చేతివాటం మారాజు..
రాచరికంలో దోపిడీ అంతా పరోక్షంగానే సాగేది. రాజాధి రాజులు, మహా మహా చక్రవర్తులు యథాశక్తి ప్రజలపై పన్నులు వడ్డిస్తూ ఆ విధంగా ముందుకుపోయేవారు. అలాగని వారు నేరుగా ఏనాడూ జేబులు కత్తిరించిన పాపాన పోలేదు. ఈజిప్టును పరిపాలించిన చిట్టచివరి రాజు ఫరూక్ మిగిలిన రాజుల కంటే భిన్నమైన పిచ్చిమారాజు. ఇతగాడు ఏకంగా జేబులు కత్తిరించే రకం. కంటికి నదరుగా కనిపించిన వస్తువు ఎంత చిన్నదైనా, పనికిమాలినదైనా కొట్టేయకుంటే అతగాడికి నిద్రపట్టేది కాదు. ఇదోరకం జబ్బు. దీనినే ‘క్లెప్టోమానియా’ అంటారు మానసిక వైద్యులు. అది సరే! జేబులు కొట్టేసిన వాడికి అవసరమైన సమయాల్లో పిక్కబలం చూపి పరుగెత్తే సత్తా ఉండాలి. ఫరూక్ మహారాజా వారికి అలాంటిదేమీ లేదు.
సుష్టుగా ముప్పూటలా భోంచేసి పెంచిన 136 కిలోల భారీ శరీరంతో గజగమనుడై అలరారేవాడు. అడుగుతీసి అడుగు వేయడమే గగనంగా ఉండేది. ఇంతటి మహాకాయుడైన మహారాజా ఫరూక్‌వారు ఒకసారి ఏకంగా అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ చేతిగడియారాన్నే కొట్టేసి చరిత్రలో నిలిచిపోయాడు.
కూర్పు: పన్యాల జగన్నాథదాసు