ ప్రజల ముందుకు వస్తాం. ఎన్నికల్లో పోరాడతాం. ప్రజలు మాకు అప్పుడు భారీ మెజారిటీ ఇస్తారు.
గత రెండేళ్లుగా దేశంలో చాలా పోరాటాలు జరుగుతున్నాయి. అన్నా హజారే ఇక్కడకు వచ్చి దీక్ష చేసినప్పుడు దేశమంతా కదిలి వచ్చింది. ఇలా ఎలా జరిగిందని నేను ఆలోచించాను. అలాగే నిర్భయపై అత్యాచారం జరిగినప్పుడు కూడా అందరూ రోడ్లమీదకు వచ్చారు. దేశంలో చాలా పెద్ద విప్లవం వస్తోంది. ఇది రాబోయే రోజుల్లో పెద్దశక్తిగా మారుతుందన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు మనమంతా కలిసి ఢిల్లీని మార్చాలి. ఇప్పుడు జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోము, ఇవ్వబోమని శపథం చేయాలి. రేషన్ కార్డు కావాలన్నా, ఏం కావాలన్నా ఇన్నాళ్లూ లంచం ఇవ్వాల్సి వచ్చేది. ఇక మీదట ఎవరైనా లంచం అడిగితే మీరు ఇవ్వబోమని చెప్పద్దు. మీకు రెండు రోజుల్లోనే ఓ ఫోన్ నెంబర్ ఇస్తాం. దానికి ఫోన్ చేసి చెప్పండి. లంచగొండులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. మీ పని నేను చేయిస్తాను. జీవితంలో ఎప్పుడూ ఎవరికీ లంచం ఇవ్వను, తీసుకోను అని అందరూ శపథం చేయండి'' అంటూ తన ప్రసంగం ముగించారు. చివరిలో ఎప్పటిలాగే తమ పార్టీ ప్రార్థన చేశారు.. అదే సమయంలో ప్రజలందరితో చేయించారు.