ప్రణతులిడిన భక్తజన‘కోటి’ | Godavari Pushkaralu 5th Day | Sakshi
Sakshi News home page

ప్రణతులిడిన భక్తజన‘కోటి’

Published Sun, Jul 19 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

Godavari Pushkaralu 5th Day

 రాజమండ్రి :గోదావరి నదికి సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో వరదలు వస్తుంటాయి. గేట్లు తెంచుకుని, ఏటిగట్లను చీల్చుకుని గోదావరి ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తుతుంది. ఈ ఏడాది 20 రోజుల క్రితం కూడా గోదావరికి వరద వచ్చింది. తాజాగా శనివారం జనగోదావరి వచ్చి ఈ నదీమతల్లిని తాకింది. ఘాట్‌లకు ఘాట్‌లనే ముంచెత్తింది. యాత్రికుల తాకిడికి రాజమండ్రి అఖండ గోదావరి సైతం చిన్నబోయింది. అఖండ గోదావరే కాదు.. సప్తనదీపాయలు.. కౌశికలు.. డెల్టా కాలువలు.. ఇలా గోదావరి జలాలు ప్రవహించిన ప్రతిచోటా భక్తులు పుణ్యస్నానాలకు లక్షలాదిగా పోటెత్తారు.
 
 జిల్లాలోని పుష్కర ఘాట్‌లకు శనివారం యాత్రికులు తండోపతండాలుగా తరలివచ్చారు. పుష్కర రాజధాని రాజమండ్రితోపాటు జిల్లాలోని గ్రామీణ ఘాట్‌లలో సైతం లక్షలాదిగా పుణ్యస్నానాలు చేశారు. శనివారం ఒక్క రోజే జిల్లాలో 40 లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ జనం పుష్కర స్నానాల కోసం వస్తూనే ఉన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే గోదావరి పుష్కరాలు ఆరంభమైన తరువాత ఒక్క రోజులో ఇంతమంది భక్తులు స్నానాలు చేయడం ఒక రికార్డే. సాయంత్రం నాలుగు గంటల సమయానికి జిల్లావ్యాప్తంగా 31.91 లక్షల మంది స్నానాలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. రాజమండ్రి కోటిలింగాల ఘాట్‌లో రికార్డు స్థాయిలో సుమారు 12 లక్షల మంది స్నానాలు చేసినట్టు అంచనా. నిజానికి ఈ ఘాట్ సామర్థ్యం రోజుకు ఎనిమిది లక్షలు. తొలి రోజు పుష్కర విషాదానికి కేంద్రమైన పుష్కర ఘాట్‌లో సైతం నాలుగు లక్షలకు పైగా భక్తులు స్నానాలు ఆచరించారు. చివరకు వీఐపీ ఘాట్‌లో సైతం 1.50 లక్షల మంది స్నానాలు చేశారంటే రాజమండ్రికి భక్తుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 గ్రామీణ ఘాట్‌లకు సైతం భక్తులు పుష్కర స్నానాల కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోటిపల్లిలో రికార్డు స్థాయిలో రెండు లక్షల మంది స్నానాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అంతర్వేది ఘాట్‌లో సైతం ఇదే స్థాయిలో భక్తులు స్నానాలు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి స్నానాలు చేసేందుకు ఇక్కడకు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం. కుండలేశ్వరం ఘాట్‌లో 45 వేల మంది పుష్కర స్నానాలు చేశారు. ధవళేశ్వరం రామపాదాల రేవువద్ద 63 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు.
 
 జనగో‘దారులు’
 పుష్కర రాజధాని రాజమండ్రిలో జనం పోటెత్తారు. నగరంలోని వీధులన్నీ జనగోదారులను తలపించాయి. ఘాట్‌ల వద్ద భక్తులు చీమల్లా బారులు తీరారు. కోటగుమ్మం, గోకవరం బస్టాండ్, పేపరుమిల్లు, తాడితోట జంక్షన్, దేవీచౌక్ వంటి ప్రాంతాలు ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయాయి. మోరంపూడి, లాలాచెరువు, బొమ్మూరు, వేమగిరి జంక్షన్ నుంచి వచ్చే రహదారులు సైతం జనంతో పోటెత్తాయి. వచ్చేవారు వస్తుంటే.. వెళ్లేవారు వెళుతూనే ఉన్నారు. రాజమండ్రిలో ఎటుచూసినా భక్తజన సందోహంతో రద్దీగా కనిపించింది. ఉచిత బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. బస్సులు నిలిపిన పార్కింగ్ స్థలాల నుంచి ఐదు కిలోమీటర్ల పైబడి భక్తులు నడిచి రావాల్సి వచ్చింది. అయినా ఈ కష్టాలకు ఓర్చుకుని గోదావరి స్నానాలకు ఎగబడ్డారు. ఇదే అదనుగా ఆటోవాలాలు అడ్డుగోలుగా దోచేస్తున్నారు.
 
 నేడు మరింత రద్దీ
 గోదావరికి ఆదివారం సైతం యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. వరుస సెలవులతో గడిచిన రెండు రోజులుగా భక్తుల తాకిడి పెరగగా, ఆది, సోమవారాల్లో కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంది. జిల్లాలో పలు పాఠశాలలకు, కళాశాలలకు ఆప్షనల్ హాలిడేస్ ఇవ్వడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. శనివారం తాకిడి చూసి.. ఆదివారం వచ్చేవారికి ఎలా ఏర్పాట్లు చేయాలా అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
 
 కోటి దాటిన భక్తులు
 గోదావరి పుష్కరాలు ప్రారంభమైన తరువాత ఇప్పటివరకూ పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శనివారంతో కోటి దాటింది. పుష్కరాలు ఆరంభమైన ఐదో రోజుకే ఈ స్థాయిలో భక్తులు రావడం విశేషం. శనివారం ఒక్క రోజే జిల్లాలో 40 లక్షల మందికి పైగా భక్తులు స్నానాలు చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement