కన్నీటి ఆర్తి | Shocking! Tollywood Actress Aarthi Agarwal Passes Away | Sakshi
Sakshi News home page

కన్నీటి ఆర్తి

Published Sun, Jun 7 2015 8:30 AM | Last Updated on Tue, Aug 28 2018 5:11 PM

కన్నీటి ఆర్తి - Sakshi

కన్నీటి ఆర్తి

కొన్ని కన్నీళ్లు అందంగా ఉంటాయి. కొన్ని వికృతంగా.
కొన్ని దయగా ఉంటాయి. కొన్ని కర్కశంగా.
కొన్ని బాధను పంచుకుంటాయి. కొన్ని బాధనిస్తాయి.
కొన్ని హర్షాన్నిస్తాయి. కొన్ని దుఃఖాన్ని వర్షిస్తాయి.
ఆర్తి కళ్లు అనేకసార్లు సుడులు తిరిగుంటాయి.
కొన్ని గ్లిజరిన్‌కు. కొన్ని నిజంగా.
గొప్ప నటన. నాటకీయ పతనం.
గొప్ప సౌందర్యం... కనపడని గాయం.
గొప్ప భవిష్యత్... హఠాత్ మరణం.

కన్నీళ్లకు కదిలించే శక్తి ఉంటుందంటారు.
ఇప్పుడు అవి ఆర్తిని కదిలిస్తే ఎంత బాగుండు!

 
అగ్రహీరోలందరితో...
పదిహేనేళ్ల కెరీర్‌లో ఆమె నటించినవి మహా అయితే ఓ పాతిక సినిమాల వరకు ఉంటాయి. అయితేనేం? వెండితెర మీద నిండుగా ప్రేక్షకులకు కనువిందు చేసిందామె! తెలుగులోని పెద్ద పెద్ద హీరోలందరి సరసనా నటించింది. అమెరికాలోని న్యూజెర్సీలో పుట్టి పెరిగిన ఆమె, అనుకోకుండా సినీరంగంలోకి వచ్చింది. బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి తొలిసారిగా ఆమె ప్రతిభను గుర్తించాడు.

ఫిలడెల్ఫియాలో సునీల్‌శెట్టి పాల్గొన్న కార్యక్రమంలో ఆర్తీ అగర్వాల్ డ్యాన్స్ చేసింది. అప్పటికి ఆమె వయసు పట్టుమని పద్నాలుగేళ్లే! సినీరంగంలో ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని, బాలీవుడ్‌కు పంపమని ఆర్తీ తండ్రి శశాంక్‌కు సూచించాడు. సునీల్‌శెట్టి ప్రోత్సాహంతో ఆర్తీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె తొలిచిత్రం ‘పాగల్‌పన్’ 2001లో విడుదలైంది. బాలీవుడ్ నిర్మాత రాకేశ్‌నాథ్ కొడుకు కరణ్‌నాథ్ సరసన నటించిన ఆ చిత్రం పరాజయం పాలైంది.
 
టాలీవుడ్ గోల్డెన్‌లెగ్..
అదే ఏడాది ఆర్తీ టాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. వెంకటేశ్ సరసన ఆమె నటించిన ‘నువ్వు నాకు నచ్చావు’ హిట్టవడంతో, టాలీవుడ్‌నే తన కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతోను, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబు, రవితేజ, ప్రభాస్, తరుణ్, ఉదయకిరణ్ వంటి యువ హీరోలతోను వరుసగా సినిమాలు చేసింది.

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తొలి నాలుగేళ్లూ ఆర్తీకి స్వర్ణయుగంలానే గడిచింది. వరుస సినిమాలు.. వరుస విజయాలు.. తొలి ఏడాదిలోనే తరుణ్‌తో ‘నువ్వులేక నేను లేను’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అల్లరి రాముడు’ సినిమాలతో తన సత్తా చాటుకుంది. వెంటనే మెగాస్టార్ చిరంజీవితో ‘ఇంద్ర’లో అవకాశం దొరికింది. అందులో ఆమె స్నేహలతారెడ్డి పాత్రలో చిరంజీవికి దీటైన నటన కనపరచి అభిమానులే కాదు, విమర్శకుల మెప్పు కూడా పొందింది.
 
‘నీ స్నేహం’లో యువహీరో ఉదయ్ కిరణ్ సరసన, ‘బాబీ’లో మహేశ్ బాబు సరసన తళుక్కుమని ఆకట్టుకుంది. ఆ వెంటనే ‘పల్నాటి బ్రహ్మనాయుడు’లో బాలకృష్ణ వంటి అగ్రహీరో సరసన మరో భారీ అవకాశం. వెంకటేశ్‌తో ‘వసంతం’, రవితేజతో ‘వీడే’, నాగార్జునతో ‘నేనున్నాను’, ప్రభాస్‌తో ‘అడవి రాముడు’.. వరుస హిట్లు.. ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్‌గా ఆర్తీ పేరు మార్మోగింది. ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘నరసింహుడు’లలో ఐటెమ్ సాంగ్స్‌తో ఆకట్టుకుంది.
 
వివాదాల సుడిగుండం..
అగ్ర కథానాయికల్లో ఒకరిగా తన స్థానం ఇక పదిలం అనుకుంటుండగానే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. హీరో తరుణ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా వదంతులు రావడంతో మనస్తాపం చెంది, 2005 మార్చి 23న వేకువ జామున బాత్‌రూమ్ క్లీనింగ్ లిక్విడ్ తాగేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవడంతో అదేరోజు మధ్యాహ్నానికి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. అదే ఏడాది తరుణ్‌తో నటించిన ‘సోగ్గాడు’ విడుదలైంది.

వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతి’లో ఒక చిన్న పాత్రలో కనిపించింది. తమిళంలో ‘బంబర కన్నలె’లో నటించినా, తమిళ రంగం నుంచి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆత్మహత్యా యత్నం నుంచి బయటపడిన తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఆమె గురించి వార్తలు కూడా బాగా తగ్గాయి. అలాంటి పరిస్థితుల్లో 2006 ఫిబ్రవరి 15న రాత్రి భోజనం తర్వాత అపార్ట్‌మెంట్‌లో మెట్ల మీంచి జారిపడటంతో తీవ్రంగా గాయపడింది.

ఆమె తండ్రి అప్పటికి పెయిన్ కిల్లర్ మాత్రలు ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం డాక్టర్‌ను పిలిచారు. వెంటనే ఆస్పత్రికి తరలించాలని డాక్టర్ సూచించడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఈ సంఘటనపైనా రకరకాల ఊహాగానాలు.. రకరకాల వదంతులు.. కాస్త కోలుకున్నాక ఆన్‌లైన్‌లో పరిచయమైన ఎన్‌ఆర్‌ఐ ఉజ్వల్‌ను 2007 నవంబర్ 21న ఆర్య సమాజ్‌లో పెళ్లాడింది.

జార్ఖండ్‌కు చెందిన ఉజ్వల్ అమెరికాలోని బ్యాంకు ఉద్యోగి. పెళ్లి తర్వాత ఆర్తీ.. టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కమేడియన్ సునీల్ సరసన ‘అందాలరాముడు’లో నటించింది. ఆ చిత్రం హిట్ కావడంతో ఆర్తీ కెరీర్ తిరిగి గాడిలో పడుతోందనే అనుకున్నారు అభిమానులు. సినిమాల్లో తిరిగి తన సత్తా నిరూపించుకోవాలనే అనుకుందామె. అయితే, అమెరికాలో ఉన్న భర్త మాత్రం సినిమాలు వదిలేసి, తన వద్దకు వచ్చేయమన్నాడు. భిన్న ధ్రువాలుగా మారడంతో ఇద్దరి కాపురం ఎన్నాళ్లో సాగలేదు.

రెండేళ్లు గడిచేలోగానే విడాకులు తీసుకున్నారు. కాపురంలో కలతలు కొనసాగుతున్న కాలంలోనే  ‘గోరింటాకు’, ‘దీపావళి’ వంటి సినిమాల్లో నటించింది. అవి కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. పోసాని కృష్ణమురళితో ‘జెంటిల్‌మేన్’లో నటించింది. తర్వాత దాదాపు కనుమరుగైంది. ఆర్తీ నటించిన ‘రణం-2’ శుక్రవారమే విడుదలైంది. మరో చిత్రం ‘నీలవేణి’ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈలోగానే అనుకోని విషాదం. ఒక అందమైన నటి రాలిపోయింది.
 - పన్యాల జగన్నాథదాసు
 
మరో యువ ఆత్మ నింగికి
ఎగిరింది. ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తూ, ఆర్తి ఆత్మ శాంతికోసం ప్రార్థిస్తున్నాను.
- మంచు లక్ష్మి
 
గుండెలు పిండివేసే వార్త ఇది.
ఆర్తి అగర్వాల్ ఆత్మకు శాంతి లభించాలి.
- మంచు మనోజ్
 
దిగ్భ్రాంతికరమైన వార్త... ఆర్తి ఇక లేదు... జీవితం నిజంగా ఎంత బుద్భుదం... చాలా విచారకరం
- నాని
 
ఆర్తి ఇంత చిన్న వయసులోనే వెళ్లిపోవడం నిజంగా దురదృష్టకరం!
- సందీప్ కిషన్
 
 
నా ‘వీడే’ కథానాయిక ఇక లేదని తెలుసుకోగానే నాకు గుండె బద్దలయినంత పనయింది. ఇది చాలా దిగ్భ్రాంతికరం. ఆమె ఆత్మ శాంతి పొందుగాక!
- కోన వెంకట్
 
నేను విన్నది నిజమేనా? ఆర్తి అగర్వాల్ ఇక లేదా? ఆఖరి క్షణం వరకు ఆమె జీవితంతో పోరాడుతూనే ఉంది!
- లక్ష్మీ రాయ్

హారి భగవంతుడా! ఇంత చిన్న వయసులోనే ఆర్తిని తీసుకెళ్లావెందుకు...
- విమలా రామన్
 
ఇంత చిన్న వయసులోనే... ఆర్తి... నిజంగా ఇది గుండెలు బద్దలయే వార్త. ఆర్తికి ఆత్మశాంతి కలగాలి.
- సమంత రూత్ ప్రభు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement