మానవుడు... మరణాన్ని జయిస్తాడా?
కవర్ స్టోరీ
నిండు నూరేళ్లు బతకాలనే ఆకాంక్షతో ‘శతాయుష్మాన్ భవ’ అంటూ పెద్దలు ఆశీస్సులు పలకడం మన ఆనవాయితీ. పిన్నల పట్ల ప్రేమాభిమానాలు అతిశయించినప్పుడు ‘చిరంజీవ.. చిరంజీవ’ అని కూడా ఆశీర్వదిస్తారు. ప్రపంచంలో శతాయుష్కులు అక్కడక్కడా ఉన్నా, చిరంజీవులు మాత్రం పురాణాలకే పరిమితం. క్రికెట్ పరుగుల్లో సెంచరీ కొట్టడం కంటే, బతుకు పరుగులో సెంచరీ కొట్టడమే సిసలైన ఘనత. అందుకే, సెంచరీ దాటిన వయోధికులు వార్తలకెక్కుతుంటారు.
క్రికెట్‌లో సెంచరీ వీరుల సంఖ్య పెరుగుతున్నట్లే, ప్రపంచంలో సెంచరీ దాటిన వయోధికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. మానవుల ఆయుర్దాయ ప్రమాణంలో ఇదొక ఆశావహమైన మార్పు. అరవైకి మించి బతకడమే ఎక్కువ. ఆ తర్వాత బాల్చీ తన్నేసినా మరేం ఫరవాలేదనే నిరాశావాదుల సంఖ్య లోకంలో తక్కువేమీ కాకపోయినా, శాస్త్ర పరిశోధనల పురోగతిని గమనిస్తే, అలాంటి నిరాశావాదులను లెక్కలోకి తీసుకోనక్కర్లేదు. అంతులేని జీవనలాలస కలిగిన శాస్త్రవేత్తలు శతాయుష్షుతో సంతృప్తి చెందడం లేదు.
మానవుల ఆయుర్దాయాన్ని బహు శతాధికంగా పొడిగించడమే కాదు, చివరకు జరామరణాలను జయించగల మార్గాలను కనుగొనే పరిశోధనలను ముమ్మరం చేస్తున్నారు. ‘గూగుల్’ వంటి దిగ్గజ సంస్థలు ఇలాంటి పరిశోధనలకు భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్నాయి. ఆ పరిశోధనలు, ఇప్పటి వరకు వాటి ఫలితాలు, వాటిపై భావి ఆశలు, అంచనాలపై ఒక వీక్షణం..
మానవాళి చిరకాల స్వప్నం..
జరామరణాలను జయించాలనేది మానవాళి చిరకాల స్వప్నం. అశ్వత్థామ, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు చిరంజీవులు. ఈ ఏడుగురే కాకుండా, మార్కండేయుడిని కూడా కొందరు పురాణకారులు చిరంజీవుల జాబితాలో చేర్చారు. పురాణాల్లో మరికొందరు చిరంజీవులూ ఉన్నారు. పురాణాల సంగతి సరే, శాస్త్ర సాంకేతిక అధునాతన వైద్య పరిజ్ఞానం విచ్చలవిడిగా విస్తరిల్లుతున్న కాలంలో చిరంజీవులెవరైనా ఉన్నారా అనే ప్రశ్నకు లేదనే సమాధానం వస్తుంది.
ఆధునిక యుగంలో కొత్తకొత్త జబ్బులొచ్చాయి, కొత్తకొత్త మందులు, చికిత్సా పద్ధతులూ వచ్చాయి. మానవాళిని మహమ్మారిలా మట్టుపెట్టగల ప్రాణాంతక వ్యాధులను జయించిన ప్రతి సందర్భమూ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచింది. ఇదివరకటితో పోలిస్తే, చాలా రకాల క్యాన్సర్‌లను వైద్యులు నయం చేయగలుగుతున్నారు. అయినప్పటికీ, చాలామందిని క్యాన్సర్ ఇంకా కబళిస్తూనే ఉంది. క్యాన్సర్ నిర్మూలనే లక్ష్యంగా యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీకి నడుం బిగించిన శాస్త్రవేత్తలు ఆశాజనకమైన ఫలితాలతో ముందంజ వేస్తున్నారు. రక్తపింజర విషంతో ఎయిడ్స్‌కు విరుగుడు కనిపెట్టే ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
ప్రతి ప్రాణాంతక వ్యాధినీ జయించే దిశగా నిర్విరామంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే, మనుషులు వ్యాధులు, వైపరీత్యాల వల్ల మాత్రమే మరణిస్తారా..? వైపరీత్యాల బారిన పడకుండా, జీవితకాలంలో ఏ వ్యాధి సోకకుండా బతికినా, ముదిమి మీరినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు గుటుక్కుమంటూనే ఉన్నారు కదా! అందుకే శాస్త్రవేత్తలు ముదిమిని జయించడమే తక్షణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ముదిమిని జయిస్తే, ఏదో ఒకరోజు మరణాన్ని జయించడం అసాధ్యమేమీ కాదనేదే వారి అభిమతం.
జరామరణాలపై గత పోరాటాలు..
జరామరణాలపై మానవుల పోరాటం ఈనాటిది కాదు. అమృతం తాగిన వాళ్లకు మరణం ఉండదని నమ్మేవాళ్లు. అమృతం తాగినందునే దేవతలు అమరులయ్యారని పురాణాలు చెబుతాయి. పురాణాల ప్రభావంతో జరా మరణాలను జయించే దివ్యౌషధం కనిపెట్టే దిశగా శతాబ్దాల కిందట చాలా ప్రయత్నాలే జరిగాయి. ఆధునిక యుగానికి ముందు కూడా దీర్ఘాయువు కోసం చాలా ప్రయోగాలే జరిగాయి.
దీర్ఘయవ్వనం కోసం మన దేశంలో వాజీకరణ ఔషధాల వాడుక శతాబ్దాల కిందటి నుంచే ఉంది. తాబేలు వృషణాలతో తయారు చేసిన సూప్ తాగితే దీర్ఘాయువు కలుగుతుందని జమైకన్లు నమ్మేవారు. లేడీ డ్రాకులాగా పేరుమోసిన ట్రాన్సిల్వేనియా రాణి ఎలిజబెత్ బ్యాతొరీ మరణాన్ని జయించేందుకు మరింత క్రూరమైన ప్రయోగమే చేసేది. మరణాన్ని జయించవచ్చనే వెర్రి నమ్మకంతో ఆమె ఏకంగా పడచు యువతుల రక్తంతో జలకాలాడేది. అయినా, ఆమె మరణాన్ని జయించలేకపోయింది.
దీర్ఘాయువు కోసం చైనా చక్రవర్తులు జేడ్ అనే రత్నం, బంగారం వంటి విలువైన పదార్థాలతో తయారు చేసిన ఔషధాలే కాకుండా, అప్పటి వైద్యుల మాటలు నమ్మి నానా ఔషధాలు, మూలికా రసాయనాలు మింగేవారు. ఒక్కోసారి అలాంటి ఔషధాలు వికటించేవి కూడా. అయినా, జరామరణాలను జయించే ప్రయత్నాలను మానవులు ఏనాడూ విరమించుకోలేదు. అయితే ఆ ప్రయత్నాల ఫలితంగా మానవుల సగటు ఆయుర్దాయ ప్రమాణాలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి.
అచిరకాలంలోనే పంచశతాయుష్కులు..!
మానవులందరికీ అమరత్వ సిద్ధి అచిరకాలంలోనే సాధ్యం కాకపోవచ్చు గానీ, సమీప భవితవ్యంలో పుట్టబోయే మనుషులు ఐదువందల ఏళ్లు నిక్షేపంగా బతుకుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొదటగా 150 ఏళ్ల లక్ష్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి. క్రమంగా మరికొంత కాలానికి అమరత్వాన్ని కూడా సాధించవచ్చని అంటున్నారు. వార్ధక్యాన్ని ఇప్పటి వరకు వైద్యులు సహజ లక్షణంగానే గుర్తిస్తూ వస్తున్నారు. అయితే, అమరత్వ సాధన కోసం తపన పడుతున్న అధునాతన పరిశోధకులు మాత్రం వార్ధక్యాన్ని వ్యాధిగానే గుర్తించాలనే వాదన వినిపిస్తున్నారు.
మిగిలిన వ్యాధుల మాదిరిగానే వార్ధక్యాన్ని కూడా చికిత్సతో నయం చేయవచ్చని చెబుతున్నారు. వార్ధక్యాన్ని నయం చేస్తే, మరణాన్ని జయించడం పెద్ద సమస్య ఏమీ కాదని అంటున్నారు. రానున్న రెండు, మూడు దశాబ్దాల్లోనే ఈ చికిత్సా పద్ధతులు అందుబాటులోకి రానున్నాయని చెబుతున్నారు. వార్ధక్యాన్ని పూర్తిగా నయం చేయగలిగితే, మరణాన్ని జయించినట్లేనని చెబుతున్నారు.
వార్ధక్యమే లేకపోతే...
వార్ధక్యం లేని మనుషులకు ‘సహజ’మరణం ఉండదు. అలాంటప్పుడు ప్రమాదాలు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా హత్యల వంటి నేరాల వల్ల తప్ప మనుషులు మరణించే అవకాశం ఉండదు. ఒకవేళ అలాంటి సందర్భాల్లో మనుషులు భౌతికంగా మరణించినా, వారికి అమరత్వం కల్పించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా భౌతికంగా మరణించినా, వారి మేధస్సును కంప్యూటర్‌లోకి అప్‌లోడ్ చేయడం ద్వారా వారిని చిరాయువులుగా మార్చవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
డీఎన్‌ఏ క్షీణత, మైటోకాండ్రియా సహా శరీర కణాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ భాగాల్లో సంభవించే విపరిణామాల ఫలితంగానే వార్ధక్యం కలుగుతోందని బ్రిటిష్ పరిశోధకుడు గ్రే చెబుతున్నారు. ఈ విపరిణామాలను నివారించడం ద్వారా వార్ధక్యం రాకుండా చేయవచ్చని అంటున్నారు. ముఖ్యంగా జీవకణంలోని డీఎన్‌ఏను అంటిపెట్టుకుని ఉండే ‘టెలోమెర్స్’ అనే న్యూక్లియోటైడ్స్ పొడవు కుంచించుకుపోవడమే వార్ధక్యానికి దారితీస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మూలకణ చికిత్స ద్వారా టెలోమెర్స్ పొడవు కుంచించుకుపోకుండా నివారించగలమని వారు భావిస్తున్నారు. మరోవైపు, మూలకణాలతో అవయవ మార్పిడి చికిత్సలను సులభతరం చేసే ప్రక్రియలపైనా పరిశోధనలు సాగిస్తున్నారు.
అమరత్వ సిద్ధిపై అపర కుబేరుల ఆసక్తి..
అమరత్వ సాధన కోసం జరుగుతున్న ప్రయోగాలపై ప్రపంచంలోని అపర కుబేరులు అపరిమితమైన ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిశోధనల కోసం ఎలాంటి ప్రచారం లేకుండా భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్నారు. ఇంటర్నెట్ దిగ్గజం ‘గూగుల్’ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ సహా పలువురు కార్పొరేట్ రారాజులు దీర్ఘాయువు కోసం జరుగుతున్న పరిశోధనలకు బిలియన్ల కొద్దీ డాలర్లను ఉదారంగా సమకూరుస్తున్నారు. మరణాన్ని జయించే రోజు కచ్చితంగా వస్తుందని సెర్గీ బ్రిన్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.
మరణాన్ని ఒక అనివార్య పరిణామంగా స్వీకరించినంత కాలం మానవ జీవితం అసమగ్రంగానే ఉంటుందని ఈ పరిశోధనలకు నిధులు సమకూరుస్తున్న మరో సాఫ్ట్‌వేర్ దిగ్గజం ల్యారీ ఎలిసన్ అంటున్నారు. జన్యు విపరిణామాలను నివారించడం ద్వారా శాస్త్రవేత్తలు ఇప్పటికే సూక్ష్మజీవులు, ఎలుకల ఆయుర్దాయ ప్రమాణాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమయ్యారు. ఇంటర్నెట్ పేమెంట్ సేవల సంస్థ ‘పేపాల్’ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ కూడా ఈ పరిశోధనలకు నిధులు సమకూరుస్తున్నారు. వార్ధక్యం అనివార్యమనే ఆలోచననే విరమించుకోవాలని బ్రిటిష్ పరిశోధకుడు ఆబ్రే డి గ్రే గట్టిగా చెబుతున్నారు.
నాణేనికి మరోవైపు...
అనివార్యమైన జరామరణాలను జయించడం అసాధ్యమని, ఇలాంటి విషయాలపై పరిశోధనలు సాగించడం పూర్తిగా వెర్రితనం అని విమర్శలు గుప్పించే పరిశోధకులూ లేకపోలేదు. అసాధ్యమైన అంశాలపై సాగించే పరిశోధనల కోసం నిధులు తగలేసే కంటే, ఉపయోగపడే అంశాలపై పరిశోధనలకు ఆ నిధులను మళ్లిస్తే సముచితంగా ఉంటుందని బ్రిటిష్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సర్ కోలిన్ బ్లేక్‌మోర్ అంటున్నారు. శాస్త్ర పరిశోధనల ఫలితంగా మహా అయితే, మానవుల సగటు ఆయుర్దాయాన్ని 120 ఏళ్ల వరకు పెంచవచ్చని, అంతకు మించి పెంచడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఆశలు కలిగిస్తున్న ఫలితాలు..
ఎలాంటి పరిశోధనలకైనా విమర్శలు తప్పవు. దీర్ఘాయుర్దాయంపై జరుగుతున్న పరిశోధనలు సైతం విమర్శలకు అతీతమైనవేవీ కాదు. కొన్ని వర్గాల శాస్త్రవేత్తలు విమర్శలు గుప్పిస్తున్నా, దీర్ఘాయుర్దాయంపై తదేక దీక్షతో పరిశోధనలు సాగిస్తున్న పరిశోధకులు మాత్రం ఆశాజనకమైన ఫలితాలనే సాగిస్తున్నారు. గూగుల్ ఆర్థిక సహాయంతో కాలిఫోర్నియా లైఫ్ కంపెనీ శాస్త్రవేత్తలు ఏలికపాములను నమూనాగా తీసుకుని నిర్వహించిన ప్రయోగాల్లో గణనీయమైన పురోగతి సాధించారు.
జన్యుపరివర్తనం ద్వారా వారు ఏలికపాముల ఆయుర్దాయాన్ని ఏకంగా పదిరెట్లు పెంచగలిగారు. ఇదే పద్ధతిలో మానవుల ఆయుర్దాయాన్ని కూడా గణనీయంగా పెంచడం సాధ్యమేనని కాలిఫోర్నియా లైఫ్ కంపెనీ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న సింథియా కెన్యాన్ చెబుతున్నారు. ఆఫ్రికాలో కనిపించే ఎలుక జాతికి చెందిన ‘నేకెడ్ మోల్ ర్యాట్’పై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. శరీరంపై రోమాలు లేని ఈ ఎలుకకు క్యాన్సర్ సోకదు. మిగిలిన ఎలుకల కంటే దీని ఆయుర్దాయం పదిరెట్లు ఎక్కువ.
మామూలు ఎలుకలు సగటు ఆయుర్దాయం మూడేళ్లు అయితే, ‘నేకెడ్ మోల్ ర్యాట్’ ఏకంగా ముప్పయ్యేళ్లకు పైగానే బతుకుతుంది. క్యాన్సర్‌ను సోకనివ్వని లక్షణమేదో ఈ ఎలుక జన్యువుల్లో ఉంటుందని భావిస్తున్న శాస్త్రవేత్తలు, ఆ రహస్యాన్ని ఛేదించే దిశగా ముమ్మర పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిశోధనల నేపథ్యంలో మానవుడు మరణాన్ని జయించే రోజు వస్తుందో లేదో ఇప్పుడప్పుడే చెప్పలేం గానీ, సమీప భవితవ్యంలోనే మానవుల ఆయుర్దాయ ప్రమాణం ద్విగుణం, బహుగుణం కాగలదని మాత్రం చెప్పవచ్చు.
- పన్యాల జగన్నాథదాసు