పుష్కర గోదావరి | pushkar godavari | Sakshi
Sakshi News home page

పుష్కర గోదావరి

Published Sun, Jul 12 2015 1:29 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

పుష్కర గోదావరి - Sakshi

పుష్కర గోదావరి

మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ వద్ద పడమటి కనుమలలోని బ్రహ్మగిరి కొండల నుంచి సన్నని ధారగా పుట్టి పాపికొండలను చీల్చుకుని పరవళ్లు తొక్కుతూ, తెలుగునేలను పునీతం చేస్తున్న పవిత్ర గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. పవిత్ర గంగానది తర్వాత 1465 కిలోమీటర్ల పొడవున ప్రవహించే గోదావరి మన దేశంలోనే రెండవ పెద్ద నది. భారతదేశంలో గంగానది అతిపెద్దదే కావచ్చు కానీ, గోదావరి అత్యంత పురాతనమైనది.

భగీరథ ప్రయత్నం వల్ల భూమిపైకి చేరిన గంగానది త్రేతాయుగం నాటిదైతే, గోదావరి కృతయుగం నాటిదని ప్రతీతి. గంగా, గోదావరి నదులు రెండూ పవిత్రతలో సమానమైనవే అయినా, గోదావరిలో స్నానం చేసిన తర్వాతే గంగానదిలో స్నానం చేయాలనేది తరతరాల ఆచారం. గంగానదిలో స్నానం చేసినా, చేయకపోయినా, గోదావరిలో స్నానం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని, గోదావరిలో స్నానం చేయకుండా గంగానదిలో స్నానం చేసినా ఫలితం దక్కదని స్మృతులు చెబుతున్నాయి. ఇంతటి ప్రశస్తి కలిగిన గోదావరి జననం గురించి పురాణాలు చెప్పిన గాథ..
 
గోదావరి జననం
గంగను వలచిన శివుడు ఆమెను తలపైకి ఎత్తుకున్నందుకు శివాని అయిన పార్వతి కోపించింది. గంగను ఎలాగైనా తన భర్త నుంచి దూరం చేయాలని తలచి, ఆ పని నెరవేర్చేందుకు వినాయకుడిని నియోగించింది. వినాయకుడు అందుకు తగిన అదను కోసం నిరీక్షించసాగాడు.
 అదే కాలంలో గౌతముడనే రుషి బ్రహ్మగిరిపై ఆశ్రమం ఏర్పరచుకుని నివసించేవాడు. తపోధనుడైన గౌతముడు శివునికి అత్యంత ప్రియభక్తుడు. ఒకసారి గౌతముని ఆశ్రమ పరిసరాలలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది.

దుర్భిక్ష నివారణ కోసం గౌతముడు ప్రార్థించగా, శివుడు అతడికి ఒక వరం ఇచ్చాడు. పరమేశ్వరుడి వర ప్రభావం వల్ల గౌతముడు ఎంతటి బంజరు భూమిపై అయినా విత్తనాలు చల్లడమే తడవుగా, కొద్ది నిమిషాల వ్యవధిలోనే పంటలు పండేవి. కరువు కాటకాలు ఉన్నప్పటికీ ఈశ్వర కటాక్షం పొందిన గౌతముడు నిరంతర ధాన్యసమృద్ధితో తులతూగుతూ అతిథి అభ్యాగతులకు నిత్యాన్న సంతర్పణలు చేసేవాడు. ఇది కనిపెట్టిన వినాయకుడు అక్కడకు చేరుకున్నాడు.
 
ఒకనాడు గౌతముడు యథాప్రకారం తన క్షేత్రంలో విత్తనాలు చల్లి, జపం చేసుకునేందుకు అడవికి వెళ్లిపోయాడు. గౌతముడు చల్లిన విత్తనాలు చూస్తుండగానే పచ్చని పైరుగా ఎదిగాయి. ఇదే అదనుగా భావించిన వినాయకుడు ఒక మాయగోవును సృష్టించి, దానిని ఆ పైరు మీదకు వదిలాడు. ఆ మాయగోవు యథేచ్ఛగా మేయసాగింది. జపం ముగించుకుని వచ్చిన గౌతమునికి తన పైరును మేసేస్తున్న గోవు కనిపించింది. అక్కడే పడి ఉన్న ఒక ఎండు కట్టెను ఆ గోవుపైకి విసిరాడు. కట్టె తాకినంతనే ఆ మాయగోవు గొప్ప బాధతో ఆర్తనాదాలు చేస్తూ, ఆ ప్రాంతమంతా గిలగిలలాడుతూ తిరిగింది.

అక్కడి నుంచి అది తూర్పు దిశగా సాగింది. పశువు వేదన అనుభవించిన ఆ ప్రాంతమే ఆ తర్వాత ‘పశువేద’ అనే గ్రామంగా పరిణమించిందని ప్రతీతి. తాను విసిరిన కట్టె తాకడమే తడవుగా మాయగోవు ఆక్రందనలు చేయడంతో గౌతముడు కలవరపడ్డాడు. ఆవు ఆర్తనాదాలు విని ఆశ్రమంలోని మునిజనులందరూ పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. తూర్పు దిశగా సాగిన ఆవును వెంబడించారు. కొంతదూరం సాగిన తర్వాత ఆ ఆవు నేలపై పడి కళ్లు తేలవేసింది. ఆచార పరాయణులైన మునిజనులందరూ గౌతముడు గోహత్యకు పాల్పడ్డాడంటూ నిందించారు. తమ యజ్ఞయాగాదికాల నుంచి అతడిని వెలివేస్తున్నట్లు ప్రకటించారు.

సాటి మునుల నిర్ణయానికి గౌతముడు ఖిన్నుడయ్యాడు. జరిగిన దానికి పరిహారంగా ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పమని వారిని వేడుకున్నాడు. శివుని జటాఝూటంలోని గంగను తెచ్చి, గోకళేబరం మీదుగా ప్రవహింపజేయడమే తగిన ప్రాయశ్చిత్తమని వారు చెప్పారు.
 మునిజనుల సూచన మేరకు గౌతముడు శివుడి కోసం తీవ్ర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన శివుడు కైలాసం నుంచి కదిలివచ్చాడు.

వరమేమి కావాలో కోరుకోమన్నాడు. తన పాప ప్రక్షాళనార్థం గంగను విడువమన్నాడు  గౌతముడు. భక్తజన సులభుడైన సదాశివుడు అతడి కోరికను మన్నించాడు. తన జటాఝూటం నుంచి ఒక పాయను నేలపైకి విడిచాడు. అది నదిగా అవతరించింది. గౌతముని వలన నేలకు దిగినందున ‘గౌతమి’గా ప్రసిద్ధి పొందింది. నదీమాత కోరిక మేరకు గోముఖాకృతి నుంచి వెలువడేలా శివుడు అనుగ్రహించాడు. ‘గౌతమి’ జన్మ స్థానమైన నాసిక్ వద్ద త్రయం బకేశ్వరుడిగా అవతరించాడు.

శివుని ప్రసాదంగా వెలువడిన పావన ధార తన వెంట రాగా, గౌతముడు దానిని గో కళేబరం మీదుగా ప్రవహింపజేసి, పాప విముక్తుడయ్యాడు. గోవుకు సద్గతి కలిగించిన గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యం దక్కుతుంది. ఇది సాక్షాత్తు పరమశివుని వరం అని, గోదావరి స్నాన సంకల్పంతో బయలుదేరి, మార్గ మధ్యంలో మృతులైన వారు సైతం మోక్షాన్ని పొందుతారని ప్రతీతి.
 
పుష్కర గాథ
సమస్త జీవులు మహానదులలో తమ పాపాలను ప్రక్షాళనం చేసుకుంటుంటే, ఆ నదులన్నీ పాపపంకిలమైపోవూ! జీవుల పాపాలతో నిండిన నదులు తిరిగి పవిత్రతను ఎలా పొందగలవు? అనే సందేహం తలెత్తింది పుష్కరుడనే బ్రాహ్మణుడికి. జీవుల పాపాలతో నిండిన నదులను పునఃపావనం చేసేందుకు ఏదైనా చేయాలనుకుని, శివుడి కోసం తపస్సు చేశాడు. పుష్కరుడి భక్తికి సంతసించి ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. వరం కోరుకోమన్నాడు. నదులను పునఃపావనం చేసేందుకు తనకు జలత్వసిద్ధి ప్రసాదించాలని వేడుకున్నాడు పుష్కరుడు. సరేనని వరం ఇచ్చాడు శివుడు. పుష్కరుడు జలత్వసిద్ధి పొందినట్లు తెలుసుకున్న బ్రహ్మదేవుడు, వెంటనే శివుడిని ప్రార్థించి, పుష్కర తత్వాన్ని తన కమండలంలో భద్రపరచుకున్నాడు.
 
ఇదిలా ఉంటే, గౌతముడి భార్య అహల్యను వాంఛిస్తాడు దేవేంద్రుడు. అహల్య పొందు కోరి, తన మాయతో గౌతముడు అకాలంలో నదీస్నానానికి వెళ్లేలా చేస్తాడు. గౌతముడు ఇల్లు విడిచిన తర్వాత, తాను అతడి రూపం ధరించి, అహల్యను చేరుతాడు. నదికి బయలుదేరిన గౌతముడు, మార్గమధ్యంలో నింగిలోని నక్షత్రాలను చూసి, అది రాక్షస ముహూర్తంగా గ్రహించి, తిరిగి ఆశ్రమానికి చేరుకుంటాడు. తన రూపంలో అహల్యతో ఉన్న ఇంద్రుని చూసి ఆగ్రహించి, ఇద్దరినీ శపిస్తాడు. గౌతముడి శాపఫలితంగా ఇంద్రుడి శరీరమంతా స్త్రీలింగాలు ఏర్పడతాయి. అహల్య రాయిగా మారుతుంది.

తన వికృతరూపాన్ని భరించలేని ఇంద్రుడు తరుణోపాయం కోసం దేవగురువు అయిన బృహస్పతిని ఆశ్రయిస్తాడు. బృహస్పతి అతడిని వెంటపెట్టుకుని బ్రహ్మ వద్దకు వెళ్లి ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మందాకిని వద్ద ఒక సరోవరాన్ని నిర్మించి, తన కమండలంలోని జలాన్ని ప్రోక్షిస్తాడు. అందులో స్నానం చేసిన ఇంద్రుడు తన పూర్వ సుందర రూపాన్ని పొందుతాడు. పుష్కరజల మహిమకు బృహస్పతి, దేవేంద్రుడు చకితులయ్యారు. దేవేంద్రుడి వికృతరూపాన్ని మటుమాయం చేసిన పుష్కర మహిమ ముల్లోకాలకూ పాకింది. ఆకాశగంగ కంటే మహిమాన్వితమైన పుష్కర సంగమం కోసం నదులన్నీ ఉవ్విళ్లూరాయి.

మహానదులన్నీ బ్రహ్మ వద్దకు వెళ్లి, తమకు పుష్కర సంగమాన్ని కల్పించాలని ప్రార్థిస్తాయి. పుష్కర మహిమను తిలకించిన దేవగురువు బృహస్పతి సైతం తనకూ పుష్కరత్వాన్ని కల్పించాలని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడి నిర్ణయం మేరకు గురుడు ఒక్కో రాశిలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు, ఆ రాశిని విడిచే ముందు పన్నెండు రోజులు చొప్పున పన్నెండు నదులలో ఉండేందుకు అంగీకరించాడు పుష్కరుడు. మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరాలని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలని అంటారు.

అయితే, గోదావరి మినహా మిగిలిన నదులకు అంత్య పుష్కరాలు జరగవు. గురుడు ఒక్కో రాశిలో  ఏడాదికాలం సంచరిస్తాడు. అందువల్ల ఒక్కో నదికి తిరిగి పుష్కరాలు ఏర్పడేందుకు పన్నెండేళ్లు పడుతుంది. ఆ క్రమంలో గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు జరుగుతాయి. ఈ ఏడాది గురుడు అధిక ఆషాఢ బహుళ త్రయోదశి నాడు, అంటే 2015 జూలై 14న ఉదయం 6.26 గంటలకు సింహరాశిలో ప్రవేశించనున్నాడు.

అందువల్ల జూలై 14వ తేదీ మొదలుకొని 25వ తేదీ వరకు ఆది పుష్కరాలు జరుగుతాయి. వచ్చే ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 11 వరకు అంత్య పుష్కరాలు జరుగుతాయి.పుష్కరకాలంలో గోదావరి స్నానం, ఆ నదీతీరాన జరిపే జప హోమాదులు, పితృతర్పణలు, దాన ధర్మాలు సహస్రాధికంగా ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
- పన్యాల జగన్నాథదాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement