మందు చేద్దామనుకుంటే మందుగుండు
జరామరణాలను దూరం చేయగల అద్భుతమైన మందును కనుగొనేందుకు చైనా రసవేత్తలు తొమ్మిదో శతాబ్దంలో విస్తృతంగా ప్రయోగాలు సాగించాడు. రకరకాల పదార్థాలను సేకరించి, నానా రకాల సమ్మేళనాలను తయారు చేసి పరీక్షలు జరిపారు. ఏదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా, ఓర్పు కోల్పోని ఆ పరిశోధకులు మరిన్ని యత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలలో జరామరణాలను దూరం చేయగల నవయవ్వన ఔషధమేదీ తయారు కాలేదు గానీ, కూతవేటు దూరంలో ఉన్న ప్రాణాలను సైతం గాల్లో కలిపేయగల గన్‌పౌడర్ పుట్టింది. నవయవ్వన ఔషధం కోసం చైనా రసవేత్తలు చేసిన విఫలయత్నం ఫలితంగా మానవాళికి ఈ పేలుడు పదార్థం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో ఆ తర్వాత యుద్ధాల తీరుతెన్నులే మారిపోయాయి.
కూర్పు: పన్యాల జగన్నాథదాసు